Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఎవ్వడురా అన్నది కమ్యూనిజం ఇక లేదని...
ఎవ్వడురా కూసింది ఎర్రజెండా నేలకొరిగిందని...
తూర్పున సూర్యుడు పొడిచినంత కాలం
మనిషిలో రక్తం ఉన్నంత వరకు
అజేయం విప్లవం - అజేయం సోషలిజం
దానిని ఆపడం ఎవడబ్బతరం'' అని కలమెత్తిన కవి డా||సి.నారాయణరెడ్డి. సోవియట్‌లో సోషలిజం విచ్ఛిన్నమై నిశ్శబ్దం ఆవహించినప్పుడు నిప్పులు చెరిగిన విద్వత్ కవి సినారె.
పాత జగత్తు అంతరించి కొత్త జగత్తు తలయెత్తాలని, ప్రతి హదయం కర్పూరంలా వెలగాలని, ప్రతి నేత్రం మందారంలా విచ్చాలని, కక్షలు పెరిగిన తావుల కారుణ్యం కనువిప్పాలని, బర్బరత్వమంతరించి మానవత్వం జయించాలని కాంక్షించే కవి. తన ఆశయాలను వెల్లడించిన అభ్యుదయ కవి సి.నారాయణరెడ్డి.
కరీంనగర్ జిల్లాలోని హనుమాజీ పేట అనే కుగ్రామంలో పుట్టి నిజాం ఏలుబడిలో డిగ్రీ దాకా ఉర్దూలో విద్యాభ్యాసం చేసి, తరువాత తన సహజ ప్రతిభా పాటవాలతో జ్ఞానపీఠాన్ని తెలుగు నేలకు తెచ్చిన సినారె సాహితీ పథ ప్రస్థానం ఓ అద్భుతం హరికథలు విని తెలుగు నుడికారాన్ని, బుర్రకథలు, ఒగ్గు కథలతో లయ జ్ఞానాన్ని ఒంటబట్టించుకుని, భావ, రాగ, తాళ యుక్త బోధనా శైలితో ఆచార్యునిగా అడుగుపెట్టారు. ఆయన అన్ని రంగాల్లో రాణించిన తీరు ఓ.. అబ్బురం.
మానవీయ కవిత్వం రాయడానికి ప్రేరణ గుర్రం జాషువా అని స్పష్టీకరించిన సినారె ప్రగతిశీల విశ్వ మానవతావాద నారుమడిలో నిత్యచైతన్యశీలిగా పండించిన కవితా రాజనాలు లెక్కలేనన్ని!
హైదరాబాద్‌లో మొదట దాశరథి గారితో పరిచయంతో బంగారానికి తావి అబ్బినట్లయింది.
''నా తరుణ కావ్యలతికలానాడు పైకి
ప్రాకలేక దిక్కులు సూడ, నీ కరాలు
సాచి లేత రేకులకు కెంజాయలద్ది
మించు పందిళ్ళ పైకి ప్రాకించినావు'' అంటూ దాశరథికి తన కతజ్ఞతను వెల్లడించుకుని,
''కలకాలమ్ములు నీవు నేనిటులే స్నిగ్థ స్నేహ బంధాల బ
ద్దులమై యుండుము ఏకగీతి నిరుగొంతుల్ విప్పి విన్పింత
మాంద్రుల చైతన్య విపంచి కావళులు విద్యున్నాశముల్ సేయగా
జలపాతమ్ముల వోలె దూకుదము విష్వక్యాహితీ శంగముల్'' అని తన అభిలాషను వ్యక్తం చేశారు.
తదాదిగా దాశరథి, సినారె గార లిరువురు తెలుగు సాహితీ రంగంలో అపారమైన కషి చేసి కష్ణార్జునులుగా వెలుగులోకి వచ్చారు. సాహిత్య రాజకీయరంగంలో మంచి పేరు గడించి కాళోజీ, వట్టికోట ఆళ్వారుస్వామి వంటి అనేకమంది సత్సాహిత్యకులతో పరిచయం కలిగింది. తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశారు.
సినారె గారు అంత పొడగరి కాదు. అంత పొట్టీ కాదు. అందమైన గుండ్రని ముఖం, కోటేరు ముక్కు, ఉంగరాల జుట్టు, స్పష్టమైన కంఠస్వరం, మధురమైన సంభాషణ... వీటన్నిటి సమన్వయమే సి.నారాయణరెడ్డి. ప్రతి అక్షరాన్ని, ప్రతి శబ్దాన్ని ఆచితూచి పొంకంగాను, బింకంగాను, గంభీరంగాను పలుకుతూ ప్రత్యేక ఫక్కీలో కవితాగానం చేస్తూ శ్రోతలను సైతం ముగ్ధుల్ని చేయడంలో సినారె అందెవేసిన చేయి. సాయంకాలం సభల్లో అక్కడున్న వారి దష్టినంతా తానే గుత్తా పట్టినట్టుగా ఆకట్టుకునే రూపురేఖలు, వ్యక్తిత్వం, కవిత్వం అన్నీ సమపాళ్ళలో రంగరించిన నిండుమనిషి సినారె.
సంఘ సంస్కరణోద్యమం, భారత స్వాతంత్రోద్యమం, ఆంధ్రరాష్ట్రోద్యమం తీవ్రత తగ్గిపోయి, ఆంధ్రావనిలో సామ్యవాద ప్రచారం బాగా జరుగుతున్న రోజులవి. సాహిత్య జగత్తులో అభ్యుదయవాదం ముమ్మరంగా ప్రచారంలో ఉన్నది. హైదరాబాద్ సంస్థాన ప్రజలు వందలాది సంవత్సరాల బానిస శంఖలాలను తెంచుకుని స్వేచ్ఛావాయువుల్ని పీల్చసాగారు. అటువంటి సమయంలో ఎటు చూసినా కమ్యూనిజం, సోషలిజం, ఆర్థిక సమానత్వంపై సినారె కలం మార్క్సిస్టు పథాన ముందుకు సాగింది. 'కలలుగనే శిలలు' అనే కవితలో...
''శిలలు కలలు కంటున్నవి నేడూ
చెట్లు ఓట్లకోసం పోట్లాడూ
ఎరలు గొంతులందు ఇరికెగాలం
ఒరలోపల మురిగెను కరవాలం.
వెనక చిక్కి విశ్రమింపలేరికా
ముందు కురికి మోసగింపలేరికా
వెనుకబడిన వాళ్ళ ముందుకు నడుపుటా
కదలండోరు చేయి చేయి కలుపుతూ'' అని దేశ ప్రజలకు ఉద్బోధించారు. సినారె రచించిన అభ్యుదయ కవితల్లో ''అగ్ని సుధలు, నిశ్శబ్దత, యుగప్రగతి, అరుణాక్షరాలు, సుఖాంతం, విలయోత్పాతం, మేమూ మానవులమే, నేనా అధముణ్ణి, కలలు కనే శిలలు... మొదలగు అభ్యుదయతత్వం, దేశభక్తి కవితలనేకం. ప్రగతిశీల విద్యార్థి సంఘాలు ప్రజానాట్యమండలి కళాకారులు నేటికీ పాడుకునే గొప్ప పాట నేటికీ వన్నె తగ్గనిది...
''కదిలింది అరుణసైన్యం - బెదిరింది చీకటి రాజ్యం
పట్టిన పిడికిళ్ళే పైకెత్తిన జెండాలై
కలిసిన కంఠాలే ఎలుగెత్తిన శంఖాలై
కులమని మతమని గిరులు గీసుకొని
మనుష్యులనే విడదీస్తారా...
మరుగొందినే ఆ పురాణాలనే తిరుగు దౌడ్
తీయిస్తారా? మొక్కే దేవుడు ఏ గుడిలోనో
ముడుచుకు కూర్చున్నాడా? పెత్తందారులు దాచుక
దోచిన సొత్తులోనే ఉన్నాడా?''
అని ప్రశ్నించారు. జీవితాంతం హేతువాదిగా వున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత సందర్భంలో మతోన్మాదాన్ని ఖండించారు. వివేకానందుడు 'కూల్చకండి, నిర్మించండి' అని చెప్పిన మాటలు గుర్తుచేశారు. మార్కెట్తత్వం, ప్రపంచీకరణపై 'ఇది గ్లోబలైజేషన్ కాదు, డాలరైజేషన్' అని అన్నారు. 'మార్కెట్ ఉన్మాదాన్ని ప్రపంచీకరణ ఉన్మాదాన్ని ఎదుర్కోలేకపోతే లాభం లేదు. లివ్ లోకల్ గో గ్లోబల్ అనేది నా నినాదం. డబ్ల్యుటిఒ వల్ల రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారో' అంటూ చింతించారు. ఈనాటి విజ్ఞానాభివద్ధిని గమనించి మానవ సంహారానికి గాక మానవ లోక శ్రేయస్సుకై సైన్సు వినియోగపడాలనే తన ప్రగాఢవాంఛను ఇలా...
''ఈ జగత్తు ఎన్నడు చితికిపోనుందో
ఇంకా నాకు సంశయంగానే ఉంది
ఈ నగరం 'హిరోషిమా' కానుందో
ఇప్పటికీ భయంగానే ఉంది.
అమతం పండించే 'అణు' బీజాలనుండి
విషపూరిత మత్యుసస్యాలను మొలిపిస్తున్న
శాస్త్రజ్ఞులారా! పరమాణువుల రగిల్చి చరిత్రను పొగచూరనీయకండి'' అంటూ వెల్లడించారు.
వైజ్ఞానికంగా మానవుడు అభివద్ధిని సాధిస్తూ వున్నాడే కాని మానవత్వాన్ని మరచిపోతూ వున్నాడు అని హెచ్చరించారు. అప్పటి ప్రధాని నెహ్రూ సూచించిన పంచశీల సూత్రాల వల్ల పులులూ, మేకలూ ఒకచోట సమావేశమై సంధి పత్రాలపై సంతకాలు చేసుకోవడం మొదలు పెట్టాయి అని పంచశీల సూత్రాలను చమత్కరించారు. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయకుడు లాంటి బహత్ గేయ కావ్యాలు పండితులతో పాటు పామరుల మన్ననలను అందుకున్నాయి. సాహిత్యస్ఫూర్తి, సమయస్ఫూర్తి, సభాస్ఫూర్తి కలబోసుకున్న కలం నేస్తం. తెలంగాణ రచయితల సంఘం బాధ్యులుగా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులుగా కడవరకు ప్రగతిశీల ప్రజాస్వామ్యవాదిగానే వున్నారు.
''అధికారం ఒక వర్గం ఆటబొమ్మకాదు
ఐశ్వర్యం ఒక వర్గం వాడబ్బసొత్తు కాదు
రెక్కలు విరిగిన పీడితులొకటై ఉప్పెనలా లేస్తున్నారు.
దోపిడి రుచులను మరిగిన దొరలను తుడుచుకుపోతున్నారు.
నీటికి చలనం వుంటేనే ఏటికి వరదొస్తుందిరా
నిప్పుకు జ్వలనం ఉంటేనే గుప్పున మంటొస్తుందిరా
చైతన్యం చీలిపోతే జాతికి వెలుగే లేదురా!'' అంటూ చైతన్యగానం చేశారు.
అక్షర సంక్షిప్తత గురించి ''గగనమంత భావం ఒక పదమవ్వాలి'' అని చెప్పేవారు. గద్దర్‌పై కాల్పులు జరిపినప్పుడు
''పాటను కూల్చేస్తారా హంతకులారా!
ప్రగతిని చంపేస్తారా వంచకులారా!
పాటంటే ఏమి పాట, ఎవరి మెప్పుకో తెగ వల్లించే దండకం కాదు.
అణచబడ్డ జన కంఠం, నినదించే రక్తఘోష, నిజం తేలే వరకు
నిందితులు పాలకులే...'' అని నిగ్గదీసి అడిగాడు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్టులో ఒకరుగా, ప్రజానాట్యమండలి రాష్ట్ర మహాసభలకు సఫ్దర్ హష్మీ, వీధి నాటకోత్సవాలకు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలకు ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా ఉండి అధ్యక్ష ఉపన్యాసాలిచ్చి ఉత్తేజితుల్ని చేశారు. సుందరయ్యగారు చనిపోయినప్పుడు 'జోహార్లు జోహార్లు మా సుందరయ్య' అంటూ పాటతో నివాళి అర్పించారు. నేటి యువత గూర్చి మాట్లాడుతూ... 'వారిలో ప్రతిభ వుంది. ఇంకో మాటలో గుండె వుంది. తగిన కండ కావాలి. అంటే అధ్యయనం, పరిశ్రమ కావాలి' అన్నారు. 1988లో ప్రతిష్టాత్మక జ్ఞానపీఠం 1992లో పద్మభూషణ్, 1997లో రాజ్యసభ సభ్యత్వం వంటివి కోరి వరించాయి. 'కాగితాలెన్నెన్ని పితికితే కవిత ఒలికెను చుక్కలా. అనుభవాలెన్నెన్ని అతికితే ఆత్మ మొలిచెను మొక్కలా' అన్న సినారె, డెబ్బై పైగా విరచిత పుస్తకాలు, లక్షలాది శిష్యుల మస్తకాలకు ప్రేరణగా విరాజిల్లారు. భాషకు మడి, శ్వాసకు ముడి లాంటిది... మడి కట్టుకుని కూర్చుంటే ఏ భాషా బతకదు అంటూ ప్రభుత్వాలకు హితబోధ చేశారు. ''మరణం నన్ను వరించి వస్తే ఏమంటాను నేనేమంటాను / పాలు పట్టి జోలపాడి పడుకోమంటాను'' అంటూ సాహిత్యానికి తండ్రి శాశ్వతంగా శ్వాస వదిలినా... ఎన్నాళ్ళయినా ఎన్నేళ్ళయినా... ఇదే పాట. ప్రతిచోట ఇలాగే పాడుకుంటాం.
- భూపతి వెంకటేశ్వర్లు