Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి మనిషికీ కన్న తల్లి, పుట్టిన ఊరు, నివసించే దేశం - ఈ మూడు ముఖ్యమైనవి. వీటి పట్ల ప్రేమాభిమానాలు మెండుగా ఉన్న వ్యక్తి జాతీయతకు ప్రతీకగా నిలుస్తాడు. అయితే ఈ జాతీయతా భావన సంకుచిత నినాదంగా కాకుండా, మానవాళి పురోభివృద్ధికి దోహదం చేసినప్పుడు అది విశ్వజనీనతను సంతరించుకుంటుంది. కవులు ఈ దిశగా తమ కవిత్వం వినిపించినప్పుడు వారు ప్రపంచ పటం మీద పతాకలై రెపరెపలాడుతారు. అటువంటి కవుల కోవకు చెందినవాడు దాశరథి.
దాశరథి ఇంట గెలిచి రచ్చగెలిచినవాడు. ముందుగా తాను పుట్టిన ఊరు, తన ప్రాంతం, ఆ తరువాత తన రాష్ట్రం, తన దేశం, ఆపై ప్రపంచం - ఇట్లా తన దృష్టిని సారించి, కవన సృష్టిని గావించాడు. అందుకే తెలుగులో దాశరథి ఒక విశిష్ట కవిగా లబ్ద ప్రతిష్టుడైనాడు.
దాశరథి పుట్టింది దేశ స్వాతంత్య్ర సంగ్రామం కొనసాగుతున్న కాలంలో. ఒకవైపు జాతీయోద్యమం ఉధృతంగా కొనసాగుతుంటే, మరొకవైపు తెలంగాణ ప్రాంతం నిజాం నిరంకుశ పాలనలో ఉక్కిరిబిక్కిరవుతున్నది. ఒకవైపు తన ప్రాంతం, మరొకవైపు తన దేశం. బలవంతుడు బలహీనుణ్ణి దోచుకోవడం, అణచి వేయడమేనా చరిత్ర అంటే? బాల్యంలోనే దాశరథిలో ఉదయించిన ప్రశ్న ఇది. దీనికి అంతమెప్పుడు? ప్రజలు
ఉద్యమించినప్పుడు. ఈ ప్రశ్నలు, ఈ జవాబులు దాశరథిని ఉన్నచోట ఉండనివ్వలేదు. పసితనంలోని ఆ లేత గుండెను తుపాకీ గుండెకు ఎదురొడ్డి నిలిచే విధంగా మలిచాయి.
సనాతన సంప్రదాయ పండిత కుటుంబంలో జన్మించిన దాశరథిలో బాల్యం నుంచే ప్రతిదీ ప్రశ్నించే మనస్తత్వం, కార్యకారణ సంబంధం వెదికే అలవాటు నాటుకొంది. కేశవార్యశాస్త్రి అనే గురువు ద్వారా విన్న
ఉపనిషద్వాక్యాలలోని 'అగ్ని' ప్రస్తావన; జనాబ్ జక్కీ సాహెబ్ వివరించిన ఇక్బాల్ విప్లవ గీతాలలోని నిప్పు సెగలు; దూరపు బంధువుల అమ్మాయి చూడామణి చూసే చూపులలోని వెచ్చదనాలు - ఈ మూడు దాశరథిలో త్రేతాగ్నులై మండినాయి. అందుకే ఆయన కవిత్వంలో ఒకవైపు అంగారం, మరొకవైపు శృంగారం
ఉంటాయంటారు.
''నేనురా తెలంగాణ నిగళాల తెగగొట్టి
ఆకాశమంత యెత్తార్చినాను''
అని దాశరథి అనడంలో ఆయన పరిధి కేవలం తెలంగాణకే పరిమితమైనది కాదు. తాను ఆకాశం దాకా విస్తరిస్తానన్న విశాలమైన భావం దాగుంది. విశ్వనరుడిగా ఎదుగుతానన్న విశ్వాసం ఉంది.
''నేను రాక్షసి గుండె నీటుగా పద్యాలు
పాడి మానవుని కాపాడినాను''
అన్నదానిలో 'తెలుగు వాడి'ని అనకుండా 'మానవుని' అనడంలో ఆయన విశ్వజనీన దృక్పథం ద్యోతకమవుతోంది.
''నేను వేయి స్తంభాల నీడలో నొక తెల్గు
తోటనాటి సుమాలు దూసినాను''
అనడంలో తాను తెలుగు వాడిననీ, తనది తెలంగాణ అని చాటుకొన్నాడు. ప్రపంచం, మనిషి, తెలుగువాడు - అన్న భావాలు ముప్పేటగా అల్లుకొన్నాయి.
''తరతరాల స్వప్నాల సుందర ఫలమ్ము
స్వైరభారత భూమి చూపడెనొ లేదొ
విషము గుప్పించినాడు నొప్పించినాడు
మా నిజాం నవాబు, జన్మజన్మాల బూజు''
బ్రిటిష్ వారి నుంచి భారతదేశం స్వాతంత్య్రం పొందినప్పటికీ, తెలంగాణ మాత్రం ఇంకా ఆనాటికి నిజాం గుప్పిట్లో నిర్దాక్షిణ్యంగా నలిగిపోతూనే ఉంది. ఆ భావాన్నే నిర్భయంగా వ్యక్తపరుస్తూ, నిజాం ఏలికనే బూజు పోలికగా ఉపమించిన ధీశాలి దాశరథి.
''అచట పాపము దౌర్జన్యమావరించి
తెలుగు దేశాన నెత్తురుల్ చిలికి
మత పిశాచము పేదల కుతుక నమిలి
ఉమ్మి వేసేను పిప్పి, లోకమ్ము మీద''
తెలంగాణలో ప్రజల పట్ల నిజాం జరిపే రాక్షస కృత్యాలను, నగ సత్యాలను లోకానికి నిర్భీకంగా చాటి చెప్పాడు. ఇక్కడ నిజాం పేదవాళ్ళ గొంతులు నులిమి వేయలేదు, నమిలి వేశాడు. అందుకే ఆ పిప్పిని సమాజంలోకి విసిరివేశాడు. అంటే ప్రజల వాక్స్వాతంత్య్రాన్ని హరించి వేశాడు.
పాలకుణ్ణి ఎదిరించి జైలు పాలైన దాశరథి కారాగార వాసమే కవన వేదికగా మార్చుకున్నాడు. జైలు గోడలనే కాగితాలుగా, పళ్ళు తోముకోవడానికి ఇచ్చే బొగ్గు ముక్కలనే కలాలుగా మలుచుకొన్నాడు. ఉదయించే సూర్యుణ్ణి అడ్డుకోవడమా! పారే సెలయేరును ఆపతరమా!!
''ఇదే మాట ఇదే మాట పదేపదే అనేస్తాను
కదం తొక్కి పదం పాడి ఇదే మాట అనేస్తాను
... ... ... ... ... ... ... ... ... ...
దగాకోరు బడాచోరు రజాకారు పోషకుడవు
... ... ... ... ... ... ... ... ... ...
'కోటిన్నర' నోటి వెంట పాటలుగా, మాటలుగా
దిగి పొమ్మని దిగి పొమ్మని ఇదే మాట అనేస్తాను
... ... ... ... ... ... ... ... ... ...
దిగి పొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది
దిగిపోవోరు దిగిపోవోరు తెగిపోవోరు దిగిపోవోరు
ఇదే మాట ఇదే మాట పదే పదే అనేస్తాను''
కవి ప్రజాపక్షం వహించడం ఆధునిక అభ్యుదయ కవి లక్షణం. అది పై పంక్తులలో ప్రస్ఫుటమవుతుంది.
నిజాం వ్యతిరేకేద్యమంలో అమరులైన ఎందరో త్యాగధనుల బలిదానం ఫలితంగా విముక్తి పొందిన తెలంగాణను ఆ విప్లవవీరుల రుధిర జ్యోతులతో దాశరథి కాంతిమయం చేశాడు.
''ననుగని పెంచినట్టి కరుణామయి నా తెలంగాణ! నీ గృహం
గణ వనసీమలో బరుసుకంపలు నాటిన మా నిజాము రా
జును పడిదోసినట్టి రణశూరుల వెచ్చని నెత్రు చుక్కలే;
మణికృత దీపమాలికల మాదిరి నీకు వెలుంగులిచ్చెడిన్''
ఇంతవరకు తాను పుట్టిన పోతుగడ్డ తెలంగాణ విముక్తి కోసం కవిత్వం ద్వారా ఉద్యమించిన దాశరథి, పిదప జాతీయ స్థాయిలో దేశమాతను కీర్తించాడు -
''జండా ఒక్కటే మూడు వన్నెలది, దేశంబొక్కటే భారతా
ఖండాసేతు హిమాచలోర్వర; కవీట్కాండమ్ములోన రవీం
ద్రుండొక్కడె కవీంద్రుడు; ఊర్జిత జగద్యుద్ధాలలో శాంతికో
దండోద్యద్విజయుడు గాంధీ ఒకడే తల్లీ! మహాభారతీ!''
భారతదేశం శాంతి సత్యాహింసలకు నిలయం. బుద్ధుడు, అశోకుడు, గాంధీ వీటికి ప్రతినిధులు. శాంతి కాముకుడైన దాశరథి వీరిని తరచుగా స్మరిస్తూ ఉంటాడు. 'అగ్నిధార'లోని 'ధర్మచక్రం' కవితా ఖండికలో కళింగ యుద్ధంలో రక్తప్రవాహాన్ని చూడలేక ప్రపంచంలో శాంతి నెలకొనేందుకు ''బ్రతుకు నంజలి పట్టిన'' అశోక చక్రవర్తిని కీర్తిస్తాడు. బుద్ధదేవుని ఇతివృత్తంతో 'మహాబోధి' అనే కావ్యాన్ని రచించాడు. దానిలో -
''అతని జననాంత రీయ గాథాళి వినిన
హృదయమున త్యాగభావమ్ములెగసి వచ్చు
సర్వమానవ సౌభ్రాతృ సరణి నడచి
విశ్వ శాంతిని సాధించు విధము తెలియు''
అంటాడు. ఇంకా -
''ఏనాడెవ్వడు కత్తితో గెలువలే దీ విశ్వమున్; ప్రేమపా
శానన్ కట్టుము నాలుగుంబది ప్రపంచాలన్; మహాత్ముండిదే
జ్ఞానోద్భోధము చేసె నెవ్వడు వినెన్; సాహిత్యసామ్రాజ్యమం
దైనం, కొంతగ శాంతి పాడుకొననిమ్మా! నీకు పుణ్యంబగున్!''
'తిమిరంతో సమరం'లో మూర్ఖుల దుశ్చర్యలకు, నీచులక్రౌర్యానికీ భయపడి శాంతి రానంటే ఒప్పుకోను అంటూ -
''నిన్ను అణువణువునా చూస్తాను
నిన్ను మా ఇంటికి తీసుకువస్తాను''
అంటాడు. 'కవితా పుష్పకం'లో 'శాంతి' అనే ఖండికలో శాంతిని ప్రేయసిగా సంభావిస్తాడు. ఆమె చెయ్యి తగిలితే ముళ్ళు పూలుగా మారతాయంటాడు. బ్రహ్మను మించింది శాంతి అంటాడు. 'ఆలోచనా లోచనాలు'లోని 'శాంతిబాల' ఖండికలో ''ఏడాదికి ఒకేసారి వస్తుంది. సంక్రాంతి. కానీ శాంతి పక్క నుంటే రోజూ సంక్రాంతే'' అంటాడు.
'అగ్నిధార'లోని 'జయభారతీ' ఖండికలో భారతదేశాన్ని ప్రశంసిస్తూ, ''నీ పూజకు తెచ్చినాడు నిదె పొంగిన గుండియ నిండు పద్దెముల్'' అంటూ దేశభక్తి తత్పరతను ప్రకటిస్తాడు.
'మహాంధ్రోదయం'లో 'అమృతాభిషేకం'లో 'ఆలోచనాలోచనాలు'లో 'అగ్నిధార'లో 'కవితా పుష్పకం'లో అహింసామూర్తి గాంధీజీ గుణగణాల్ని ప్రస్తుతిస్తాడు.
మాతృభూమిపై శత్రువు దాడి చేసినప్పుడు దాశరథి వీర సైనికుడవుతాడు. దౌర్జన్యానికి తలవంచటం సహనం కాదంటాడు. సహనం సమర్థులకు పిరికి మందు కాకూడదంటాడు. అతనిలోని దేశభక్తి రౌద్రోద్రేకాన్ని ప్రదర్శిస్తుంది. అప్పుడు అతను అగ్గిపిడుగులా నిప్పులు రాలుస్తాడు, బడబాగ్నిలా ప్రజ్వరిల్లుతాడు. అగ్నిధారలు కురిపించి రుద్రవీణలు మీటుతాడు. ఇదంతా అతని జాతీయతను ప్రకటిస్తుంది. ఆ జాతీయతలోని మరో కోణమే ఆయన శాంతికాముకత. అందుకే -
''పెన్ను జేబులో పెట్టి
గన్న చేత పట్టాను
ఏం చేయను
ఎంత శాంతించినా తప్పలేదు!
కొన్ని మాటలు వినటానికి వీణ పలుకులు
అవి ఆచరణలో ఇనుప ములుకులు'' - అని అంటారు.
- డా|| టి. గౌరీశంకర్