Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రాణములొడ్డి ఘోరగహ
నాటవులన్ పడగొట్టి మంచి మా
మాగాణములన్ సృజించ నెముకల్
నుసిజేసి పొలాలు దున్ని బో
షాణములన్ నవాబునకు
స్వర్ణము నింపిన రైతుదే, తెలం
గాణము రైతుదే; ముసలి
నక్కకు రాచరికంబు దక్కునే?
అని నిరంకుశ నిజాం నవాబు రాజరికాన్ని ధిక్కరించిన ఉద్యమకవి దాశరథి కృష్ణమాచార్య.
ఇదే మాట ఇదే మాట - పదే పదే అనేస్తాను
కదం తొక్కి పదం పాడి - ఇదే మాట అనేస్తాను
దగాకోరు బటాచోరు - రజాకారు పోషకుడవు
ఊళ్ళకూళ్ళు అగ్గిపెట్టి - ఇళ్ళన్నీ కొల్లగొట్టి
తల్లిపిల్ల కడుపుగొట్టి - నిక్కిన దుర్మార్గమంత
నీ బాధ్యత నీ బాధ్యత
అంటూ సూటిగా ప్రకటించడంతో బాటు...
వద్దంటే గద్దె ఎక్కి - పెద్దరికం చేస్తావా? / నీకు నిలుచు హక్కు లేదు - నీకింకా దిక్కులేదు / దిగిపొమ్మని జగత్తంత - నగరాలు కొడుతున్నది / దిగిపోవోరు, తెగిపోవోరు - తెగిపోవోరు దిగిపోవోరు
అని 'అగ్నిధారలు' కురిపించాడు; 'రుద్రవీణలు' పలికించాడు.
దుర్భరమైన జైలు జీవితం, రాసుకోడానికి కలమూ, కాగితమూ లేని దుస్థితి. అప్పుడీ కవి పద్య ప్రక్రియను ఆశ్రయించాల్సి వచ్చింది. జైలు గోడల మీద అల్లుతున్న పద్యాలు, గోడలమీద బొగ్గుతో రాయడంతో పాటు, మనస్సులో మననం చేసుకుంటూ పదిల పరుచుకునేవాడు. మాత్రాఛందస్సు, లయబద్ధత ఉన్నందున తన పద్యాలన్నీ తనకు గుర్తుండిపోయేవి. కవిత్వం గుర్తుపెట్టుకోదగిన కళారూపం అని దాశరథి విశ్వసించాడు. జైల్లో అనేక పద్యాలు అల్లుకుని, ఆ తరువాత చాలా కాలానికి నెమరు వేసుకుని కాగితంపై పెట్టాడు. అలా రూపొందినవే 'అగ్నిధార', 'రుద్రవీణ' కవితా సంపుటులు.
పోరాటం నుండి కవిత్వమూ, కళలూ పుడతాయి అని దాశరథి విశ్వాసం. ఆయన జీవితమంతా పోరాటమే. ఎన్నో ప్రతీపశక్తులతో పోరాడాడు. ప్రతిబంధకాలు ఎదురైనప్పుడు ఏనాడూ నిరాశ చెందలేదు. నమ్రతతో తన దారిన తాను పయనించాడు. అతని గమ్యం ప్రపంచశాంతి, అతని ధ్యేయం ప్రజాస్వామ్య సామ్యవాదం.
జనం మనం - మనం జనం / జనం లేక మనం లేము అన్న స్పష్టత ఉన్నవాడు. అందుకే...
రానున్నది ఏది నిజం? - అది ఒకటే సోషలిజం / కలపండోరు భుజం భుజం - కదలండోరు గజం గజం అంటూ ఉద్యమాహ్వానం పలికాడు.
ఖమ్మం జైలు జీవితకాలంలో దాశరథి ప్రేమాభిమానాలు పొందిన మహారచయిత వట్టికోట ఆళ్వారుస్వామి. జైలుగోడల మీద దాశరథి బొగ్గుతో రాసే పద్యాలను కంఠస్థం చేసేవాడు. జైలు అధికార్లు ఆ పద్యాలను గోడలమీద చెరిపేసినప్పుడల్లా, అవి మరో గోడ మీద ప్రత్యక్షమయ్యేవి. వాటిని దాశరథి రాస్తున్నాడని పోలీసుల అనుమానం. కొన్నాళ్ళకు వాటిని రాస్తున్నావాడు ఆళ్వార్ స్వామి అని వాళ్ళు కనిపెట్టారు. ఫలితంగా అతడిని గుల్బర్గా జైలుకు, దాశరథిని హైదరాబాదులోని చెంచల్గూడా జైలుకు మార్చారు.
ఇది నిదాఘము; ఇందు సహింపరాని / వేడి యేడ్పించుచున్నది; పాడువడిన / గోడలందున జైలులో పాడినాడ / వాడిపోనున్న పూమొగ్గ పైన పాట అంటూ జైల్లో పద్యాలు, పాటలు పాడుకున్నాడు.
ఆయాసపడు జైలులో యెన్ని ప్రజల, రా/జ్యములున్నవో! యని యరసినాను / నిరుపేద వాని నెత్తురు చుక్కలోనెన్ని / విప్లవాలో! యని వెదికినాను. ఇదీ ఆనాటి దాశరథి అన్వేషణ. అలాగే జైల్లో జీవితాన్ని వర్ణిస్తూ...
వెన్నెలలు లేవు, పున్నమ కన్నెలేదు / పైడి వన్నెల నెలవంక జాడలేదు / చుక్కలే లేవు, ఆకాశ శోకవీధి/ధూమ ధామమ్ము, దుఃఖ సంగ్రామ భూమి వంటి దుర్భరమైన వాతావరణంలో వందలాది వీర యోధులను నిర్బంధించిన నిజాం ప్రభుత్వాన్ని శపిస్తూ...
పరుల హింసించువారలు బాగు పడెడు / మాట వట్టిది, నశించుమాట నిజము అని ప్రకటించాడు. జైలు దుస్థితికి ఇదొక పార్శ్వం కాగా, మరో పార్శ్వం జైలు ప్రాచీనతపై గౌరవం కూడా ప్రకటించాడు. 'ఇందుపుర దుర్గము' శీర్షికన నిజామాబాద్ సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు, ఆ జైలు ప్రాచీనతనూ, ప్రాశస్త్యాన్నీ దాశరథి ఇలా వర్ణించాడు ఇది చరిత్రాత్మకంబయిన / ఏ మహితాలయమో! ఇదే మహా / కదనము కోసమూ మలచి / కట్టిన దుర్గమొ! అంటూ మొఘల్ రాజులను ఎదిరించిన మరాఠా వీరులు కట్టించిన కోటను స్తుతించాడు.
1948 జనవరి 30న నాథూరాం గాడ్సే కాల్చిన తుపాకి గుళ్ళకి నేలకొరిగిన గాంధీజీ మరణవార్తను నిజామాబాద్ జైల్లో ఉన్న దాశరథి విన్నాడు. చలించిపోయాడు. 'క్షమామూర్తి' శీర్షికన ఉద్వేగభరితమైన స్మృతి కవితను రచించాడు.
తళతళలాడు భరత ప / తాకము నాకము తాకునంత యె / త్తుల కెగయించినావు, పగ / తుల్ కొనియాడగ పెంచినాడవున్ అంటూ తన సమ్మోహన శక్తితో, నిర్మాణ కార్యక్రమాలతో మేధావుల ఉద్యమాన్ని ప్రజోద్యమంగా మలచిన గాంధీజీ ప్రతిభను ప్రశంసించిన దాశరథి, కవితాంతంలో...
చేతులారగ నీవు పెంచిన స్వతంత్ర / నాగవల్లికయే విష నాగమయ్యె / నీ గళము చుట్టి ప్రాణములు లాగివేసి / భారతీయుల గౌరవ ప్రతిభమాపె అని నిట్టూర్పు విడిచాడు. నివాళులర్పించాడు.
జెండా ఒక్కటే మూడు వన్నెలది / దేశం బొక్కటే భారతాఖండాసేతు హిమాచలోర్విద; / కవీట్మాండమ్ములోనన్ రవీంద్రుడొక్కండె కవీంద్రుడు / ఊర్జిత జగద్యుద్ధాలలో శాంతి కోదండోద్యద్విజయుండు / గాంధీ ఒక్కడే, తల్లీ! మహా భారతీ! అంటూ ఉప్పొంగిన గుండె నిండా పద్యాలతో భారతమాతను ఆరాధించాడు. రవీంద్రుని కవితాశక్తినీ, గాంధీజీ శాంతి ఉద్యమాన్నీ కీర్తించాడు. భూస్వామ్య సమాజంలోనూ, పెట్టుబడిదారీ వ్యవస్థలోనూ అణచివేతకు గురయ్యే శ్రామిక జనం పట్ల అభిమానం గల ప్రగతిశీలకవి దాశరథి. అందుకే... తరతరాల దరిద్రాల - బరువులతో కరువులతో / క్రుంగి క్రుంగి కమిలి కుమిలి - కష్టాలకు నష్టాలకు / ఖైదులకూ కాల్పులకూ - సహనంతో శాంతంతో / బలిపశువై తలవాల్చిన దీన పరాధీనజాతి శ్రమికజాతి / దెబ్బతిన్న బెబ్బులివలె - మేల్కొన్నది అంటూ మేల్కొంటున్న శ్రామిక జనచైతన్యానికి స్వాగతం పలికాడు. అంతేకాదు.... అనాదిగా సాగుతోంది - అనంత సంగ్రామం / అనాథుడికీ, ఆగర్భ శ్రీనాథుడికీ మధ్య... అన్న వర్గ స్పృహను దాశరథి కవిత్వం వ్యక్తపరుస్తున్నది. ఈ అనంత సంగ్రామానికి గల కారణాలను విశ్లేషిస్తూ...
సేద్యం చేసే రైతుకు - భూమిలేదు, పుట్ర లేదు / రైతుల రక్తం త్రాగే - జమీందార్ల కెస్టేట్లు / మిల్లు నడిపి కోట్ల డబ్బు - కొల్లగ లాభం తెచ్చే / కూలోనిది కాదు మిల్లు - మిల్ మ్యాగేటొక సేటూ / కర్షకులు, కార్మికులు - మధనపడే మేధావులు / తమ శ్రమలకు తగిన ఫలం - ఇమ్మంటే తిరుగుబాటు అంటూ అసమ సమాజ స్వరూపాన్ని దాశరథి ఆవిష్కరించాడు.
'ఉషస్సంధ్య' గేయంలో అటు రాజులు, రాజరికాలు, చట్టాలు, శాసనాలు, జైళ్ళు, ఆకలి, ఆరాటం, వేదన, సంపాదన, క్రౌర్యం, కౌటిల్యం, కసి, మారణాయుధాలు, మంటలు, మసి, సిండికేట్లూ, సేట్లూ నిండిన వ్యవస్థను తమస్సుతో పోల్చాడు. మరోవైపు జలపాతానికి నాంది, కుళ్ళిన సమాజపు దుర్గంధాన్ని తరిమికొట్టే ప్రజాగ్రహ ప్రవాహం, శతాబ్దాలుగా గొంతుదాటి పలకని శబ్దాల హౌరు, సమీపిస్తున్న ప్రజాగళ గర్జనలను ఉషస్సుతో ఉపమించాడు.
ఎత్తండి కాంతిపతాకాలు - ఒత్తండి శాంతి బాకాలు / పదండి ఆగామి పథమ్ముల - పాడండి అందాల పదమ్ములు ఉషస్సు కిర్మీర కవాటం తోస్తూ దూసుకువస్తున్న సమసమాజ నిర్మాణాన్ని దాశరథి ఆకాంక్షించాడు.
ఉదయాకాశ పతాకం - యెదలో కదలాడె నేడు / హృదయావేశ తటాకం - నదిలా పొరలాడె నేడు / రానున్నది ఏది నిజం - అది ఒకటే సోషలిజం అని ఖచ్చితంగానే ప్రకటించాడు. చల్లని సముద్ర గర్భంలోని బడబాగ్నులనూ, నల్లని ఆకాశంలోని సూర్యులనూ చూడగలిగాడు. ఉదయించనున్న సుందరమైన లోకాన్ని కలగన్న దాశరథి కవిత్వం నేటి తరానికి స్ఫూర్తిదాయకం.
(ఈ నెల 22న దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా...)
-ఆచార్య ఎస్వీ సత్యనారాయణ