Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దాశరథి కృష్ణమాచార్యులు గారు 22 జూలై 1925 లో వరంగల్ జిల్లా చిన్నగూడూరు లో పుట్టారు..కానీ పెరిగింది మాత్రం ఖమ్మం జిల్లాలో..దాశరథి గారు బహు భాషా కోవిదులు.. తొలి తెలుగు గజల్ కవి..
అరబ్బీ లో పుట్టి పారసీలో పెరిగిన గజల్ ప్రక్రియను తెలుగు సాహితీ లోకానికి పరిచయం చేసింది దాశరథి గారే! 1966 లో దాశరథి గారు తొలి తెలుగు గజల్ కు శ్రీకారం చుట్టారు.
"రమ్మంటే చాలుగానీ రాజ్యాలు విడిచి రానా
నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు గడిచి రానా
ఏడేడు పర్వతాలు ఎన్నెన్నొ సాగరాలు,
ఎంతెంత దూరమైనా బతుకంత నడిచి రానా
కనులందు మంచులాగా కలలన్ని కరిగిపోగా,
కావేరి వోలె పొంగి కన్నీరు తుడిచి రానా "
అనే ఈ గజల్ దాశరథి వ్రాసిన తొలి తెలుగు గజల్ అని డా.తిరుమల శ్రీనివాసాచార్య గారు "దాశరథి రుబాయీలు-గజళ్ళు" అనే గ్రంథంలో తెలిపారు.
"వలపునై నీ హృదయ సీమల నిలువవలెనని ఉన్నది
పిలుపునై నీ అధరవీధుల పలుకవలెనని ఉన్నది"
అనేదే దాశరథి గారు వ్రాసిన మొట్ట మొదటి గజల్ అని మరికొంత మంది గజల్ పరిశోధకుల అభిప్రాయం.
గజల్ పరిమళాన్ని తెలుగు నేలకు అద్దిన ఘనత దాశరథి గారిదే !
దాశరథి గారి కలం నుండి జాలువారిన ఎన్నో రచనలు ప్రజల్ని చైతన్య పరిచాయి..అభ్యుదయం వైపుకు నడిపించాయి.. కంటికి కనిపించింది నేను కవితగా వ్రాస్తున్నానన్నారు దాశరథి..
ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానలమెంతో..
ఆ నల్లని ఆకాశంలో కానరాని భానువులెందరో..
అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో
గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో..
...అంటూ ప్రశ్నిస్తూ వ్రాసిన ఈ గీతం ఎందరినో ఆలోచింపజేంది.
"నా తెలంగాణ కోటి రత్నాల వీణ"అని చాటిన దాశరథి గారు ఆనాటి నిజాం పాలనకు వ్యతిరేకంగా ఎన్నో కవితలను, గీతాలను వ్రాశారు - ప్రజల్ని చైతన్య పరిచారు.
"ఓ నిజాము పిశాచమా
కానరాడు నిన్ను బోలిన రాజు
మాకెన్నడేనీ.."
"దగాకోరు బడాచోరు రజాకారు పోషకుడు..
దిగిపొమ్మని జగత్తంతా నగారాలూ కొడుతున్నవి"
అంటూ రచనలతో నిజాము పై తిరుగు బాటు చేశారు.
కమ్యూనిస్టు భావాలు కలిగిన దాశరథి గారు అభ్యుదయ రచనలతో పాటుగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు, జైలు జీవితాన్ని కూడా గడిపారు.. జైలు గోడల మధ్య కూడా తన రచనను సాగించారు.
దాశరథి గారు వ్రాసిన ఎన్నో సినిమా పాటలు...
"గోదారి గట్టుంది గట్టు మీద సెట్టుంది
సెట్టుకొమ్మన పిట్టుంది..
ఖుషీ ఖుషీగా నవ్వుతూ..
రారా కృష్ణయ్యా..రారా కృష్ణయ్యా
దీనులను కాపాడా రారా కృష్ణయ్యా..
ఆవేశం రావాలి.. ఆవేదన కావాలి.."
అనే ఎన్నో వందల పాటలు సినీ ప్రేక్షకులను అలరించాయి, ఆలోచింపజేశాయి !
అంతేకాకుండా, దాశరథి గారు మహాకవి అసదుల్లాఖాన్ గాలిబ్ వ్రాసిన "గాలిబ్ గజళ్ల"ను "గాలిబ్ గీతాలు"గా తెలుగీకరించారు
"బస్కె దుష్వార్ హై హర్ కామ్ కా ఆసా హోనా
ఆద్మి కోభి మయస్సర్ నహీ ఇన్సా హోనా"
అని గాలిబ్ అంటే..
ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము
నరుడు నరుడౌట ఎంతొ దుష్కరము సుమ్ము !
అని అంటారు దాశరథి
'వాదా ఆనేెకా వఫాకీజే యహ్ క్యా అందాజ్ హై
తూనే క్యూ సోంపాహై మేరె ఘర్ కి దర్భాని ముఝే'
(గాలిబ్)
"వత్తునని రాక నా గృహ ద్వారమునకు
నన్నే కాపలాగా నిల్పినావదేమే ?(దాశరథి)
"ఎంత తీయని పెదవులే ఇంతి ! నీవి..
తిట్టుచున్నప్పుడున్ గూడ తీపి కురియు "
"గుండెదొంగిలించుకొనిపోయే జంకక
ముద్దొసంగ వెనుక ముందులాడే"
"గాలీబు నెఱుంగ రెవరు లోకమునందు
మంచికవియైన అతని నిందించు జగము."
"సింధువునుజేరి బిందువు సింధువగును,
ధ్యేయమును బట్టి ప్రతి పని దివ్యమగును"
వంటి ఎన్నో షేర్ లు మూలభావము చెడకుండా దాశరథి గారు ఎంతో గొప్పగా తెలుగీకరించి సాహితీ ప్రియుల మెప్పును పొందారు. ఇలా తనదైన శైలిలో ఎన్నో రచనలు చేసి తెలుగు సాహితీ లోకం లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మహాకవి దాశరథి !
--రాజేష్