Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'' ఏదైనా రాయనిదే ఈ క్షణాన్ని పోనీయను
కాలాన్ని పిండేయందే కాలాన్ని కదలనీయను''
పై మాటలకు అక్షరరూపం సి. నారాయణ రెడ్డి గారు. సి.నా.రె గా పిలుచుకొనే సింగిరెడ్డి నారాయణరెడ్డి సాహితీ వనంలో పాత తరానికి, కొత్త తారానికి మధ్య వారధిగా నిలిచారు. తన సమకాలీకుడైన దాశరథి ని అగ్రజ్యుడిగా స్వీకరించిన సి.నా.రె గారు దాశరథితో పాటు సమున్నతంగా ఎదిగి సాహితీ సేద్యంలో వారికి సమవుజ్జీగా నిలిచారు.
కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా హనూజీ పేటకు చెందిన సింగిరెడ్డి మల్లారెడ్డి, బుచ్చమ్మల ఏకైక పుత్రుడు నారాయణరెడ్డి. వ్యవసాయ మోతుబరి కుటుంబంలో పుట్టినప్పటికీ హలం పట్టాల్సిన చేతులతో కలం పట్టారాయన. చిన్నతనంలో నాటకాలవైపు ఆకర్షితులైన సి.నా.రె విద్యార్ధి దశలో పలు నాటకాలు రచించి, క్రమంగా కవిత్వం పైపు నడిచారు. బి.ఎ వరకూ ఉర్దూ మీడియంలో చదివిన నారాయణరెడ్డి, ఆ తర్వాత ఏం.ఎ తెలుగు పూర్తి చేశారు.
పద్మశ్రీ, పద్మభూషణ్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, భారతీయ భాషా పరిషత్, రాజ్యలక్ష్మి, సోవియట్ నెహ్రూ వంటి ఎన్నో అత్యున్నత పురస్కారాలతో పాటు 1988 లో విశ్వంభరు కావ్యానికి ప్రతిష్టాత్మక జ్ఞాన పీఠ్ పురస్కారాన్ని అందుకొన్నారు. తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ తర్వాత అంతటి ఘనత సాధించిన సాహితీకారుడు సి.నా.రె.
భూమిక, కర్పూర వసంతరాయులు, నాగార్జున సాగరం వంటి దీర్గకావ్యాలు ఆనాటి మేటి సాహితీకారుల కన్నా సి.నా.రె గారిని ఒక మెట్టు పైన కూర్చోబెట్టాయి. సాహితీవేత్తగా, అనుభవశీలిగా, పరిపక్వత చెందిన వ్యక్తిగా విభిన్న కోణాల్లో దర్శనమిచ్చే సి.నా.రె గారు సరస్వతి మాత ముద్దు బిడ్డగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగి తెలుగు సాహిత్యాన్ని, తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు.
కవిత్వంతో, కావ్యాలతో అక్షరాస్యులైన పండితులను ఆకర్షించగలిగిన వారి కలం, సినిమా పాటల మలుపునందుకొని నిరక్షరాస్యులైన పామరులను సైతం కట్టిపడేసింది. ప్రేమ, ఎడబాటు, విషాదం, హాస్యం, భక్తి, తత్వం వంటి నవరసాలను తన పాటలలో బంధించి ధీశాలి సి.నా.రె. గులేబకావళి కథ సినిమాతో పాటల రచయితగా ప్రస్థానం ఆరంభించిన సి.నా.రె ఆ సినిమాలో పదికి పది పాటలు రాశారు. అది కూడా కేవలం పది రోజులలో పూర్తిచేయడం విశేషం. మొట్ట మొదటి సినిమాలోనే అన్ని రకాల పాటలు రాసి తన సత్తాను సినీ పరిశ్రమకు పరిచయం చేశారాన. 'నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని ... కన్నులలో దాచుకొందు నిన్నే నా సామి' మొట్టమొదట రికార్డయిన పాట. బందిపోటుు సినిమాలో 'వగలరాణివి నీవే... సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే' అంటూ కథానాయిక పరివారాన్ని ఆటపట్టించే పాట ఆనాటి శ్రోతల్ని కట్టిపడేసింది.
స్వాతిముత్యం సినిమాలో వారి కలం నుండి జాలువారిన 'వటపత్ర శాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి' అనే పాట నేటి ఆధునిక యుగంలో కూడా ఏడుస్తున్న పిల్లల్ని నిద్రపుచ్చుతోంది అంటే అతిశయోక్తి కాదు. అదే సినిమాలో మరో ఆణిముత్యం 'సువ్వి సువ్వి సువ్వాలమ్మా సీతాలమ్మ, గువ్వా మువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా' అమాయకుడైన కథానాయకుడికి, అభాగ్యురాలైన కథానాయకికి మధ్య సాగే ఆ పాట సి.నా.రె లోని భావనా శక్తికి నిదర్శనం.
పూర్తి సంస్కృత పదాలతో, గొప్ప విశేషణాలతో అక్షర భిక్ష పెట్టిన సరస్వతీ దేవిని స్మరించుకొంటూ స్వాతికిరణంలో రాసిన 'సంగీత సాహిత్య సమలంకృతే... స్వరరాగ పదయోగ సమాభూషితే' పాట వారిలోని మేధోశక్తికి మచ్చుతునక. నిప్పులాంటి మనిషి సినిమాలో ' స్నేహమేనా జీవితం, స్నేహమేరా శాశ్వతం' పాట స్నేహ మాధుర్యాన్ని పరిమళింపజేస్తే, బంగారు గాజులు సినిమాలో 'అన్నయ్య సన్నధి అదే నాకు పెన్నిధి' అనే పాట అన్నాచెల్లెళ్ల మధ్య నున్న అనురాగాన్ని సుసంపన్నం చేస్తుంది. ఆత్మబంధువు సినిమాలో 'చదువు రాని వాడవని దిగులు చెందకు' పాట ఆనాటి నిరక్షరాసులకు సాంత్వన కలిగించింది. ఇవే కాదు, తల్లా పెళ్లామా చిత్రంలో 'తెలుగు జాతి మనది' అనే పాట, చెల్లెలి కాపురంలో 'ఆడవే మయూరి... నటనమాడవే మయూరి' , శ్రీకృష్ణ పాండవీయం లో 'ఛాంగురే బంగారు రాజా!' అనే పాట, శివరంజని చిత్రంలో 'అభినవ తారవో, నా అభిమాన తారవో' , అమరశిల్పి జక్కన్న లో 'ఈ నల్లని రాళ్లలో..... ఏ కన్నులు దాగెనో' , అరుంధతి సినిమాలో 'జేజమ్మా ...... జేజేమ్మా........' మొదలైన పాటలు సి.నా.రె నాటిన పాటల పూదోటకు కొత్త అందాలను తెచ్చిపెట్టాయి. ప్రేమించుు చిత్రంలో 'కంటేనే అమ్మ అని అంటే ఎలా' , సీతయ్యు సినిమాలో 'ఇదిగో రాయలసీమ గడ్డ, దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ' పాటలు సి.నా.రె గారికి నంది అవార్డులను అందించాయి.
ఎంత పెద్ద దర్శకుడైనా, ఎంత గొప్ప స్వరకర్త కైనా, స్టార్ హీరోల సినిమాలైనా వారి స్థాయికి మించిన సాహిత్యాన్ని అందించి తన పాటలతో ఆ సినిమాను సమున్నత స్థానంలో నిలబెట్ట గలిగిన సాహితీవేత్త మన సి.నా.రె.
మనిషి-చిలక, దృక్పథం, కలం సాక్షిగా, భూగోలమంత మనిషి, రెక్కల సంతకాలు, నా చూపు రేపటి వైపు, నింగికెగిసిన చెట్లు మొదలైన వందకు పైగా పుస్తకాలు, మూడు వేలకు పైగా పాటలు రాసి తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర వేశారు సి.నా.రె గారు. అధికార భాషా సంఘ అధ్యక్ష్యుడిగా, తెలుగు వర్శిటీ వైస్ ఛాన్సులర్ గా, ఆంధ్ర సారస్వతీ పరిషత్ అధ్యక్షుడిగా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు సి.నా.రె . ప్రత్యక్ష రాజకీయాలవైపు ఎంతమాత్రమూ ఆసక్తి చూపని ఆయన 1997 లో రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
తెలుగు సాహితీ మాగాణిలో బంగారు పంటలు పండించి, సినీ పూదోటకు పరిమళాలు అద్దారు సి.నా.రె గారు. తెలుగు భాష ఉన్నంతవరకూ, తెలుగు పాట బ్రతికినంత వరకూ సి.నా.రె గారి ఖ్యాతి వెలుగుతూనే ఉంటుంది. మరెందరో యువ సాహితీ కారులకు ప్రేరణగా నిలుస్తుంది.
- పేట యుగంధర్. (9492571731).