Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాతి గాంచిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య. పద్యం,గేయం,వచనం, రుబాయీ, గజల్ వంటి ప్రక్రియల్లో ప్రౌఢమైన రచనలు చేస్తూనే లలిత గీతాలు,సినిమా పాటల ద్వారా కూడ తెలుగు వారి హృదయాలను దోచుకున్నాడు. 1925 సం.జూలై 22 నాడు వరంగల్ జిల్లా చిన్న గూడూరులో జన్మించిన దాశరథి మెట్రిక్యులేషన్ వరకు ఉర్దూ మీడియంలో, ఇంటర్ ,డిగ్రీ ఇంగ్లీషు మీడియంలో చదివాడు.సంస్కృతాంధ్రాంగ్ల ఉర్దూ భాషల్లో అపారమైన పాండిత్యాన్ని సంపాదించాడు. చిన్ననాటి నుండే అభ్యుదయ భావాలు కలిగిన దాశరథి ప్రౌఢమైన పద్యాలు రాశాడు.
నిజాం నిరంకుశ పాలనను నిరసిస్తూ అగ్నిధారయై ప్రవహించాడు,రుద్రవీణయై నినదించాడు. నిజాం రాజు దౌర్జన్యాలను ఎదిరించి జైలు పాలయ్యాడు.పళ్లు తోముకోవడానికి ఇచ్చిన బొగ్గు ముక్కతో నిజాంను వ్యతిరేకిస్తూ దాశరథి రాసిన పద్యాలు ప్రతిరోజు జైలు గోడల మీద అధికారులకు దర్శనమిచ్చేవి.
ఓ నిజాము పిశాచమా! కానరాడు
నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రత్నాల వీణ
ఇలాంటి పద్యాలు రాసి జైలు అధికారుల ఆగ్రహానికి అనునిత్యం గురయ్యేవాడు దాశరథి.
దాశరథి రాసిన ఖండకావ్యాలలో అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, నవమంజరి, నవమి, గాలిబ్ గీతాలు, దాశరథి శతకం, తిమిరంతో సమరం, కవితాపుష్పకం, ఆలోచనాలోచనాలు, ధ్వజమెత్తిన ప్రజ, జ్వాలా లేఖిని అనేవి ముఖ్యమైనవి.
తెలంగాణ లోని కోటి ధీరుల గళధ్వనినె గాక
ఇలా గోళమందుండెడి ఎల్లరి శబ్దాన్ని నేను
నా పేరు ప్రజా కోటి నా ఊరు ప్రజా వాటి
ఎర్రజెండ పట్టుకోని ఎగిసిపోవు వాడి తోటి
పచ్చజెండ పట్టుకోని పరుగుతీయు వాని తోని
మైత్రీబంధం కూర్చే మహాశక్తి నాకున్నది (పునర్నవం-నా పేరు ప్రజాకోటి)
ఈ పంక్తులు దాశరథి విశాల కవితాహృదయాన్ని స్పష్టం చేస్తాయి.దాశరథి హృదయం కవితాపుష్పకమే.అందుకే ఆయన కవిత్వంలో అభ్యుదయ,కాల్పనిక,నవ్య సంప్రదాయ, జాతీయ కవితాలక్షణాలు కనిపిస్తాయి. నిజాం నిరంకుశత్వం,జాగీర్దార్ల జులుం చేత పీడింపబడుతున్న ప్రజల అగచాట్లు,సమాజంలోని దారిద్ర్యం,మత వైషమ్యాలు దాశరథి హృదయాన్ని కదిలించాయి. తెలంగాణాలో భూస్వామ్య వ్యవస్ధకు వ్యతిరేకంగా పోరాటం జరుపుతున్న కమ్యూనిస్టులను దాశరథి చూశాడు. ఆ పోరాటం ఆయనను బాగా ఆకర్షించింది.అందుకే ఆయన తొలి రచనలైన అగ్నిధార,రుద్రవీణ కావ్యాలలో అభ్యుదయ కవిత్వలక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి.
అనాదిగా సాగుతోంది-అనంత సంగ్రామం
అనాథుడికీ,ఆగర్భ-శ్రీనాథుడికీ మధ్య (అగ్నిధార-అనంత సంగ్రామం)
ఈ చరణాలు అభ్యుదయ కవితాలక్షణమైన వర్గ సంఘర్షణను సూచిస్తున్నాయి.అగ్నిధార లోని 'అనంత సంగ్రామం' అనే కవిత మార్క్స్ సిద్ధాంతానికి చక్కని వివరణ.నిరుపేదలకూ,ధనికులకూ నడుమ సాగే పోరాటం అనంతమని చూప్పాడు దాశరథి.
తరతరాల దరిద్రాల బరువులతో పరువెత్తే
నిరుపేదా విరుగుతోంది నీ మెడ
పెరుగుతోంది నీ గుండెల్లో దడ
నీ పిల్లల నిల్లాలిని కిల్లీ మాదిరి నమిలే
మిల్లు మ్యాగ్నెట్లు
నీ వేడి వేడి నెత్తురుతో షవర్ బాత్ తీసుకునే
భువనైక ప్రభువులు వారంతా ప్రభువులు
అభవులు అనే చరణాలు ధనికులైన పెట్టుబడిదారుల చేతుల్లో నిరుపేదలు ఎలా నలిగి పోతున్నారో కవితాత్మకంగా చెప్పాడు,వెట్టి చాకిరిని నిరసించాడు.
నా గీతావళి ఎంతదూరము ప్రయాణంబౌనో
అందాక ఈ భూగోళమ్మున కగ్గి పెట్టెదను (అగ్నిధార-'అంతర్నాదం')
ఈ పద్యంలోని అగ్గి చైతన్యానికి సంకేతం.జఢులై పడి వున్న జనావళిని తన గీతాలతో చైతన్యవంతుల్ని చేయడమే కవి ఉద్దేశ్యం.
'చింతల తోపులో కురియు చిన్కులకున్ తడి ముద్దయైన బా
లింత యొడిన్ శయించు పసిరెక్కల మొగ్గను వోని బిడ్డకున్
బొంతలు లేవు కప్పుటకు బొంది హిమంబయి పోవునేమొ?సా
గింతును రుద్రవీణ పయి నించుక వెచ్చని అగ్ని గీతముల్ ' (రుద్రవీణ-మూర్ఛన)
ఈ పద్యంలో చలిచే వణికిపోతున్న పేదరాలైన బాలింత ఒడిలోని పసిపాపను కప్పుటకు బొంతలు లేవని వాపోయి తన రుద్రవీణ ను మీటి వెచ్చని గీతాలు పలికించాడు దాశరథి.
పూలగాలి సోకి పులకింప జగమెల్ల
వచ్చినది ఉగాది వన్నెలాడి
ఆకురాలి గొంతులారిన తరువుల
పూవు పూవు నాల్క పోల్కి పల్కె (మహాంధ్రోదయం- రాగబంధం)
అని ఉగాదిని వన్నెలాడిగా వర్ణించాడు దాశరథి.పూవులే నాల్కలుగా తరువులు పల్కినవనడం ఒక్క దాశరథి కలానికే సాధ్యమవుతుందేమో!
ఉషస్సు కిర్మీర కవాటం తోస్తూ
ఒక్క మాటు చూసిందిటు
తమస్సు పాషాణ కిరీటం తీస్తూ
ఒక్క పరుగు తీసిందటు (పునర్నవం-ఉషస్సంధ్య) అంటూ ప్రకృతిలోని సూర్యోదయాన్ని వర్ణిస్తూనే ఉషస్సును స్వేచ్ఛకూ,తమస్సును దాస్యానికి ప్రతీకలుగా ధ్వనింపజేశాడు దాశరథి.అంతేకాదు ఆనాటి రాజకీయ పరిస్థితిని కూడ స్ఫురింపజేశాడు.
ప్రకృతిని ఋతువులను దాశరథి సామాజిక స్పృహతో వర్ణించాడు.శిశిరం గతించిన బానిసతనానికి , వసంతం రాబోయే శుభ స్వాతంత్యానికి ప్రతీకలుగా గ్రహించాడు.సమత మమత మానవత సమాజంలో వికసిస్తేనే నిజమైన వసంతమని తన ఆశయాన్ని అభివ్యక్తం చేశాడు. దాశరథి కవిత్వంలో అత్యధిక భాగం దేశభక్తి ప్రపూర్ణమైనది.ఆయన దేశభక్తి కవిత్వం తెలంగాణ విముక్తి ఉద్యమంతో ప్రారంభమైనది.
'మా నిజాం రాజు జన్మ జన్మాల బూజు' ,'నా తెలంగాణ కోటి రత్నాల వీణ', 'తెలంగాణము రైతుదే,ముసలి నక్కకు రాచరికంబు దక్కునే' అని తెలంగాణ రైతుదంటూ నిజాం రాజును ధిక్కరించాడు. మాతృభూమిని ప్రస్తుతించాడు. తెలంగాణ విముక్తి కాగానే- నాకు కావలె మహాంధ్రోర్వర అంటూ ఆరాటపడ్డాడు. విశాలాంధ్ర అవతరించగానే-
ఏది కాకతి? ఎవరు రుద్రమ?
ఎవడు రాయలు? ఎవడు సింగన?
అన్ని నేనే అంత నేనే
అరి శిరస్సులనుత్తరించిన
అలుగు నేనే పులుగు నేనే
వెలుగు నేనే తెలుగు నేనే అంటూ ఆనందంతో గానం చేశాడు దాశరథి.
పండిత జవహర్ లాల్ నెహ్రూ కన్ను మూసినప్పుడు తన సుమధుర గేయమాలికతో ఆయనకు జోహార్లు సమర్పించాడు దాశరథి.
చని పోయావని ఎల్లరు జల జల కన్నీరు కార్చిరి
చిరంజీవివే నీవు మరణం నీకెక్కడిది?
అరుణ వర్ణ రంజితమై అలరారే గులాబిలో
గంగా యమునా సంగమ కమనీయ జలాలలో
మా రైతుల పొలాలలో మా కవుల కలాలలో
అంతట నీవేనయ్యా అన్నిట నీవేనయ్యా (కవితా పుష్పకం-చిరంజీవి నెహ్రూ)
మాతృదేశంలోని నదీ నదాలను వర్ణిస్తూ ప్రస్తుతించడం జాతీయోద్యమ కవితాలక్షణమే-
ఎవరి గజ్జెల రవళివే నీవు మంజీర
ఎవరి కజ్జల బాష్పధారవే మంజీర
నీవు పారిన దారిలో ఇక్షుదండాలు
నీవు జారిన జాడలో అమృత భాడాలు (మహాంధ్రోయం-మంజీర)
అంటూ మంజీరానదిని వర్ణించాడు దాశరథి. కృష్ణా,గోదావరి,తుంగభద్ర,పెన్నా నదులను పేర్కొని వర్ణిస్తూ వాటి ద్వార తెలుగు వారి ఏకత్వాన్ని వ్యక్తం చేశాడు.
దాశరథి రచించిన లలిత గీతాలలో ప్రకృతి గీతాలు, ప్రణయ గీతాలు, దేశభక్తి గీతాలు, అనువాద గీతాలు, అభ్యుదయ గీతాలు ఉన్నాయి.ఈ గీతాలన్నీ నవ మంజరి కవితాసంపుటిగా రూపు దిద్దుకున్నాయి. దాశరథి రచించిన ప్రణయ గీతాలలో 'నా రాణి ' అనే పాట బాగా ప్రాచుర్యం పొందింది.
'తల నిండ పూదండ దాల్చిన రాణి
మొలక నవ్వుల తోటి మురిపించ బోకే'
అనే పల్లవితో ఈ పాట ప్రారంభమవుతుంది.కవి ఆ రాణిని పూల వానలు కురిసే మేఘంగా,అందాల మొగలి రేకుల లోని సొగసుగా అభి వర్ణిస్తాడు.ఆమెలో ఆరు ఋతువులను దర్శిస్తాడు.స్త్రీలో గడుసుదనాన్ని,సొగసునూ,నిండు దనాన్ని,వలపు తియ్యదనాన్నీ చిత్రించే ఈ పాట బహుళ జనామోదాన్ని అందుకూన్నది.'ఆ రజనీకర మోహన బింబము నీ నగు మోమును బోలునటే','కలువల రాజా ఎట దాగినావో','వెలిగించవే చిన్ని వలపు దీపం' అనే గీతాలు చాలా ప్రశస్తి పొందాయి.ఇలా రెండు వేలకు పైగా లలితగీతాలు రచించి తెలుగు భారతిని అలరించాడు దాశరథి. ఇక దాశరథి సినిమా పాటల ప్రస్థానం ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని తెచ్చి పెట్టినవాడు దాశరథి.లలిత గీతాలెన్నో రాసిన దాశరథికి సినిమా పాటల రచన చాలా హాయిగా సాగింది.అయితే సాధారణమైన పాటకూ సినిమా పాటకు భేదముంటుంది.సినిమా పాటలు రక రకాల బాణీలలో సమకూర్చబడతాయి. సాధారణ గీతాలలో కవికి స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది.సంగీత స్వర కల్పనకు అనుగుణంగా పాట రాస్తే నడకలో నవ్యత ఉంటుంది.అయితే కవికి కొంత శ్రమ ఉంటుంది.ఒక సినిమా పాట సిద్ధం కావడానికి మూడు పద్ధతులుంటాయి.పాట రాసిన తర్వాత ట్యూను చేయడం ఒక పద్ధతి.ట్యూను కట్టిన తర్వాత పాట రాయడం రెండవ పద్ధతి.సంగీత దర్శకుడూ,రచయిత ఒకచోట కూర్చొని,సందర్భానుగుణంగా అప్పటి కప్పుడే పాటనూ,ట్యూన్ నూ సిద్ధం చేసుకోవడం మూడవ పద్ధతి.రెండవ పద్ధతిలో దాశరథి సినిమా పాటల రచన ప్రారంభమైంది.కవిగా దాశరథి శక్తి తెలిసిన ఆచార్య ఆత్రేయ గారు 1960లో దాశరథిని మద్రాసుకు ఆహ్వానించి ఆయన చేత వాగ్దానం చిత్రానికి -నా కంటి పాపలో నిలిచి పోరా-నీ వెంట లోకాలు గెలువనీరాఃఅనే పాటను రాయించారు.శరత్ చంద్ర ఛటర్జీ గారి సుప్రసిద్ధ బెంగాలీ నవల ఆధారంగా తీసిన వాగ్దత్త అనే హిందీ చిత్రంలోని - 'ఆధా హై చంద్రమా రాత్ ఆధీ' -అనే హిందీ పాట బాణీలో రాసిన పాట ఇది.దీనిని పెండ్యాల గారు ట్యూన్ చేశారు. దాశరథి మొదటి సినిమా పాట నా కంటి పాపలో (వాగ్దానం చిత్రం)అయితే విడుదలైన మొదటి పాట 'ఖుషీ ఖుషీగా నవ్వుతూ 'అనే 'ఇద్దరు మిత్రులు' సినిమా లోని పాట. దాశరథి 1960 నుంచి 1984 వరకు రెండు వేల అయిదు వందల సినిమా పాటలు రాశాడు.వీటిలో భక్తి గీతాలు,వీణ పాటలు,వాన పాటలు,అనుబంద గీతాలు,స్త్రీల పాటలు,అభ్యుదయ గీతాలు,తాత్త్విక గీతాలు,స్నేహ గీతాలు,ప్రణయ గీతాలు,విరహ గీతాలు,హాస్య గీతాలు,జానపద గీతాలు ఉన్నాయి.ఇంకా ఉర్దూ సంప్రదాయానికి చెందిన ఖవ్వాలి పాటలు కూడ ఉన్నాయి.
ఆయన సినిమా పాటల్లోంచి మచ్చుకు కొన్నింటిని గూర్చి వివరిస్తాను.'రంగుల రాట్నం' సినిమా లోని 'నడిరేయి ఏ జామునో' అనే పాట అశేష ప్రజానీకం నోట ఇప్పటికీ మారు మోగుతూనే ఉన్నది.'మేన కోడలు' సినిమా లోని-'తిరుమల మందిర సుందరా' అనే పాట, 'మట్టిలో మాణిక్యం' సినిమా లోని -'శరణం నీ దివ్య చరణం' వంటి అనేక భక్తి గీతాలు మిక్కిలి ప్రశస్తి పొందాయి. వీణపై ఆలపించే సందర్భాలకు సంబంధించి ఎన్నో మంచి పాటలు రాశాడు దాశరథి. ఆత్మీయులు చిత్రం లోని 'మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నొ చెలరేగే'-అనే పాట, అమాయకురాలు చిత్రం లోని 'పాడెద నీ నామమే గోపాలా' అనే పాట, రెండు కుటుంబాల కథ చిత్రం లోని 'వేణు గానలోలుని కన వేయి కనులు చాలవులే' వంటి పాటలు సినీ జగత్తులో దాశరథికి మంచి పేరు తెచ్చి పెట్టాయి.
ఇలాంటి పాటలే కాకుండా ఎన్నో హుషారు గీతాలు కూడ రాశాడు దాశరథి. 'ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ', 'ఆ దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే', 'మంచి వాడు మా బాబాయి' ,'మామిడి కొమ్మ మళ్లీ మళ్లీ పూయునులే' - 'గోదారీ గట్టుందీ గట్టు మీన సెట్టుందీ' వంటి పాటలు తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెక్కు చూదరని స్ధానాన్ని సంపాదించుకున్నాయి.
దాశరథి గజల్ ,రుబాయీ ప్రక్రియలను ఉర్దూ,హిందీ,ఫారసీ,స్పానిష్ భాషలలో అధ్యయనం చేసి పరిశోధన జరిపి ఆ ధోరణిలో రచన చేశాడు. దాశరథి తెలుగు గజల్ కు మొదట 'మంజరి'అనీ, తర్వాత వల్లరి అని పేర్లు పెట్టాడు. ఈ పేర్లతో ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో కొన్ని గజళ్లు రచించాడు. 'జ్వాలా లేఖిని' కవితా సంపుటిలో తొమ్మిది గజళ్లున్నాయి.కొన్ని గజళ్లలో దాశరథి తన 'తఖల్లుస్' (కవి నామ ముద్ర) 'శరథి'ని ప్రయోగించాడు.
'రమ్మంటే చాలు గానీ రాజ్యాలు విడిచి రానా
నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు గడిచి రానా'
ఇలా సరళంగా,సరసంగా సాగిన ఈ గజల్ ప్రణయ భావాత్మకమైనది.ఇలా తెలుగులో మొట్ట మొదటి సారిగా గజల్ ను ప్రవేశ పెట్టినవాడు దాశరథి.ఉర్దూలో మిర్జా గాలిబ్ రాసిన గజళ్లను తెలుగులోకి అనువాదం చేసి 'గాలిబ్ గీతాలు' పేరు మీదుగా వెలువరించాడు. దాశరథి సారస్వత మూర్తి.ఆయన కలం నుంచి ఖండ కావ్యాలు,కథా కావ్యాలు,బాల సాహిత్యం,లలిత గీతాలు,ఆశు పద్యాలు,సినిమా పాటలు,నాటికలు,అనువాదాలు,శతకాలు,నవలలు,వ్యాసాలు,విమర్శలు,కథలు,వ్యాఖ్యానాలు,స్వీయ చరిత్రలు,గజళ్లు,రుబాయీలు,పీఠికలు,సమీక్షలు ఇలాంటి సాహిత్య ప్రక్రియలెన్నో వెలువడ్డాయి.అలాంటి మహాకవి 1987సం.నవంబర్ 5 రోజున పరమపదించాడు.
---తిరునగరి శ్రీనివాసస్వామి
సినీగేయ రచయిత
9440369939