Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ గడ్డ ,హనుమాజిపేట లొ
మల్లారెడ్డి, బుచ్చమ్మ అను
పుణ్య దంపతుల పెరటిలొ పూసిన
పద్మశ్రీ సి.నా.రె...!
అమ్మ తలపు అనురాగపు మాధుర్యాన్ని
ఆకాశపు మబ్బులతో ఆవిష్కరించిన
సాహిత్య శిరోమణి సి.నా.రె...!
అజంతా పదాల జలపాతపు విశ్వగీతిలొ
నవ్వే పువ్వులే ఆయన రచనలన్ని...!
ప్రపంచ పదులను పల్లవించి
పవలించు మానవాళిని
మేల్కొలిపిన మేధావి సి.నా.రె...!
వరుస మారిన వందేమాతర గీతపు
తలరాతను వీక్షించిన ద్రష్ట మన సి.నా.రె..!
మనసు ముడుతలల్లొ యవ్వనం
పొంగుతుంటే,
కవితా రణరంగానికి సెలవెక్కడిది అంటూ
శృతికే మతిపోయె కృతి సల్పిన
కవి కిరణం సి.నా.రె....!
వెన్నెల దొరసానిని పదబంగిమలతొ
చిందులు వేయించిన దొర మన సి.నా.రె..!
విశ్వమానవ కవితా జగత్తులో
కలమనే హలము పట్టి
సాహిత్య పూదోటను సాగుచేసిన
కవితా దురంధరుడు మన సి.నా.రె...!
పద్య,గద్య-వచన,గేయ
చిత్రగీత,యాత్రా కథ ఒకటేమిటి
ఆయన రచనా శైలి నైపుణ్యత,
ముక్తక,నృత్య రూపక-సంగీత సాహిత్య
రసికులకు విందు నందించిన
విశ్వంభరుడు మన సి.నా.రె.....!
అంతర్జాతీయ కవిసమ్మేళనపు
భారతీయ ప్రతినిధి
బహుభాషా కోవిదుడు, పద్మభూషణుడు
పద సంపద నిధి మన సి.నా.రె...!
తన గజల్స్ తో వాగ్దేవి చరణ కింకణులు
గల్లు గల్లు మనిపించిన కవితా చక్రవర్తి
సి.నా.రె...!
విప్లవ జ్వాలల వేడిని రంగరించిన
అభ్యుదయ శిల్పి మన సి.నా.రె...!
అ"ద్వితీయ "జ్ఞానపీఠాన్ని అధిరోహించిన
సాహిత్యపు కవి చంద్రుడు సి.నా.రె....!
పురస్కారాలకే శోభనద్దిన
సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారికి
ఇవే నా అక్షర సుమాంజలులు....!