Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నూరు వసంతాలు నోరారా పాడవలసిన బుల్బులీ
నూరు శరత్తులు దోర వెన్నెల కురియవలసిన జాబిలి
కోటి అరుణోదయాల తూరుపు వాటికలో
చాటవలసిన ఉజ్వల రవి
ఉర్దూ కావ్య గంగాఝరిని ఉర్వరపై దింపిన భగీరథ కవి
వెళ్ళిపోయావా! చెప్పకుండా వెళ్ళిపోయావా!
ప్యారే మఖ్దూం! మేరే హమ్దమ్!
అటుచూడు
''పోతున్న సిపాయి'' బిక్కుబిక్కున చూస్తున్నాడు
ఇటుచూడు
పూస్తున్న ''చమేలీ మండువా'' వెక్కి వెక్కి ఏడుస్తున్నది
'సమరగీతం' క్షణకాలం స్తంభించింది
'అరుణ ప్రభాతం' అరనిముషం కంపించింది
కురంగం లాంటి మనస్సు నీది
తరంగం లాంటి వచస్సు నీది
ఆప్తులకు పసివాడివి, ఆరులకు కత్తివాడివి
పదవీ మోహాలను, పరతంత్ర వ్యూహాలను
బదాబదలు చేసిన మొనగాడివి
''ఏ జంగ్ హై జంగె ఆజాదీ''
ఈ గీతం ఎవరిది? మాది
కంకళాలను సైతం కదను తొక్కించే
ప్రగతి శక్తులదీ, నిగళ ముక్తులదీ
నీవు మాలో లేకున్నా నీ పాట వినిపిస్తున్నది
నీవు మాకు కానరాకున్నా నీ వాణి కనిపిస్తున్నది
మల్లెపందిరి పూసినప్పుడల్లా
మధురోషస్సును చూసినప్పుడల్లా
సమీర కాహళి స్వరాలలో
సమర గీతం మ్రోగినప్పుడల్లా
నీవు వినిపిస్తావు మఖ్దూం
నీవు కనిపిస్తావు హమ్దమ్.
- డా|| సి. నారాయణరెడ్డి