Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవనం కదనం
జమిలిగా పెనవేసుకొని
గేయం, గాయం
ఒక్కటిగా ముడివేసుకొని
రక్తచందనం పూసుకున్న సూర్యుడై
రజాకారు దగాకోరులకు భాస్వరమై
తమస్సులొ తడిసిన తెలంగాణకు
తూరుపుకనుమల్లో పూసిన ఉషస్సై
సమతామమతల సాదృశ్యమై వెలసిన
మహాంధ్రోదయ అగ్నిధార దాశరథి
నిజాము దౌర్జన్యాలను, దాష్టికాలను
కవనాయుధంతో దునుమాడి
గాలీబు గజళ్ళను, షాయరీలను
పసందుగా తెనుగాడి
తెలుగుప్రజల హృదయాలలో
అభ్యుదయ కవితాశరథిగా
నవకవన జలధిగా ఆసీనుడైన
కళాప్రపూర్ణ రుద్రవీణ దాశరథి
మానవకల్యాణం కోసం కలమెత్తి
ధనవంతుల దుర్మార్గాలపై గలమెత్తి
తెలగాణ నిగళాలు తెగగొట్టి
తెలుగుతోటలో కవితాసుమాల మాలగట్టి
మహాంధ్రకై మూడుకోటుల తమ్ముల కూడగట్టి
కోటి రతనాల వీణను సవరించిన కవితాశరథి దాశరథి.
డా.చింతల రాకేశ్ భవాని
ఎల్.బీ.నగర్
9246607551