Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ సింగిరెడ్డి నారాయణరెడ్డి గారి కలం నుండి జూలువారిన జనహిత పాటలు ఎన్నో.
ప్రేక్షక ఆదరణ పొందిన పలుకు తేనెల పదాలెన్నో. సుమధుర సాహిత్యానికి మూర్తీభవించిన 'సాహిత్యమూర్తి' ఆయన.
ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా.సి.నారాయణరెడ్డి గారు. సినీరంగ ప్రవేశానికి ముందు వీరు కవితలు వ్రాసేవారు. ఆపై సినీగీతాల రచయితగా అడుగు పెట్టడమే తడవు అద్భుత పద విన్యాసంతో,కూర్చబడిన సంగీతానికి అనుగుణంగానూ తెలుగుభాషామ తల్లి మురిసిపోయేలాంటి పదజాలంతో పాటల వర్షాన్ని మనపై కురిపించిన ప్రావీణ్యుడు.
'నన్ను దోచుకుందువటే ...
వన్నెల దొరసాని..'
అని సిరా తో వ్రాసినా మన మనోఫలకాలపై చెరగని ముద్రే వేశారు. ఆపై వెనుదిరిగి చూడలేదు. 'పగలే వెన్నెల..జగమే ఊయల.. కదిలే ఊహలకే కన్నులుంటే.. అంటూ మన సినీ పరిశ్రమలో సరికొత్త వెలుగులు నింపిన 'కవిశేఖరుడు'.
'గోరంత దీపం...కొండంత వెలుగు ...చిగురంత ఆశ..జగమంత వెలుగు' అని సినీ జనాలకు 'కల్పవృక్షం'గా'కామధేనువు'గా మారారు. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి అని అక్కాచెల్లెళ్లకు తోడబుట్టిన వారి మధ్య ఉండే ఆప్యాయతానురాగాలు వర్ణించినా, చెలికాడు నిన్నే రమ్మని పిలువ ..చేరరావేలా ...ఇంకా సిగ్గు నీకేలా ..
అంటూ ప్రేమికులపై రచనా ప్రతాపం చూపినా..
నిన్ను చూడక నేనుండలేను.. ఈ జన్మలో మరి ఆ జన్మలో ...ఇక ఏ జన్మకైనా.. ఇలాగే...అని ఆయన మస్తిష్కంలో మెదిలిన ఆలోచన పాట రూపం దాల్చింది. చలన చిత్రానికి సంబంధించి నిర్మాతలు,దర్శకులు కథను, కథాసన్నివేశాన్ని ఇచ్చినా యింపైన పాటల గుబాళింపును పంచిన ఘనులు.
పురాణాలలో ప్రస్తావనే లేనటువంటి దుర్యోధనునికి యుగళగీతం అనే కాన్సెప్ట్ తో విచ్చేసిన ప్రముఖులకు అది ఏ పూర్వజన్మ సుకృతమో గాని 'చిత్రం భళారే విచిత్రం - అయ్యారే విచిత్రం' అంటూ దానవీరశూరకర్ణ చిత్రానికి గాను గీతామృతాన్నందించిన 'చిత్ర సీమ పుణ్యఫలం మన సినారె'
కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా మెరిసే వెన్నెల్లో విరబూసిన నురగలా
అని ప్రకృతిశోభను కళ్లకు కట్టినట్లు వ్రాయాలన్న , కళ్లల్లో పెళ్లిపందిరి కనబడసాగే..అని సాగినా ... మ్రోగింది కళ్యాణవీణ.. నవమోహన జీవన మధువనిలోన అనే సాహిత్య వీణ మ్రోగించినా వారికి వారే సాటి.
మల్లియలారా... మాలికలారా... మా కథలే విన్నారా..మౌనంగా ఉన్నారా అనే పాటను మనకందించే ముందు ఆయన కలం కాగితంపై కదలాడే ముందు వహించిన ఆలోచనతో కూడిన మౌనం మరో కలికితురాయి. 'అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుష్యులు ఆడుకొనే నాటకం వింత నాటకం'.. అనే ధోరణిలో కలాన్ని ఝళిపించినా, ఎవరికి ఎవరు చివరికి ఎవరు ముగిసే ఈ యాత్రలో ..అని విషాదగీతం వదిలిన విశిష్టులు.
'సిపాయి.. ఒ సిపాయీ నీకై వేచి వేచి చూశాను.. ఇది మన దేశ రక్షణకై అహర్నిశలు శ్రమించే సిపాయికి అంకితమోయి. అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణం మిన్న రాణి మనసు వెన్న..అనేది చిట్టిపొట్టి పిల్లలకు కథగా చెప్పుకునే పాట,గోగులు పూచే గోగులు పూచే ఓ లచ్ఛా గుమ్మడి.. వంటి సంప్రదాయ పాటల్లోనూ సిద్ధహస్తులు.
'ఆడవే మయూరి నటనమాడవే మయూరి... అంటూ పక్షులను తన పాటల్లో పొందుపరిచిన ప్రేమికుడు.తోటలో నారాజు తొంగి చూసిననాడు.. నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు అనే యుగళగీతం 'పాటల తోట' లో విరబూసిన 'పూరాజం' ఇక కిలకిల నవ్వులు చిలికిన పలుకును నాలో ..అనే సినారె పలుకులు మనకందిన గొప్పవరం. ఏదో గిలిగింత .. ఏమీటీ వింత ఇది సరిగ్గా వారి పాటలు యావత్ప్ర జానీకానికి కలిగించిన పులకింతలకు దర్పణం. అనుభవించు రాజా -అనుభవించు రాజా అని హుషారెత్తించిన .. ఒహోహో వయ్యారమొలికే చిన్నది.. ఓరబ్బీ చెబుతాను - ఓలమ్మీ చెబుతాను.., చిలకకొట్టుడు కొడితే.. చిన్నదానా పలకమారిపోతావే కుర్రదానా.., రా వెన్నెల దొరా...కన్నియను చేర .. రా కన్ను చెదర.. వేచితినిరా తదితర పాటలు ఫాస్ట్ బీట్ అయినప్పటీకీ సాహిత్యం వినికిడికి అందుబాటులోను పరిమితుల్లోను ఉండేలా చూసిన హక్కుదారుడు.
సప్తశైలవాసా.. కరుణా సాగరా అంటూ భక్తితత్వం చూపించిన నన్ను బ్రోవుమని చెప్పవే సీతమ్మ తల్లి అని వేడుకొన్న నిజజీవితంలో అంతగా దైవభక్తి లేనప్పటికీ ఆ ఛాయలు పడక సహజమైన భక్తితత్వంతో ఆ పదాల కూర్పు - వారిదే అ స్థాయి మార్కు.. గోడకు చెవులుంటేను ఈ మేడకు కనులుంటేను అని ప్రతీ ఇక్కటి పాటల పదప్రయోగంలో వాడిన వాగ్ధాటి గల వ్యక్తి. నీలో ఏముందో ఏమో..మనస్సు నిన్నే వలిచింది.. ఇలా ఒకటేంటి ఎన్నో ఎన్నెన్నో సేకరణకు అసాధ్యమే. అద్భుతమైన రచయిత, కవి గొప్ప సాహితీవేత్త. 'దేవతలే దిగివచ్చి మనుష్యులతో కలిసిన కథ.. చెప్పాలని ఉంది... 'వంటి పాటలతో పాటకు పల్లవి ప్రాణం అని తేల్చి, కలలు అలలపై... నువ్వుంటే నాకెంతో ఇష్టం, నాలోని రాగమీవే.. మరియు పిల్లనగ్రోవి పిలుపు అంటూ వాయిద్య సాధనాలను ప్రస్తావించిన పద్మశ్రీ,పద్మభూషణ్ అవార్డుల గ్రహీతగా అన్నింటికీ మించి అసలు సిసలు తెలుగువాడిగా సాహిత్య అకాడమీలో ఫెలోషిప్ కలిగి 'తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది' అని ఎలుగెత్తి పలికినా ,జోహారు శిఖపింఛమౌళి.. అని వ్రాసి సర్వుల చేత శభాష్ అనిపించుకున్న కళాప్రపూర్ణ.
ఏంచెప్పాలి... ము..ము..ము.. ముద్దంటే చేదా...నీకావుద్దేశం లేదా అనేది థియేటర్లలో ఈలలు వేయించిన పాట, ఆ రోజుల్లో కుర్రకారును ఊపెత్తించిన పాట. ఇప్పటికీ క్రేజీ సాంగ్. ఋతుచక్రం,దివ్వెల మువ్వలు, నవ్వని వువ్వు, జలపాతం, మధ్యతరగతి మందహాసం ఇలా ఎన్నో కవితలు వ్రాశారు. విశ్వంభర కావ్యకర్త, రష్యా, మలేషియా వంటి దేశాల్లో పర్యటించారు. రామప్ప సంగీత రూపకాన్ని అందించారు. చక్కటి గ్రంథాలను వ్రాశారు. రాజకీయాల్లోనూ అభినివేశం ఉన్న వ్యక్తి.
సంగీత సాహిత్య సమలంకృతే - స్వరరాగ పదయోగ సమభూషితే.. హే భారతి మనసాస్మరామి.. శ్రీ భారతి శిరసా నమామి అని ఆనందబాష్పాలు రాలేటంతగా,ఒళ్ళు మైమరచిపోయేలా అమృత పదాల మాలికలైన పాటల సంగతి వర్ణింపనలవి కావు. భావ వ్యక్తీకరణకు అందనంత తారాస్థాయి పాటలు 'ఈ సరస్వతీ పుత్రుడు సొంతం. వారి గురించి పత్రసమర్పణ చేయడమే ఒక అదృష్టం... 'లాలి..లాలి..లాలి..లాలి...వటపత్రశాయికి వరహాల లాలి రాజీవనేత్రునికి రతనాల లాలి' అని వ్రాసిన సినారె 2017వ సంవత్సరంలో శాశ్వత నిద్రలోకి జారుకోవడం మన దురదృష్టం. తెలుగు జాతి ఉన్నంతవరకు ఆయన పాటలు మోగుతూనే ఉంటాయి.
- ఉండవిల్లి సుజాత మూర్తి
విశాఖపట్నం
7416605529