Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దాశరథీ! కవితా శర థీ!
వరంగల్ జిల్లా చిన్నగూడూరు గ్రామం నీ జననం,
ఖమ్మం జిల్లా మధిరలో నీ బాల్యాన్ని,
ఆటపాటలతో ఆస్వాదించి,
సంస్కృత, ఆంగ్ల, ఉర్దూ భాషల్లో పాండిత్యాన్ని గడించి,
పసిప్రాయంలోనే పద్యాలను అల్లి,
కవన లోకంలో మకుటంలేని మహారాజుగా కవితా సంపుటాలను రాసి,
అగ్నిధారల లో, నిజాం రాజుల నిరంకుశ పరిపాలనను కాల్చి,బూడిద చేసి,
మహాంధ్రోదయం తో రుద్రవీణ మీటి,
ఆలోచనాలోచనాలతో, ధ్వజమెత్తిన ప్రజ తో,
మార్పు నా తీర్పు అని ప్రకటించి, నేత్రపర్వంగా కవితాపుష్పకం తో,
తిమిరంతో సమరం చేసి,
పునర్నవ, గాలిబ్ గీతాలను ఆలపించి.. అంతా నేనే, అన్నీ నేనే అని..
ఆ చల్లని సముద్ర గర్భంలో
దాచిన బడబానలమెంతో..
అని, కానరాని భాస్కరులను,
పసిపాపల భవితవ్యాలను,
ప్రశ్నార్ధక జీవితాలను,
గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలను రాసిన కవి సింహమా,
ఆంధ్రకవితా సారథీ,
అభ్యుదయ కవితా చక్రవర్తి గా,
తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి,
నిజాం రాజుల నిరంకుశ పాలన తీగలను తెంపి,
అగ్నిలో దింపి," నా తెలంగాణ కోటి రతనాల వీణ"అని చాటి చెప్పి,
ఎన్నో, ఎన్నెన్నో,
మధుర సినీ గీతాలను రచించి,
ప్రజలందరినీ ఆనందడోలికలలో ఊయల లూగించి,
నా కంటిపాపలో నిదురపోరా,,
అని జోల పాటలతో..
నిదురపుచ్చిన..
గేయ చక్రవర్తీ,
దాశరథీ. కవి సింహమా..
అందుకోండి అక్షర కుసుమాంజలుల నివాళులు
- తిరునగరి పద్మ
తెలుగు పండిట్
హన్మకొండ, వరంగల్ అర్బన్