Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషి అచ్చమైన ఆశాజీవి
ఇనుని కంటె ఉజ్వలం అతని భావి
సామాన్య మానవుడే
ఈనాటి మనువు
మార్క్సిజం సమాజం ధనిక దరిద్ర, పేద పీడిత వర్గాలుగా విభజింపబడి ఉన్నట్లు గుర్తించింది. మరోరకంగా సమాజంలో మూడు తరగతుల ప్రజలున్నారని కూడా మార్క్సిజం పేర్కొంది. 1) పై తరగతి 2) మధ్య తరగతి, 3) కింది తరగతి. ఈ రకాల వర్గీకరణకు ఆర్థిక స్థితి ప్రమాణం. ఈ ఆర్థిక స్థితి వర్గాల, తరగతుల స్వభావాలను, ఆచరణలను నిర్ణయిస్తుంది. భారతీయ సమాజంలో పై తరగతి జనాభా చాలా పరిమితం. ఇటీవల భారతదేశంలో కోటీశ్వరుల సంఖ్య పెరిగినా అది అత్యల్పమే. మధ్య తరగతి జనాభా దానికన్నా ఎక్కువ మంది. అలాగే కింది తరగతి కూడ, మధ్య తరగతి ఒకవైపు పై తరగతిని అందుకోవాలని ప్రయత్నిస్తూనే, కింది తరగతిని పైకి రానీకుండా తొక్కే ప్రయత్నం చేస్తుంది. అవసరాన్ని బట్టి పురోగమన పాత్రగానీ, తిరోగమన పాత్రగానీ నిర్వహిస్తుంది. నూరేళ్లక్రితం రష్యాలో బోల్షెవిక్ విప్లవంలో మధ్యతరగతి విప్లవాత్మకంగా ప్రవర్తించింది. అయితే కొన్ని సమయాలలో అలా ఉండదు. భారతదేశ స్వాతంత్య్రోద్యమంలో కూడా మధ్యతరగతి ప్రజలు క్రియాశీలపాత్ర నిర్వహించారు. అదే సమయంలో స్వాతంత్య్ర ఫలాలు కింది తరగతి ప్రజలకు దక్కకుండా కూడా జాగ్రత్త పడ్డారు. ఈ మధ్యతరగతి జీవితాన్ని అభ్యుదయ సాహిత్యం వాస్తవికంగా చిత్రించింది.
డా|| సి.నారాయణరెడ్డి గారు మధ్యతరగతిలో పుట్టిన కవి. ఆయనకు ఆ తరగతి స్వభావం బాగా తెలుసు. ''మధ్య తరగతి మందహాసం'' కావ్యంలో ఆ తరగతి స్వభావాన్ని ఆయన కవితాత్మకంగా ఆవిష్కరించారు. ఈ కావ్యం 1968లో వచ్చింది. దీనిలో సినారె 1965-68 మధ్య నాలుగేళ్లలో రాసిన కవితలున్నాయి. 1965 ద్వితీయార్ధానికి నెహ్రూశకం ముగిసింది. లాల్‌బహదూర్ శాస్త్రి శకం ముగిసింది. శ్రీమతి ఇందిరాగాంధి శకం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజంలో చీలిక వచ్చింది. అందులో భాగంగా భారతదేశంలో కూడా చీలింది. ఒకకొత్త సంపన్న వర్గం దేశంలో ఉత్పన్నమైంది. తెలుగులో అభ్యుదయ సాహిత్యం సంక్షోభానికి గురై పునరుజ్జీవనం పొందుతున్నది. దిగంబర కవిత్వం దూసుకు వచ్చింది. 1967 మే 25న పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్ జిల్లా నక్సల్బరీ గ్రామంలో పురుడుపోసుకొన్న విప్లవోద్యమం ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం జిల్లాను తాకింది. భారతదేశ స్వాతంత్య్రం మీద సంస్కరణ వాద అభ్యుదయ రచయితలు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలోంచి ''మధ్యతరగతి మందహాసం'' కావ్యం వచ్చింది.
''కడివెడన్ని కలల్ని తాగేసి
కడుపునింపడం నేర్చుకున్నాను
నవ్వుతున్న జీవచ్ఛవానికి
రవ్వలహారంలా వున్నాను
మధ్యతరగతి మనస్తత్వానికి
మాయని గాయంలా వున్నాను''
అని సినారె మధ్యతరగతి రూపాన్ని ఆవిష్కరించారు. మధ్య తరగతి ఊహలు ఎక్కువ. ఊహకు వాస్తవానికి మధ్య పొంతన ఉండదు. ఈ వైరుధ్యంలో చిక్కుకొని మధ్యతరగతి ఏడవలేక నవ్వుతుంది. అందుకే కవి 'జీవచ్ఛవం' అని మధ్య తరగతిని నిర్వచించారు. స్తబ్ధంగా పడిఉన్న మధ్యతరగతిని తట్టిలేపడం అభ్యుదయ కవి కర్తవ్యం. స్తబ్దతను చలనంగా మార్చడమే అభ్యుదయ కవి చేసే పని. అందుకే సినారె 'మధ్యపురుష' కవితలో ఇలా అన్నారు.
చీకట్లను శపించడం కట్టిపెట్టి
చిరుదివ్వె వెలిగించడం మంచిది
లోకాన్ని వెక్కిరించడం చాలించి
లోచూపు ఆవిష్కరించడం మంచిది
ఆత్యోత్కర్ష, పరనింద మధ్యతరగతి మనస్తత్వం, దీనిని కవి నిరసిస్తూ ఆ తరగతికి కర్తవ్యాన్ని బోధించాడు. స్తబ్ధంగా ఉన్న మధ్య తరగతిని చలనం రూపం తీసుకోమన్నాడు.
గోళ్లుగిల్లుతూ కూచోవడం మానేసి
కూలంకషంగా ప్రవహించడం నేర్చుకో
నేలమీద పరచుకోవడం ఆపేసి
నిటారుగా పెరగడం నేర్చుకో
''దీపం ముట్టిస్తున్నావా పాపా'' అనే కవితలో కూడా సినారె 1965ల నాటికి స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తికి దూరమైపోయి, చైతన్య రహితమై పోయిన మధ్యతరగతిని మధ్యతరగతి గొంతుతోనే ఇలా గిల్లారు.
మంచిని వెలిగించలేని భీరువులం మేము
మయసభలో జారిపడ్డ కౌరవులం మేము
గాజుపెంకుల్లా వెలుగుతున్న కళ్ళు మావి
కాకి బంగారంలా మెరుస్తున్న వాకిళ్ళు మావి
మధ్యతరగతి మనస్తత్వంలోని కృత్రిమతను, ఊగిసలాటను ఈ కవిత ప్రతిబింబించింది.
మధ్యతరగతికి కావలసిన ఉత్పత్తులన్నీ కింది తరగతి సమకూర్చిపెట్టాలి. పై తరగతి గాని, మధ్య తరగతి గాని కింది తరగతి శ్రమ మీదనే ఆధారపడి బతుకుతాయి. ఆ వర్గాల ప్రజలకు అన్నీ సమకూర్చిపెట్టే కింది తరగతికి మాత్రం దక్కవలసిన ఫలితం దక్కదు. ఇది పరాయీకరణ. ఈ పరాయీకరణను సినారె ''సన్నజాజీ పూలమాలా'' అనే కవితలో పూలమ్మే ఒక పేద ముస్లిం పిల్లవాని జీవిత రూపంలో చిత్రించారు. సాయంకాలమైతే జరుగుబాటున్నవాళ్ల విలాసానికి పూలు కావాలి. అవి పేదలు సమకూర్చాలి. పూలు ముడుచుకున్న తరగతి ఆనందంలో మునిగిపోయింది. పూలు అమ్మిన చిల్లరతో సాయెబు కుర్రాడు ఇంటికి పరుగెత్తిపోయే సరికి తల్లి కన్నుమూసి ఉంటుంది. ఈ దృశ్యాన్ని సినారె ఆర్ధ్రంగా ఆవిష్కరించారు.
ఇవాళ మాధ్యమాల్లో చూస్తున్నాం మనం. ఒక అనారోగ్యకర యువత నిరంతరం పనికిమాలిన ఆటలతో పాటలతో అనుత్పాదక కాలహరణాత్మక కార్యక్రమాలతో జుగుప్సావహమైన విలాసాలతో కాలక్షేపం చేస్తున్నది. పాపప్రక్షాళన కోసం అన్నట్లు ఒక రోగినో, ఒక పేదనో చూపించి ఆర్థిక సహాయం చేయిస్తుంది. దేశ పునర్నిర్మాణానికి ఏమాత్రం ఉపయోగపడని నికృష్ట కార్యక్రమాలతో మధ్యతరగతిని మత్తులో ముంచుతున్నది. 'ఎక్కడికి పోతున్నాం మనం?' అని ప్రశ్నించుకోవలసిన సమయం వచ్చింది. సినారె ఈ ప్రశ్నలే ఎప్పుడో వేశారు. దిగంబర దశ నుంచి బట్టలు ధరించే దశకు చేరుకున్నాం మనం. మళ్లీ దిగంబర దశకు చేరుకుంటున్నామా అనిపిస్తున్నది నేటి సాంస్క ృతిక రంగాన్ని చూస్తుంటే.
కోతియుగం నుంచి రాతియుగంలోకి దూకి
రాతియుగంలోంచి రాకెటు యుగంలోకి ఎగబ్రాకి
మళ్ళీ వెనక్కి నడుస్తున్నామా?
అన్నది కవి ప్రశ్న 'ఎక్కడికి పోతున్నాం మనం' అనే కవితలో సినారె చేసిన ప్రబోధం ఉగాది సందర్భంగా
ప్రమాణం చేయాలి ఇందరం
పశుత్వానికి గోరీ కడదామని
స్వాతంత్రానంతర భారతీయ రాజకీయ రంగం క్రమక్రమంగా స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తికి దూరమై అప్రజాస్వామిక అరాచక శక్తులతో నిండిపోయింది. 1965 నాటికి ఒక నయా సంపన్న వర్గం ఉద్భవించి పెట్టుబడి, ధనికవాద రాజకీయాలకు తెరలేపింది. సామాజిక విలువలకు, మానవీయ విలువలకు తిలోదకాలిచ్చింది. రాజకీయం పెట్టుబడి, లాభాల రంగమై పోయింది. ఈ దుష్పరి ణామాన్ని 1965 నాటికే గుర్తించారు అభ్యుదయకవి సినారె. భౌతిక వాది అయిన అభ్యుదయవాది, అనివార్యంగా తనకు నమ్మకంలేని భగవానుని సంబోధిస్తూ 'హేభగవాన్' కవితరాశాడు. రెండు ఖండికల్ని పరిశీలిస్తే సినారె ఆ కవితను 2017లో రాసినట్లు అనిపిస్తుంది.
ఓట్లకోసం సీట్లకోసం
కోట్లపచ్చ కాగితాలతో నిన్ను
అహరహం అభిషేకిస్తున్న వాళ్ళు..
బియ్యంతో వియ్యమందే పలుగురాళ్ళు
పాలతో తాదాత్మ్యం చెందే పంపునీళ్ళు
పట్టపగలే గుచ్చుకుంటున్న చీకటి ముళ్ళు
పాలకవర్గాలలో పరిమళిస్తున్న కుళ్ళు
అన్నీ నీ లీలలేనా దేవా!
అవినీతిపై ప్రయోగం చేస్తున్నావా?
ఇదే సమయంలో ఈ దుర్మార్గాలను ప్రతిఘటించే చైతన్యం పెల్లుబికి రావడం కూడా కవి గుర్తించారు. గుర్తించి హెచ్చరించారు.
చెరబడ్డ దినకరబింబం
తెరలు చీల్చి వస్తున్నది
రెచ్చితిన్న కంఠీరవం
..... వేస్తున్నది
దేవుళ్ళారా జాగ్రత్త
రాజకీయ రంగంలో పార్టీ ఫిరాయింపులు ఇవాళ ప్రజాస్వామ్యం తలదించుకునే దశకు చేరుకున్నాయి. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో మనుగడ సాగించే దుర్మార్గం పట్టపగలే సాగిపోతున్నది. నీతినిజాయితీలను గురించి ఎక్కువ మాట్లాడటం, దానికి విరుద్ధంగా రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహించడం నిత్యకృత్యమైపోయింది. సినారె ఈ అవకాశవాద దుర్మార్గాన్ని ''సంక్రాంతి లేఖ'' కవితలో అధిక్షేపించారు.
సంక్రాంతి అంటే ఏమిటి?
సహస్రకిరణుని రాశి మార్పు
రాజకీయరంగ మార్తాండులు మాత్రం
రోజురోజూ రాశులే కాదు
రంగులూ మారుస్తున్నారు
వీళ్ళది నిత్యసంక్రమణం
గాలిని బట్టి వీలును బట్టి
లీలగా జరపే శాఖా చంక్రమణం
ఈ కవిత చదివినప్పుడు కూడా కవి 2017లో శాసనసభల ముందు నిలబడి పార్టీ ఫిరాయింపుల మీద వ్యాఖ్యానిస్తున్నట్లనిపిస్తుంది.
స్వాతంత్య్ర ప్రకటన మొదలు నేటిదాకా సమాజంలో హింస అంతర్భాగమై పోయింది. కులహింస, మతహింస, లైంగికహింస, ఆర్థిక హింస, అధికార హింస, అనధికార హింస. హింసకు వేయి రూపాలు. గౌతమబుద్ధుడు పుట్టిన దేశంలో హింస అధికారిక విధానం కావడం పెద్ద వైరుధ్యం. ప్రజాస్వామ్యానికి పెద్దమచ్చ. దేశంలో పెచ్చరిల్లుతున్న హింస. హింస వ్యవస్థీకృతమైన సమాజానికి మనుగడ ఉండదు. సినారె 1966లోనే యాభై ఏళ్ళ క్రితమే మన సమాజంలో మితిమీరుతున్న హింసా ప్రవృత్తిని అభ్యుదయకవిగా ''వింత అందంగా ఉంది జీవితం'' అనే కవితలో విమర్శకు పెట్టారు.
ధేనుహత్య నిషేధించాలనీ అహింసావ్రతులు
మానవహత్యకు పొగరేపుతుంటే
లోకాన్నే సన్యసించిన సాధుపుంగవులు
లోకసభ గోడల కెగబ్రాకుతుంటే
ఎంతహాయిగా నిదరపోయింది చట్టం!
ఈనాటికీ తాజాగా ఉంది ఈ కవిత. హింసను మజాగా భావించే వాళ్ళకు ఈ కవిత మొట్టికాయవంటిది. మనుషుల మధ్య గోడలు కట్టిన వర్గం పశువుల మధ్యకూడా కట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్న దశలో మనమున్నది. ఈ వికృతిని క్రాంతిదర్శి అయిన అభ్యుదయ కవి ఎన్నడు గుర్తించాడు.
అభ్యుదయ కవి నిరంతర ప్రతిపక్ష కవి. అంతమాత్రాన నిరాశావాది కాదు. అభ్యుదయకవి అసంతృప్తి సామాజిక మైనది. స్వతంత్రం వచ్చిన రెండు దశాబ్దాలకు, గాంధీ శతజయంతి సందర్భంగా సినారె
వద్దు బాపూ వద్దు
నీవిచ్చిన మామిడిపండు
మేడిపండుగా మారొద్దు
అని మొరపెట్టుకున్నారు. ''జ్యోతి వెలగాలి'' కవితలో అలాగే ''స్వాతంత్య్రం పుట్టినరోజు'' కవితలో కూడా.
ఎక్కడున్నావు గొంగడీ అంటే
అక్కడే వున్నానంటే సరిపోదు
తాబేళ్ళలా నడిచే పంచవర్ష ప్రణాళికలు
సెలయేళ్ళలా పరుగులు తీయాలి
ఎవరికందకుండా ఊగే నదీమాలికలు
చవిటిపర్రల మెళ్ళో వేయాలి
అని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో జరగవలసినంత అభివృద్ధి జరగకపోవడం పట్ల రాజకీయ దృష్టిగల కవి, సమాజ క్షేమం కోరే కవి అసంతృప్తి వ్యక్తం చేయడమే.
ఈ మధ్య మనదేశంలోని మతోన్మాదులు రచయితల్ని కళాకారుల్ని మేధావుల్ని తమ ఉన్మాదాన్ని సహించని వాళ్ళను మొరటుగా అప్రజాస్వామికంగా చంపేయడం, అవమానించడం, నోరుమూయించడం చూశాం. ఆ సంఘటనలు మనదేశంలో భావస్వేచ్చ ఉందా అనే అనుమానం కలిగించాయి. సినారె 1966లోనే 'అభినవం' కవితలో
వాక్కును నిలిపివేసే ఉక్కు చట్టాలు ఊడనీ
బక్కుల్లాంటి అక్షరాత్మలు రెక్కలెత్తి ఆడనీ
అని భావస్వేచ్ఛాపహరణాన్ని తిరస్కరించారు. నేటి పాలకులు యాభై ఏళ్ళ నాటి కవి పలుకులను గౌరవించాలి ప్రజాస్వామ్యం మీద నమ్మకముంటే.
' మధ్యతరగతి మందహాసం' కావ్యం వచ్చి అర్ధశతాబ్ది గడచిపోయినా అందులో కవి చిత్రించిన సామాజికాంశాలు, వాటిమీద కవి చేసిన వ్యాఖ్యలూ నేటికీ ప్రాసంగికత కలిగున్నాయి. మధ్యతరగతి ఇవాళ ఇంకా బాగా బలిసింది. దానిమనస్తత్వమూ ముదిరింది. అప్పటి రాజకీయాలే మరింత అప్రజాస్వామికంగా రూపొందాయి ఇవాళ. అప్పటికి మసక మసకగా ఉన్న అవినీతి ఇవాళ నిస్సిగ్గుగా రాజ్యమేలుతున్నది. మహావ్యక్తుల జయంతులకూ వర్ధంతులకూ ఏలినవాళ్ళ ప్రగల్భాలు కోటలు దాటుతున్నాయి. ఆ మరునిమిషమే అవి అదృశ్యమైపోతున్నాయి. ఈ వైరుధ్యాన్ని ఎత్తిచూపే సినారె కావ్యం అందుకే ఇంకా తాజాగా ఉంది.
చచ్చిన గతానికి గోరీకట్టు
వచ్చిన భవితవ్యానికి గోపురం నిలబెట్టు
- రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి