Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజాం ఉక్కుపిడికిలిలో బందీయైన తెలంగాణ తల్లికి విముక్తి గీతం పాడిన మహకవి దాశరథి కృష్ణమాచార్య.పద్యాన్ని అత్యంత పదునైన ఆయుధంగా వాడిన కవి ఆయన.పదేళ్ల వయస్సు లోనే కలంపట్టి అరాచక పాలనను ఎదిరిస్తూ కవిత రాయడం ప్రారంభించాడు. చైతన్యఝరిలా పరుగులెత్తే పదబంధాలు ఆయనవి.అవి అనాటి నుండి ఈనాటి వరకు వేడిదనాన్ని,వాడిదనాన్ని కోల్పోలేవు.ఆన్యాయం కన్పిస్తే చీల్చి చెండాడుతూనే ఉన్నాయి.
1925 జూలై 22 న ఉమ్మడి వరంగల్ జిల్లా చినగూడూరు గ్రామంలో జన్మించిన దాశరథి సంప్రదాయపు పునాదులపై ఆధునిక సాహితీ సౌధాన్ని నిర్మించాడు.ఛాందసవాదాన్ని విడిచిపెట్టాడు. వేదాలు,పురాణాలు వల్లె వేసే పౌరోహిత్యం గల కుటుంబంలో నుంచి తెలంగాణ దాస్యశృంఖాలాలు తెంచే దిశగా కలం పట్టుకుని పరుగులు తీశాడు. అన్యాయాలతో,అక్రమాలతో,వంచనలతో జరుగుతున్న దుర్మార్గపు పాలనను చూసి చలించిన దాశరథి ఈటెల్లాంటి పాటలు రాసి చైతన్యం కలిగించాడు.
'ఓ నిజాము పిశాచమ్మా కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రత్నాల వీణ'
అంటూ ఉద్యమమై కదిలాడు. చినగూడురు నుంచి గార్లకు చేరుకుని అక్కడ తన మిత్రులతో కలిసి ఒక సమూహాన్ని ఏర్పరుచుకుని తిరుగుబాటు తత్వాన్ని తనలో నింపుకుని తన మిత్రులకు నూరిపోశాడు. ఒక చేత్తో పెన్ను మరో చేత్తో గన్ను పట్టుకుని ముందుకు సాగాడు.
'పడతుల మానాలు దోచి గుడగుడమని హుక్కత్రాగి
జడియక కూర్చుండినావు
మడి గట్టుక నిలిచినావు
దగాకోరు బటాచోరు
రజాకారు పోషకుడవు
ఊళ్లకూళ్లు అగ్గిపెట్టి
తల్లిపిల్ల కడుపుకొట్టి
నిక్కిన దుర్మార్గమంత
నీ బాధ్యత బాధ్యత
కోటిన్నర నోటివెంట మాటలుగా పాటలుగా....అంటూనే 'నీకు నిలుచు హక్కు లేదు నీకింకా దిక్కులేదు' అని నిజాం పై ఆవేశంతో నిండిన కవిత్వంతో సింహం మై దూకాడు.
1944-48 మధ్య కాలంలో ఉద్యమం తీవ్రంగా మారుతున్న తరుణంలో దాశరథి కవితలు,పాటలు తెలంగాణలో విప్లవాత్మమైన భావాల్ని తీసుకువచ్చాయి. ప్రతి ఒక్కరిని కదనంవైపు కదిలించాయి.
' తరతరాల దరిద్రాల బరువులతో పరువెత్తే
నిరుపేదా?
విరుగుతోంది నీ మెడ పెరుగుతుంది నీ గుండెల్లో దడ'
అంటూ ధనవంతుల దౌర్జన్యాలకు బలైపోయే పేదవాడి పక్షాన నిలబడి సందేశం అందిస్తుంది దాశరథి కవిత్వం.
'నీ వేడివేడి నెత్తురుతో
షవర్ బాత్ తీసుకునే
భువనైక ప్రభువులు -వారంతాప్రభువులు?
అభవులు.'
అంటూ కవితా కోపం చూపించాడు.నిరంతర ఘర్షణలతో కులమత విద్వేషాలతో ధనిక పేద వర్గాల సమస్యలతో అల్లాడి పరప్రభుత్వం నీడలో దుర్భరమైన జీవితాల్ని గడిపిన ప్రజలను తన కవితావస్తువులుగా స్వీకరించాడు దాశరథి.
''ప్రజాస్వామ్య సామ్యవాద ధ్వజం ఎగురగలగాలి
ఉగ్రవాద నగ్ననాద రుగ్నబాధ తొలగాలి
శాంతి వేద సౌమ్యవాద కాంతిరేఖ వెలగాలి'
అంటూ దేశం శాంతియుతంగా సుభిక్షంగా ఉండాలనే కాంక్ష దాశరథి కవిత్వం లోనే కాదు ఆయన ప్రతి మాటలోను ఒక గేయమై వినిపిస్తుంది.
''జగత్తులో నేడు సగం / దగా పడుట మానుకొంది
పేదజనం నేడు మొగం/ తుడుచుకోని మేలుకొంది''
అంటూ తెలంగాణ బానిస సంకెళ్ల నుండి విముక్తి పొందిన వేళ పొంగిపోయాడు. నిలువెత్తు పద్యమై సాగిపోయాడు. స్వేచ్ఛాప్రయాణానికి మారు పేరే తెలంగాణమంటూ మంగళగీతి పాడాడు. తన మాతృభూమియైన తెలంగాణకు తన 'రుద్రవీణ' కావ్యాన్ని అంకితం చేస్తూ జన్మభూమి రుణం తీర్చుకున్నాడు.
''ననుగని పెంచినట్టి కరుణామయి నా తెలగాణ!నీ గృహాంగణ వనసీమలో ఇరుసుకంపలు నాటిన మా నిజాము రాజును పడద్రోసినట్టి రణశూరుల వెచ్చని నెత్రుచుక్కలే
మణికృత దీపమాలికల మాదిరి నీకు వెలుంగులిచ్చెడిన్"
పై పద్యం వల్ల దాశరథికి మాతృభూమిపై గల భక్తి ప్రస్ఫుటమవుతుంది.ఇది తెలంగాణకు దాశరథి పట్టిన పద్యాల హారతి. సామాజిక స్పందనను, మానవతాదృక్పథాన్ని కలిగి ఉండాలనే భావనను ప్రజల్లో కలిగించాలనే తపన కూడా ఆయన కవితల్లో కన్పిస్తుంది. కక్షలతో కాకుండా ప్రతిమనిషి కరుణతో ఎదుటివాన్ని జయించాలి. కారుణ్యం చిలికే హృదయంలో పోటీపడే దుర్మార్గుడు కూడా సన్మార్గుడైపోతాడు' అని చెప్తున్నారు. దాశరథి ఈ గేయం ద్వారా..
'కత్తిపట్టి గెలిచినట్టి ఘనుడగు వీరుండెవ్వడు?
మెత్తని హృదయం దాడికి తుత్తునియలు కానిదెవడు?'
కరకు రాతి గుండెగల వాన్ని కూడా కరిగించగల కవితా చైతన్యం దాశరథి సొంతం.అక్షరతూణీరాలను ధరించి, అశాంతిపై యుద్ధానికి సిద్ధమైన ఆయన శాంతియై కదిలే పరమ హంస.
నిజామాబాద్ ,హైదరాబాద్ (చంచల్ గూడ),వరంగల్ సెంట్రల్ జైళ్లలో బందీయై ఉన్నప్పుడు తన మిత్రులకు రహస్యంగా కవితలు పంపి పత్రికల్లో ప్రచురింపజేసేవాడు. అవి ఆనాటి రజాకార్ల గుండెల్లో గునపాల్లా దిగేవి. పద్యాన్ని,పాటని అమ్ములా ప్రయోగించేవాడు దాశరథి.
''పాటలు పాడితిన్ తెలుగుబాబులు నిద్దుర మేల్కొనగ,పో
రాటము సేయగా,కరకు రాచరికమ్మును కూలద్రోయగా
కోటిగళాలనొక్కకడ గూర్చితి విప్లవ శంఖమొత్తితిన్
నాటికి నేటికిన్ తెలుగు నాటికి వెచ్చదనమ్ము లూదితిన్ ''
అంటూ తెలంగాణ తమ్ముల కోటిగళాలను ఒక్కటిగా చేయుటకు శ్రమించి చైతన్యం సాధించానన్నాడు.
'అగ్నిధార(1949) దాశరథి తొలి కవితా సంకలనం. ఇందులో ఉన్న 49 కవితలు దాశరథి ఉద్యమంలో ఉన్నప్పుడు జైళ్లల్లో బందీ అయినపుడు రాసినవే. ఇందుపురదుర్గము' అనే కవిత నిజామాబాద్ సెంట్రల్ జైలు గురించి రాసిన కవిత. ఒకప్పుడు రఘునాథయోధుని ఎత్తైన కోట ఇప్పుడు కారాగారమై కాంతి బాసిందని బాధతో రాసిన పద్యాలు ఇవి.
''నశియించెన్ రఘునాథయోధుని దివాణమ్ముల్; మహారాష్ట్ర వీ
రశివాజీ గురురామదాస రసనాగ్రవ్యగ్ర మంత్రౌఘముల్
నశియించెన్ రఘురామ దేవళము;లీనాడీ నిజాం రాక్షసీ
నిశిరాసిన్ బడి బందిఖానయయి కన్పించెన్ వికారమ్ముగా''
అంటూ సెంట్రల్ జైలు స్థితిని పద్యరూపంలో ప్రదర్శించాడు దాశరథి. ఆ తర్వాత వచ్చిన 'రుద్రవీణ(1950)' కవితాసంకలనాన్ని తన మాతృభూమియైన తెలంగాణకు అంకితమిచ్చి బుణం తీర్చుకున్నాడు. జైళ్లో తనతోపాటు బందీయైన ఎందరో సాహితీ మిత్రుల ద్వారా ఆశయంతో పిడికిలెత్తి విముక్తికై పోరాటం సాగించాడు. తనకు మేనమామ వరసైన ప్రముఖ రచయిత శ్రీ వట్టికోట ఆళ్వారుస్వామి దాశరథి రాసిన గేయాలను, పద్యాలను బట్టీ పట్టీ జైలుగోడలపై పదే పదే రాసేవాడు. అది తెలిసిన రజాకార్లు ఆళ్వారుస్వామిని హింసించేవారు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఆళ్వారుస్వామి దాశరథి పేరును బయటపెట్టేవాడు కాదు.దీనిని బట్టి ఆనాటి కాలంలో, ముఖ్యంగా తెలంగాణ విమోచనోద్యమకాలంలో సాహితీమిత్రుల మధ్యన తెలంగాణయోధుల మధ్యన ఎంతటి పరస్పర సహకారం, మితృత్వం, ఐకమత్యం ఉండేవో స్పష్టమవుతుంది. అంతే కాదు ఆ స్నేహనికి గుర్తుగా తన 'అగ్నిధార'ను వట్టికోట ఆళ్వారుస్వామికి అంకితం చేశారు.
చారిత్రక భౌతికవాదాన్ని చాటిచెప్పే పద్ధతి దాశరథి కవిత్వంలో అణువణువున కనిస్తుంది. కమ్యూనిజం వంటి భావాలతో తన ఇమేజిజాన్ని చాటి చెప్పిన దాశరథి కారల్ మార్క్స్ లోగల ఉత్ప్రేరితమైన ఉప్పెనలాంటి భావాలు తనలో జీర్ణించుకున్నాడు.
మొదట కమ్యూనిస్టు పార్టీలో సభ్యునిగా చేరి ఎందరో యువకులను ప్రోత్సహించి వారిని ఉద్యమానికి ఉసిగొల్పిన దాశరథి ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చేసి, స్వతంత్రంగా ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకుని సాహిత్యసభలు,కవి సమ్మేళనాలు ఏర్ఫాటుచేశారు.
'నవభారత యువకులార! కవులారా! కథకులార!
భవితవ్యపు హవనానికి హోతలు
నూతన భూతల నిర్మాతలు మీరే మీరే'
అంటూ యువశక్తి తలచుకుంటే జరగనిదేదీ లేదని చాటి చెప్పాడు.
రైతుదే తెలంగాణమంటూ వెలుగెత్తి చాటే ఈ పద్యం జనం నరనరాన పొదుగుకుంది.
'' ప్రాణములొడ్డి ఘోరగహనాటవులన్ పడగొట్టి,మంచి మా
గాణములన్ సృజించి,ఎముకల్ నుసిజేసి పొలాలు దున్ని,భో
షాణములన్ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే, తెలం
గాణము రైతుదే, ముసలి నక్కకు రాచరికంబు దక్కునే?''
ప్రాణాలను సైతం పణంగా పెట్టి నవాబు కోసమై ఎముకలు నుసిజేసి వారి ఖజానాలను నింపి,అతని రాజ్యంలో స్వర్ణం నింపిన శ్రామికుడైన రైతుదే ఈ తెలంగాణమని, ముసలినక్క లాంటి నవాబుకు రాజరికం దక్కదని గళమెత్తి కలమెత్తి గర్జించాడు దాశరథి.
''అన్నార్తులు అనాధలుండని ఆ నవయుగమదెంత దూరమో?
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో?
పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో?
గాయపడిన కవిగుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో? ''
----------------------------------------
''ఆ చల్లని సముద్ర గర్భం
దాచిన బడబానలమెంతో?
ఆ నల్లని ఆకాశంలో
కానరాని భాస్కరులెందరో?'
దాశరథి జీవితం ,కవిత్వం రెండూ నిరంతర పోరాటమయమై సాగినవి. నిజం తెలిసి భుజం కలిపి నిండు మదిని సాగాలి' అంటూ నిర్మలమైన మనస్సుతో సాగిపోతూ తనతోటి వారిని కూడా కదిలిరమ్మనాడు. శాంతిమాతను స్వాగతిస్తూ దాశరథి వినిపించిన శాంతిగీతి కాంతిని అంతటా ప్రసరింపజేస్తుంది. దాశరథిశాంతిని ''రావమ్మా శాంతమ్మా'' అని పిలుస్తూ...
'' ఉగాదివై / నా ఆశల పునాదివై
సమరానికి సమాధివై/ నరహంతల విరోధివై
జగాలలో ఆవరించు/ రణాల తలలుత్తరించు/ నా మనవిని చిత్తగించు''
అంటూ స్వాగతగీతిక ఆలపిస్తాడు. ఇక్కడ శాంతిని ఉగాదిలా రమ్మనడం నూతనోత్తేజమైన భావనగా స్ఫురిస్తుంది. ఇలాంటి భావాలు రతనాలుగా తెలుగు క్షేత్రంలో పండించాడు.
కోటిరతనాల వీణగా తెలంగాణను మీటిన దాశరథి ' నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి'
అని చివరిదాకా ప్రజాక్షేమాన్ని కోరినవాడు. ప్రజల సౌభాగ్యాన్ని కాంక్షించి కవిత్వాన్ని రాసినవాడు. జాతికి గీతిక పాడి జాతిలో చైతన్యాన్ని రగిలించి దేశభవిష్యత్తు మంగళదీపమై వెలగాలని ఆశించి సాధించిన అభ్యుదయ కవి చక్రవర్తి దాశరథి.
---- తిరునగరి శరత్ చంద్ర
6309873682