Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతివాదుల అభిప్రాయాలను విన్నవాడు, మితవాదుల మనస్థత్వాలను ఎరిగినవాడు, ఆంధ్ర మహాసభ ఆంతర్యాలు తెలిసినవాడు, ప్రజల జీవితపు లోతుల్పి చూసినవాడు దాశరథి. దేశం పై ఒత్తిళ్లు, విదేశీయుల పాలన, పెట్టుబడి దారీ వ్యవస్థ తీరుతెన్నులన్నీ చూసి, గ్రహించి విజృంభించిన కలం దాశరథి. స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అన్నీ ఆయన కలానికి పదును పెట్టినవే. పీడిత తాడిత ప్రజా ఉద్యమాలే ఆయన పదాలకుఅందిన బలం!
''ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను!
కదంతొక్కి పదంపాడి ఇదే మాట అనేస్తాను
జగత్తంత రగుల్తొన్న కధా జ్వాల వృథాపోదు''
అంటూ నిజామాబాద్ సెంట్రల్ జైలు నుండి గళమెత్తి, ఈ తెలంగాణ స్వేచ్ఛా వాయువు పీల్చాలని ఆకాంక్షిస్తూ నైజాం నెదిరిస్తూ, రజాకార్లను విమర్శిస్తూ రాసిన కవిత్వం ఆనాటి ప్రజలకు గొప్ప ఉత్తేజమిచ్చింది. సమయం, సందర్భాన్ని బట్టి అక్షరాలను కత్తులుగా, ఈటెలుగా విసురుతూ తెలంగాణ పోరాటంలో పాల్గొన్న విప్లవ కవి దాశరథి కష్ణమాచార్యులు. ''మా నిజాం నవాబు జన్మజన్మల బూజు'' అని నిరసన గళమెత్తినందుకు చేతులకు బేడీలు పడినా దడవని మానుకోట బిడ్డ దాశరథి.
ఖమ్మం జిల్లాలో చదువు పూర్తయ్యాక హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో కాలుపెట్టిన ఆయన అందరిలా తెలుగులో కాకుండా ఇంగ్లీష్ లిటరేచర్‌లో పట్టా పొందాడు. ప్రాంతానికి ప్రాంతానికీ, వ్యక్తులకు వ్యక్తులకు మధ్య ఉన్న తేడా గమనించి నప్పుడు ఆయన బుర్రనిండా ఆలోచనల పరంపరలు సాగినవి. ఆ ఆలోచనలనే శరాలుగా మార్చి కవిత్వంగా వదిలినవాడు దాశరథి. అక్షరాల్ని కత్తులుగా దూసి 'అగ్నిధార'లను కురిపించి, 'రుద్రవీణ'లు మోగించి తెలుగు సాహిత్యానికి ఒక కొత్త ఒరవడి తెచ్చిన కళా రవి దాశరథి. సాంప్రదాయ కవిత్వాన్ని వంట బట్టించుకున్నా సమాజ బాధను చూసి, ప్రభుత్వ అరాచకాలనూ, రజాకర్ల అకృత్యాలను చూసి దాశరథి ఊరుకోలేదు. చందోబద్ధమైన కవిత్వంలోనూ పలికించింది విప్లవాన్నే!
''ప్రాణములొడ్డి ఘోరగహనాటవులన్ బడగొట్టి మంచి మా
గాణములన్ సజించి ఎముకల్ నుసిజేసి పొలాలదున్ని భో
షాణములన్ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలం
గాణము రైతుదే, ముసలి నక్కకు రాచరికంబు దక్కునే?''
అని రాచరిక వ్యవస్థను నిరసించాడు. మనిషి తిండి తినడం మొదలు పెట్టినప్పట్టి నుండి ఇప్పటివరకూ అందరి పొట్టలు నింపుతున్న రైతన్న పక్షాన నిలబడి సాహితీ సేద్యం చేసాడు. కల్పనలూ, అవాస్తవాలూ ఏవీ లేకపోవటమే దాశరథి కవిత్వంలో ప్రత్యేకత. అందుకే అవి నేరుగా, సూటిగా బాణంలా గుచ్చుకుంటాయి. తెలంగాణ పల్లెల్లో పుట్టి, అక్కడి మట్టి వాసనను ఆస్వాధించిన దాశరథి వారిలో నిద్రాణమైన చైతన్యాన్ని పెల్లుబికించేలా రాసిన కవిత్వాన్ని మన జాతీయ సాహితీ సంపదగా గుండెల్లో దాచుకోవాలి.
''దేశంబొక్కటే భారతాఖండాసేతు హిమాచలోర్వర'' అని చెప్పిన దాశరథి జాతీయ సామ్యవాద ఉద్యమాలను మేళవిస్తూ కవిత్వం రాశాడు. ఒక నూతన సామాజిక నిర్మాణం కోసమే పరితపించింది అతని హృదయం.
''రక్తం నదులై పారకపోతే రాదా రెవల్యూషన్?
బుర్రలు బుర్రలు పగులక సమస్యకు లేదా సొల్యూషన్?
హింసా యుద్ధం ఔట్‌డేటెడ్ అని నేనంటాను
శాంతి ఒక్కటే మానవ జాతికి సరియగు సాల్వేషన్''
ఇదీ దాశరథి కవిత్వం! గుప్తతా, వ్యక్తతా రెండూ జీవన సాఫల్యానికి సమానావసరాలని చెప్పిన దాశరథి స్పష్టతను కోరే కవి. ఆయన కవిత్వంలో ఎట్లాంటి అయోమయం ఉండదు. ఆనాటి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఆయనను చలింపజేసినవి. దీనికితోడు విస్తృతంగా పుస్తకాలు చదివే అలవాటు. ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం చదవడం వాటిపై విమర్శ చేసుకోవడం అలవాటున్న దాశరథి, మనిషి మీద, సమాజంమీద విశ్వాసం పెంచే విశాల దృక్పథాన్ని ఏర్పరిచే రచనలు చేశారు. అందుకు మూలం మార్క్సిస్టు దృక్పథమే. కాబట్టే ఆయన
''గతాన్ని కాదనలేను - వర్తమానాన్ని వద్దన బోను
భవిష్యత్తు వదులు కోను - కాలం నా కంఠమాల
నా పేరు ప్రజా కోటి, నా ఊరు ప్రజావాటి''
అని అనగాలిగాడు. సంప్రదాయ చైతన్యధార, అభ్యుదయ భావధార, శాంతి పూర్వక విప్లవ హేల కలగలిసిన దాశరథి కవిత్వం ఒక మందార మాల. అందుకే ఆయన కవిత్వం 'తిమిరంతో సమరం' చేసింది.
దాశరథి సూఫీ కవిత్వాన్ని ప్రేమించాడనడానికి ఎన్నో ఉదాహరణలు. 'గాలిబ్ గీతాలు', గాలిబ్ గజళ్లను తెలుగులోకి అనువాదం చేయడం ఈ కోవకు చెందిందే! మనిషికున్న జ్ఞానం మరో మనిషికి మంచి చేసే దిశలో సాగాలన్నదే ఆయన అభిమతం. మనిషికీ సంఘానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని ప్రకృతితో కలిసి చేసే జీవనాన్ని దృష్టిలో పెట్టుకొని రచన చేయడం దాశరథి రచనల్లో చూడవచ్చు.
''వీరంగం వేస్తుంటే రాదు విప్లవం
తారంగం పాడుతుంటే రాదు సమరథం
అందుకే నేనంటాను
ఏ లేహ్యం తిన్నాగాని రాదు యవ్వనం''
అని తిరిగిరాని కాలాన్ని తరగిపోయే జీవితాన్ని బాగా గుర్తుచేస్తారు దాశరథి. సమస్యలు చుట్టూ చేరుతుంటారు. అందులో అనేక శక్తులుంటారు. అధికార దాహం, డబ్బు కాంక్ష, కీర్తికండూతి, తెలివికలవారిమన్న భేషజం, ఉన్నవారిమన్న గర్వం అన్నీ అన్నీ మనచుట్టూ ఉంటాయి. అవన్నీ దాటినప్పుడే ఆశయాన్ని చేరుకోగలం అంటారు. అందుకే ''కలపండోయ్ భుజం భుజం - కదలండోయ్ గజం గజం
అడుగడుగున యెడదనెత్తు - మడుగులుగా విడవండోయ్'' అని ఎలుగెత్తిన దాశరథి మాటను మన మాటలుగా చేసుకోవాలి!
''ఎవడైనా మానవుడే ఎందుకు ద్వేషించడాలు?
రాక్షసినైనా మైత్రికి, రానిత్తును భయంలేదు''
అంటాడు. దాశరథి వారి పాటలలో రకరకాల ప్రతీకల్ని వాడినప్పటికీ, ఎక్కువగా కనిపించేది దీపం. మచ్చుకు - ''దీపాలు వెలిగె పరదాలు తొతొగె'' (పునర్జన్మ), ''తొలి చూపులు నాలోనే వెలిగించె దీపాలు'' (చదువుకున్న అమ్మాయిలు). దీపాన్ని చైతన్యానికి, ప్రణయానికి, విప్లవానికి, ఆశావాదానికి తరచు ప్రతీకగా వాడారు. 1961-1987 మధ్య కాలంలో దాశరథి దాదాపు 2000 పాటలు రాశారు. దాశరథి గారి పద్యం తెలుగు సరస్వతికి నైవేధ్యమైతే, వారి సినీ సంగీతం చలనచిత్ర భారతి గళసీమలో విరిసిన పద పారిజాతం.
- అనంతోజు మోహన్ కృష్ణ
సెల్ : 897765417