Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీసము
కలము శ్రీ పోతన గంటమున్ దలపించ
కంఠంబు చూడగా కంచుగంట
నీనుడుల్ జగతిలో నానుడులై వెల్గ
వాగ్ధాటి సెలయేటి పరుగులయ్యె
సాహితీ సామ్రాజ్య సమ్రాట్టు నీవయ్య
సాహితీగగనాన చంద్రుడీవె
చిత్రసీమలొ నీవు చిరజీవి వైనావు
గీతమిద్ది యనుచు గీతగీసి
తేటగీతి
పలుకు మధురామృతంబు నీ మనసు వెన్న
కనులు కరుణకు హృదయంబు
క్షమకు జలధి
ముఖముగంభీరమేగాని ముత్యమీవు
రాచఠీవి యున్నది కవిరాజువనగ
ఉత్పలమాల
తెల్లని ధోవతిన్ మెడను తీరిచి చుట్టిన కండువాయితో
పల్లెను రైతువోలె కనుపట్టెదవౌర ! మహా కవీంద్ర ! నీ
యల్లిక అల్లసాని కవితా సుధ ధారల బోలియుండె, మే
మెల్లరు మెచ్చురీతి వరమిచ్చెనె ?
భారతి నీకు దెల్పుమా !
తేటగీతి
తెలుగునగజళ్ళు మన సాహితీ వనాన
నాడు నేడును దేదీప్య మాన మయ్యె
కలము, గళమును మీదైన కతన నేమొ !
ఇంతకంటెను భాగ్యమింకేమి వలయు ?
కందము
విశ్వంభర గొనిదెచ్చెను
విశ్వంబంతటను నీ కవితకు యశంబున్ !
నశ్వరము లేదు కీర్తికి
శాశ్వతమిక నీదు పేరు సాహితి జగతిన్ !
ఆటవెలది
జ్ఞానపీఠికింక సమమేమియున్నది
మంచు కొండకన్న మించినావు
ఇంతయెదిగికూడ యెంతగా యొదిగావు
ఇంతలోనే స్వర్గమేగనేల ?
-డా.వూసలరజనీగంగాధర్
సెల్ - 9290680605
హయత్ నగర్
హైదరాబాద్