Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహిత్య రవి(కవి) చంద్రులు
దాశరథి -సినారెలు!
కవిగా ' అగ్నిధార'తో జన్మించి
అపర రుద్రనిలా 'రుద్రవీణ' మోగించి
నిజాం రజాకార్ల దుశ్యర్యల నెదిరించి
నిజామాబాద్ జైళ్లో వట్టికోట ఆళ్వార్ సాహచర్యంతో
'తల్వార్' లాంటి పద్యాల్ని
అగ్గిలా మండుతూ బొగ్గుతోనే రచించి
అనేక హింసలపాలైన
అపూర్వ మహాకవి - మండే రవి దాశరథి
కవినీయ కవితాశరథి
స్వతంత్ర తెలంగాణ కై
కుతంత్రాల 'తిమిరంతో సమరం' సాగించిన
మహారథి - మధురసినీ గీతాల ధీ,
తెలంగాణ మరువలేని
తేజోత్తుంగ తరంగ నీరధీ!
నవ్య సాహితీ వనంలో
'నవ్వని పువ్వు' ను పూయించి
'నాగార్జున సాగర' కావ్యాన్ని నిర్మించి
'కర్పూర వసంతరాయలు' గా గుబాళించి
'వెన్నెలవాడ' లో వేడుకగా విహరించి
వెండితెర గీతాలతో ప్రకాశించి
'అక్షరాల గవాక్షాల'లోంచి
మధ్యతరగతి మంద హాసాల్ని గమనించి
'మంటలూ - మానవుడు' అంటూ
మహనీయ పురస్కారాలతో ప్రజ్వలించి
'విశ్వంభర'తో జ్ఞాన పీఠాన్ని అదివసించి
కవిగానే గాక వీ.సి గా, ఎం.పీగా ఎనలేని ఖ్యాతి గడించి
అభినవ కవిసార్వభౌముడిగా రాణించి
అమరత్వం పొందిన
ఆచార్య సి.నారాయణరెడ్డి
అశేష శిష్యుల పాలిటి వేల్పుగిడ్డి!
వీరిరువురి విశిష్ట జయంతి వారోత్సవం
సాహిత్యలోక స్మరణ మహొత్సవం!
---డా. వడ్డేపల్లి కృష్ణ
9246541699