Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహాకవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి ఎనబై ఆరు సంవత్సరాల నిండు జీవితం గడిపిన అరుదైన వ్యక్తి... సమున్నత వ్యక్తిత్వంతో 'కవి' అన్న పదానికి ఐకాన్‌గా నిలిచిన మనీషి. పరిపాలనాధికారిగా, ఆచార్యునిగా, ఉపకులపతిగా, అధికార భాషా సంఘం, భాషా సాంస్కృతిక మండలికి అధ్యక్షులుగా సేవలందించినా, తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులుగా ఉన్నా అన్నింటా ఆయన తనదైన ముద్రవేసారు. వేలాది వేదికలపై వెలుగొందినా తన హనుమాజిపేట మట్టి భాష, శ్వాసను ఎన్నడూ మరిచిపోలేదు. వారిని సన్నిహితంగా చూసినవారికి ఆయన మాట్లాడే నిఖార్సయిన తెలంగాణ భాష, అచ్చమైన కరీంనగర్ యాస కనిపిస్తుంది. దాదాపు యాబై ఏండ్లుగా హైదరాబాదు నగరంలో ఆయన సభలో పాల్గొనని రోజు లేదనడం అతిశయోక్తి కాదు. ఆయన తెలుగువారి సాహిత్య, సాంస్కృతిక సభలు సమావేశాలకు తనదైన రీతిలో అలిఖిత రాజ్యాంగాన్ని లిఖించి దానికనుగుణంగా సభలను నడిపించారు. ఆయన మరణం సాహిత్య సాంస్కృతిక సంస్థలకే కాదు తెలుగు భాషకు, ఆయనకు జన్మనిచ్చిన తెలంగాణకు కూడా తీరని లోటు. ఒక్క రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచంలోని తెలుగువాళ్ళందరిది ఈ బాధ.
తెలంగాణలో ఒక సామెత ఉంది, 'ఎలా బతికాడో కాదు... ఎలా మరణించాడో చూడు' అని. మహాకవి నారాయణ రెడ్డి అంత్యక్రియలు చూసినట్టయితే ఆ విషయం తెలుస్తుంది. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా నారాయణ రెడ్డిని తెలుగువారందరూ గుండెల్లో నిలుపుకున్నారు. అందరు ముఖ్యమంత్రుల నుండి దేశాధినేతలదాకా ఆయనను సమున్నతంగా గౌరవించారు. దాదాపు అన్ని గౌరవ సత్కారాలు సినారె పొందారు. వారి అంత్యక్రియల సందర్భంగా తెలంగాణా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు, ఈ సందర్భంగా చూపించిన గౌరవం బహుశా నాకు తెలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ దేశంలో ఇటువంటి ఘనమైన గౌరవం బహుశా మరే కవికి... సాహితీవేత్తకు దక్కలేదు. ఇది తెలంగాణ రాష్ట్రం మహాకవికి ఇచ్చిన గౌరవం. చరిత్రలో మనం చదువుకున్నాం, శ్రీకృష్ణదేవరాయలు తన అస్థానకవి అల్లసాని పెద్దనను గౌరవించి ఆయన పల్లకీని స్వయంగా మోసాడని. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖరరావు సినారె అంత్యక్రియలకు స్వయంగా తాను హాజరు కావడమేకాక అన్నీ తానై ముందుండి నడిపించడం, అంతిమ యాత్రలో ముందుండి నడవడం, ఒక మహాకవి పట్ల ప్రభుత్వం ఇంత గౌరవాన్ని ప్రటించడం గొప్ప విషయం. కేవలం ప్రభుత్వ అధినేత ఒక్కడే హాజరుకావడం కాదు, తెలంగాణా నాలుగుచెరగులా నారాయణ రెడ్డిని అభిమానించే కవులు, సాహితీవేత్తలందరూ వారి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ముప్పైఒక్క జిల్లాల నుండి అంత్యక్రియలకు హాజరయ్యే వారికోసం ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించింది ప్రభుత్వం..
సినారె తెలుగు భాషా సాహిత్యాలకు ప్రతీకగా నిలిచినా ఆయన అణువణువునా తెలంగాణా నల్లరెగడి మట్టిపై వెలగట్టలేని ప్రేమ. వారిని మూడు దశాబ్దాలుగా దగ్గరగా చూస్తున్నవాడిగా ఆ విషయం నాకు తెలుసు. ఈ సందర్భంగా నాకు జ్ఞాపకమున్న ఒక విషయాన్ని గుర్తుచేస్తాను. 1988లో 'విశ్వంభర' కావ్యానికి ప్రతిష్టాత్మక భారతీయ జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నాక జంటనగారాలు, వివిధ ప్రాంతాలలోని ఎన్నో సాహిత్య సాంస్కృతిక సంస్థలు ఆయనకు సన్మానం చేసేందుకు ముందుకువచ్చాయి. తను పుట్టిన హనుమాజీ పేటపైన... మూలవాగు.. నక్కవాగు... మానేరుల మీదున్న అవ్యాజమైన మమకారంతో సినారె వారందరిని కాదని మొదటగా తన స్వగ్రామంలో... తన తల్లి సమకాలికుల చేతుల మీదుగా సత్కారం స్వీకరించిన తరువాతనే మిగతా సత్కారాలు అని తేల్చిచెప్పడం తన మట్టిమీద ఆయనకున్న గౌరవానికి నిదర్శనం. తెలంగాణాకు జ్ఞానపీఠాన్ని తెచ్చిపెట్టిన మహాకవి సినారె.
ఉర్దూనే విద్యార్థిగా ఊపిరిగా మలచుకు అప్పటి నిజాం రాష్ట్రంలోని అప్పటి సిరిసిల్ల తాలూకా, నేటి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మారుమూల గ్రామం హనుమాజీపేట నుండి వచ్చిన సినారె నిన్నటి అఖిలాంధ్ర క్యాన్వాస్ మీద మనకంటూ పత్రికలు, సంస్థలు లేని కాలంలో నిలదొక్కుకుని నిలవడం మామూలు విషయం కాదు. వేములవాడలోని హరికథలు, పురాణ ప్రవచనాలు సినారెలో తెలుగును వెలిగేలా చేసాయి. చదువుకోసం పట్టుబట్టి ఒప్పించుకుని చదువుకున్న నారాయణ రెడ్డి ప్రస్థానం అటు తరువాత సిరిసిల్ల, కరీంనగర్ల మీదుగా హైదరాబాద్ చాదర్‌ఘాట్ కాలేజీ వరకు సాగింది. సినారె పట్టుదలకు మారుపేరు. సిరిసిల్ల, వేములవాడల్లో విద్యార్థిగా ఉన్నప్పుడే కవిత్వం రాయడం ప్రారంభించారు. 'మనం బట్టోళ్ళమా... బాపనోళ్ళమా' అంటూ నాయిన మల్లారెడ్డి వారించినా కవిత్వం రాయడం మానలేదు. స్వాతంత్య్రానంతర తెలంగాణా తొలితరం కథకుల్లో ఒకరైన గూడూరి సీతారాం, జి. రాములు గార్లతో నాకు మూడు దశాబ్ధాల అనుబంధం ఉంది. ప్రతిరోజు సాయంకాలం వ్యాహాళికి మానేరు తీరానికి వేళ్ళేవాళ్ళం. ఆ సందర్భంలో 1969 తెలంగాణా ఉధ్యమం, సినారె తదితరులతో, తెలంగాణా రచయితల సంఘంతో తనకుగల అనుబంధాన్ని వీలున్నప్పుడల్లా చెప్పేవారు.
ఒక్కడ ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తెలంగాణ భాష పట్ల సినిమా రంగంలో చిన్నచూపు చూస్తున్న సమయంలో తెలంగాణా జానపదాలను సిమాల్లో ప్రవేశపెట్టడం ఆయన భాష మీద ఆయనకున్న గౌరవం. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు అప్పటి ప్రభుత్వం పోతన కడప జిల్లా ఒంటిమిట్టకు చెందినవాడని 'పోతన ఉత్సవాలు' చేసినప్పుడు తాను ముందువరుసలో ఉండి ట్యాంకు బండు మీదున్న పోతన విగ్రహం వద్ద కవులు, సాహితీవేత్తలందరితో నిరసన తెలిపారు సినారె.
ప్రతి పండగ సెలవులకు సినారె తన స్వగ్రామానికి వచ్చేవారు. హైదరాబాద్ నుండి సిరిసిల్లకు, సిరిసిల్ల నుండి ఎడ్ల కచ్చరంలో హనుమాజీపేటకు వెళ్ళేవారు. ఆయన ఉన్నన్ని రోజులు సిరిసిల్ల మానేరు, వేములవాడ, హనుమాజీపేటల మూలవాగులు ముచ్చట్లతో సాహిత్య గోష్టులతో నిండిపోయేవట. తరువాత చొప్పకట్ల చంద్రమౌళి, జక్కని వేంకటరాజం, వడ్డేపల్లి కృష్ణ, కుడిక్యాల లింగయ్య, గోలి కృష్ణహరి మొదలగు యువకవులు సినారెను అనుసరించిన వారిలో కొందరు. అటుతరువాత కొంతకాలం రాకపోకలు తగ్గినప్పటికీ మళ్ళీ మూడు దశాబ్దాల క్రితం గూడూరి సీతారాం నేతృత్వంలో మానేరు రచయితల సంఘం స్థాపించాక దానికి గౌరవ అధ్యక్షులు, అటు తరువాత గౌరవ ముఖ్యసలహాదారులుగా సినారె చూపించిన మార్గదర్శకత్వం ఇవ్వాళ్ళ మానేరు తీరం వందలాది కవులతో నిలిచేలా చేసింది.
దాదాపు ఆరు దశాబ్దాలుగా మానేరు తీరంలో చైతన్నాన్ని నింపిన 'వసంతారామ కవితా సౌందర్యమూర్తి సినారె'. ప్రతి సంవత్సరం హనుమాజీపేటకు వచ్చి రెండు రోజులు కూతుళ్ళు, అళ్ళుల్లు, మనవలు, మనవరాళ్ళతో సొంత ఇంట్లో గడపడం దాదాపు మూడు దశాబ్ధాలుగా చేస్తున్నారు సినారె. ఆ రెండు రోజులు మానేరుతీరం, హనుమాజీపేట ఒక సాహిత్యోత్సవం లాగా ఉండేది. మేమంతా క్రమం తప్పకుండా వెళ్ళేవాళ్ళం. సినారె తాను కొత్తగా రాసిన కవితలను వచ్చినవారందరికి వినిపించేవారు. అలా వారు కొత్తగా రాసిన కవితల నుండి 'ఒసే రాములమ్మ' సినిమా పాటల దాకా ప్రత్యక్షంగా విన్నవాళ్ళల్ళో నేనొకడిని. సినారె వచ్చారంటే అదే సమయంలో అంతదాకా అచ్చువేసుకుని సిద్ధంగా ఉంచుకున్న పుస్తకాల ఆవిష్కరణ జరిపేవాళ్ళం. వందలాది పుస్తకాలు ఆ సమయంలో ఆవిష్కరించుకున్నాం.
తానే ఒకచోట రాసారు- 'ఏసి గదిలోనూ / ఉక్క పోస్తుంది / కారణం / కవిత్వం రాయలేదివ్వాళ' అని. అందుకు నిదర్శనం ఆయన కళ్ళు మూసిన రోజు కూడా 'నవ తెలంగాణ'లో కవిత అచ్చుకావడం. ఏడు దశాబ్ధాలుగా కవిత్వం రాస్తున్న సినారె కవిగా తనదైన సమన్వయ దృక్పథంతో రాస్తున్నారు. పద్యం రాసినా, గేయం, వచనం, గజల్, సినిమా పాట ఏది రాసినా అందులో తనదైన ముద్ర ఉండేలా రాయడం సినారెకే చెల్లింది. మాత్రాచందస్సులో సినారె చేసిన ప్రయోగాలు, రచనలు మరోకరు చేయలదన్నది అతిశయోక్తి కాదు.
'పదవున్నా లేకున్నా లేకున్నా ఎద ఎదలో నీపరిమళాన్ని ఎవరాపగలరు నారన్నా!' అంటారు డా. ఎన్.గోపి సినారె మహాన్నత వ్యక్తిత్వం గురించి చెబుతూ. పదవున్నా లేకున్నా ప్రతిక్షణం కవిగా జీవించారు సినారె. 'కవిత్వం నా మాతృభాష' అంటూ కాలరెగరేసి చెప్పుకున్న కవి. చిన్నా పెద్ద తేడాలేకుండా నిన్న మొన్నటిదాకా వారు నింపిన స్ఫూర్తిని మాటల్లో కొలవలేం. అందుకు వారు రాసే ముందుమాటలు, తిరుగుటపాలో జవాబు రాసే ఉత్తరాలు నిదర్శనం. తన అభిప్రాయం కోసం పుస్తకాన్ని పంపిన ఏవ్యక్తిని నిరుత్సాహ పరచకుండా నాలుగు మాటలు రాసేవారు సినారె. ఆ నాలుగు మాటలే మాలాంటి వారిలో ఎంతో స్ఫూర్తిని నింపేవి. భవిష్యత్తులో ఆయా కవులు చేసిన బలమైన వాగ్ధాన సంతకాలకు స్ఫూర్తిగా నిలిచేవి. నిన్నటిదాకా అదే స్ఫూర్తిని మా మానేరు తీరంలో నింపిన మహాకవి సినారె ఇక నిజాన్ని నమ్మలేకున్నాం... మళ్ళీ జనవరికి మా ఊరు వస్తాడని ఎదురుచూస్తున్నాం.
- డా. పత్తిపాక మోహన్, సహాయ సంపాదకుడు (తెలుగు),
నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం