Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీసము
కరవాలమేపాటి? కవితాగ్ని చిమ్మిన
కరమునందలినీదు కలము ముందు
రణశంఖమేపాటి? రజకార్లపై నీవు
ధ్వజమెత్తు విప్లవస్వరముముందు
శతగీతలేపాటి? జైలుగోడలపైన అలికిన నీదు పద్యములముందు
బ్రహ్మాస్త్రమేపాటి? ప్రజల ఉద్యమ మందు పలికిన పటుతర పలుకు ముందు
ఆటవెలది
నిన్నుమించుమేటి, నీబోటి, నీసాటి
లేరు, వేరు నిజము రారు రారు
ఋణమువడ్డదయ్య ఈ తెలంగా ణంబు
నేల,నింగి సృష్టి నిలుచువరకు
సీసము
ఆ దాశరథి నాడు అల రాక్షసుల ద్రుంచి
సురుల, నరుల గాచి స్ఫూర్తి నింపె
ఈ దాశరథి నీవు ఈ నిజాం నెది రించి
తెలుగు ప్రజల వెతల్ దీర్చినావు
ఆదాశరథినాడుఅడవులపాలయ్యె పితృ వాక్యమునకై ప్రేమతోడ
ఈ దాశరథి నీవు ఈప్రజా స్వేచ్ఛ కై
జైలుగోడల మధ్యచేరినావు
తేటగీతి
దాశరథియన్ననామంబెధైర్య గుణము
దాశరథి రక్తమందునె ధర్మబుద్ధి యుండు కాబోలు! కాకున్న నుర్వి లోన
ఎవరు యొరులుందురిట్లు యో కవివరేణ్య?
సీసము
గాలిబ్ గజళ్ళను కమనీయ తెనుగున
అనువదించుటె గాకఅతిశయించి
తెలుగు గజళ్ళకే తేనెలద్దితివీవు
ఆంధ్రులందరు మదిన్ హర్షమొంద
నీపాటలేని సినీమాలులేవంటె
అతిశయం కాదయ్యఅదె నిజంబు
సాహిత్యసేవకున్సాహిత్య అకడమీ
లాంధ్ర ,కేంద్రాలు అవార్డు లిచ్చె
ఆటవెలది
అగ్నిధార, మరియునమృతాభి షేకంబు
నవమి, రుద్రవీణ కవనములకు
చేతులెత్తి మ్రొక్కి జేజేలు పలికిరి
నాటి తెలుగుప్రజలు నాడునేడు
రచన
డా"వూసలరజనీగంగాధర్
సెల్ - 9290680605
హయత్ నగర్
హైదరాబాద్