Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహాకవి దాశరథి బహుముఖ ప్రతిభావంతులు. కవిత్వంతో పాటు కథలు, నాటికలు, వ్యాసాలు, నవలలు, పీఠికలు రాశారు. ఆయన కథలు తెలంగాణ జీవితాలకు దర్పణంగా నిలుస్తాయి. సంఖ్యాపరంగా తక్కువే అయినా సాహిత్య పరంగా చిరస్థాయిగా నిలబడే కథలను ఆయన రచించారు.
తెలంగాణలో పోలీసు చర్య జరిగిన అనంతరం దాశరథి కృష్ణమాచార్యులు రాసిన నాటిక 'నిప్పుపూలు'. నిజాం రాజ్యంలో జాగీర్దారు అక్తర్ జంగ్ భార్య బేగం సాహిబా. భర్త మరణానంతరం తమ భూములను స్వాధీనపరుచుకునే ఉద్దేశంతో జాగీరు గ్రామానికి వెళ్తుంది. అక్కడ గౌరి అనే మహిళ సహజ సౌందర్యానికి, అమాయకత్వానికి బేగం ఆకర్షితురాలవుతుంది. భూముల స్వాధీనానికి వెళ్ళిన బేగం ఆ మహిళకు స్వాధీనమవడం ఈ కథలోని వస్తువు.
దాశరథి స్వీయ జైలు జీవన విశేషాలతో కూడిన కథ 'రక్తాంజలి'. ఈ కథలోని కథానాయకుడు విశ్వం దాశరథి కృష్ణమాచార్యులే. రహస్య స్థావరాల వివరాల కోసం విశ్వాన్ని తీవ్రంగా హింసిస్తారు పోలీసులు. దాశరథి కూడా నిజామాబాదు జైల్లో పోలీసుల చేతిలో చావు దెబ్బలు తిన్నారు. తీవ్రమైన అనారోగ్యంతో జైల్లో గడిపారు.
దాశరథి కథల్లో తెలంగాణ జీవితం ప్రతిబింబిస్తుంది. 'నిప్పుపూలు' కథలో గౌరి వంటినిండా జాగీర్దారు భార్య బేగం అత్తరు అద్దుతుంది. మంచి చీర కట్టిస్తుంది. కొప్పులో నాలుగు మోదుగు మొగ్గలు చెక్కుతుంది. ''ఇదంతా మమ్మల్ని దోచుకున్న డబ్బే' అంటుంది గౌరి.
రజాకార్ల గురించి ప్రస్తావన, రజాకార్లపై వ్యతిరేకత కూడా ఈ కథల్లో కన్పిస్తుంది. 'నిప్పు పూలు' కథలో గౌరి, బేగం మధ్య రజాకార్ల ప్రస్తావన వస్తుంది. జాగీర్దారు భార్య అయినా బేగం గౌరి మాటల్నే సమర్థిస్తుంది. 'రజాకార్లు మీరే. మిమ్మల్ని ఊడగొట్టాలి' అన్న గౌరితో 'మీరూ మేమూ ఒక్కటే' అంటుంది బేగం. ''రజాకార్లు నిజానికి చెడ్డవాళ్ళు. వాళ్ళను వెళ్ళగొట్టాలి'' అని అంటుంది.
నవాబులు, జాగీర్దార్ల భార్యల లోకాన్ని సంక్షిప్తంగా వర్ణించారు దాశరథి. బేగం మనసులోని ఆలోచనల్లో రాజభోగాలను పేర్కొంటారు. ''ఆ మహళ్లు, ఆ రేడియోలు, మంచి కార్లు, నృత్యాలు, ఎత్తయిన మెత్తని పరుపులు, గొప్ప భోజనాలు, విలువైన దుస్తులు, తాంబూలాలు, అత్తరు, ముసలి మొగుడి కామం, వందల కొద్ది పరిచారికలు, బురఖాలు, తెరలు'' అని పేర్కొని ఆ నాటి అంత:పుర విలాసాలను దృశ్యీకరించారు దాశరథి.
స్వాతంత్య్రోద్యమం, నిజాం వ్యతిరేక పోరాటం అట్టడుగు వర్గాల వారిని నాయకత్వ స్థాయికి చేర్చాయి. ఈ విషయాన్ని కూడా బేగం ఆలోచనల్లో కనబడేలా చేస్తారు రచయిత. గౌరి భర్త చంద్రం కాంగ్రెసు పెద్ద అని తెలుసుకుంటుంది బేగం. గొడ్లు కాసుకునే గొల్లోళ్లు సైతం పెద్దలు కావడంలో ఏదో గొప్పదనం ఉందని అనుకుంటుంది.అక్కడితో ఆగిపోతే దాశరథి ప్రత్యేకత ఏముంటుంది! 'నవాబుల కంటే గొప్ప అయిపోయారు కాంగ్రెసు వాళ్లు' అని బేగం మనసులో అనుకుందని చెప్పడం ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారు దాశరథి.
' అని క్లుప్తంగా నాటి పరిస్థితులను తెలియజేస్తారు రచయిత. కేవలం తెలంగాణలోని పరిస్థితులే కాకుండా అంతర్జాతీయ పరిస్థితుల వివరణ కూడా ఈ వాక్యాల్లో అంతర్భాగంగా ఉండడం గమనార్హం. ఈ వ్యాఖ్యలో పేర్కొన్న చర్చిల్ ఇంగ్లాండు దేశానికి నాటి ప్రధానమంత్రి, ట్రూమన్ అమెరికా దేశానికి అప్పటి అధ్యక్షుడు. రెండో ప్రపంచ యుద్ధంలోకి భారత్ ప్రవేశం వెనుక చర్చిల్ మంత్రాంగం ఉంది. జపాన్లోని హీరోషిమా, నాగసాకిలపై 1945లో అణుబాంబు దాడికి తెగబడింది ట్రూమన్ నేతృత్వంలోని అమెరికా. ఈ రెండు చర్యలను సమర్థించాడు నిజాం. అందుకే వీరంతా కలిసి నిజాం ఇంట్లో విందారగిస్తున్నారని ప్రపంచ రాజకీయాలను కూడా ఈ పంక్తుల్లో వ్యంగ్యాత్మకంగా దాశరథి ప్రస్తావించారని సుప్రసిద్ధ విమర్శకులు డా. అమ్మంగి వేణుగోపాల్ పేర్కొన్నారు.
నాటి జైలు స్థితిగతులను కూడా ఈ కథలో వివరించారు దాశరథి. జైల్లో ఉన్న ఏడు వందల మంది స్నానాలకు, తాగేందుకు, బట్టలు ఉతుక్కునేందుకు ఒకే నీళ్ల పంపు ఉండేదట. దోమల బాధ, నీళ్లలో క్రిములు సర్వ సాధారణం. రెండు జొన్న రొట్టెల ఆహారంలోనూ సున్నం, మట్టి, గడ్డి, ఇసుక ఉండేవట.
కథ ప్రారంభానికి, ముగింపుకు మధ్య ఒక సంబంధాన్ని నెలకొల్పడం కూడా దాశరథి కథల్లో కనబడుతుంది. 'నిప్పు పూలు' కథ తంగేడు పూల వర్ణనతో మొదలవుతుంది. చివర్లో 'గౌరి జడలో మోదుగు పూలు నవ్వేయి' అనే వాక్యంతో కథ ముగుస్తుంది. ఈ కథలో తంగేడు పూలకు, మోదుగు పూలకు మధ్య తేడాతో బేగం జీవితాన్ని బలంగా వివరిస్తారు రచయిత. జాగీర్దారు బతికి ఉన్నప్పుడు నాట్యగత్తెల నాట్యం చూస్తూ ఆనందంగా గడిపింది బేగం. ఆ ప్రస్తావన చేస్తూ 'బంగళాల ముందర యెర్రని చీరలతో నాట్యం చేసే అప్సరసల లాగ తంగేడు పూలు ఎర్రగా ఉన్నాయంటారు. ఇక్కడ సుఖలాలస జీవితానికి ప్రతీక అయిన తంగేడుపూలను ప్రస్తావించడం కథ ప్రారంభంలో బేగం పూర్వ జీవితాన్ని ప్రస్తావించడమే. చివర్లో రక్త తర్పణం చేసిన ఉద్యమకారుల స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే మోదుగుపూలను పేర్కొనడం ఉద్యమకారులతోనే బేగం ఉండబోతుందనడానికి సూచిక.
'రక్తాంజలి' కథ ప్రారంభంలో పడమటి ఆకాశం రక్తం రంగులో ఉందంటారు రచయిత. దవడల్లో నుంచి కారుతున్న రక్తాన్ని చేతితో తుడుచుకుంటాడు కథానాయకుడు విశ్వం. చివర్లో ప్రాగాకాశంలో రక్తాంజలి ఘటించినట్టు ఉందని పేర్కొంటారు దాశరథి. ప్రారంభంలో పడమటి ఆకాశాన్ని వర్ణిస్తే చివరిలో తూర్పు ఆకాశాన్ని వివరిస్తారు. ఇది ఆరంభం, ముగింపు మధ్య ఒక చక్కటి లయకు సూచన. అమరుడైన కథానాయకుడికి ప్రభాత సూర్యుడు అంజలి ఘటించాడని పేర్కొనడం అద్భుతమైన ముగింపు. 'ఎప్పుడైతే సంకెళ్లు ఒక చివర బానిస ముంజేతిని బంధిస్తాయో, తప్పనిసరిగా రెండో చివర యజమాని చేతికి బిగుసుకుంటాయి' అన్న ఎమర్సన్ సూక్తిని చివర్లో పేర్కొని కథకు నిండుదనాన్ని చేకూర్చారు రచయిత.
కవులు రాసే కథల్లో ఎక్కడో ఒక చోట కవిత్వ పోకడ కనబడుతుంది. దాశరథి కథలూ ఇందుకు మినహాయింపు కాదు. కథల పేర్లు, ఆరంభం, ముగింపు ఆయనలోని కవిత్వానురక్తికి అద్దం పడతాయి. 'రక్తాంజలి' కథలో సూర్యగోళం కథానాయకుడి చుట్టూ నృత్యం చేస్తుందనడం కవితాత్మక ముగింపుకు ఉదాహరణ. ఇదే కథలో ఒక చోట 'నైజాం నరాల్లో చొరబడి రక్తాణువులకు తిరుగుబాటు బోధిస్తున్నాడు' అని విశ్వాన్ని ఉద్దేశించి పేర్కొంటారు దాశరథి. ఇలాంటి కవితాత్మక పంక్తులెన్నో దాశరథి కథల్లో కనబడతాయి.
దాశరథి కృష్ణమాచార్యుల కథలు నాటి ప్రజల జీవితానికి చిత్రిక పడతాయి. అద్భుతమైన శైలీ విన్యాసంతో అలరిస్తాయి.
- డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు
9441046839