Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని' అంటూ రాసినది తన మొదటి సినిమా పాటైనా అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో మంది హృదయాలను దోచుకున్నదనుటలో సంశయమే లేదు. ఎన్నో పాటలతో, మరెన్నో కవితలతో,గజళ్ళతో పరవసింపజేసిన సినారె అశేష ప్రజా హృదయాలలో చిరస్మరణీయంగా నిలిచాడు.
సినారె గారి పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఇతడు తెలంగాణలోని పాత కరీంనగర్ జిల్లా ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లాగా పిలువబడుతున్న ప్రాంతంలోని మారుమూల గ్రామం అయినటువంటి హనుమాజీ పేటలో బుచ్చమ్మ మల్లారెడ్డి గార్లకు 1931 జూలై 29న జన్మించారు. మల్లారెడ్డి పూర్వీకులది వ్యవసాయ కుటుంబం కావడంతో రైతుగానే పొలం పనులన్నింటిని చూసుకునేవాడు మల్లారెడ్డి.అయితే సినారె జన్మించేనాటికి భారతదేశం అంతా కూడా పరాయి పాలనలోనే ఉంది. భారతీయులంతా కూడా ఆ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఉద్వేగభరితమైన రోజులవి. ఒకవైపు పరిపాలన మరొకవైపు ఆర్థిక మాంద్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాకుతలమౌతున్న రోజులవి. సాహిత్య రంగంలో విశ్వనాథ "వేయిపడగలు"రామాయణ కల్పవృక్ష" రచనలు, గుర్రం జాషువా"అనాధ", "స్వప్నకథ", శ్రీ శ్రీ "మహాప్రస్థానం", మొదలైనవి ప్రజల్లో చైతన్యం నింపుతున్న పరిస్థితులు. నారాయణ రెడ్డి ప్రాథమిక ఉన్నత విద్యాభ్యాసమంతా కూడా హనుమాజీపేట, సిరిసిల్ల, కరీంనగర్ ,చాదర్ఘాట్ లోనే జరిగింది. ప్రాథమిక, ద్వితీయ మరియు ఉన్నత చదువులు అన్నీ కూడా ఉర్దూ మీడియం లోనే పూర్తి చేశారు. 1949 లో హైదరాబాదులో డిగ్రీ చదువులకై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టి తన కళాశాల విద్యాభ్యాసంను కొనసాగించారు. అప్పుడున్న కాల పరిస్థితుల దృష్ట్యా నిజాం పాలనలో తెలుగులో విద్య అందుబాటులో లేకపోవడంతో నారాయణ రెడ్డి గారు గ్రాడ్యుయేషన్ వరకు కూడా ఉర్దూ మాధ్యమంలోనే తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. శతావధానిశేషాద్రి మార్గదర్శకత్వంలో మరియు వారి శిక్షణలో సిరిసిల్ల పాఠశాలలో తెలుగు అధ్యయనం చేయడం జరిగింది. డిగ్రీ విద్యను అభ్యసించడానికి హైదరాబాద్ కు వెళ్లిన తర్వాత అక్కడ ఆధునిక తెలుగు సాహిత్య దిగ్గజాల గురించి తెలుసుకోవడం ప్రారంభించాడు. అందులో భాగంగానే గుర్రం జాషువా రచించిన పుస్తకాలను, శ్రీ శ్రీ రచనలు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పుస్తకాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించటం మొదలు పెట్టారు.అయితే సినారె గ్రాడ్యుయేషన్లో మాత్రం తెలుగును తన అంశంగా తీసుకోవడమే కాకుండా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ను కూడా అందుకోవడం జరిగింది. 1955 లో కళాశాల లెక్చరర్ గా, 1962 లో మోడరన్ 'ట్రెడిషనల్ ఆఫ్ తెలుగు' పై పి హెచ్ డి చేసి 1976లో ప్రొఫెసర్ అయ్యారు.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విరమించబడి తెలుగువారికొక రాష్ట్రం కోసం అమరజీవిగా మారిన రోజుల్లోనే కవితా లోకానికి 1953 లోనే సినారె కవిగా పరిచయమయ్యారు. తెలంగాణ రచయితల సంఘ నిర్మాణంలో కవులుగా దాశరథీ, సినారె అన్నదమ్ములుగా కీలక పాత్రను పోషించారు. తొలి తరం కవులుగా సోమ సుందర్,సి వి తిలక్, శ్రీ శ్రీ, నారాయణ బాబు,రెంటాల, ఆరుద్ర వంటి వారు కాగా దాశరథి,సినారె, అవంత్య కందుర్తి, అయినవారు రెండవ తరానికి చెందిన అభ్యుదయ కవులుగా ముద్ర పడిపోయారు. ఎందుకంటే భారతీయ సమాజంలో వచ్చిన మార్పులు అభ్యుదయ సాహిత్యాన్ని ఒడిదుడుకులకు గురిచేశాయి. విమర్శకులకు కూడా గురైనది.ఈ కాలంలోనే సినారె అప్పటి కాల ప్రభావ ఆలోచనలతో పరిణామం చెందారు. భావ కవిత్వం కనుమరుగైపోతున్న కాలమది. దాశరధి, సోమనాథ్ వంటి అభ్యదయకవులు భావకవిత్వం భావాలు వదులుకోకుండా అభ్యుదయ కవిత్వం రాస్తున్నారు.1953లో సినారె "నవ్వనిపువ్వు"రాసే నాటికి భావకవిగానే ఉన్నారు. కానీ అనతి కాలంలోనే భావ కవిత్వంలోకి అభ్యుదయ కవిత్వం వచ్చిందని"విశ్వగీతి"వంటి కావ్యాలలో కనిపిస్తుంది. "మంటలు-మానవుడు" ఇందుకు తొలి ఆనవాలుగా చెప్పవచ్చును.
సినారె గారి సాహితీ రచనలను చూసినట్లయితే ఇతని మొట్టమొదట ప్రచురించిన రచన 1953 లో "నవ్వని పువ్వు", వెన్నెల వాడా" జలపాతం", దివ్యెల మువ్వలు", 1964లో"ఋతుచక్రం", 1968లో "మధ్యతరగతి మందహాసం", 1970"మంటలు- మానవుడు", 1980లో వచ్చిన "విశ్వంభర", ఇది విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. అనేక భారతీయ భాషల్లోకి కూడా అనువదించబడింది. "నాగార్జున సాగరం బౌద్ధమత ఇతిహాసం","కర్పూరవసంత రాయలు", మొదలైనవెన్నో కూడా. కవిత్వంతోపాటుగా సినారె గారు కాకతీయ రాజవంశం ఆధారంగా 1916 లో రామప్ప అనే సంగీత నాటకాలను కూడా స్వరపరిచారు. ఆధునిక తెలుగు కవిత్వం పూర్వాంగాలు/ వివిధ దశలలో దాని పురోగతి/ ఆధునికాంధ్ర కవిత్వం/ కవితా సంప్రదాయాలు/ ప్రయోగాలు/ ప్రయోగాలలో విశ్లేషణ మొదలైనవి ఈయన ప్రచురించారు. 1997 లో మట్టి మనిషి ఆకాశం సుమారు వంద పేజీల పొడవైన కవిత/ ముచ్చటగా మూడు వరుసల్లో మలేషియా పర్యటనలను మొదలైన ఎన్నో ఎన్నెన్నో రచనలు.
సినీగీత రచయితగా సినారే మొదటి చిత్రం "గులేబకావళి" కథ.ఇది1962 లో ఆ తర్వాత మూడు వేలకు పైగా సినిమా పాటలు కూడా రాయడం జరిగింది. అందులో కొన్ని ఆ పాత మధురాలను చూసినట్లయితే....
నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని/ తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది/ రఘుకుల తిలకా.. నీ ఆనతి.../ ఇంతేలే నిరుపేదల బ్రతుకులు/ కృష్ణవేణి తెలుగింటి విరిబోణి/ గున్నమామిడి కొమ్మ మీద/ అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం/ ఈనాడే బాబు నీ పుట్టిన రోజు/ రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్/ గువ్వలా ఎగిరి పోవాలి/ పుట్టిన రోజు పండగే అందరికీ మరి/ అణువు అణువున వెలసిన దేవా/ నీ మది చల్లగా/ గాలికి కులమేది/ ఆడవే ఆడవే ఆడవే జలకమ్మాలాడవే/ ఎవరికీ తలవంచకు/ ఈ నల్లని రాళ్ళలో/ భలే మంచి రోజు/ మానవ జాతి మనుగడకే/ చదువు రానివాడవని దిగులు చెందకు/ ఎన్నాళ్లో వేచిన ఉదయం/ కంటేనే అమ్మ అని అంటే ఎలా/ ఇదిగో రాయలసీమ గడ్డ/ ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ/ వందే మాతరం.... వందేమాతరం/ మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి.... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఆణిముత్యాల లాంటి పాటలు మనకు అందించారు సినారె గారు.
సినారె కవిత్వంలోఅనేక ప్రయోగాలు చేశారు. "జలపాతం", విశ్వగీతి", కర్పూరవసంతరాయలు", విశ్వంభర",మట్టి మనిషి -ఆకాశం"వంటి సమగ్ర కావ్యాలు ఎన్నో రచించారు.ఇంతే కాకుండా మినీ కవితలు,గజల్స్, ప్రపంచ పదులు కూడా రచించడం జరిగింది.
" ఆత్మలను పలికించేది అసలైన భాష
ఆ విలువ కరువైపోతే అది కంఠశోష"
" పరుల కోసం పాటుపడిన నరుని బతుకు దేనికని
మూల నేలకు నీరు అందివ్వని వాగు పరువు దేనికని"
గజళ్ళను కూడా రాసి పాడిన సినారె తెలుగు సమాజాన్ని ఉర్రూతలూగించారు. సామాజిక చైతన్య ప్రబోధమే తన కవిత్వ ప్రధాన లక్ష్యం అని చెప్పి కవిత్వంలో ఎన్నో ప్రయోగాలు చేసి ఆ తర్వాత కవులకు మార్గదర్శి గా ఓ వెలుగు వెలుగుతున్నారు సినారె.
"గడ్డికుప్పల్లా పడి ఉన్నాయి గుడిసెలు"
కర్ఫ్యూ సూర్యుని సాక్షిగా జరిగే
విచ్చుకత్తుల కసరత్తులు"
నిరుద్యోగం రాలుతుంది బొట్లుబొట్లుగా
సర్టిఫికెట్ల నొసళ్ళ నుంచి" అంటూ చెప్పుకొచ్చారు.
ఇంకా....
"పాత ముఖాన్ని లాండ్రిలో పారేసి
కాకుంటే మ్యూజియంలో దాచేసి
కొత్త ముఖం తొడుక్కో అంటూ"... మంటలు-మానవుడులో తన అభిప్రాయం.
ఆంధ్ర కవిత్వాన్ని సమగ్రంగా ఎనిమిది ప్రకరణములల్లో వెలువరించారు సినారే. సాహితీ రంగంలో ఆ తరవావచ్చినటు వంటి గ్రంథాల అన్నింటికీ కూడా ఈ గ్రంథమే పునాదిగా నిలిచినది. శారీరక తత్వంపై వంశపారంపర్యం ప్రభావంమెట్లో జీవనంన సంప్రదాయం నిర్వహించే పాత్ర కూడా అట్టిదే. గతంలోని కొంత భాగమును ఒక తరం నుండి మరొక తరంనకు అందజేయుటయే సంప్రదాయం యొక్క కర్తవ్యం అని తెలిపెను. అంటేే "సంక్రమించుట" అనే అర్థమే. ఇతరుల నుండి ఎరువు తెచ్చుకున్న అంశములు తప్ప సాంఘిక జీవితం అందలి అంశంలన్నియు సంప్రదాయ సంబంధము లేనని అనెను. ధర్మ,అర్ధ,కామ,మోక్ష నిర్వచనాలను,ప్రాధాన్యతలను, సాహిత్యంపై వాటి ప్రభావంను వివరించెను. ప్రయోగం దానిస్వరూపం/ భారతీయ మత సంస్కృతులలో ప్రయోగాలు/ సాహిత్యంలోప్రయోగం/ రసము/ కావ్య స్వరూపము/ అలంకారాలు/ ఆంగ్ల సాహిత్యంలో ప్రయోగం/ సంప్రదాయ ప్రయోగములు సమన్వయము/ మొదలైనవన్నీ కూడా ప్రధమ ప్రకరణంలో దర్శనమిస్తాయి. ద్వితీయ ప్రకరణములో కవితా స్వరూపమును/ తృతీయ ప్రకరణములో ప్రాచీనాంధ్ర కవిత్వంలో నవీన రీతులు/ చతుర్ద ప్రకరణములో నవ్యకవిత్వమహోదయము/ పంచమ ప్రకరణములో ఇద్దరు యుగ కర్తలు గురజాడ రాయప్రోలు కవుల గురించి/ షష్ఠ ప్రకరణంలో భావకవిత్వము ఇందులో శాఖలైన ప్రణయ కవిత్వం/ దేశభక్తి కవిత్వం/ ప్రకృతి కవిత్వం/ సంఘ సంస్కరణ కవిత్వం/ భక్తి కవిత్వం/ స్మృతి కావ్యాలు/ సప్తమ ప్రకరణములోభావ కవిత్వం పై తిరుగుబాటు/ నూతన యుగ కర్త శ్రీ శ్రీ అభ్యుధయకవితోద్యమం/ అష్టమ ప్రకరణములో అతి నవ్య కవితా ధోరణులు/ అధివాస్తవికత/ సెక్స్ ప్రాధాన్యం/ ప్రతీకవాద ధోరణి/ జీవన చిత్రణం/ వైచిత్రీ ప్రియత్రణము/ వచన గేయములు/ అరాజకవాదం / నిరాశావాద ధోరణి/ ఈ దశాబ్ద కవిత సమీక్ష మొదలైనవన్నీ కూడా ఆధునికాంధ్ర కవిత్వంలో మనకు దర్శనమిస్తాయి.
సినారె సాహితీ రచనలు పలు అవార్డులను గెలుచుకున్నాయి.1973 లో "మంటలు-మానవుడు" కవితాసంపుటికి "సాహిత్య అకాడమీ" అవార్డు, 1988 లో 'విశ్వంభర "కు "జ్ఞానపీఠ "అవార్డ్, 2014లో "సాహిత్య అకాడమీ ఫెలోషిప్", కళాప్రపూర్ణ" "సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కారం", శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం యొక్క విశిష్ట పురస్కారం, ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారాలైన అటువంటి "పద్మశ్రీ", "పద్మభూషణ్", ఉత్తమ సినీగేయ రచయితగా నంది అవార్డులు "కంటేనే అమ్మ అని అంటే ఎలా"పాటకు కోసం రెండు సార్లు ఇంకా సీతయ్య సినిమా లో"ఇదిగో రాయలసీమ గడ్డ"అనే పాటకు ఇలా ఎన్నో ఎన్నెన్నో.... పురస్కారాలు వచ్చాయి. కవిగా,నాటక రచయితగా,స్వరకర్తగా,కళాకారుడిగా,ప్రొఫెసర్ గా రాజకీయవేత్తగా ఎంతో కీర్తి నొందాడు.
ఒక కవి తన కవిత్వంలో ఏవిధంగా నిరూపణ చేసుకోవాలో,ఏ విధంగా పదబంధాలు వాడాలో,ఏ విధంగా భావప్రసారంలో అంతర్వాహినిగాకావాలో, ఏ విధంగా మనసులను కవిత్వ ధోరణితో రంజింప చేయాలో, అలంకార శబ్దాలతో అందమైన రీతులతో అంత్యప్రాసలతో కవిత్వీకరించి కవితకి ఎలా జీవం పోయాలో తెలిపినట్టి సినారె గారికి తెలుగు సాహిత్య లోకం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. నూతన ధోరణులను తెలుపుతూనే ఆధునిక కవిత్వాన్ని విడమరిచి చెప్పిన గొప్ప పరిశోధక సాహితీవేత్త.సాహితీవేత్తగా,కవిగా,గేయ రచయితగా నవతరానికి మార్గదర్శియైన సినారె తెలుగు చలన చిత్ర రంగంలో తను రాసిన పాటలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో వెలిగి,తెలుగు సాహిత్య సాంస్కృతిక అభ్యుదయానికి ఎనలేని కృషితో కవిత్వమనే అమృతధారలనే కురిపించిన సినారె 2017 జూన్ 12న ఆ అభ్యుదయ గొంతు మూగబోయిన క్షణం కన్నీరు పెట్టింది కవన కలం. సాహితీ లోకానికి అతని మరణం తీరని లోటును మిగిల్చింది.
- గోస్కుల శ్రీలతరమేశ్
7013943368
హుజురాబాద్.