Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'దాశరథి కరుణాపయోనిధీ’ అన్నది శ్రీ రామచంద్రుడి భక్తుడైన కంచర్ల గోపన్న మాట. "దాశరధి కవితాపయోనిధీ" అన్నది తెలుగు సినీ జనుల మాట. అన్నపూర్ణ వారి "ఇద్దరు మిత్రులు" (1961) చిత్రం లోని 'ఖుషి ఖుషిగా నవ్వుతూ, చలాకి మాటలు రువ్వుతూ' అన్న పాట ద్వారా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన డాII దాశరథి తన సినీ కవితా రంగంలో తరంగాల వలే ఉవ్వెత్తున ఊరికే ఎన్నో సినిమా పాటలు రచించాడు. అప్పటినుంచి తనదైన ఒక ప్రత్యేకనైమ ముద్ర ఏర్పర్చిన విలక్షణ రచయిత దాశరథి.
"సినిమా అంటే అన్ని రకాల పాటలు రాయాలి లేకుంటే కలం జేబులో పెట్టుకొని వెళ్ళిపోవాలి" అని దైర్యంగా తన భావాన్ని చాటి చెప్పిన ధైర్యశాలి దాశరథి. అందుకే తెలుగు సినీ సాహితి పయోనిధీ దాశరథి అని పెద్దలు అంటారు.
ఆధునికాంద్ర సాహిత్యంలో , తెలుగు సినీ సాహితి జగత్తులో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించినా దాశరథి, వరంగల్ జిల్లా చిన్న గూడూరులో ( ప్రస్తుతం ఈ గ్రామం మహబూబాబాద్ జిల్లాలో ఉంది) 1925 జులై 22వ తేదీన జన్మించారు. తల్లితండ్రులు దాశరథి వెంకటాచార్యులు, వెంకటమ్మ. పూర్తిపేరు దాశరథి కృష్ణమాచుర్యులు అయినప్పటికీ అందరికి ' దాశరథి ' గానే సుప్రసిద్ధులు.
బాల్యం అంతా ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది.తండ్రిగారైన వెంకటాచార్యులు తన కుమారునికి తెలుగు కన్నా సంస్కృతం ప్రధానంగా నేర్పించేవారు, బహుశా ఇందువల్లనే ఏమో చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించారు. ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బియ్యే పూర్తిచేశారు. అంతకుముందు నుంచి ఆంగ్ల సాహిత్యంలో ఉన్న పరిచయం డిగ్రీ తీసుకోవడంతో ఆంగ్లబాషపై వీరికి సాధికారత ఎక్కువైంది.ఆ రోజుల్లో ఉన్నత పాఠశాల నుంచి ఉర్దూ భాష నిర్బంధంగ బోధింపబడేది. ఇలా అన్య బాషల పరిచయం వల్ల దాశరధికి తెలుగుతో పాటు సంస్కృత, ఉర్దూ,ఇంగ్లీషు,భాషల్లో బాగా అభినివేశం ఏర్పడినది.
ఉద్యమ జీవితం, రచనలు :
నిజాం ప్రభువుల పాలనలో రైతుల కష్టాలు, కూలీలా బాధలు దాశరథి చిన్నప్పటినుండి చూస్తూ వచ్చాడు.లోలోపల ఎంతో బాధను అనుభవించాడు. ఇవే కాకుండా నిజాం పాలనలో అణగతొక్కపడుతున్న తెలుగు జాతి, తెలుగు భాష పరిస్థితి దశరథిని ఏంటో కలవరపరిచాయి. ఆ నేపథ్యంలో వెలువడిన రచనలే అగ్నిధార, రుద్రవీణ లాంటి గొప్ప ఖండ కావ్యాలు.
అగ్నిధార (1949) అనే ఈ నామం ఈ ఖండకావ్య సంపుటికి ప్రత్యేకతను, రచయిత వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఇందులోని అధిక భాగం వీరు జైలు జీవితంలోనే రాసినవి. ఈ రచనలో ప్రధానంగా నిజాం నిరంకుశ పాలన, ప్రజల అగచాట్లు మనకు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తాయి.
" ఓ నిజాము పిశాచమా! కానరాడు
నిన్ను బోలిన రాజు మాకు ఎన్నడేని
తీగలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణా కోటి రత్నాల వీణ "
అని ఎలుగెత్తి గొంతెత్తి చాటిన వైతాళికుడు దాశరథి.
'రుద్రవీణ' రెండో సంపుటం 1949 సం IIలో ప్రచురింపబడినది. ఈ సంపుటికి రుద్రవీణ అని పేరు పెట్టడంలో కవి ఉద్రేకం, ఉద్వేగం స్పష్టంగా ధ్వనిస్తుంది. ఇందులోనే ఖండికలు శ్రామికుల అభ్యున్నతిని కాంక్షించేవి, నిరంకుశ నిజాం నవాబు పాలనను నిరసించేవి.
మా నిజాము రాజు జన్మ జన్మల బూజు. (ముక్తిభూమి - రుద్రవీణ)
రానున్నది ఏది నిజం
అది ఒక్కటే సోషలిజమ్
కల్పాండోయి భుజం భుజం
కడాలండోయి గజం గజం
అని ఆనాడే సోషలిజమ్ వస్తుంది అని చాటిన ఆశావాది.
దాశరథి సినీ గేయాలు:
సినిమా కవుల్లో సుప్రసిద్ధులు దాశరథి. సినిమా పాటల సరళకతకు, సౌమ్యతకు, పూర్ణార్ధానికి ప్రతీకలుగా నిచిచనివే దాశరథి వారి సినిమా పాటలు. వీరి సినిమా పాటల్ని పరిశీలిస్తే అందులోని ఎత్తుగడ, నడక, అక్షర రమ్యత, అల్లిక జిగిబిగి, అత్యద్భుతంగా వర్గీకరించవచ్చు.
అవి 1) ప్రణయ గీతాలు 2) విషాద గీతాలు 3) భక్తి గీతాలు 4) శ్రామిక గీతాలు 5) పిల్లల గీతాలు
1) ప్రణయ గీతాలు: సినిమా పాటల్లో ప్రణయానికి ప్రణయ కవిత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడింది. ప్రేయసి ప్రియులు కలిసి పాడుకొనే గీతాలు ప్రణయ గీతాలు. దాశరథి వారు రాసిన ఈ పాటలు చక్కటి భావంతో,చిక్కటి కవిత్వంతో, రంజింపచేస్తాయి.
ఖుషి ఖుషీగా నవ్వుతూ
చాలాకి మాటాలు రువ్వుతూ
హుషారు గొలిపే వెందుకే
నిషా కనులదాన (ఇద్దరు మిత్రులు)
నా కంటి పాపలో నిలిచిపోరా
నీవెంట లోకాల గెలవునీర
ఈనాటి పున్నమి, ఈనాటి పుణ్యమో
జాబిలీ వెలిగేను మన కోసమే (వాగ్దానం)
నన్ను వదిలి నీవు పోలేవులే - అది నిజములే
పూవు లీక తావు నిలువ లేదులే - లేదులే
తావులేని పూవు విలువ లేనిదే ఇదీ - నిజములే
నేను లేని నీవు లేనే లేవులే - లేవులే (మంచి మనసులు)
ఈ విధంగా దాశరథి గారు రాసిన ఈ పాటలు వెన్నెల స్నానాలు చెయిస్తాయి, మల్లెల సుగంధం గుబాళించేస్తాయి.
2) విషాద గీతాలు: దాశరథి తన గీతాల్లో విషాదాన్ని కరుణ రసాత్మకంగా చిలికించాడు.
నిజమైన కలయైన - నిరాశలో ఒకటేలే
పగలైనా రేయైన - ఎడారిలో ఒకటేలే
పదే పదే ఎవరినో - పరాకుగా పిలిచెను
నీనీదే నీ తోడై జగమంతా తిరిగేను II నిజ II (మూగనోము)
మంటలు రేపే నేలరాజా
ఈ తుంటరి తనము నీకెలా
వలపులు రేపే వీరులారా
ఈ శీలా పై రాలిన ఫలమేమి ?
ఆకాశానికి అంతుందీ
నా ఆవేదనకు అంతేది ? (రాము)
మల్లెతీగ వాడిపోగ మరల పూలు పూయునా
తీగ తెగిన హృదయవీణ తిరిగి పాట పాడునా
మనసులోని మమతలన్నీ మాసిపోయి కుములువేళ
మిగిలింది ఆవేదనా II మల్లె II (పూజ)
విషాదానికి సంబందించి అద్భుత భావ వ్యక్తీకరణ ఈ గీతాల్లో కనిపిస్తుంది.
3) భక్తి గీతాలు: సినిమాల్లో దైవ భక్తిని ప్రభోదించే సినిమా పాఠలు ఎన్నో వచ్చాయి, కానీ దాశరథి వారు రాసిన పాటలుబహుళ ప్రాజాధారణ పొందాయి.
పాడెద నీ నామమే గోపాల
హృదయములోనే పదిలముగానే
నిలిపితి నీ రూపమేరా II పాడెద II (అమాయకురాలు)
తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగరా
ఏ పేరున నిను పిలిచేనురా ఏ రూపున నిను కొలిచేనురా II తిరుమల II
పాలకడలిలో శేషశయ్యపై పవళించిన శ్రీపతివో
వెండికొండపై నిండు మనసుతో వెలిగే గౌరి పతివో
ముగ్గురమ్మలకే మూలపుటమ్మగా భువిలో వెలిసిన ఆదిశక్తివో II తిరుమల II (మేనకోడాలు)
ఇలా ప్రతి మనసులో భక్తి పారవశ్యాన్ని పెంచే ఎన్నో పాటలు వీరి కలం నుండి వెలువడ్డాయి.
శ్రామిక గీతాలు:
సినిమా కవులు శ్రమకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చి శ్రామిక గీతాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకోని వచ్చారు.
పల్లెసీమ మన పంట సీమ
అందాల చేలల్లో అలరించే గాలిలో
పగలనక రేయనక పనిచేసే వేళలో
అందరిలో ఆనందం చిందువేసే - అహ గంతులేసే
మహాలక్ష్మి ఇంటింటా విహరించెను. II పల్లెసీమ II
ఇలా శ్రామికుల కష్టాన్ని ఎంతో ఇష్టoగా తనదైన శైలిలో, కొత్త బాణీలతో కూర్పాడు దాశరథి.
5) పిల్లల గీతాలు:
దాశరథి వారు రాసిన పిల్లల పాటలు ఆధునిక బాల గేయాలు అనవచ్చు.
పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయి
నీకు యేటేటా ఇలాగె పండుగ జరగాలి !
కళకళలాడే నీ కళ్లు దేవుడి ఇళ్ళమ్మా
కిలకిలానవ్వే నీ మోము ముద్దుల మూటమ్మ (బంగారు కోడలు)
చిన్నారి పొన్నారి పువ్వు
విరబూసి విరబూసి నవ్వు
మన ఇంటి పొదరింటి పువ్వు
నినుజూసి నన్నుచూసి నవ్వు IIచిన్నారిII (నాది ఆడజన్మే)
ఆలనా పాలనలో మమేకమైన ఇలాంటివి ఎన్నో పాఠాలు దాశరథి వారి కలం నుండి వెలువడ్డాయి.
ఇలా దాశరథి వారి గేయాలను పరిశీలిస్తే ఇంతింతై వటుడు త్రివిక్రమ స్వరూపుడైనట్టు, తెలుగు సినీ సాహితీ ప్రపంచంలో దాశరథి గొప్ప విశారదునైట్టు తెలుస్తుంది. తెలుగు సాహిత్యం తెలుగు పాట ఉన్నంత కాలం దాశరథి ఉంటాడనటం అతిశయోక్తి కాదు, అందుకే తెలుగు సినీ సాహితీ విశారదుడు - దాశరథి.
సాయికృష్ణ రంగ MA,TPT,(PhD)
ఉస్మానియా విశ్వవిద్యాలయం