Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహాకవి దాశరథి కవిత్వంలో మాత్రమే కాకుండా వచన రచనలోనూ తన ప్రత్యేకత నిరూపించుకున్నారు. కథలతో పాటు నాటికలు కూడా ఆయన వచన రచనా నైపుణ్యానికి ఉదాహరణలుగా నిలుస్తాయి. ఆయన రచించిన నాటికలు సంభాషణల పరంగా ప్రత్యేకత నిలుపుకుంటాయి.
బుద్ధుడి జీవిత చరిత్రలోని రెండు ప్రధాన ఘట్టాలను 'మహాబోధి', 'మహాపరినిర్వాణము' అనే నాటికలుగా మలిచారు దాశరథి కృష్ణమాచార్యులు. ఆయన సంపాదకత్వం వహించిన స్రవంతి అనే మాస పత్రికలో ఈ రెండు నాటికలూ 1956లో ప్రచురితమయ్యాయి. ఈ రెండు నాటికలు బౌద్ధంపై దాశరథికి ఉన్న పరిజ్ఞానానికి ఉదాహరణలుగా నిలుస్తాయి. సిద్ధార్థుడు వైశాఖ పూర్ణిమ నాడు అజ్ఞానాన్ని జయించి, బుద్దుడయ్యే ఘట్టాన్ని 'మహాబోధి' నాటికలో అద్భుతంగా మలిచారు నాటిక రచయిత. బుద్ధుని అవసాన దశను 'మహాపరినిర్వాణము' నాటికలో చిత్రించారు.
గంధర్వ రాజకన్య మహాశ్వేత విఫల ప్రేమను చూపిన నాటిక 'మహా శ్వేత'. ఈ నాటిక 1954 జూలై 'స్రవంతి' మాసపత్రికలో ప్రచురితమైంది. రుషి కుమారుడు పుండరీకుడు గంధర్వ రాజకన్య ప్రేమకు విముఖత చూపిస్తాడు. నాటిక చివరిలో చంద్రమండలానికి ఎగిరిపోతాడు.
భారత స్వాతంత్య్రోద్యమాన్ని చిత్రించిన 'త్యాగ జ్వాల' అనే మరో నాటిక అముద్రితం. జాతీయ కాంగ్రెస్ శతాబ్ద్యుత్సవాల సందర్భంగా 1985లో దాశరథి రాసిన ఈ నాటికను ప్రముఖ పరిశోధకులు డాక్టర్ గంటా జలంధర్ రెడ్డి అనేక శ్రమల కోర్చి సేకరించి, ప్రచురించారు. తాను విశ్వసించిన శాంతి, అహింసావాదం గెల్చినట్టుగా ఈ నాటికలో చిత్రించారు దాశరథి. గాంధీ మార్గమే సరైనదని ముగింపులో తేలుస్తారు.
ఈ నాలుగు నాటికలనూ సంభాషణల పరంగా ఉత్తమంగా మలిచారు దాశరథి. 'మహాబోధి' నాటికలో నవమల్లిక సిద్ధార్ధుడిపైకి వలపువల విసిరేందుకు సన్నద్ధమవుతుంది. బుద్ధుడి ఉపాసకుడైన ఉపాలి ఆమె ఆలోచనలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తాడు. బుద్ధుడి దగ్గర ఆమె ఆటపాటలేవీ పనిచేయవని చెప్తాడు. ఈ సందర్భంలో ''ఇంద్రియాల్ని జయించడం ఎవడి తరం? దూరాన్నుంచి కమ్మని కోయిల కూత వినబడి, దగ్గరగా మల్లెపూల పరిమళం పయటకొంగులా రెపరెపలాడి, పక్కగా మకరంద రసం పూల దొన్నెలో తొణికి, ఎదుట నేను గల్లుగల్లుమని ఆడితే మనసులో అనురాగం పొడవదూ?'' అని ప్రశ్నిస్తుంది. సౌందర్యంలోని ఇన్ని అంశాలను ఇంత అద్భుతంగా చెప్పడం ఎవరి తరం అనిపించేలా ఈ వాక్యాలున్నాయి. ఇదే నాటికలో సిద్ధార్ధుడు అజ్ఞానాన్ని జయించి బుద్ధుడైన ఘట్టంలో ఆ విషయాన్ని నంద, ఆనందుడు జరిపే సంభాషణ ద్వారా సమర్థవంతంగా వెల్లడిస్తారు రచయిత. 'జనం ఏమంటున్నార'ని ఉపాసిక నందను బుద్ధుని ప్రథమ అనుయాయి ఆనందుడు అడుగుతాడు. దానికి నంద 'ఆనందంతో గంతులు పెడుతున్నారు' అని సమాధానమిస్తుంది. 'చీకట్లు జారిపోయి వెన్నెలలు పాకుతున్నాయి' అంటాడు ఆనందుడు. ఇక్కడ చీకటి అంటే అజ్ఞానం. వెన్నెల అంటే పరిజ్ఞానం. అజ్ఞానం పోయి జ్ఞానదీపం వెలిగిందనడానికి గుర్తుగా 'వైశాఖ పూర్ణిమ పరిమళిస్తున్నది' అంటుంది నంద. బుద్ధుడిగా బోధిసత్తు ్వడు పరిణామం చెందడాన్ని ఈ సంభాషణ శ్రోతల మనసులకు హత్తుకునేలా వివరిస్తుంది.
'మహాపరినిర్వాణము' నాటికలో బుద్ధుడి గొప్పతనాన్ని మల్లుడు, నందుడు, పూర్వాశ్రమంలో నందుడి భార్య కల్యాణిల సంభాషణ ద్వారా వివరిస్తారు దాశరథి. ''ఆయన (బుద్ధుడు) ఏ చోట నివసిస్తారో అక్కడ పులులు మేకలతో మైత్రి చేస్తాయి. పావురాళ్లు డేగల చంకల్లో నిద్రిస్తాయి. పాములు నెమళ్లతో ఆడుకుంటాయి. దేవతలు మనుష్యులతో వియ్యమందుకుంటారు. రాక్షసులు శాంతులై స్వామిని భజిస్తారు'' అంటాడు నందుడు. ''ఆయన ఎంత దూరం చూస్తే అంత దూరం అమృతం వర్షిస్తుంది. ఆయన నవ్వితే నరనరాల్లో స్వర్గాలు మొలుస్తాయి. ఆయన మాట్లాడితే గుండెల్లో తేనెవానలు కొడతాయి'' అంటుంది కల్యాణి. ''ఆయన్ను గూర్చి వింటే పాపాలు పలాయనం చేస్తాయి. ఆయన అనుచరులతో సంభాషిస్తే మనస్సులోని కొండలన్నీ కరిగిపోయి బ్రతుకు తేలిక అవుతుంది'' అంటాడు మల్లుడు.
'మహాశ్వేత' నాటికలో పుండరీకుడు చంద్రమండలానికి వెళ్ళిపోయిన అనంతరం ఆకాశం నుండి వినబడే పాట ఒక అద్భుతం. నాటిక సారాన్ని మొత్తం ఆరు పంక్తుల పాటలో ఇమిడ్చే ప్రయత్నం చేసి విజయం పొందారు దాశరథి.
''ఎక్కడి గంధర్వాంగన? ఎవ్వడీ రుషి కుమారుడు? ఏమిటీ మనోబంధము? ఎందులకీ వియోగము? ముత్యాలకు రుద్రాక్షల కెప్పటిదీ అనుబంధము'' అనే ఈ పాట మహాశ్వేతకూ పుండరీకుడికీ మధ్య బంధాన్ని ముత్యాలు, రుద్రాక్షల మధ్య అనుబంధంగా చెప్పడం సందర్భోచితం.
'త్యాగజ్వాల' నాటికలో అహింసావాది రామం, హింసామార్గంతో స్వాతంత్య్రం సాధ్యమనే ప్రసాద్‌ల వ్యక్తిత్వాలను చక్కగా తెలియపరుస్తారు రచయిత. హింస, అహింసల తేడాను సంభాషణల ద్వారా బలంగా వివరించారు.
శ్రవ్య ప్రధానమైన 'మహాబోధి', 'మహాపరినిర్వాణము' నాటికల్లో సూచనల ద్వారా ధ్వని రూపం ఎలా ఉండాలో వివరంగా తెలియజేసి దర్శకుడి పని తేలిక చేయడం కనబడుతుంది. 'మహాబోధి' నాటికలో నవమల్లిక ప్రవేశించే దృశ్యాన్ని వీనులవిందుగా మలచడం ద్వారా నవమల్లిక అందాన్ని శ్రోతలకు సమర్థవంతంగా తెలియజేస్తారు. ఆమె ప్రవేశించే సమయంలో వాయులీనం సన్నని ధ్వని వినబడుతుంది. తద్వారా వాయులీనం ధ్వనిలా ఆమె సన్నగా ఉంటుందని, ఆ ధ్వనిలా అందమైనదని తెలియజేయడం దాశరథి ఉద్దేశం కావచ్చు.
బుద్ధుడి మహా పరినిర్వాణం అనంతరం మహాదు:ఖంలోనూ ఆనందంగా బతకాలన్న ఆనందుడి అభిప్రాయానికి అనుగుణంగా మృదంగాలు, వీణ, వేణువు, సన్నాయి మొదలైన వాయిద్యాల శబ్దాన్ని వినిపించడం సన్నివేశానికి బలాన్ని చేకూర్చే యత్నంలో భాగమే.
నాటికలకు ప్రాణం సంభాషణలు. సంభాషణల్లో ప్రత్యేకత కనబర్చడం ద్వారా నాటికలకు బలాన్ని చేకూర్చారు దాశరథి కృష్ణమాచార్యులు. తద్వారా కవిత్వంలోనే కాకుండా వచనరచనల్లోనూ తన పటిమను నిరూపించుకున్నారు.
- డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు
9441046839