Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలాన్ని జయించి కంఠమాలగా ధరించిన కవి దాశరథి. ఆ విషయాన్ని తానే తెగువతో విస్పష్టంగానే ప్రకటించాడు.
'గతాన్ని కాదనలేను - వర్తమనం వద్దనబోను
భవిష్యత్తును వదులుకోను - కాలం నాకంఠమాల'
సమీకాలీన ప్రపంచంలో సంభవించే సంక్షుభిత సమస్యలను కవిగా ఎలా ఎదరుక్కోవాలో దిశానిర్దేశం చేసాడు. ఆ సంఘర్ణణలోనే మహాకవిగా ప్రజాకవిగా ఆవిష్కృతమయ్యాడు. 20వ శతాబ్దం ప్రధమార్ధం ప్రపంచమంతా అతలాకుతలం అయింది. రెండు ప్రపపంచయుద్దాలను (1914 -1918 , 1939-44) చవి చూసింది.
ఒక ప్రక్క ప్యూడల్ వ్యవస్థ దాష్టికం కొనసాగుతునే ఉన్నది. మరోప్రక్క పెట్టుబడిదారి వ్యవస్థ వేళ్లనుకోవడం ప్రారంభించింది. మన దేశంలో స్వాత్రంతోద్యమం పురివిప్పుతున్న కాలం కూడా అదే,
బ్రిటీష్, సామ్రాజ్యవాదం నుండి భారతదేశం పూర్ణ స్వరాజ్యంతో విముక్తి కావాలని 1930వ సంవత్సరం అర్ధరాత్రి నుండే పతాకను ఎత్తుకున్నది.
1930-40 దశకంలోనే కరువు కాటకాలు కూడా ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్భవించాయి. అందువలన ఆ దశకాన్ని హంగ్రీ థర్టిస్ (ఆకలికోన్న దశాబ్దం) అని పిలిచారు. ఈ పరిస్థితులన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా కవుల అంతరంగిక కల్లోలానికి కారణభూతం అయ్యాయి. కాల్పనిక భావవాదాన్ని కట్టిబెట్టి, సమకాలీన వాస్తవిక సంఘటనలకు సాహిత్యం స్పందించడటమే విద్యుక్త ధర్మం అనే భావన అనివార్యమైంది. కవి అన్నవాడు దానికి కట్టుబడక తప్పలేదు. ప్యూడల్ భావజాలం మత ఛాందసంలో చిక్కుకు పోగా, పెట్టుబడి దారీ భావాజాలం వ్యక్తివాద లాభా (స్వార్ధ) ప్రయోజనాన్ని అశ్రయించింది.
ఎప్పటికప్పుడు సమాకాలీనతే ఆధునికం అయినప్పటికీ ప్రజలను సమాజాన్ని సంక్షుభిత సమస్యలను పట్టించుకోకుండా తాను అనుక్నుదే తాను రాసుకుంటూ పోతాననే విశృంఖలత్వం కూడా అభ్యుదయం వెంటనే వస్తున్నది.
'కళకళకోసమే'అన్నది విశృంఖలత్వానికి ప్రతిక అయితే 'కళ ప్రజలకోసం' అన్నది అభ్యుదయనికి ప్రతీక అయింది. భావ కవిత్వం కేవలం స్వీయనందానికి పరిమితమైతే అభ్యుదయ కవిత్వం ప్రజాచైతన్యానికి పునాది అయ్యింది. కాలాన్ని జయించడానికి తొలి మెట్టు ఇదే. సహజ సిద్దంగా కవిత్వంలో ఉండే సౌందర్యం, భావవాదం కాకుండా భౌతిక వాస్తవంతో పాటు కవియొక్క తాత్విక దృక్పధం అభ్యుదయంలో కీలకంగా మారింది. ఉన్నది ఉన్నట్టు చెప్పడమే కాదు, సామాజిక జీవితాన్ని ప్రమాణంగా తీసుకుని ప్రస్తుతం సమాజంలో ఎట్లా ఉన్నది..? ఎట్లా ఉండాలే..? పరిష్కార దిశగా ప్రజల్ని కదిలించాలి అనేది కూడా అభ్యుదయ సోషలిస్టు వాస్తవికతలో అంతర్భాగం అయ్యింది.
1936లో అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ఎర్పడటంతో అభ్యుదయ సాహిత్యం ఎక్కడికక్కడ ఓ నిర్దిష్టమైన ప్రబలమైన ఓ సామాజిక శక్తిగా అవతరించింది. ఇది ఓ చారిత్రక పరిణామం. అయితే ఇక్కడ తెలంగాణ పరిస్థితి వేరుగా ఉంది. ప్యూడల్ దోరల పదపట్టనలలో ప్రజ నలిగిపోతున్నది. 'నీ బాంచన్ దోరా!కాల్మొక్కుతా' అనే చట్రంలో మనిషి బందీ అయిపోయాడు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు ఉద్యమం నడుం కట్టింది.
భూమికోసం భుక్తికోసం పీడిత ప్రజ విముక్తి కోసం సాయిధ రైతాంగం పోరాటం నిర్వహించింది. దున్నేవానికే భూమి అన్న నినాదాన్ని భారత రాజకీయ చిత్రపటంపై సగర్వంగా ప్రకటించింది.
నాలుగువేలమంది అమరుల బలిదానంతో తెలంగాణ విముక్తి సాద్యమైంది. విషేషమేమంటే ఈ మొత్తం తెలుగునాటి తెలంగాణలోని సామాజిక సాహిత్య పరిణామంతో సమాంతరంగా దాశరధి ఓ పోరాట పటిమతో ప్రయాణించాడు. అందుకే అగ్నిధార నిప్పుల వర్షం కురిపించాడు. ఆర్ధిక, రాజకీయ, సామాజిక పరిస్థితిని అంతా ఆవాహన చేసుకున్నాడు. 'తానే ఓ రుద్రవీణై సమర సాహిత్యాన్ని సృష్టించిన కవి' అని ఆరుద్ర అన్నారు. నైజాం నిజస్వరూపాన్ని ముసుగు చీల్చీ ప్రజలకు చూపించాడు.
అడుగడుగున యెడద నేత్రు
గడగడమని త్రాగనీవు
పడతుల మానాలు ద్రోచి
గడగడమని హుక్కా త్రాగి
జడియక కూర్చుండినావు
మడికట్టుక నిలిచినావు
రజకారు పోషకుడివి.
ఇక్కడ కవి ఆవేశం ధర్మాగ్రహం భావం ప్రాణం అంతా ప్రజాపోరాటవేగంతో విడదీయలేనంతాగా మమేకం అయ్యింది. ఆ మహత్తర తెలంగాణ పోరాటంతో దాశరథి స్వయంగా పాల్గొని జైల్లో చిత్రహింసలు అనుభవించడం, అజ్ఞాతవాసం గడపడం అందరికి తెలిసిందే.
1947లో భారతదేశానికి స్వాతంత్రం లభించింది కాని తెలంగాణాలో రాలేదు కదా.. నిర్భందం హెచ్చింది. తెలంగాణ వీరోచిత సమరంతో పాటే అభ్యుదయ రచయితల ఉద్యమం ఉదృతంగా సాగింది. తెలంగాణ ప్రజల కష్టానష్టాలను కన్నీళ్ళను పొలికేక పెట్టి లోకానికి విన్పించాడు.
ఇట వసంతము లేదు సహింప రాని
గ్రీష్మ హేమంత కాల కాళికలే గాని
ఇట ఉషస్సులు లేవు భరింప రాని
అంబుహ సందోహనివళిగాని
కవి ఇక్కడ ప్రేక్షక పాత్రలో లేడు. బాధితుల పాత్రలో జీవించాడు. తెలంగాణనే కన్నతల్లిగా భావించాడు.రుద్రవీణ కావ్యాన్ని తెలంగాణాకు అంకితమిస్తూ ననుగని పెంచినట్టు కరుణామయి నా తెలంగాణ అని ఆ ప్రజావాహినిలో లీనమైపోయాడు. కాలం కంటే ముందునడుస్తూ
ఓ దార్శకుని కవిగా తన కర్తవ్యాన్ని కూడా తెలుపుకున్నాడు.
'పాటలు పాడితినే తెలుగు బాబులు నిద్దర మేలుకో పోరాటము సేయగా కరకు రాచరికమ్మును కూల ద్రోయగా కోటి దళాల నోక్కడ గూర్చితి విప్లవ శంఖమెత్తితిన్ నాటికి నేటికిన్ తెలుగు వెచ్చదనంబు లూదితిన్'
అభ్యుదయ రచయితల సంఘం అద్యక్షునిగా తెలంగాణా రచయితల సంఘం అద్యక్షునిగా బాద్యతల్ని భుజానెత్తుకున్నాడు. సామ్రాజ్యవాద వ్యతిరేక దృక్పథంతో రచనలు చేయడమే కాదు సామ్యవాదం పైఅచంచల విశ్వాసం ప్రకటించాడు.
రానున్నది ఏది నిజం - అది ఒకటే సోషలిజం
కలపండోయ్ భుజం భుజం -కదలండోయ్ గజంగజం
అడుగడుగుడగున ఎడదనెత్తు -మడుగులుగా విడవండోయ్
పడిపోయిన గుడి గోడలు - విడిచిపెటట్టి నడవండోయ్.
సామ్యవాద స్థాపన ప్రస్థానంలో సంకుచిత్వాన్ని మౌడ్యాన్ని ఎలా విడానాడలో కూడా స్పష్టంగా ఎరుకపరిచాడు. అందుకనే సుప్రసిద్ద పరిశోధకులు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ఇలా ప్రకటించాడు. తెలగు నాట మూడు కవితాధారలు ప్రవహించాయి. ఒకటే విశ్వనాథ సత్యనారాయణ సంప్రదాయ ధారకాగా, రెండవది శ్రీ శ్రీ సాయిధ విప్లవ చైతన్య ధార అయితే మూడవది దాశరధి శాంతి విప్లవ చైతన్య ధార అని తెలిపాడు. ఇది సమన్వయధార, సమతా కవితా ధార తన కాలంలోనే ప్రజలు కొరుకునే సమసమాజానికి అంకుఠిత దీక్షతో అక్షరాలు వారపోసి స్వాగతద్వారాలు తెరిచినధారా.
-కె. శాంతారావు
9959745723