Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాణముగాగ పద్యము నవారిత యుద్యమ వింటిలోన సం
ధానము జేసి ముష్కర మదాంధరజాకరు మూకపైన సం
త్రాణత నొంద నేసిన తదాగ్రహ భిక్షగ వచ్చె నీ తెలం
గాణము ధన్యజీవనముగా కవి దాశరథీ ! మహారథీ !!
పేదల దీన దుఃఖితుల వేదన జూచిన నోర్వలేక మ
ర్యాదను విస్మరించిన యరాచకతన్ దునుమంగ నగ్ని ధా
రా దమనక్రమంబుగ ధరాతలినెల్లను గాల్తునన్న సం
పాదిత విక్రమోజ్జ్వలన భాసుర దాశరథీ నమోస్తుతుల్ !!!
పద్యవిశారదుండు ననవద్య కవిత్వ మహత్వ కీర్తి సం
వేద్యుడు సాధ్యుడున్ సరసవిద్యల సాంద్రుడు సత్కవీంద్రుడున్
ఉద్యమనేత రాష్ట్రపు మహోన్నత సాధన స్ఫూర్తి దాత స
ద్విద్యుదనంగ బ్రాకిన గవేషుడు దాశరథీ మహాత్ముడున్ !!!
వచనకవిత్వమైన నది పద్యము పాటయునైన నేమి నీ
రచనల నన్నిటన్ యనితరమ్మగు భాసవిలాస శబ్ద స
ద్రుచిరమునై గవేషణ నిరూపితమౌ గద సత్కవీంద్ర !స
త్య చరిత ! మమ్ము బోంట్లకు సదా గురుదేవుడవంచు మ్రొక్కెదన్ !!!
--దోరవేటి, 8978871961