Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1931లో సినిమా పాట పుట్టింది. మూకీ నుండి టాకీ పుట్టింది. తెలంగాణంలో సినారె 1931లోనే పుట్టారు. ఇది కాకతాళీయమే... తెలుగు పాట నిలిచి ఉన్నంతకాలం సినారె పేరు మారుమోగుతుంది. సినారె హైస్కూల్ విద్యార్ధిగా ఉన్న కాలంలో రామప్పను దర్శించి, స్పందించి ''ఈ నల్లని రాలలో... ఏ కన్నులు దాగెనో... ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో'' అంటూ రచించిన ఆ పాటను తరువాత కాలంలో ''అమరశిల్పి జక్కన''లో పెట్టారు. ఈ పాట నాటికీ - నేటికీ - ఏనాటికీ ఓ చెరగని సంతకమే కదా!! ప్రతి పాట పల్లవిని శ్రోతలు.. వినగానే అవలీలగా పాడుకునేలా రచించడం సినారె ప్రత్యేకత.
ఆచార్య చేకూరి రామారావు మాటల్లో చెప్పాలంటే... ''ఇప్పట్లో వున్న కవుల్లో నారాయణరెడ్డిగారికి ఉన్నంత శబ్దస్ఫూర్తి ఉన్నవాళ్ళు ఎక్కువ మంది లేరు. శబ్దాలకు రంగు రుచి వాసన కలిగించే ఆల్కెమీ ఏదో ఆయన వద్ద ఉండి వుండాలి. అది అనిర్వచనీయం. అది పరిశోధకులకు సైతం అందదు.''
రామప్ప సంగీత రూపకం అన్ని భారతీయ భాషల్లో అనువాదమైంది.
సినారె పాట...అమ్మ లాలి పాటలానే కాక సమాజాన్ని, మనుషుల్ని నిక్కచ్చిగా ప్రశ్నిస్తుంది. కులాలపై, మతాలపై, వర్గాలపై, ఎదురు తిరుగుతుంది. బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, మోహాలు, విరహాలు, మనసు పొరల్ని సుతిమెత్తగా తడిమే భావోద్వేగాల సమాహారం.
''పాటలో ఏముంది... నా మాటలో ఏముంది'' అనే శీర్షికతో తన పాటలకు సంబంధించి అనేక విషయాలకు వ్యాఖ్యానాలు రాశారు సినారె. నాలుగున్నర దశాబ్దాల కాలంలో 50 మందికి పైగా సినీ సంగీత దర్శకులతో ఆయన పనిచేశారు. 3,500కి పైగా పాటలు రాశారు.
ఏకవీర ; అక్బర్ సలీమ్ అనార్కలి చిత్రాలకు ''మాటలు'' రాశారు సి నారాయణరెడ్డి (ఇవి రెండు ఎన్టిఆర్ చిత్రాలే).
జోసెఫ్ కృష్ణమూర్తి అనే తెలుగు సంగీత దర్శకుని నుండి ఆరంభమైన సినారె పాటల రచనా ప్రస్థానంలో శంకర్ జయకిషన్ , సి. రామచంద్ర, ఓ.పి. నయ్యర్, రవీంద్రజైన్, బప్పీలహరి లాంటి అగ్రేసర హిందీ అన్య భాషా సంగీత దర్శకులూ వున్నారు.
నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న రోజుల్లో తెలుగు సాంస్కృతిక సమావేశాల కోసం తరచుగా మద్రాసు వెళ్ళి వస్తుండేవారు సినారె. ఆ కార్యక్రమాల్లో సినారె తన స్వీయ కావ్యమైన ''కర్పూర వసంతరాయలు'' రాగయుక్తంగా గానం చేస్తుంటే... అక్కినేనిలాంటి వారు మంత్రముగ్ధులై విని, వీరాభిమానిగా మారిపోయారు. అలనాటి సాహితీ - సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి, పులకించిన బి.ఎన్. రెడ్డి, జగ్గయ్య, వరలకిë లాంటి వారు చిత్ర పరిశ్రమకు ఆహ్వానించారు. అధ్యాపక వృత్తికి అవరోధమని సున్నితంగా వారి ఆహ్వానాన్ని తిరస్కరించారు సినారె.
పి.ఎస్. ప్రసాద్ అనే మిత్రుడి ద్వారా ఎన్‌టిఆర్‌తో సినారెకు పరిచయం ఏర్పడింది. పాటలు రాసే అవకాశాలు వచ్చిన సందర్భాలున్నాయి సినారెకు.
శభాష్ రాముడు, పెళ్ళిసందడి చిత్రాల్లో ఒకటి, రెండు పాటలు అడిగితే తాను రాయనని చెప్పారు సినారె. రాస్తే అన్ని పాటలు రాయాలనేది సినారె అభీష్టం.
'కలిసి ఉంటే కలదు సుఖం' చిత్రీకరణలో భాగంగా ఎన్టిఆర్ సారధి స్టూడియోకు హైదరాబాద్ రావడం జరిగింది. సినారెకు కబురు పెట్టి కలవమనగా సినారె వెళ్ళారట.
వెళ్ళి కలవగానే ''మీ గురించి వింటున్నాను. మీ గేయాలు పత్రికల్లో అప్పుడప్పుడు చూస్తున్నా. మీరు పాటలు రాయాలి'' అన్నారు ఎన్టీఆర్. సింగిల్ కార్డ్ పాటల రచయితగా (ఒక్క తొలి ప్రయత్నం)లో సినిమాకు మొత్తం 12 పాటలు తనతోనే రాయించుకుంటే రాస్తాను లేదా తప్పుకుంటాను అన్నారు సినారె ఎన్‌టిఆర్‌తో. సినారె ప్రతిపాదనకు అంగీకరించి 12 పాటలు రాయించుకున్నారు. ఆ సినిమాకు పాటలు రాయడానికి 1960 మార్చి 10 మద్రాసు పయనమయ్యారు సినారె. రైల్వేస్టేషన్‌కు స్వయంగా ఎన్టిఆర్ వచ్చి స్వాగతం పలికారు. ''గులేబకావళి కథ'' చిత్రం. ఈ చిత్రానికి వేలూరి కృష్ణమూర్తి, జోసెఫ్ సంగీత దర్శకులు. తెరపై ఎన్టిఆర్ జమున కథానాయకీ నాయకులు. పాట సుశీల, ఘంటసాల. ''నన్ను దోచుకొందువటే - వన్నెల దొరసానీ'' ఇది సినారె తొలి సినిమా పాట.
పాటను... మాటను రెండు కళ్ళుగా అభివర్ణించే సినారె ఓ సభలో ఇలా అన్నారు.
''ఎన్ని తెన్నులకైతకన్నె విహరించినను.. పాటలోనే నాదు ప్రాణాలు గలవందు''
అంటూ పాటపై తనకున్న మమకారాన్ని తెలియజేసిన సినారె సినీ పాటల ప్రస్థానంలోని కొన్ని ఆణిముత్యాలు చూద్దాం.
మనిషి - మానవత్వాన్ని - మట్టిని గాఢంగా ప్రేమించిన సినారె. అరసంతో అవినాభావ సంబంధముంది. దశాబ్దం పైగా ఆ సంస్థ అధ్యక్ష వర్గ సభ్యులుగా ఉన్నారు. ప్రజానాట్యమండలి కోసం పలు గీతాలు రాశారు.
1. ''కదిలిందీ అరుణ సైన్యం - బెదిరిందీ చీకటి రాజ్యం''
2. ''వందేమాతర గీతం వరస మారుతున్నదీ - తరం మారుతున్నదీ''
3. ''ఎవడురా అన్నది - కమ్యూనిజం చచ్చిపోయిందని, ఎవడురా కూసింది - ఎర్రజెండా నేలకొరిగిందని - తూర్పున సూర్యుడు పొడిచినంత కాలం - మనిషిలో రక్తం ఉన్నంత వరకు అజేయం విప్లవం - దాన్ని ఆపడం ఎవడబ్బతరం'' అని గర్జించాడు సోవియట్ పతనమైన కాలంలో (1991).
4. ''సురలకన్న కరుణాత్ముడు - నరుడుగాక ఇంకెవ్వడు - మందిర మెరుగని దేవుడు - మనిషిగాక ఇంకెవ్వడు'' అని జన (కీర్తన) గానం చేశాడు సినారె.
ప్రేమ, ప్రణయం, విరహం, కుటుంబ నేపథ్యం, మట్టి మనుషుల ఘోష, విప్లవం, భాష, భావం, శబ్దం, శిల్పం, అలంకారాలు, మాత్రాఛందస్సు, సంగీతం, సాహిత్యం, రాగం, తాళం, లయ, ప్రత్యేక శైలి, మానవతావాదం, ప్రబోధం, విశ్వశాంతి, పల్లెపదాలు, మానవాంతరాళాల్లోని భావోద్వేగాలను తన పాటలో పలికించిన అక్షర బ్రహ్మ సినారె.
1. జన్మనిచ్చిన తండ్రి హృదయాన్ని, గొప్పదనాన్ని తెలిపే గొప్ప పాట. 1970లో ''ధర్మదాత'' చిత్రంలో అద్భుతంగా సినారె రాశారు.
''ఓ.. నాన్నా... ఓ.. నాన్నా... నీ మనసే వెన్న..
అమృతం కన్నా అది ఎంతో మిన్న''
''ముళ్ళబాటలో నీవు నడిచావు... పూలతోటలో మమ్ము నడిపావు...''
అని కీర్తించే పాట.. కంట తడి పెట్టిస్తుంది.
2. ''బంగారు గాజులు'' చిత్రంలో అన్నాచెల్లెళ్ళ అనురాగాన్ని
పాటలో పలికించిన తీరు ప్రశంసనీయం.
''అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి -
కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది..''
3. తల్లి ప్రేమను ''స్వాతిముత్యం'' చిత్రంలో... ''లాలీ... లాలీ...లాలీ.. వటపత్రశాయికి వరహాల లాలి.. రాజీవ నేత్రునికి రతనాల లాలీ'' పాట... ప్రతి తల్లి పాడుకునే ఎవర్గ్రీన్ హిట్.
4. పుట్టినరోజు పండుగ ప్రాధాన్యత తెలిపే మంచి పాట ''జీవన తరంగాలు'' చిత్రంలో రాసారు. ''పుట్టినరోజు పండుగే అందరికీ - పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికి...''
5. భౌతికవాదియైన సినారె షిర్డిబాబాపై ''ఎంతెంత... దయనీది ఓ సాయి'' అనే పాటను ముంబాయి ప్రఖ్యాత గాయని అనురాధా పోడ్వాల్ అద్భుతంగా పాడింది. ''శ్రీ షిర్డి సాయి మహత్యం'' అనే చిత్రం రమణమూర్తి తీశారు.
6. అమ్మ ప్రేమను అద్భుతంగా ఆవిష్కరించిన సినారె పాటలో ''ప్రేమించు'' చిత్రంలో ''కంటేనే అమ్మ అని అంటే ఎలా... కరుణించే ప్రతి దేవత అమ్మే కదా...'' అన్న ఈ పాట 'నంది' పురస్కారం పొందింది.
7. తెలుగువాడి పౌరుషాన్ని చెప్పే పాటల్లో 'సీతయ్య' చిత్రంలోని ''ఇదిగో రాయలసీమ గడ్డ - దీని కథ తెలుసుకో తెలుగు బిడ్డ'' అనే పాట ఆయనకు మరోసారి ''నంది'' పురస్కారం తెచ్చింది.
సినారె శబ్దాలంకారాల్లో అంత్యానుప్రాసను ఇష్టపడేవారు. అర్ధాలంకారాల్లో ఉత్తరాలంకారాన్ని ఇష్టపడేవారు.
8. నిరక్షరాస్యుని అక్కున చేర్చి ఆదరించే పాట. ''ఆత్మబంధువు'' చిత్రంలో ''చదువురాని వాడవని దిగులు చెందకు'' అంటూ ఈ గీతం సాగుతుంది. ఆయన నిజ జీవితంలో బండి నడిపే వ్యక్తి - చదువురాని వ్యక్తిపై రాశారు ఈ పాట.
9. భాష - భావం మీద పట్టు వున్న సినారె ''స్వాతికిరణం'' సినిమాలో ''శృతి నీవు.. గతి నీవు... శరణాగతి నీవు భారతీ.. పాట సాహిత్య విలువలు గలది.
10. లలిత కళలపై మక్కువతో ''కల్యాణి'' చిత్రంలో ''లలిత కళారాధనలో... వెలిగే చిరుదివ్వెను నేను'' మధుర భారతి పద సన్నిధిలో ఒరిగే తొలి పువ్వును నేను..''
11. ''కంచుకోట'' చిత్రంలో ''సరిలేరు నీకెవ్వరూ...'' పాట పద విన్యాసం అపూర్వం.
12. అక్షర కొలనులో సాహిత్యాన్ని జలకాలాడించిన పాట ''చెల్లెలి కాపురం''లో ఆడవే జలకమ్ములాడవే... కలహంసలాగ... జలకన్యలాగ... ఆంధ్ర సంస్కృతికి తీయని క్షీరధారలై ... జీవకళలొల్కు... గోదావరి తరంగాలలోను... కృష్ణవేణి తరంగిణి జాలి గుండెలే... సాగరమ్మై రూపు సవరించుకొను నీట... నాటి రాయలపేరు నేటికిని... తలపోయు తుంగభద్రానదీ తోయ మాలికలందు..'' అంటూ ఈ గీతం సాగుతుంది (శోభనబాబు నటన).
13. ''తాత మనవడు'' చిత్రంలో అనుబంధం.. ఆత్మీయత.. అంతా ఒక బూటకం... ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం... వింత నాటకం'' అంటూ తాత్త్వీకరించారు సినారె.
14. జానపదాలంటే మహా ఇష్టపడే సినారె ''ముత్యాలముగ్గు'' చిత్రంలో ''గోగులు... పూచే గోగులు కాచే ఓ లచ్చ గుమ్మడి...''
15. ఈ కాలం కవులతో పోటీపడి రాసిన 'అరుంధతి' చిత్రంలో ''జేజమ్మా... జేజమ్మా...'' పాట అలరిస్తుంది.
16. కృష్ణమ్మ ప్రాశస్త్యాన్ని ''కృష్ణవేణి'' చిత్రంలోని ''కృష్ణవేణి తెలుగింటి విరిబోణి...'' అంటూ రాసిన పాట మరవలేం. ..
17. తొలిచిత్రం ''గులేబకావళి కథ'' చిత్రంలో అన్ని పాటలు వాటికవే సాటి.
1. నన్ను దోచుకొందువటే... వన్నెల దొరసాని 2. కలల అలలపై
3. ఊహలు గుసగుసలాడే 4. ఒంటరినైపోయాను.. ఇక ఇంటికి ఏమని పోను..
18. ''బందిపోటు'' చిత్రం (1963)
(1) వగల రాణివి నీవే-సొగసుకాడను నేనే-ఈడు కుదిరెను-జోడు కుదిరెను
మేడ దిగిరావే - వెండి వెన్నెల నీకోసం - పిల్ల తెమ్మెర నా కోసం
రెండు కలిసిన- నిండు పున్నమి రేయి మనకోసం...'' అంటారు.
19. ''నిప్పులాంటి మనిషి'' చిత్రంలో ''స్నేహమేరా జీవితం ... స్నేహమేరా శాశ్వతం... అంటూ (కైకాల, ఎన్టిఆర్లపై పాట) రాశారు.
20. ఓ ముత్యాల రెమ్మా ... ఓ మురిపాల కొమ్మా... ఓ పున్నమి బొమ్మా...
ఓ.. రాములమ్మా ''ఒసే రాములమ్మ'' గీతం మరపురానిది.
21. హైదరాబాద్ విశిష్టత తెలుపుతూ ''మట్టిలో మాణిక్యం'' చిత్రంలో ''రింఝం.. రింఝం హైదరాబాద్.. రిక్షావాలా జిందాబాద్.. మూడు చక్రములు గిర గిర తిరిగితే మోటారు కారూ బలాదూర్!
అటు చూస్తే చార్మినార్... ఇటు చూస్తే జుమ్మా మసీదు..
అంటూ సాగుతుందీ పాట.
22. ''బాలమిత్రుల కథ'' చిత్రంలో బాల్య స్నేహాల్ని తెలిపే పాట
''గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి...
ఒక గూటిలోన రామచిలకుంది.. ఒక గూటిలోన కోయిలుంది... అంటాడు.
23. ''అల్లూరి సీతారామరాజు'' చిత్రంలో ''వస్తాడు నా రాజు ఈ రోజు
- కథానాయకి విజయనిర్మల పాట ఇది.
24. ''బలిపీఠం'' చిత్రంలో ''మారాలీ... మారాలీ... మనుషుల నడవడి మారాలి''
అన్న అభ్యుదయ గీతం.
25. ''సూత్రధారులు'' చిత్రంలో చక్కటి జానపద సొగసులున్న పాట
''జోలాలో లమ్మ జోల... నీలాల కన్నులకు నిత్యమల్లె పూలజోల...''
26. ప్రేయసీ ప్రియుల పాటల్లో ఎప్పటికీ నిలిచిపోయే గుర్తుండిపోయే పాటలు కొన్ని.
''కులగోత్రాలు'' చిత్రంలో ''చెలికాడు నిన్ను రమ్మని పిలువ చేర రావేలా''
'''చిలిపి కనుల తీయని చెలికాడా...''
27. ''కర్ణ'' చిత్రంలో ''గాలికి కులమేది... నేలకు కులమేది'' అనే పాట కులంపై చెర్నాకోలు దెబ్బ.
28. ''బందిపోటు దొంగలు'' చిత్రంలో ''విన్నానులే ప్రియా... కనుగొన్నానులే ప్రియా..''
29. ''చెల్లెలి కాపురం'' చిత్రంలో రెండు పాటలు ఆణిముత్యాలు
1. కనుల ముందు నీవుంటే... కవిత పొంగి పారదా..
2. ఆడవే... మయూరి నటనమాడవే... మయూరీ...
30. ''రాముడు - భీముడు'' తెలిసిందిలే... తెలిసిందిలే...
31. ''చిట్టి చెల్లెలు'' ఈ రేయి తీయనిది
32. ''నోము'' మనసే జతగా పాడిందిలే
33. ''చాణక్య చంద్రగుప్త'' చిరునవ్వుల తొలకరిలో
34. ''జరిగిన కథ'' చిత్రంలో
''భలే మంచిరోజు... పసందైన రోజు... వసంతాలు పూచే నేటి రోజు..'' పాట ఎవర్గ్రీన్.
35. ''పూజాఫలం'' చిత్రంలో ''పగలే వెన్నెలా... జగమే ఊయల''
36. ''గూఢచారి'' చిత్రంలో ''నువ్వు నా ముందుంటే''
37. ''తూర్పు - పడమర'' చిత్రంలో ''శివరంజనీ... నవరాగిణీ..
వినినంత నే నా తనువులోని అణువణువు కరిగించే''
38. ''దాన వీర శూర కర్ణ'' లో ఎన్టిఆర్ అడిగి మరీ రాయించుకున్న (దుర్యోధనునికి) పాట 1. ''చిత్రం భళారే విచిత్రం... ఈ రాచనగరికి రారాజును రప్పించుటే విచిత్రం''
2. ''ఏ తల్లి నిను కన్నదో.. నేను నీ తల్లినైనానురా..''
39. ''మాతృదేవత'' చిత్రంలో మహిళలపై రాసిన పాట ఎప్పటికీ ఆదర్శంగా ఉంటుంది
''మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ''
40. ''నిండు సంసారం''లో ఆత్మ విశ్వాసం నింపే పాట
''ఎవరికీ తలవంచకు... ఎవరినీ యాచించకు...''
41. ''మంచి మిత్రులు'' చిత్రంలో ''ఎన్నాళ్ళో వేచిన ఉదయం''
42. ''కోడలు దిద్దిన కాపురం'' లో ''నీ ధర్మం.. నీ సంఘం.. నీ దేశం.. నువు మరవొద్దు''
43. ''వరకట్నం'' (1968) వరకట్న దురాచారంపై ''ఇదేనా మన సంప్రదాయమిదేనా..?''
44. ''పునర్జన్మ'' (1963) లో ''మబ్బులో ఏముంది... నా మనసులో ఏముంది''
45. ''తిరుపతమ్మ కథ'' (1963) లో ''పూవై విరిసిన పున్నమి వేళా...
బిడియము నీకేలా బేలా''
46. ''మురళీకృష్ణ'' (1964) లో కనులు... కనులు.. కలిసే.. కన్నెమనసు పిలిచెను..
47. ''రాముడు - భీముడు'' (1964) లో ''తెలిసిందిలే... నెలరాజ... నీ రూపు తెలిసిందిలే''
48. ''మంగమ్మ శపథం'' (1965) లో ''కనులీ వేళ చిలిపిగ నవ్వెను...''
49. ''ఏకవీర'' చిత్రంలో ''తోటలో నా రాజు - తొంగి చూచెను నాడు... నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు''
50. ''భక్త తుకారం'' చిత్రంలో ''పూజకు వేళాయెరా.. రంగ పూజకు వేళాయెరా..'' అనే పాట ఎంతో తాత్త్వికతతో రాశారు సినారె. ఆ పాట చివరలో ఇలా అంటారు.
''పాల పొంగు ఈ కలశాలే తోలు తిత్తులై పోవునులే... నీలి కురుల నీ ముంగురులే దూదిపింజలై పోవునులే'' అంటూ మోహ నర్తకికి మోక్షోపదేశం చేసే పాట అద్భుతంగా రాశారు. ''సరి సరి వగలు తెలిసిన గడుసరీ'' పాట కూడా వుంది.
53. ''తల్లా పెళ్ళామా'' (1970) చిత్రంలో ''తెలుగు జాతి మనది - నిండుగ వెలుగు జాతి మనది'' పాట మరువలేం.
54. ''వందేమాతరం''లో ''వందేమాతర గీతం వరస మారుతున్నది - స్వరం మారుతున్నదీ - ఈ తరం మారుతున్నది'' పాట ఓ ప్రజా నాట్యమండలి గాయకునికి ఇంటిపేరుగా మారింది (వందేమాతరం శ్రీనివాస్).
56. ''పాడవోయి భారతీయుడా'' (1976) లో ''గుండె గుండెకొక దీపం వెలిగింది అంటూ సాగే గీతంలో.. ''ఎవరు హిందు వెవరు ముస్లిమెవరు కిరస్తానీ... ఎవరిదీ తెలుగెవరిది దాంగ్లమెవరిది.. హిందీస్తానీ.. వంటి పంక్తుల్ని రాశారు. దైవభక్తే కాదు దేశభక్తీ అవసరమని చెప్పారు.
57. ''రాజకోట రహస్యం''లో ''నెలవంక తొంగి చూసింది''
58. ''అగ్గిపిడుగు'' లో ''ఏమో ఏమో ఇది ఏమో నాకేమొ ఏమొ అయినది''
59. ''జమిందారు''లో ''పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు''
60. ''ఆరాధన''లో ''నా మది నిన్ను పిలిచింది గానమై'' (రఫీ పాడారు)
61. ''నీరాజనం'' చిత్రంలో 1. ''నిను చూడక నేనుండలేనూ ఈ జన్మలో''
2. మనసొక మధుకలశం'' పాటలు
62.''కురుక్షేత్రం'' చిత్రంలో ''మ్రోగింది కల్యాణ వీణ...'' పాట అద్భుతంగా రాశారు.
63. ''తాండ్ర పాపారాయుడు'' చిత్రంలో ''అభినందన మందారమాల...''
ఇలా 3,500 పైగా పాటలు రాశారు సి.నా.రె.
అక్కినేని తన చివరి శ్వాస వరకు నటిస్తూనే కన్నుమూయాలని ఆశించి, అలాగే తుదిశ్వాస విడిచినట్లుగా, సినారె తన తుది శ్వాస వరకు రచిస్తూనే కన్నుమూయడం విశేషం.
- తంగిరాల చక్రవర్తి