Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సి. నారాయణరెడ్డి కవిత్వమే ఊపిరిగా బతికినవాడు. పుట్టిన గడ్డకు సాహితీ పరిమళాలు అందించినవాడు. శ్రీనాధునిలాగే రాజాశ్రయాలు సంపాదించి రాజ్యానికి లోబడకుండా వ్యక్తిత్వాన్ని నిలుపుకొన్నవాడు. మౌఖిక సమాజంలో పుట్టి లిఖిత సంపదను సష్టించి, ఒక కవితా సర్వస్వాన్ని సజియించాడు. మాటలో, పాటలో, వర్తనలో ఒక క్రమాన్ని రూపొందించుకొని 85 ఏళ్ళు జీవించాడు. స్నేహం, అనునయం, అభినందన జీవన వర్తనలుగా చేసుకొని అసంఖ్యాక శిష్య ప్రపంచాన్ని సష్టించుకొన్నాడు. ఆయన నియంతత్వానికి వ్యతిరేకి. తన రచనలో అలెగ్జాండర్ ఆత్మవేదన పలికించిన తీరే అందుకు ఉదాహరణ. 'ఏమిటి! సాధించిందేమిటి! నర రుధిరంలో ఎరుపెక్కిన చీకటి? ఈ చీకటి వెలుగౌతుందా! ఈ హింస గెలుపౌతుందా! మగతను నూరిపోసే లోభం మనసుకి మేలుకొలుపవుతుందా! కుత్తుకలను నరికితే కాదు, గుండెలను కలిపితే గెలుపు. వినాశం జరిగితే కాదు, వివేకం పెరిగితే గెలుపు. సమరం రగిలించేది భీతి, సహనం వర్షించేది ప్రీతి.. అనురాగం చేసే శాసనమే అసలైన రాజనీతి!'
సినారె హింసకు వ్యతిరేకి. యుద్ధంలో భయం దాగుందని చెప్పాడు. గుండెలను కదపటమే గెలుపన్నాడు. అలతి అలతి పదాల్లోనే మానవ ధర్మాన్ని వివేచించాడు. ఆయన పెద్ద వివేచనాపరుడు. తనలో ఎక్కడ అహంకారం వస్తుందోనని తనను తాను ప్రశ్నించుకుంటాడు. జిజ్ఞాసను పెంచుకుంటాడు. ఆలోచనలను విస్తరింపచేసుకుంటాడు. మనుషులను పరిశీలించి మానవత్వాన్ని పరిమళింపచేస్తాడు. అనేక పాత్రల నుంచి కూడా ఆయన పలికాడు. సోక్రటీస్ చేత ఇలా అనిపించాడు : 'నాకు తెలిసిందొక్కటే నాకేమీ తెలియదని. విత్తు నాటకుండానే వక్షం మొలవదని, చెడూ మంచీ తెలిస్తే చెడుకు మంచి లొంగదని, అడుసు ఉనికి తెలిస్తేనే అడుగు నేలపై పడుతుందని, చదును చేసిన మనస్సులోనే పదునెక్కుతుంది జిజ్ఞాస, మునిమాపులో ఏనాడూ కనిపించదు ప్రత్యూష, ఆత్మాహుతిలోనే సత్యం అమ తంగా నిలుస్తుంది. తాను జ్వలిస్తే దీపం తన చుట్టూ వెలిగిస్తుంది. ఆలోచనల పొద్దుపొడుపును ఆపలేవు ఏ చీకట్లు, వెలిజిమ్మే ఆత్మకిరణాలను నిలుపలేవు ఏ గొలుసుకట్లు'.
నారాయణరెడ్డి వివేచనాపరుడు. మనోవిజ్ఞానం ఆయనకు మెండు. ఒక పాత్ర గురించి రాసేటప్పుడు తనకు తాను ఆ పాత్రలోకి ప్రవేశిస్తారు. అందుకే ఆయన కవిత్వంలో చిక్కదనం ఎంతో విస్త తీ అంతే!
సినారె కవే కాదు. కవితా విమర్శకుడు. తన ఆధునికాంధ్ర కవిత్వం సాంప్రదాయాలు, ప్రయోగాలు అనే తన పిహెచ్డి గ్రంథంలో కవిత్వాన్ని గురించి లోతులకు వెళ్ళారు. వర్డ్స్‌వర్త్, షెల్లీ, ఆర్నాల్డ్, కాల్రిడ్జ్ వంటివారు కవులే కాక సాహితీ విమర్శకులు కూడా! ఆ కోవలోనివారే నారాయణరెడ్డి. కవిత్వం ఎంత బలంగా రాశారో కవితా విమర్శ కూడా అంతే చేశారు. సినారె కవిత్వంలో బుద్ధిని మేల్కొలిపే అర్ధగంభీరమైన కవిత్వాన్ని రాయడం అలవాటు చేసుకున్నాడు. నిజానికి ఆయన సాహిత్యానుశీలం నుంచి తన సాహిత్యాన్ని పరిపుష్టం చేసుకున్నాడు. సాహిత్యానికి సామాజిక దక్పథం ఉండాలి, సాంస్క తిక పుష్టి ఉండాలి. రమణీయత ఉండాలి, సంక్షిప్తత ఉండాలి. అప్పుడే కవిత్వం ప్రజల హ దయాల్లోకి చొచ్చుకుపోతుంది. పాఠకుల్లో చైతన్యం తీసుకొస్తుంది. అందుకే సినారె కవిత్వంలో ఒక మానవతా స్పర్శ, ఒక విజ్ఞత, ప్రాజ్ఞత గోచరిస్తాయి. ఆయన ఏ ప్రక్రియ తీసుకున్నా ఈ మార్గాన్నే అనుసరించాడు. గజళ్ళను తెలుగిళ్లకు పరిచయం చేస్తూ కూడా ఈ ఒరవడినే అనుసరించారు. సినారె మనిషిని చిత్రించడంలో, మనిషి భావాల్ని చిత్రించడంలో, మనిషిలో వున్న భావోద్వేగాలను చిత్రించడంలో, మనిషిలో వున్న ఘర్షణలను చిత్రించడంలో ఆరితేరినవాడు. మనిషిలో ఉన్న ఏ భావావేశాన్ని ఆయన దాచలేదు. పరిమితుల్లో చెప్పారు. ఆయన మీద కబీరు ప్రభావం బలంగా ఉంది. కబీరు తాను చెప్పదలచుకున్నది శ తిబద్ధంగా చెప్తాడు, సూత్రబద్ధంగా చెప్తాడు, సూక్ష్మంగా చెప్తాడు, గుండెల్లో నాటుకునేలా చెప్తాడు. అందుకే ఆయన ప్రపంచ కవి కాగలిగాడు. కబీరులో ఉన్న భావోజ్వల దీప్తి మనకి సినారెలో కనిపిస్తుంది. కబీరు ఇలా అంటారు ''సాతో సబద్ జహా బాజతే, హౌత్ ఛతీసో రాగ్ తే మందిర్ ఖాలీ పడే, బై సణ లాగే కాగ్'' (ఒకప్పుడు సప్తస్వరాల నాదాలతో, రాగ రాగిణుల నర్తనలతో అలరారిన రాజ ప్రాసాదం ప్రస్తుతం ఖాళీగా బోసిపోతున్నది. ఆనాటి వైభవం ఏమైంది? ఆ భవనంపై కాకులు నివసిస్తున్నాయి. లోకంలోని అన్ని వస్తువులూ అశాశ్వతమైనవే. నశించేవే అంటున్నాడు కబీర్) ''జల్ మే కుంభ కుంభ మే జల్ హై, బాహర్ భీతర్ పానీ ఫ్యూట్యో కుంభ జల జలహి సమానా, యహ తత్ కథ్యోగియానీ'' (జలంతో నిండిన కడవ నదీ నీళ్ళలో ఉంటుంది. శరీరమనే ఆవరణ లోపల ఆత్మ దాగి ఉంది. కడవ పగిలి చిట్లిపోగా కుండ లోపలి నీళ్ళు బయటి నదీ జలంలో మిళితమవుతాయి. అవి నది నీళ్ళలో ఏకాకతి చెందినట్లు - శరీర కవచం తొలగిపోగానే ఆత్మ మళ్ళీ పరబ్రహ్మలో విలీనమవుతుంది. దర్శనశాస్త్ర నిగూఢ సిద్ధాంతాన్ని ఇంత సరళంగా అభివ్యక్తం చేయడం కబీర్ భాషలోని విలక్షణత.)
గజల్ గురించి సినారె ఇలా చెప్పారు: 'ఉర్దూభాషలో గజల్ ఒక కమనీయ కవితాలహరి.' ఒక గులాబీల గుచ్ఛం, ఒక మత్తకోకిల రసాత్తకూజితం, సరసభావన, చమత్కార ఖేలన, ఇంపూ, కుదింపూ గజల్ జీవగుణాలు. అది జోల పాడుతుంది - జ్వాల రేపుతుంది. గజల్లో ఒకే విషయాన్ని చెప్పాలన్న నిర్బంధం లేదు. భావం ఏ చరణానికి ఆ చరణం విడిగా ఉండొచ్చు. గజల్ పల్లవిని 'మత్లా' అంటారు. చివరి చరణాన్ని 'మక్తా' అంటారు. పల్లవి చివర ఉన్న పదం, ప్రతి చరణం చివర అంత్యప్రాసను రూపొందిస్తుంది. కొన్నిట్లో అంత్యప్రాసకు ముందు మరో ప్రాసపదం ఉంటుంది. వీటిని రదీఫ్ ఖాపియాలంటారు. చివరి చరణంలో కవి నామముద్ర ఉంటుంది. దీనిని 'తఖల్లుస్' అంటారు. నా తఖల్లుస్ 'సినారె'. గజలంటే అనేకార్థాలుగా స్థూలంగా 'ప్రియురాలితో సల్లాపం' ప్రాయికంగా ఇది శ ంగారపరం. కొన్నిటిలో తాత్విక స్పర్శలూ ఉంటాయి. కానీ నా గజళ్లలో ప్రణయానికి బదులు మానవీయ దక్పథాన్నీ, ప్రగతి శీలాన్నీ, మెత్తని అధిక్షేపాన్నీ ప్రవేశపెట్టాను. పదం నాదంగా, భావం రాగంగా, అనుభూతి స్వరరీతిగా గుండెతో నేను పలికించినవి గజళ్లు.' సినారె తన కవిత్వం గురించి ఇతరుల కంటే బాగా చెప్పారు. కారణం తెలుగులో కవితా విమర్శ రావాల్సినంత బలంగా రాలేదు.
1995లో సినారె ఒకసారి లంచ్‌కి పిలిచారు. ముచ్చట్లతో కాలక్షేపం చేయటం ఎందుకని ఆయన జీవిత గమనాన్ని గురించి అడిగాను. ఇలా చెప్పారు : 'నేను టైమ్‌టేబుల్ నిక్కచ్చిగా పాటిస్తాను. మార్నింగ్ వాక్ చేయటం, డైలీ పేపర్లన్నీ చదవడం, ఆఫీసుకు వెళ్ళడం, లంచ్‌కి రావడం, కొంత విశ్రాంతి. మళ్ళీ ఆవిష్కరించే పుస్తకం చదివి సభలకు వెళ్ళడం, నాకిష్టమైన పుస్తకాలు చదువుకోవడం, పీఠికలు రాయడం, ఏదైనా కవిత నచ్చితే ఆ కవికి ఫోన్ చేసి అభినందించటం... ఇలా రోజంతా సాహిత్యాత్మకంగానే సాగిపోతుందని' చెప్పారు. ఆయనకు కులతత్వం లేదు. ఏ కవికైనా తమ సామాజిక వర్గాలవారు అంకితం తీసుకోవడం ద్వారా, గ్రంథాలు ముద్రించటం ద్వారా సహాయ పడుతూనే ఉంటారు. అది మామూలు పద్ధతుల్లోనే కొనసాగింది కాని పనిగట్టుకొని కాదు అని ఆయన ఉద్దేశం. నేను ఆయన కవిత మీద విమర్శ పెడితే 'కొన్ని కవితలు పేలిపోతాయి. కొన్ని కవితలు తూలుతాయి. కొన్ని కవితలు జ్వలిస్తాయి' అని చమత్కారంగా అంటారు. విమర్శను స్వీకరిస్తారు కాని, దానిని అధిగమించాలని చూస్తారు. చిన్నప్పుడు దళితవాడల్లో వారు పాడే పాటల్లో బాణీలు ఏరుకొనేవాణ్ణని, తన పాటల్లోని శ్రుతి అక్కడిదేనని చెప్పారు. 'మీరు ఎందరినో అణగదొక్కి పైకి వచ్చారని అనుకొంటారు'. అంటే - 'అదేమి లేదు. నాలో పోటీతత్వం ఉంది. కానీ నా నిరంతర క షి, పట్టుదల, కార్యాచరణే నా ఎదుగుదలకు మూలసూత్రం' అన్నారు. కొన్ని విషయాల్లో ఆయనకు నాకు భేదాలు ఉన్నా మా స్నేహం ఆయన మరణించేవరకూ సాగింది. మూడు నాలుగు రోజులకు కవితొకటి రాయటం ఆయనకు అలవాటు. కవిత ఏదో పత్రికకు పంపడం, అచ్చులో చూడటం ఆయనకు ఇష్టం. హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు సాహిత్యాలు బాగా చదువుతారు. ఆయన విశ్వంభర కూడా జయశంకర్ ప్రసాద్ గారి హిందీ కావ్యం కామయాని కావ్య స్ఫూర్తితో రాసిందే. హిందీ, ఉర్దూ కవిత్వాన్ని మూలరూపాలే ఆయన ఎక్కువ చదువుతారు. వాటిని తెలుగులోకి తెచ్చేటప్పుడు స్వీయ గంధాన్ని అద్ది పరిమళింపచేస్తారు. సినారె సినిమా పాటలపె కష్ణశాస్త్రి, శ్రీశ్రీ, మల్లాది, దాశరధి ప్రభావం బలంగా ఉంది. శ్రీశ్రీని ఆయన కొత్త గొంతులో పలికారు. ఆయన అభ్యుదయ కవిత్వం నిండా శ్రీశ్రీ నిండివున్నాడు. లయ, శ్రుతి, పదబంధాలు, గమనం, గమకం శ్రీశ్రీ నుంచే తీసుకున్నారు. 'కారంచేడు, చుండూరు దురాగతాలు జరిగినప్పుడు మీరు ఎందుకు రాయలేదు' అని నేనడిగితే- మీరు రాస్తున్నారుగా, అన్ని వస్తువులను అందరూ రాయలేరు అన్నాడు.
ఏదేమైనా సినారె కవిత్వం, పాట, మాట తెలుగు సాహిత్య సంపదకు చేర్పు, వన్నె. లిఖిత సాహిత్య సంప్రదాయానికి దళిత సాహిత్యోద్యమ ప్రజ్వలనానికి అంతర్గతంగా ఆయన స్ఫూర్తి ఉంది. మౌఖిక జాతులన్నీ తమ భావాలను లిఖిత సంప్రదాయాల్లోకి తెచ్చుకోవడం ఈనాటి చారిత్రిక అవసరం. ప్రపంచంలో ఉన్న అభ్యుదయ భావాలన్నింటినీ తెలుగు నుడికారంలోకి, తెలుగు పలుకుబడిలోకి తెచ్చుకోవాలనే తపనకు సినారె ఒక ప్రతీక. చరిత్ర- కవుల మాటలతో పరిమళిస్తుంది. అందుకే సినారె మనతో మాట్లాడుతూనే ఉంటారు. మానవతా కవితాగానం వినిపిస్తూనే ఉంటారు.
- డాక్టర్ కత్తి పద్మారావు