Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'దాశరథియే తెలంగాణము... తెలంగాణమే దాశరథి' అని దేవులపల్లి రామానుజరావు వంటి సాహితీమూర్తుల ప్రశంసలందుకున్న దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీద ఎక్కుపెట్టిన మహాకవి. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని గర్వంగా ప్రకటించి ఇప్పటి ఉద్యమానికీ ప్రేరణనందిస్తున్న సుప్రసిద్ధుడు దాశరథి. దాశరథి 1925 జూలై 22న వరంగల్ జిల్లా గూడూరులో జన్మించారు. ఆయన బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఇంగ్లీషు సాహిత్యంలో బియ్యే చదివిన దాశరథి... సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితులు. చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించారు. సాహిత్యంలో అనేక ప్రక్రియలను సృష్టించిన దాశరథి... కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాసారు. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించారు. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులను పొందిన దాశరథి, 1977 ఆగష్టు 15 నుండి 1983 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవిగా ఉన్నారు. 'గాలిబ్ గీతాలు' పేరుతో మీర్జాగాలిబ్ రచించిన ఉర్దూ గజళ్ళను తెలుగులోకి అనువదించి, అక్కినేని నాగేశ్వరరావుకు అంకితం చేశారు. ఆ సభకు బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షత వహించగా, గేయ సంపుటిని మధుసూదనరావు చదివారు. ఈ సందర్భంలోనే సినిమాలకు పాటలు రాయకూడదా? అని మధుసూదనరావు అడిగారు. అందుకు సమాధానంగా ''నాకు సంగీత పరిజ్ఞానం లేదు కదా ఎలా ?'' అన్నారు. ''అదంతా మేం చూసుకుంటాం. మీరు రాస్తారా?'' అనడంతో, ఒ.కె. అన్నారు దాశరధి. ఆ విధంగా 'ఇద్దరు మిత్రులు' చిత్రంతో సినీ గేయ రచయితగా 1961లో చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. తొలిసారిగా సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వరరావుతో మ్యూజిక్ సిట్టింగ్‌లో పాల్గొన్న దాశరథి... రాజేశ్వరరావు ఇచ్చిన ట్యూన్‌కు పది నిమిషాల్లోనే పాటను రాసిచ్చి, అక్కడివారిని ఆశ్చర్యచకితులను చేశారు. ఆవిధంగా దాశరధి కలం నుండి జాలువారిన తొలిసినిమా పాట 'ఖుషీఖుషీగా నవ్వుతూ... చెలాకి మాటలు రువ్వుతూ' అంటూ సాగిన పదాల అల్లిక. ''ఖుషీ ఖుషీగా నవ్వుతూ'' పాట ట్యూన్ ఒక ఇంగ్లీషు ఆల్బమ్ నుండి తీసుకున్నారు రాజేశ్వరరావుగారు. హైదరాబాద్‌లో ఉంటూ ఇక్కడి 'ఖవ్వాలి' పాటల తీరుతెన్నులు తెలిసిన వారు కావటంతో చిత్రంలోని ఒక ఖవ్వాలి పాటను కూడా దాశరథితోనే రాయించారు. ''నవ్వాలి నవ్వాలి నీ నవ్వులు నాకే ఇవ్వాలి'' అన్న ఈ పాట ''ఇద్దరు మిత్రులు'' చిత్రంలోని తొలి పాట. అలా మొదలైన దాశరథి సినీ ప్రయాణంలో 'నా హృదయపు కోవెలలో', 'గోరొంక గూటికే చేరావు చిలక', 'అందాల ఓ చిలకా.. అందుకో నా లేఖ' వంటి పాటలకు సాహితీ సౌరభాలద్ది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన సాహితీమూర్తి దాశరథి. ఈయన 1987 నవంబరు 5న మృతి చెందారు.
- హిప్సా