Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది 1940వ దశకం. భారత స్వాతంత్య్ర పోరాటంతో బాటు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని భూస్వాములకు, జమిందార్లకు, రాజులకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ప్రజాపోరాటాలు సాగుతున్న కాలం. ఉద్యమకారుడు కాలేని వాడు - ఉద్యమకవి కాలేడు. ప్రపంచ పోరాట చరితల్లో లిఖించదగిన, తెలంగాణ సాయుధ వీరోచిత రైతాంగ పోరాటం, మహారాష్ట్రంలో 'తె.భా.గ' పోరాటం, కేరళలో 'పున్న ప్రవాయలార్' బెంగాల్ 'తేయాకు కార్మికుల పోరాటాలు' సాగుతున్న కాలం. గ్రామాలు విముక్తం చేస్తూ భూపంపకం చేస్తూ, నైజాంను తరిమికొట్టే రోజుల్లో దాశరధి కమ్యూనిస్ట్ జీవితం ఆరంభించారు. 1942లో కమ్యూనిస్టుపార్టీ నిర్వహించిన సెల్ మీటింగ్‌లకు, అండర్ గ్రౌండ్ సమావేశాలకు హాజరయ్యారు. నిజాంకు వ్యతిరేకంగా రచించిన అనేక గేయాలను అధిక భాగం పోరాట కాలంలో రాసినవే. వాటిల్లో రక్తారుణ వైజంతి, అనంత సంగ్రామం, రణ ఝణ రుణఝణ వంటి కవితలు. దాశరధి నిజామాబాద్ జైల్లో ఉన్నప్పుడు గోడలపై బొగ్గుతో నైజామ్ నవాబుపై ఇలా రాసాడు.
'ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, తీగెలను తెంపి, అగ్నిలో దింపినావు - నా తెలంగాణ కోటిరత్నాల వీణ తరతరాల స్వప్నాల సుందర ఫలమ్ము - స్వైర భారతభూమి చూపడెనో లేదో!విషముగుప్పించినాడు నొప్పించినాడు మా నిజాం నవాబు - జన్మజన్మల బూజు' అంటూ నైజాం పాలనపై అగ్నిధారలు కురిపించి, విప్లవ 'రుద్రవీణ'లు మ్రోగించి, ఉద్యమంలో పాల్గొని జైలుశిక్షలు అనుభవిస్తూ, అక్షర శతఘ్నలు పేలుస్తూ నిత్యం విప్లవోత్తేజం జాతికి రగిలించిన కలం యోధుడు దాశరధి కృష్ణమాచార్యులు. సంస్కృతం, హిందీ, ఉర్దూ, ఫారసీ, తెలుగుభాషల్లో పండితుడు. పద్యంలో... పాటలో... గేయంలో... ఆయన కలం గొప్ప ఉద్యమవాహిక. ఉర్దూ గజళ్ళను - రుబాయిలను తొట్ట తొలిగా పరిచయం చేశారు. (గాలిబ్‌ని ఆయన గజళ్లను) గాలిబ్ గీతాలకు 1965లో అకాడమీ అవార్డ్ వచ్చింది. ఃతిమిరంతో సమరంః గ్రంథానికి 1974 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్, ఆంధ్రా, వెంకటేశ్వర, ఆగ్రా విశ్వవిద్యాలయాలు డాక్టరేట్‌తో సత్కరించాయి. 1977 ఏపీ ఆస్థాన కవిగా నియమించబడ్డారు. ఆ చల్లని సముద్రగర్భం...! పాట ఒక్కటి చాలు.. ఃఃదాశరధిఃః కలం బలం సూచించడానికి. తలనిండ పూదండ దాల్చిన రాణీ... చాలదా ప్రేమికుల హృదయావిష్కరణకు అగ్నిధార, రుద్రవీణ, మహాంద్రోదయం, అమృతాభిషేకం, మహాబోధి, కవితాపుష్పకం, ధ్వజమెత్తిన ప్రజ, యాత్రస్మృతి ముఖ్యమైనవి. వందలాది సినిమా పాటలూ రాసారు. ఎమర్జెన్సీ కాలంలో ఃదీక్షః సంకలనం (కవితా) వెలువడినాయి. రాజ్యాన్ని బలపరిచినా, రాజ్య వ్యవస్థపై కేసు పెట్టిన వ్యక్తి పోరాడినదీ దాశరధే. సినిమా ప్రపంచంలో భక్తీ, వీణపాటలు, విరహగీతాల్లో నాకంటి పాపలో నిలిచిపోరా (వాగ్దానం), ఖుషి.. ఖుషీగా నవ్వుతూ... (ఇద్దరు మిత్రులు), ఏదివిలో విరిసిన పారిజాతమో.. (కన్నె వయసు) ఎన్నెన్నో జన్మలబంధం... (పూజ) ఆయన లేఖిని నుండి జాలువారాయి. తెలంగాణ విమోచనోద్యమం వల్ల చదువుకు దూరమైనా... సాయంకాలం కళాశాలల్లో చేరి... బీఏ చేసి స్థానిక స్వపరిపాలనా ప్రభుత్వ శాఖలో గ్రామ పంచాయతీ తనిఖీ అధికారిగా పనిచేసారు దాశరధి. 1925 జూలై 22న వరంగల్ జిల్లా మానుకోట తాలూకా చినకూడూరు గ్రామంలో జన్మించిన దాశరధి 1987 నవంబర్ 5న హైదరాబాద్‌లో క(పె)న్ను మూసారు. లాంటి అపూర్వ సాహిత్య సృష్టికర్త జాతి గర్వించదగ్గ జాతీయ మహాకవి దాశరధి అన్నార్తులు అనాధులుండని ఆ నవయుగ మదెంతదూరం! కరువంటూ - కాటకమంటూ కనుపించని కాలం కావాలని.. రావాలని నిత్యపోరాట పథగాము లవ్వడమే దాశరధికి మనమిచ్చే నివాళి.
- తంగిరాల చక్రవర్తి
సెల్: 9393804472