Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసమాన సాహిత్య ప్రతిభా పాటవాలను ఎలుగెత్తి చాటగల నిలువెత్తు గిరిశిఖరం, మన తెలుగు కళామతల్లి మెడలోని అరుదైన కవితాక్షరహరం, విశ్వంభర తో విశ్వ విజేతగా నిలిచిన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా.సి.నారాయణరెడ్డి గారు మహకవిగా, రచయితగా, విద్యావేత్తగా, రాజ్యసభ సభ్యునిగా, ఎన్నో ఉన్నతమైన పదవులను అధిరోహించిన పరిపాలనా దక్షునిగా, సమగ్ర విజ్ఞాన సర్వస్వంగా, తెలుగు సాహిత్య వినీలాకాశంలో దేదీప్యమానంగా వెలుగొందిన అరుదైన ద్రువతార.
జులై 29, 1931 న, కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం హనుమాజిపేట గ్రామంలో బుచ్చమ్మ, మల్లారెడ్డి దంపతులకు జన్మించిన సింగిరెడ్డి నారాయణరెడ్డి, వీధిబడిలో ప్రాథమిక విద్యనభ్యసించి, అనంతరం సిరిసిల్ల లోను, హైదరాబాద్ ఛాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి. ఎ. ఉర్దూ మాధ్యమంగా చదివి, తెలుగు సాహిత్యములో ఉస్మానియా నుండి ఎం. ఏ., పి.హెచ్ డి డాక్టరేట్ సాదించారు. ఆయనకు సుశీలమ్మ గారితో వివాహం జరిగి, నలుగురు బిడ్డలకు జన్మనిచ్చారు. వారు గంగ, యమున, సరస్వతి, క్రుష్ణవేణులు. డా. సి నా.రె గారు సికింద్రాబాద్ ఈర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకునిగా, నిజాం కళాశాల లో రీడర్ గా పనిచేశారు.
సి.నా.రె గారు సాహిత్యంలో అనేక గ్రంథాలను అపోసన పట్టారు. విశ్వవిద్యాలయాలలో ఆచార్యునిగా పనిచేస్తూ, తెలుగు సాహిత్యపు ఉన్నత శిఖరాలు అధిరోహించారు, అంతేకాదు ఎన్నో ఉన్నతమైన పదవులను, అనేకానేక పురస్కారాలను పొందారు.
ఆయన పాండిత్యం సుమధుర కావ్యాలనెన్నో సాహిత్యలోకానికందించింది. ప్రభందకావ్యాలెన్నో వెలువరించేలా చేసింది. ఆయన కలం పద్యకావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవిత్వం, గద్య రచనలు, సినీ గీతాలు, యాత్రా కథలు, సంగీత న్రుత్య రూపకాలు, గజళ్ళు, ముక్తకాలు, వ్యాసాలు, విమర్శలు, అనువాదాలు, బుర్రకథల వంటి 95 కు పైగా గ్రంథాలను రచించి సాహిత్యలోకానికందించారు.
ఆయన యువ, నవ కవులకెంతో ప్రోత్సాహన్నిచ్చి వారి వెన్ను తట్టారు. వారి పద ప్రయోగాలు, రస రమ్యమైన గీతాలు, అద్బుతమైన భావ వ్యక్తీకరణ, భాషా సొగస్సు, జీవనతత్వం, తార్కికతా, ప్రేక్షకుల్ని, పాఠకుల్ని మంత్రముగ్దుల్ని చెసేది. అందుకే ఆయనకు, ఆయన రచనలకు అసంఖ్యాకమైన అభిమానులను సంపాదించుకునేలా చేసింది. ఆయన పద్యం ఆలపించినా, గొంతెత్తి గానం వినిపించిన, వక్తగా ప్రవచనం చేసినా జనుల గుండెలన్ని నిండుగా దోచబడేవి విశ్వనాథ సత్యనారాయణ గారి తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అత్యున్నత జ్ఞానపీఠ పురస్కారం డా. సి నా రె గారి విశ్వంభర కావ్యానికి దక్కడం తెలంగాణకెంతో గర్వకారణం.
డా.సి నా రె గారు విద్యార్థిగా ఉన్నరోజుల్లో రాసిన మొదటి కవిత జనశక్తి అనే పత్రికలో ప్రచురించబడింది, ఆయన "శోభ" అనే పత్రిక కు సంపాకత్వం వహించారు. అనంతరం ఆయన "నవ్వని పువ్వు", "జలపాతం", విశ్వగీతి, అజంతా సుందరి,మనిషి-చిలుక, ముఖాముఖి, కలిసి నడిచేకలం, కర్పూర వసంతరాయలు, మట్టిమనిషి ఆకాశం, నాగార్జున సాగరం, విశ్వనాథనాయుడు, విశ్వగీతి, రెక్కల సంతకాలు వంటి కావ్యాలెన్నో వెలువరించారు. వారి పరిశోదనా గ్రంథం "ఆధునికాంధ్ర కవిత్వం" అంత్యంత ప్రామాణిక గ్రంథంగా పేర్కొనబడింది.
ఆయన అధికార భాషాసంఘం అధ్యక్షునిగా నిరుపమానమైన సేవలనందించారు. 3500 లకు పైగా చలనచిత్ర గీతాలను రచించి సినిమా ప్రేమికులను విశేషంగా అకట్టుకున్నారు. వారి రచనలెన్నో ఇంగ్లీష్, హిందీ, సంస్ర్రుతం, మళయాళం,ఉర్దూ, కన్నడం వంటి భాషల్లోకి అనువదింపబడ్డాయి.
ఆయన్ను ఆం. ప్ర. సాహిత్య అకాడెమి, కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారాలు, భారతీయ భాషాపరిషత్, సోవియట్ నెహ్రు పురస్కారం, పద్మశ్రీ, పద్మవిభూషణ్, ఆంద్ర కాకతీయ, మీరట్, నాగార్జున వంటి విశ్వ విధ్యాలయాలు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. అసమానమైన వారి సాహిత్యం అచంద్రతారార్కంగా నిలుస్తుందనటం లో ఎటువంటి సందేహము లేదు. వారి సేవలు భారతీయ కళామతల్లి మెడలో మెరిసే వజ్రాభరణాలు, వారి సాహిత్యం అందరికీ ఆదర్శప్రాయం. వారికివే నా మన:పూర్వక నమస్క్రుతులు.
~ఎన్వీ రఘువీర్ ప్రతాప్
ధర్మకేతనం సాహిత్య కళాపీఠం
# 9-6-369, ఫ్లాట్ నె 103, రోడ్ నె 14, మారుతీనగర్, చంపాపేట్, హైదరాబాద్-59.
మొబైల్ 9440551552