Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ వామనమూర్తి, తెలుగు మాగాణ త్రివిక్రమ స్పూర్తి, అతని కలం అగ్నిధారా, అతని గళం రుద్రవీణ, లలిత గేయాల దీప్తి, కవిత కావ్యాల కీర్తి, సమగ్ర భావ కవితా స్వరూపం వర్తమాన కవులకు ఆచార్యుడు, ఇంటి పేరులో రాముణ్ణి తన పేరులో కృష్ణున్ని నిలుపుకున్న రామకృష్ణావతారమే దాశరధి. దాశరధి కృష్ణమాచార్యులు 1927-87 మధ్య కాలములోని వారు. 1977 లో ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా ఉన్నారు. ఆంధ్ర విశ్వవిధ్యాలయం “కళాప్రపూర్ణ”, బిరుదుతో గౌరవించింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ మరియు కేంధ్ర సాహిత్య అకాడమీ అవార్డులను పొందాడు.
తెలంగాణ ప్రజలను చైతన్యపరుచుటకై దాశరధి ప్రతీ విషయంలో కవిత్వం ద్వారా తన కలం, గళం ద్వారా ఉత్తేజపరిచారు. కత్తి హింస చేయవద్దు కలంతో గళం కలిపి ఓటుతో దుష్ట పరిపాలనను తిరగ్గొట్టమన్నారు. మహాత్మా గాంధీ ఆశయ సాధన గౌతమ బుద్దుని అహింసా పద్దతులు దాశరధి పై ప్రభావము చూపినాయి. మార్పు విప్లవాల వల్ల హింస ద్వారా రాదని మనుషుల మనసుల్లో మానవత్వముతో కూడిన ఆలోచనలు వాటి ఆచరణాల్లో మార్పు రావాలని సుభిక్ష మైన విశాల భావాలు రావాలని కోరుకున్నారు.
దాశరధి నిజాం నవాబుకు సింహా స్వప్నమై తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన ప్రళయ కవితా మూర్తి. కానీ మొదట్లో దాశరధి ప్రకృతి – చిత్రణలు, ప్రణయ వర్ణనల పై రచనలు ఎక్కువగా ఉండేవి. అటు పిమ్మట నవాబు సైనికులు తెలంగాణ ప్రజలపై దారుణ హింసా చర్యలను చూసి ప్రజా ఉద్యమాలతో పరిచయం ఏర్పడడంతో ప్రణయం తో ప్రళయం కలిసి రచనల్లో మార్పు వచ్చింది. తాను రాసిన పద్యాలు చదువుతూ సభలు సమావేశాలు నిర్వహిస్తున్న దాశరధిని నవాబు సైనికులు బంధించి జైలులో పెట్టారు. యుక్తితో తప్పించుకొని ఆత్మీయుల చేత ఆధరింపబడి మారు వేశములో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఇలాంటి పరిస్థితుల్లో కవి గారిలో “తిరుగుబాటు కవిత్వం జీవితం” ఊపిరి పోసుకుంది. రోజులు గడుస్తున్న కొలది బలవత్తరమైన జాతీయ భావాలతో కూడిన విప్లవాత్మకమై విలసిల్లి తెలంగాణ ప్రజానీకాన్ని మేల్కొల్పడానికి ఎంతో తోడ్పడినాయి. దుర్మార్గుల కిరాతకులకు బలి అయిన ప్రజావాణికి నిదర్శనంగా నిలిచారు.
“దున్నేవాడిదే భూమి” అనే సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు. నిరంకుశత్వాన్ని తీవ్రంగా నిరసించాడు. అందుకే
“ఓ నిజాం పిశాచమా ! కానరాడు / నిన్ను బోలిన రాజు మాకేన్నడేని
తీగలను తెంపి, అగ్నిలో దింపినావు / నా తెలంగాణ కోటి రతనాల వీణ” అంటూ నిండు సభలో ఎలుగెత్తి చాటి మాతృ భూమిపై గల భక్తిని వెల్లడించాడు.
“దిగిపొమ్మని జగత్తంత / నగారాలు కొడుతున్నది. / దిగిపోవోయ్ తెగిపోవోయ్ “ అంటూ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా కధం తొక్కి పదం పాడి నిజాం నవాబును శపించాడు. వారి క్రోధానికి గుర్తుగా జైలు జీవితం గడిపినాడు. అందులోని అనుభవాలు అధ్బుతమైన భావనా శక్తికి సజీవంగా వర్ణించాడు. నిరాశగానే ఉండిపోక ఆశావాదిగా అభ్యుధయ లక్షణం కూడా ఉంది. ఆర్థిక సమానత్వం, సౌమ్యవాధ ధోరణికి కూడా దాశరధి స్వాగతం చెప్పినారు. శ్రామికులు పడే కష్టాలను తీవ్ర నష్టాలను హృదయ విధారకంగా వర్ణించాడు.
“ తరతరాల దారిద్యాలతో / బరువులతో పరిగెత్తే నిరుపేద / విరుగుతుంది నీ మెడ / పెరుగుతుంది నీ గుండెల్లో ధడ నీ వేడి వేడి నెత్తురుతో శవరుబాత్ తీసుకొనె భువనైక ప్రభువులు వారంతా ప్రభువులు అభువులు” అంటూ నిరంకుశ ప్రభువులను విమర్శించాడు. పేదవారి కష్టాల్లో తాను పాలుపంచుకోవటానికి ఆకలితో చనిపోతానని నా కలాన్ని రూకలకై అమ్ముకోనని చెప్తూనే దివ్య నవ్య భవితవ్యానికి నిరీక్షించు అంటూ ధైర్యమును బంగారు భవిష్యత్తును ఊహిస్తాడు. నిరుపేద మాన ప్రాణాలకు రక్షణ లేని రాజ్యం రాబందుల రాజ్యమే అని రాజుల రాజ్యం కాదని విమర్శించారు.
దాశరధి నిజ జీవితంలో నుంచే కవితా జీవితం ప్రారంభం అయినది. తాను సాధించాలను కున్న విజయాలకు కవిత్వాన్ని ఆయుధంగా ఉపయోగించుకున్నాడు. దాశరధి కవితా జీవితం నిజ జీవితం రెండు ఒకదానితో ఒకటి విడదీయ రాని అనుభందంగా ఉండేది. ఆయన కళ్ళల్లోని కోపం ఒళ్ళంతా కవిత్వమై నైజాములపై ఘణ ఘణ గర్జనైంది.
రజాకారులు, నైజాం పోలీసుల నుండి గాలి లాగా తప్పించుకొని కవిత్వంతో తెలంగాణను మేల్కొల్పాడు. తన కవిత్వంతో తెలంగాణ ని రాజ పెట్టాడు. అందు తాను కూడా జ్వలించిన మహనీయుడు. ఆయన ప్రకృతిని మానవ ప్రవృత్తిని జాగ్రతగా పరిశీలించి మానవతతో సమతా సందేశంతో ప్రజల్లో జాగృతిని కలిగించాడు. దాశరధి భాషా ప్రయోగంలోనూ, పద్య రచనా శైలిలోనూ కొత్త పుంతలలోకి నవ్యతను సాధించిన దివ్య కవితామూర్తి, మూర్తీభవించిన మహా వ్యక్తి.
ఏ వస్తువు ప్రాముఖ్యత అయిన చూసే మనసును బట్టి ఉంటుందనేవారు దాశరధి గారు. చీకటి అజ్ఞానానికి ప్రతీక అని ద్వేషించేవారు. కానీ చీకటిని ప్రేమించడం అది లేకపోతే వెలుగుకు విలువ లేదని చెప్పడం దాశరధి గారి ప్రత్యేక లక్షణం.
“ ఇరులకన్న అందమెచట కానరాదు / ఇరులే సౌఖ్యములకు దరులు సుమ్ము
ఇరులు లేని నాడు నరులు కానరాదు / నరులు లేనినాడు ధరణి లేదు” అంటూ చీకటి ప్రాముఖ్యతను వర్ణిస్తారు. వర్ణాలు వర్గాలు, వేషాలు రోషాలు మాని ప్రాణాలర్పించగలిగితే, కష్టాల నష్టాలకొర్చితేనే స్నేహమని మనస్సు విప్పి హాయిగా స్నేహ గీతాన్ని ఆలపించిన సౌజన్య మూర్తి. విశ్వమంతా ఆయనదే ఎక్కడ మంచి ఉంటే అక్కడే ఉంటారు. ఎక్కడ శాంతి అవసరమో అక్కడ తన కవితా కోదండంతో అవతరిస్తారు. దాశరధి కవితా సౌధం పుష్పక విమానం లాంటిది. అందు ఎందరు ప్రయాణించిన ఇంకా చోటు ఉంటుంది. అన్నీ భాషల వారు ఆ పుష్పక విమానంలో కూర్చొని ఆనందలోకాల్లో సంచారం చేయడానికి వెళ్లవచ్చు.
ఇతిహాసాలల్లోని రావణుడి పాత్రను గూర్చి చెప్తూ “ అసలు సూర్యుడే రావణున్ని చూసి భయంతో ఆగిపోయాడు. ప్రకృతి సమస్తం అతనికి దాసోహం అంది. రావణుడు బ్రహ్మాండం అంతా పట్టేసిన సైంటిస్ట్. ఇదంతా భయతో జరుగుతుంది కానీ భక్తితో కాదు. రావణున్ని నిరంకుశ ధోరణిని వ్యంగంగా వెల్లడించారు.
“తోటలోని పూలు యుద్దం చేస్తే / తోటంతా రణరంగంగా మారుతుంది / పరిమళాలు నశించిపోతాయి
శవాల దుర్వాసన పెరుగుతుంది”. తోటవంటి లోకాన్ని ఎడారి చేయకండి అంటూ విప్లవ శక్తులను రూపుమాపాలని ప్రజలను అభ్యర్ధన చేసాడు. చీకటి రాక్షసిని రవికిరణాల ఖఢ్గాలతో చేధిస్తాడు అని చెప్పారు. దాశరధి దృష్టిలో తెలంగాణ అంటే ఆనాటి తొమ్మిది జిల్లాల భూభాగం కాదు. తెలంగాణ భాహులాంధ్రులకు పర్యాయపదం అని విశాల విశ్వ మానవతా వాదానికి నిదర్శనం “వసుదైక కుటుంబమే” ఆయన లక్ష్యం. మనిషిని మనిషి ద్వేషించని మార్గం వెతకాలి / జగతిని సుఖశాంతులు గల స్వర్గం చేయాలి అని హితువులు ఉపదేశించాడు. యువ కవిత, శశిరేఖతో అజ్ఞానాంధకారాన్ని అణగిస్తూ అమాయకుల ఆక్రంధనను తొలగిస్తూ పదవీ దావాలాన్ని చల్లారుస్తారు.
దాశరధి గారు ధీనజన పక్షపాతి, అందుకే నవాబు పరిపాలనలో ధీన జనులకు కలిగిన అన్యాయాలకు చేలించి వారి రక్షనకై కంకణం కట్టుకున్నారు. పీడిత ప్రజలు ఏదో ఒక నాడు తిరగ బడక మానరు, ఆ తిరుగుబాటుతో దుష్ట శక్తి నాశనం కాక తప్పదు అని ఆశావాదాన్ని వెల్లడించారు. భాష మీద ప్రభుత్వము భావంతో వైశాల్యము, కవిత్వంలో ప్రవాహము ఉన్న దాశరధి బుద్దునిచే ప్రభావితుడై బౌద్ద గాధలను కొన్నింటిని ఇతివృత్తంగా తీసుకొని ముగ్ధమనోహరమైన “ మహాబోధి” కావ్యంగా రూపొందించారు. విప్లవ కవితల వల్ల రాదు. పీడిత ప్రజల వల్లనే వస్తుంది. వారిని విప్లవోన్ముకులను చేయుటయే కవిత్వ ముఖ్య కర్తవ్యం. అదే లక్ష్యంతో దాశరధి ప్రగతి నిరోధక శక్తుల ఆట కట్టించడం, సంఘ శ్రేయస్సును సాధించటం కోసమే ఆయన జనార్ధనుడిగా, కాళీయ మర్ధనుడిగా, గాండేవిగా ఎన్నో అవతారాలను ఎత్తుతానన్నారు. “తిరిగే భూగోళాన్ని ఆపేయండి దిగిపోతాన్నేను / మానవతా నశించిన చోటు దానవత సహించలేను అంటారు”. మానవతా లేని చదువులు డిగ్రీలు నిష్ప్రయోజనం, నిజమైన చదువుకు మానవతే కొలబద్దం. చదువుల కోసం అహర్నిశలు మానవులంతా కృషి చేయాలి అనేది దాశరధి సందేశం. రణబీజాలు వెదజల్లే రాక్షసుల మీద మృత్యు కేదారాలు పండించే ఉన్మాదుల మీద దాశరధి గారికి చెప్పలేనంత ద్వేషం, పట్టరానంత ఆగ్రహం.
“ఎర్ర కోట మీద ఎగిరే జండా నా హరివిల్లు / ఈ విశాల భారతావని స్వాతంత్ర్య దేవతలకు ఆది ఇల్లు
స్వాతంత్ర్య దేవతా సహస్ర శిఖరాలయంలో భారత ప్రజా లక్షల, కోట్ల సంఖ్యలో పూజలు జరుపుతున్నారు, అన్న దాశరధి గారి దేశ భక్తి తత్పరతం ఆదర్శవంతమైనది. నాగటి చాళ్ళల్లో నడిచే రైతులకు తన దివ్య సందేశాన్ని సుప్రభాత గీతాలుగా పాడిన దాశరధి మహా అరణ్య మైన తెలంగాణ భూమిని మాగాణమోనర్చిన రైతుదే గానీ, నిజాం నవాబులది కాదని, నిజామాబాదు సెంట్రల్ జైలులో సింహా గర్జన చేశారు.
“వేయి స్తంభాలగుడి రాయించుకున్నది / నా చేత ఏకశిలా చరిత్ర వీర రుద్రమదేవి వినిపించుకున్నది నా చేత జన్మ జన్మల కథలు, పోతన్న కవి కలబోయించుకున్నాడు నా చేత నేటి ఆనాటి కవిత /ముసునూరి కాపన్న మ్రోగించుకున్నాడు నా చేత క్రాంతి వీణ/నాకు తల్లివీ నీవు, నేను నీకు సుతుడిని/ నాటికి నేటికీ ననుదినం మ్రోయుచున్నావు నా గలమ్మున, కలాన నా తెలంగాణ! కోటి రతనాల వీణ!”అని దేశభక్తిలో అంతర్భాగమైన గత వైభవ స్మరణ ప్రవేశించింది. అజంతా పాలరాతి విగ్రహాల కళ్ళల్లో కాంతిని, ముఖాల్లో శాంతిని దర్శించిన నవకళా మూర్తి. శ్రీ జలగం వెంగళరావు గారు, దాశరధి గారు ఇరువురు చిరకాల మిత్రులు. ప్రాణంలో ప్రాణం, గానం లో గానంగా ఉండేవారు. దాశరధి ఆర్జించిన కీర్తి వెనుక జలగం గారి మూర్తి ప్రజ్వలిస్తూనే ఉంటుంది. ప్రజల్లో తిరుగుతూ ప్రజల సమస్యను అవగాహన చేసుకుంటూ పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తూ తన కవితా కిరణాలతో వెన్ను తట్టి లేపుతూ జాతికే తన కవిత్వం అంకితం అయిపోయిన ప్రజాకవి దాశరధి.
“ రక్తం నడులై పారకపోతే రాధా రెవల్యూషన్ / బుర్రలు బుర్రలు పగులక సమస్యకు లేదా సోల్యూషన్ / హింసా యుద్దం అవుట్ డేటెడ్ ఆని నేను అంటాను / శాంతి ఒక్కటే మానవ జాతికి సరియగు సోల్యూషన్” అనే దాశరధి బహుముఖ ప్రజ్ఞావంతుడు, శాంతిసమర యోధుడు. విప్లవానికి సముచితమైన వ్యాఖ్యానం చేసి విప్లవం అంటే రక్తపాతం కాదని హితబోధ చేశారు. సమ సమాజమే ఆయన ధ్యేయం అనేవారు. “అగ్నిధారా” కురిపించటం ఆరంభించి “జ్వాలలేఖిని” వరకు ఎన్నో చైతన్యామృత కవితా ధారలను కుంభవృష్టి కురిపించి ‘జనత’ ను మురిపించిన హృదయాస్థానకవి దాశరధి.
-వనపర్తి పద్మవతి
9949290567