Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓరుగల్లు వేగుచుక్క ఉదయించింది
చిన్నగూడూరు ముత్యాలమ్మ కుంట మురిసింది
బహుపసందుగా అల్లుకొన్న మల్లెతీగ ఉర్దూ
గాలిబ్ గీతాలలో పరిమళాలను వెదజల్లింది
శ్రామిక, హాలిక,కార్మిక,కర్షక బతుకుగాయాలను,
నీ అభ్యుదయ గేయాల్లో నిక్షిప్తం చేసి అక్షరయాగం చేశావు
మోసపూరిత దగాకోరు రాజ్యంలో ఎలా బతుకుతాడు
మానవుడు? అమాయకుడైన నా తమ్ముడు - అంటూ
నవయుగంకై అక్షర తూణీరాలను సంధించావు
మండే కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో
జీవన పోనాటాలలో అలుపెరుగని బాటసారివైనావు
రంగుల ప్రపంచంలో కలల బేహారిగా,
మధురమైన బాణీలతో పాటకు పట్టం కట్టావు
ఇందూరు ఖిల్లా ఉలిక్కిపడేలా
'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని గర్జించిన కవి సింహా!!
నింగిని వెలుగుతున్నాయి, మలుగుతున్నాయి చుక్కలు
ఈ సృష్టి మారదు నీ దృష్టి మార్చమంటూ
కొత్త ఒరవడిని సృష్టించిన అభ్యుదయ ఉద్యమ రథసారథీ!
అగ్నిధారలై కురిసిన నీ కవితలతో
రుద్రవీణ మోగించాలని, ఆలోచనాలోచనాలను సారిస్తూ
మరోమారు తెలంగాణా నేలకు అమృతాభిషేకం గావించాలని
తెలంగాణా అక్షర కొలిమిలో ఉదయించిన
మా అభ్యుదయ సూరీడికి నజరానాగా
నా ఈ చిన్న కవితా పుష్పకము!!!
-బి.కళా గోపాల్