Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక నిర్దిష్ట రూపం నుంచి ఒక పరిణామం దాకా రూపంతో కొనసాగిన కవులు రచయితలు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి అరుదైన అవకాశం సమకాలీనంగా కవిగా సాగడం వలన దాశరథికి లభించింది. సాహిత్య ప్రక్రియల్లో రూపాలు మారుతూ ఉంటాయి. కొంతకొంతగా ఆధునికతను సంతరించుకుంటూ ప్రక్రియా రూపాలు మారుతాయి. ఈ మార్పు ఎంత బలంగా ఉంటుందంటే ఒక్కో సారి రూపాలు కూడా ప్రక్రియలనుకునేంతగా మార్పును పొందుతాయి. సాధారణంగా ఈ రూపాలు మార్పు పొందడానికి కూడా శతాబ్దాలు పట్టిన సందర్భాలున్నాయి. కాని ఆధునిక పద్యం అనే రూపం నుంచి వచన కవిత దాకా వచ్చిన పరిణామాలు చాలా వేగంగా జరిగాయి. ఐతిహాసిక పద్యకవితా రూపం ప్రాబంధిక పద్యకవితా రూపంగా మారడానికి చాలా కాలం పట్టింది. సుమారు కొన్ని శతాబ్దాలు. ఈ మార్పు కవిత్వం అనే ప్రక్రియ ఆకరంగా చేసుకున్న పద్య రూపంలో కాకుండా వస్తు చిత్రణలో వచ్చిన మార్పు. తరువాత కాలంలో కావ్యాలు, ఖండకావ్యాలు ఆధునిక పద్యం అనే రూపాలు కవిత్వంలో కనిపిస్తాయి. ఈ కాలం సుమారుగా పంతొమ్మిదివందల నలభై కాలం. ముప్పైరెండులలో వచ్చిన గోలకొండ కవుల సంచికలోనూ రూపపరంగా ఖండికలున్నాయిగాని, వస్తువు పరిపూర్ణంగా ఆధునికమైంది కాదు. స్తోత్రాలు, స్తుతులు, మహా పురుష ప్రశంస ఇలాంటివి అందులో ఉన్నాయి. దానికి దగ్గరలో ఆధునిక పద్య రూపం కనిపిస్తుంది. ఆ తరువాత గేయ కవిత, దానికి దగ్గరలో వచనగేయం, ఆ తరువాత వచన కవిత కనిపిస్తుంది. దాశరథి కవిత్వాన్ని గమనించినా, ఆయా కాలాల్లో వచ్చిన 'ప్రత్యూష' (1950) లాంటి సంకలనాలను గమనించినా ఈ విషయం అర్థమవుతుంది.
దాశరథి ఆధునిక పద్య రూపాలనుంచి వచన కవిత తొలిరూపం దాకా రాశారు. ఆధునిక పద్యానికి మంచి నిర్వచనం కూడా దాశరథినుంచే దొరుకుతుంది. సుమారు డెబ్బై కాలానికి దగ్గరలో కూడా అంటే సుమారు వచన కవితకొక ప్రాతిపదిక ఏర్పడ్డాక కూడా ఆధునిక పద్య కవిత బలమైన ఉనికిలో ఉంది. వస్తువు, ఇతివృత్తం, శైలి, శిల్పాలు ఆధునికమైనవి. రూపం విషయంలో ప్రాచీన పద్య ఛందస్సులకు సంబంధించినది ఆధునిక పద్యం. రూపం విషయంలో గేయ ఛందస్సులను శిల్పం, భాష, శైలి, వస్తువు, ఇతివృత్తాలలో ఆధునిక పద్య రూపాన్ని అనుసరించినది ఆధునిక గేయ కవిత్వం. దీని ప్రాతిపదిక ముప్పైలలోనే ఉన్నా బలంగా, ప్రయోగాత్మకంగా కనిపించింది యాభై అయిదు కాలాల తరువాతే. నిజానికి గేయ కావ్యాల కన్నా ముందు గేయ నాటికలున్నాయి. గేయమనే మాత్రారూప ఛందస్సును అనుసరించినది గేయ కవిత్వం. ఈ గేయంలోని కేవల గతిలక్షణాన్ని, లయను మిగుల్చుకొని ఛందస్సులను వదిలివేసిన కవితా రూపం వచన గేయం. లయగుణాన్ని, మాత్రారీతిని వదిలి వచనాన్ని మాత్రమే కలిగింది వచన కవిత. ఈ రూపాలన్నీ అనుసరించిన వారు దాశరథి. డెబ్బై కాలాల్లో వచ్చిన ఆయన కవిత్వంలో ఈ రూపాలన్నీ కనిపిస్తాయి.
1. ప్రాణ జ్వాలిక ఫాలభాగమున విభ్రాజిల్లుచుండంగ ని
ద్రాణంబైన ధరాతలంబునకు చైతన్య ప్రభాపుంజముల్
దానంబీయగ జాలు తైజస పదార్థంబీవు; నీ కన్న నా
కేనా డెవెవ్వరులేరు మిత్రులు, శుభాంగీ! కాంతి కాంతామణీ!
పూల కారేరాక పుష్పింతువీవు
శిశిర రుతువేలేక క్షీణింతువీవు
అక్షులే లేకుండ అశ్రులోడ్చెదవు
అస్యమే లేకుండ హసియించగలవు - (కొవ్వువత్తి)
2. గజదంతగోపురం/ లో కాదు కాపురం
కార్మికులుగల పురం/ కవితి అంత:పురం
పెద్దపొగ గొట్టాలు/ పేదలకు చుట్టాలు
ఆ ధూమ పటలాలు /బాధితుల నిటలాలు - (గజదంత గోపురం)
3. పోతున్నది పాతయుగం- పోనీ పోనీ
వస్తున్నది కొత్త తరం - రానీ రానీ
దిసమొలలై ఉన్న లతా విసరమ్ములకు
కుసుమాలే వసనావలి కానీ కానీ - (మధుతోరణము)
4. నౌబత్ పహాడ్ మీదినుంచి చూస్తే
నాలుగుమైళ్ళ మేర అయినా కనబడదు
చార్ మినార్ పైనుంచి పరికిస్తే
'సారా' హైదరాబాద్ సాక్షాత్కరించదు
గోలకొండ గోపురాగ్రం నుంచి దర్శిస్తే
కొంత దూరం మించి కంటికి కానరాదు- (తల్లి పూజకు తరలిరండి)
5. శాంతియుత ప్రయోజనాల కోసం అణువు ను భేదించిన శాస్త్రజ్ఞులారా!
భారత కీర్తి దశదిశలా వ్యాపిస్తుంటే/ భయపడే వారి గగ్గోలును విన్నారా!
కత్తితో కుత్తుకలను మాత్రమే/ ఉత్తరించ వచ్చుననే చిత్తవృత్తిగలవారు/ కత్తితో మెత్తని గులాబీల
అంట్లుకట్టవచ్చునని/ కడుపులోని విషవ్రణాల తొలగించవచ్చునని/ కడుతియ్యని మామిడిపండ్లు కోసుకు
తినవచ్చనీ/ గ్రహించి సగనం వహించలేరు, పాపం'' -(అణుగీతం)
ఈ వాక్యాలన్నీ, కవితా భాగాలన్నీ వివిధ కవితా రూపాలననుసరించి రాసినవి. వరుసగా పద్యం, గేయం, వచన గేయం, వచన కవిత అనే కవితా రూపాలను అనుసరించి రాసినవి. ఇవన్నీ ఒకే సంపుటిలోనివి కావడం విశేషం. యాభైల కాలం నాటికి స్పష్టంగా వచన కవితకొక రూపం ఏర్పడినా పద్యం గేయాల ఉనికి తగ్గలేదు. ఆ మాటకొస్తే ఈ కాలానికి పద్యం ఏదో ఒక రూపంలో శ్వాస పీలుస్తూనే ఉంది. ఈ పద్యం పూర్తిగా ఆధునికమైంది. ఇది అనువాదమే అయినా రూపపరంగా, వస్తుపరంగా ఆధునికమైనది. శ్రీశ్రీ నాటి అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ లాగా కొవ్వొత్తిని వస్తువుగా తీసుకుని విలువలను ఇతివృత్తంగా చేసుకుని రాసిన పద్యమిది. ''నిద్రాణంబైన ధరాతలంబునకు చైతన్యప్రభా పుంజముల్ దానంబీయగ జాలు తైజస పదార్థంబీవు'' అనడంలోనే అభ్యుదయ భావన కనిపిస్తుంది. ఇక రెండవ పద్యంలో భావదృష్టి వికసించింది. రకరకాల రుతువులతో సమన్వయంచేసి చెప్పడంవల్ల ఈ లక్షణం కనిపిస్తుంది. కొవ్వత్తిని కన్నీరు కారుస్తున్నావనడంలో, అందులోనూ కళ్ళులేకుండా కన్నీరు కారుస్తున్నావనడంలో భావనాఛాయ స్పష్టంగా కనిపిస్తుంది. పద్యంలో వర్ణన ఉన్నా అభ్యుదయ చింతన భావోద్దీపన ఈ రెండూ ఆధునికమైనవి. శుభాంగీ, కాంతి కాంతామణీ- లాంటి సంబోధనలు, తైజస పదార్థం లాంటి సమాసాలు మాత్రమే ఒకింత ప్రాచీన పద్య శైలిని ఇముడ్చుకున్న భాగాలు భాషాగతంగా.
రెండవ భాగంలో ఖండగతి నడకలోని గేయకవిత్వ రీతి ఉంది. విషయాన్ని అదే కవితామార్గంలో చెప్పినా గేయ కవితా రూపం స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటివి మరికొన్ని ఈ కాలానికి దగ్గరగా కనిపిస్తాయి. దీనిని ఛందోబద్ధంగా కూడా విశ్లేషించుకోవచ్చు. క్రియల పరంగా కూడా ఆదితాళంలో ఇమిడిపోతుంది. గేయ కవిత ముప్పైల కాలానికి మొదలై ఆ తరువాతి కాలాల్లో బలపడింది. మూడవ భాగం లోనిది వచన గేయం. గేయంలోని లయను అనుసరించింది కాని తాళం, క్రియలు ఛందస్సు విషయంలో స్వేచ్ఛ కనిపిస్తుంది. తిశ్రగతిలోఉన్నా వాక్యాల్లో వచన తత్త్వం ఎక్కువగా కనిపిస్తుంది. నాలుగు అయిదు భాగాలలో వచనకవితా రూపం కనిపిస్తుంది. అందులోనూ నాలుగులో ప్రాసాత్మకత వలన కొంత గేయ రూపంలోని లయ ధ్వనించినా, చివరి భాగంలో పూర్తి వచన రూపం కనిపిస్తుంది. 'ఏది విప్లవం, ఎర్రబాలలు' లాంటి ఖండికలు అభ్యుదయం నుంచి విప్లవగతికి మారుతున్న కవితా మార్గాన్ని చెబుతాయి. గాంధీని గురించి రాసిన 'విప్లవ నాయకుడు, శాంతిబాల' లాంటి ఖండికలు ఆయనదైన అభ్యుదయ మార్గాన్ని చెబుతాయి.
అనేక రూపాలు పరిణామాన్ని పొందుతున్న కాలంలో ఉండడం వలన దాశరథి కవితలో ఈ రూపాలన్నీ ప్రతిబింబిస్తాయి. గమనించాల్సింది ఏమిటంటే ఏ రూపం మారినా దాని తాలుకు శైలిని, నిర్మాణాన్ని, భాషను, శయ్యను గమనించి దాశరథి కవిత నడిచింది. దాశరథి కవితా పరికరాలే ప్రత్యేకం. అవి ఎంత ఆధునికమైనవో, అంత సంప్రదాయ ముద్రను ఊనిక చేసుకున్నవి. ఎంత భావ యుక్తమైనవో ఆయన అధ్యయనంతో అంతే హుందాగా నడచివచ్చినవి. 'షా: నామా' అనే కవితను ఈ సంపుటంలో అనువదించారు. ఇందులో వర్ణన ఉర్దూ కవితాసమాగ్రిని అనుకొని కనిపిస్తుంది. కాని వాటిలో భావ కవిత నాటి ఆధునిక ఛాయ కూడా పద్యాన్ని నీడలా అనుసరిస్తుంది.
''నెలత బుగ్గలులేత దానిమ్మపూలు/ ఆమె పెదవులు జ్వలియించు అగ్నిశిఖలు
పడతి చనుదోయి రజత కుంభమ్ములౌరా/ కనులు కాటుక పిట్ట రెక్కలనుబోలు
ఆమె మైతావి కస్తూరినతిశయించు/ గొలుసుగొలుసులు గొలుసులు వెలది కురులు
కాంత పదివేళ్లు పదివెండికలములౌర!/ ఎవరి ఫాలాననేమి లిఖియించగలవో'' - (సౌందర్యాధిదేవత)
ఈ వాక్యాలు దాశరథి కవితా పరికరాలను, వాటి మూలాలను చెబుతాయి. బహుశ: బుగ్గలను దానిమ్మ పూలుగా, పెదాలను అగ్నిశిఖలుగా,కనులు కాటుక పిట్ట రెక్కలుగా చెప్పడంలోనే నవ్యత కనిపిస్తుంది. 'అరాల కుంతల' లాంటి పాత ప్రయోగాలు లేకుండా గొలుసులు గొలుసులని చెప్పడంలో తనదైన ఉర్దూ పరికరాల ముద్ర కనిపిస్తుంది. ఒకచోట చెట్టునూ 'అగ్నిపూల షామియాన' అంటారు. ఇలాంటివన్నీ ఈ కాలంలోని కవిత్వం నుంచి ఎత్తి రాసుకోవచ్చు.
దాశరథి ఆధునిక పద్యం నుంచి వచనకవిత దాక అనేక రూపాలను రాశారు. అయితే ఏ రూపానికుండే పరిణతులను, మార్పులను అందులో అనుసరించారు. అది ఆయన అధ్యయనానికి నిదర్శనం. పద్యాన్ని నిర్వహిస్తున్న విధానం, పాద విభజన, వాక్యాల విభజన ఇవి పద్యం నుంచి వచన కవిత ఏర్పడిన విధానాన్ని ప్రధానంగా రూపపరంగా గమనించడానికి సహాయపడేవి. పద్యకవితలో గణ బద్ధ ఛందస్సుననుసరించి, గేయంలో మాత్రాగణాల ననుసరించి పాద విభజన జరిగితే, వచనగేయంలో అంత్యప్రాస ఈ విభజనకు ఉనికి వచన కవితలో వరుసలు అర్థ గతంగా వేరుపడుతాయి. చాలామంది వచన కవిత రాసేవాళ్ళు ఈ అంశాన్ని గమనించినట్టు కనిపించదు. ఈ నాలుగు రూపాల మధ్య సారూప్యతలను, వైరుధ్యాలను, వైవిధ్యాలను అధ్యయనం చేయడానికి దాశరథి కవిత మార్గాన్ని చూపుతుంది. వచనకవిత ఉదయించిన మార్గానికి దీపపు వెలుగుని చూపుతుంది. ఆధునిక పద్యం నుంచి వచన కవిత దాకా అన్ని మలుపుల్లో దాశరథి కవిత తనను మార్చుకుంటూ నడిచింది.
- ఎం.నారాయణ శర్మ,
9177260385