Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినారె!
మీరిక లేరే!
అని-అందరూ అంటున్నారే!
మీరు లేరనే మాట ఎలా నమ్మాలి!?
మీకు ఆటా,మాట,పాట నేర్పిన హనుమాజి పేట-
ప్రతి యేటా పర్వంలా మెరిసే మీ రాకకై నిరీక్షిస్తూంటే-
మీరు లేరనే మాట ఎలా నమ్మాలి!?
గంగా,యమున,సరస్వతి,కృష్ణవేణి కెరటాల్లో
కిరీటమై మీ రూపం ప్రతిఫలిస్తుంటే-
మీరు లేరనే మాట ఎలా నమ్మాలి!?
మీ బోధనంతో సాహితీ యోధులైన మీ శిష్య వినీతులు-
సాహితీ సమరాంగణంలో మ్రోగిస్తున్న విజయ దుందుభుల్లో-మీ పేరు ప్రతిధ్వనిస్తూంటే-
మీరు లేరనే మాట ఎలా నమ్మాలి!?
వీస్తున్న వాయువుల్లో మారుమోగుతున్న మీ మధుర గీతాలు-మమ్మల్ని మైమరపిస్తూంటే-
మీరు లేరనే మాట ఎలా నమ్మాలి!?
కవితా కర్పూర వసంతరాయల
చరణాల ఋతు రాగాల కోసం-
సారస్వత పరిషత్తు- నిలువెల్లా కళ్ళతో-
నాగార్జున సాగరమై నిరీక్షిస్తూంటే-
మీరు లేరనే మాట ఎలా నమ్మాలి!?
మీ చమత్కార ప్రసంగాల చైత్ర వీచికలు-
రసరమ్య ప్రేరణలై-
రవీంద్ర భారతి,త్యాగరాయ గాన సభల్లో
అనుస్మరణీయ తోరణాలవుతూంటే-
మీరు లేరనే మాట ఎలా నమ్మాలి!?
తెలుగు వాడి తెల్లటి పంచె కట్టు మడతల్లో-
మెరిసే ఎర్రటి అంచులా-
మా గుండెల్లోనిండిన మీ రూపం దేదీప్య దీపమై ధగధగలాడుతూంటే-
మీరు లేరనే మాట ఎలా నమ్మాలి!?
మీరు నాటిన సాహితీ తోటలో
కవితా ప్రసూన పరిమళాలు ప్రసరిస్తూంటే-
మీరు లేరనే మాట ఎలా నమ్మాలి!?
మట్టిలో పుట్టి,మనిషిగా ఎదిగి,ఆకాశమంత విస్తరించిన విశ్వంభరుడు
వెదజల్లిన ఙ్ఞాన పీఠికలు
వేగు చుక్కల్లా వెలిగి పోతూంటే-
మీరు లేరనే మాట ఎలా నమ్మాలి!?
మహా ప్రస్థానం మంటల్లో
ఎగిసిన మీ కీర్తి కిరణాలు-
అవని అంచుల్ని-ఆర్తిగా స్పర్షిస్తూంటే-
మీరు లేరనే మాట ఎలా నమ్మాలి!?
విస్మితే గాని-విస్మ్రతి లేని మీరు
చిరంజీవిగా చరితార్థులు సినారె!
తెలుగు సాహిత్యాంబరంలో
శోభాయమానంగా వెలిగే-
స్మరణీయ నారాయణ ధృవతార మీరే!!
--మనోహర్ రెడ్డి గంటా హైదరాబాద్
9949992964