Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఏమీ మనసున పడ్త లేదు బిడ్డా
అమ్మ గొంతుక
నా స్మృతుల పొరల్లో
దీనంగా పలుకుతున్నది
ఎప్పుడు చూసినా
నీ చూపు చదువుల మీదనే
మెదడు పాడయిపోతది కొడకా!
చదివింది చాలు
ఇప్పటి నుంచి నా నీడలోనే నువ్వుండు
నీ యెదుగుదలను నేను గమనిస్తుంటాను'
పరమపదించిన మాతృమూర్తి
ప్రత్యక్షంగా యెదుట నిలబడి
నాపైన
వాత్సల్యాన్ని వర్షించినట్లనిపించింది.
ఆదిత్యబింబం ఆస్తమించగానే
దాని కాంతి అంతం కాదు
ఆ ఉదయకిరణ మూర్తి
వీలు చూసుకుని
తూర్పు దిక్కు పైకెక్కి
తన వెలుతురు వేళ్లతో
సకల సృష్టిని లాలిస్తుంది.
నా లాలన చలువతో
నిఖిల జీవకోటి
నిస్తంద్ర సమ్మోదాన్ని పొందుతుంది
ఆ సమ్మోదం
సంవృద్ధికి మూలహేతువవుతుంది.
అమ్మ ప్రగాఢ వాత్సల్యం
పుత్ర పురోభివృద్ధికి
కారకమవుతుంది
ఆదిత్య కాంతి బాహుళ్యం
అఖిల జగత్ విలసనానికి
ప్రేరకమవుతుంది.
- డాక్టర్ సి.నారాయణరెడ్డి