Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహాకవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి ఎనబై ఆరు సంవత్సరాల నిండు జీవితం గడిపిన వ్యక్తి. సమున్నత వ్యక్తిత్వంతో 'కవి' అన్న పదానికి ఐకాన్‌గా నిలిచిన మహా మనీషి. జూన్ 12, 2017 న శాశ్వత నిద్రలోకి జారుకునే వరకు కవిత్వం రాస్తూనే ఉన్నారు. తానే ఒకచోట రాసారు- 'ఏసి గదిలోనూ / ఉక్క పోస్తుంది / కారణం / కవిత్వం రాయలేదివ్వాళ' అని. అందుకు నిదర్శనం ఆయన కళ్ళు మూసిన రోజు కూడా 'నవ తెలంగాణ'లో కవిత అచ్చుకావడం.
ఏడు దశాబ్ధాలుగా కవిత్వం రాస్తున్న సినారె కవిగా తనదైన సమన్వయ దృక్పథంతో రాస్తున్నారు. పద్యం, గేయం, వచనం, గజల్, సినిమా పాట ఏది రాసినా అందులో తనదైన ముద్ర ఉండేలా రాయడం సినారెకే చెల్లింది. మాత్రాచందస్సులో సినారె చేసిన ప్రయోగాలు, రచనలు మరోకరు చేయలేదు. మొన్నటి నిజాం రాష్ట్రంలోని సిరిసిల్ల తాలూకా, నేటి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని హనుమాజిపేట అనే పల్లెటూరులో పుట్టిన ఒక రైతుబిడ్డ ప్రతిష్టాత్మక జ్ఞానపీఠం అధిష్టిస్తాడని, తెలుగుభాషా, సాహిత్యాలకు ఇంతటి పేరుతీసుకు వస్తాడని ఎవరూ ఉహించి ఉండక పోవచ్చు. తన పేరుతో తనకు జన్మనిచ్చిన హనుమాజీ పేటకు, తెలంగాణకు పేరుతెచ్చారు. ఆలోచిస్తే ఆయనకు జన్మనిచ్చిన మట్టిమీద, ''మానేరు మా కళ్ళకు ముత్యాల పేరు'' అంటూ ఆయనే పేర్కొన్నట్టు వారి కవిత్వానికి మూలధాతువులుగా నిలిచిన మూలవాగు, మానేరుల మీద గౌరవం కలగక మానదు.
సినారెగా ప్రసిద్ధులైన సింగిరెడ్డి (సత్య) నారాయణరెడ్డి వంద ఎకరాల భూస్వామి సింగిరెడ్డి మల్లారెడ్డి-బుచ్చవ్వ దొరసానిల ఏకైక కుమారుడు. సత్యనారాయణ వ్రతం చేసుకుంటే పుట్టాడని సత్యనారాయణ రెడ్డి అని పేరు పెట్టుకున్నారట. సినారేనే చెప్పినట్టు ఆయన పేరులోని 'సత్య'ం కాలక్రమంలో ఆయన కవిత్వంలో స్థిరపడిపోయింది. 'పదుగురు పాలెర్లతో నడిచే పెద్ద వ్యవసాయం' వీరిది. హనుమాజీ పేటలో ప్రాథమిక పాఠశాల కూడా లేని రోజుల్లో చదువు మీద మక్కువతో సమీపంలోని వేములవాడ, సిరిసిల్ల వెళ్ళి చదువుకుంటానని మారాం చేసాడు సినారె. 'నూరెకరాల ఆసామి' కాలుమీద కాలేసుకుని కూర్చోవాలి కాని కష్టపడి పొరుగూరుకు వెళ్ళి చదవడమెందుకుని తల్లి తండ్రులు ఒప్పుకోలేదు. అంతే పట్టుదల గలిగిన సినారె సమీపంలోని వ్యవసాయ బావిలో దూకాడు. అక్కడే ఉన్న పశువుల కాపరులు కాపాడారు. ఆ మరునాడే వేలములవాడ పాఠశాలలో సినారె విద్యాభ్యాసం మొదలైంది.
అప్పటి ప్రభుత్వ భాష ఉర్దూ. అందరిలాగే వీరి చదువు కూడా ఉర్దూలోనే సాగింది. ఇదే సమయంలో వేములవాడ లోని హరికథలు, పురాణ ప్రవచనాలు సినారెలో తెలుగును వెలిగేలా చేసాయి. చదువుకోసం పట్టుబట్టి ఒప్పించుకుని చదువుకున్న నారాయణరెడ్డి ప్రస్థానం అటు తరువాత సిరిసిల్ల, కరీంనగర్ల మీదుగా హైదరాబాద్ చాదర్‌ఘాట్ కాలేజీ వరకు సాగింది. నారాయణరెడ్డి పట్టుదలకు మారుపేరు. సిరిసిల్ల, వేములవాడల్లో విద్యార్థిగా ఉన్నప్పుడే కవిత్వం రాయడం ప్రారంభించారు. 'మనం బట్టోళ్ళమా, బాపనోళ్ళమా' అంటూ నాయిన మల్లారెడ్డి వారించినా కవిత్వం రాయడం మానలేదు.
స్వాతంత్య్రానంతర తెలంగాణా తొలితరం కథకుల్లో ఒకరైన గూడూరి సీతారాంతో నాకు బంధుత్వం, మూడు న్నర దశాబ్ధాల అనుబంధం ఉంది. ప్రతిరోజు సాయంకాలం వ్యాహాళికి మానేరు తీరానికి వేళ్ళేవాళ్ళం. ఆ సందర్భంలో 1969 తెలంగాణా ఉధ్యమం, సినారె తదితరులతో, తెలంగాణా రచయితల సంఘంతో తనకుగల అనుబంధాన్ని చెప్పేవారు. అలా హనుమాజీపేట అనే ఒక పల్లెటూరు సినారె మహాకవిగా రూపుదిద్దుకునేందుకు ఎంతటి భూమిక పరిచిందో తెలిసేది. ఆ రోజుల్లో కనపర్తి లక్ష్మీనర్సయ్య, గూడూరి సీతారాం, గూడూరి రాఘవేంద్ర, గూడూరి శంకరం మొదలైన వాళ్ళంతా హనుమాజీ పేట నుండి కవులుగా రచయితలుగా సినారె సాహచర్యంలో ఎదుగుతున్నవాళ్ళు. వీరిలో సినారె, కనపర్తిలు కవిత్వం వైపు వెళ్ళగా, సీతారాం, శంకరం కథలవైపు, రాఘవేంద్ర బాల సాహిత్యం వైపు నడిచారు. మరో సహచరుడు మిద్దె రాములు ఒగ్గుకథ వైపు వెళ్ళగా, సినారె సమీప బంధువు కాతం ఆదిరెడ్డి జానపద గేయాలు సేకరించడం, పాడడం వంటివి చేసేవాడు. సినారె ప్రభావం తన సహచరులపై అంతగా ఉండేది. ప్రతి పండగ సెలవులకు సినారె తన స్వగ్రామానికి వచ్చేవారు. హైదరాబాద్ నుండి సిరిసిల్లకు, సిరిసిల్ల నుండి ఎడ్ల కచ్చరంలో హనుమాజీపేటకు వెళ్ళేవారు. ఆయన ఉన్నన్ని రోజులు సిరిసిల్ల మానేరు, వేములవాడ, హనుమాజీపేటల మూలవాగులు ముచ్చట్లతో సాహిత్య గోష్టులు, నాటకాలు, నాటికలతో నిండిపోయేవట. తానే స్వయంగా రాసిన నాటకాలను ఈ మిత్రబృందం ప్రదర్శిచేది. ఆ రోజుల్లో సిరిసిల్ల తాలూకాలో డా.జె.బాపురెడ్డి, చొప్పకట్ల చంద్రమౌళి, జక్కని వేంకటరాజం, వడ్డేపల్లి కృష్ణ, కుడిక్యాల లింగయ్య, గోలి కృష్ణహరి మొదలగు యువకవులు సినారెను అనుసరించిన వారిలో కొందరు. మళ్ళీ మూడు దశాబ్దాల క్రితం పత్తిపాక మోహన్ వ్యవస్థాపకులుగా ఏర్పడిన మానేరు రచయితల సంఘనికి గౌరవ అధ్యక్షులు, అటు తరువాత గౌరవ ముఖ్యసలహాదారులుగా సినారె చూపించిన మార్గదర్శకత్వం మానేరు తీరం వందలాది కవులతో విలసిల్లేలా చేసింది.
దాదాపు ఆరు దశాబ్దాలుగా మానేరు తీరంలో చైతన్నాన్ని నింపిన 'నిర్మలోజ్జ్వల వసంతారామ కవితా సౌందర్యమూర్తి సినారె'. ప్రతి సంవత్సరం తల్లి తండ్రుల, భార్య సుశీలమ్మ యాదిలో హనుమాజీపేటకు వచ్చి రెండు రోజులు కూతుళ్ళు, అళ్ళుల్లు, మనవలు, మనవరాళ్ళతో సొంత ఇంట్లో గడపడం సినారెకు చాలా ఇష్టం. క్యాలండర్లో తేదీలు మారినా, మారకున్నా రావడం మాత్రం ఆగేదికాదు. ఆ రెండు రోజులు మానేరుతీరం, హనుమాజీపేట ఒక సాహిత్యోత్సవం లాగా ఉండేది. మేమంతా క్రమం తప్పకుండా వెళ్ళేవాళ్ళం. సినారె తాను కొత్తగా రాసిన కవితలను వచ్చినవారందరికి వినిపించే వారు. అలా వారు కొత్తగా రాసిన కవితల నుండి 'ఒసే రాములమ్మ' సినిమా పాటల దాకా ప్రత్యక్షంగా విన్నవాళ్ళల్లో నేనొకడిని. సినారె వచ్చారంటే అదే సమయంలో అంతదాకా అచ్చువేసుకుని సిద్ధంగా ఉంచుకున్న పుస్తకాల ఆవిష్కరణ జరిపేవాళ్ళం. వందలాది పుస్తకాలు ఈ సందర్భాల్లోనే ఆవిష్కరించుకున్నాం. దీనికి తోడు అదే సమయంలో సినారె రాజ్యసభ సభ్యులుగా నియామకం కావడంతో వారి రాకపోకలు సంవత్సరానికి ఒకసారి కాకుండా చాలాసార్లు సాగాయి. కారణం రాజ్యసభ సభ్యులుగా వారి నిధులను వెచ్చించే క్రమంలో తొలుత ఎన్నుకుని ఖర్చు చేసింది సిరిసిల్ల ప్రాంతంలోనే. సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లో దాదాపు ప్రతి గ్రామంలో వందలాది బోరుబావులు ఎం.పి నిధులతో వేయడం జరిగింది. ఇవేకాక ఎన్నో పాఠశాలలు, సమావేశ మందిరాలు, కమ్యూనిటి హాళ్ళు సినారె నిధులతో నిర్మింపబడ్డాయి. ఎలగందుల కోట నుండి హనుమాజీ పేట దాకా ఈ నిధులను పూర్తిగా వెచ్చించారు సినారె.
'పదవున్నా లేకున్నా లేకున్నా ఎద ఎదలో నీపరిమళాన్ని ఎవరాపగలరు నారన్నా!' అంటారు డా. ఎన్.గోపి సినారె మహాన్నత వ్యక్తిత్వం గురించి చెబుతూ. పదవున్నా లేకున్నా ప్రతిక్షణం కవిగా జీవించారు సినారె. 'కవిత్వం నా మాతృభాష' అంటూ కాలరెగరేసి చెప్పుకున్న కవి. చిన్నా పెద్ద భేదంలేకుండా కొత్త కలాల్లో నిన్న మొన్నటిదాకా వారు నింపిన స్ఫూర్తిని కొలవలేం. అందుకు వారు రాసే ముందుమాటలు, తిరుగుటపాలో జవాబు రాసే ఉత్తరాలు నిదర్శనం. తన అభిప్రాయం కోసం పుస్తకాన్ని పంపిన ఏవ్యక్తిని నిరుత్సాహ పరచకుండా తప్పకుండా తన మాటలు రాసేవారు సినారె. ఆ నాలుగు మాటలే నావంటి ఎందరిలో స్ఫూర్తిని నింపేవి. భవిష్యత్తులో ఆయా కవులు చేసిన బలమైన వాగ్ధాన సంతకాలకు స్ఫూర్తిగా నిలిచేవి. నిన్నటిదాకా అదే స్ఫూర్తిని మా మానేరు తీరంలో నింపిన మహాకవి సినారె ఇక నిజాన్ని నమ్మలేకున్నాం... సినారె మరణం తెలుగు జాతికి తీరనిలోటు. ఇదే సందర్భంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మహాకవి సినారె అంత్యక్రియల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గౌరవం...సాక్షాత్ రాష్ట్రాధినేత అంతిమయాత్రకు ముందు నడవడం 'నభూతో...' అని చెప్పొచ్చు.
- డా.పత్తిపాక మోహన్