Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు చలన చిత్ర సినీ సంగీతానికి 1960 నుంచి 1980 వరకు స్వర్ణయుగమనే చెప్పాలి. భావరంజితమైన గీత సాహిత్యం ఆ రోజుల్లో సినిమా కళను మరింత తీర్చిదిద్దింది. మధుర గాయనీ గాయకులు, సుమధుర సంగీత దర్శకులు, సుసంపన్న సాహిత్యాన్ని సృష్టించిన గీత రచయితలు... ఎన్నో భావరంజిత గీతాలను అందించిన ఆనాటి సినిమా లోకానికి సినారె ఒక పెద్ద సంపద. మట్టిలో, గాలిలో ఆయన పాట పెనవేసుకుపోయింది. ఆనాటి గాయకుల మధుర కంఠాలకు సినారె సాహిత్యం ఒక ఆభరణం కావడమే కాకుండా, ఆ కాలాన్ని హృదయ రంజితంగా మలచడంలో ఆయనది ప్రధాన పాత్ర. ప్రేమ, ప్రకృతి వంటి అంశాల్ని అభ్యుదయ భావజాలంతో ముడిపెట్టి రచించడం సినారె ప్రత్యేకత.
రాళ్ళల్లో సైతం హృదయాన్ని చూడగల గొప్ప మనసు సినారెది. అందుకే ''ఈ నల్లటి రాళ్ళలో ఏ కన్నులు దాగెనో'' అంటూ పలికిస్తాడు.
పైన కఠినమనిపించును, లోన వెన్న కనిపించును... అంటూ కవిలోని అంతర్నేత్రాన్ని మన ముందు ఆవిష్కరిస్తాడు. చాలామంది కవులు, గీత రచయితలు పూల అందాలను, పాట సౌకుమార్యాన్ని, వాటి లాలిత్యాన్ని పొగుడుతూ అనేకం రాస్తారు. కానీ బండరాళ్ళు సైతం గొప్ప అందాన్ని సంతరించుకున్నాయని సినారె చెబితేనే మనకు అర్థమయ్యింది. ఇంతకాలం మనుషులు చూడలేని రాళ్ళలో నిగూఢమై వున్న అందాల్ని చూపించాడు.
''ఉలి అలికిడి విన్నంతనే/ జలజలమని పొంగి పొరలు...''
ఎంత అద్భుతమైన భావన. రాయి ఉలి అలికిడి విని జలజలమని పొంగుతుందట. బహుశా రాయిని ఇంత గొప్పగా చెప్పిన కవి తెలుగు సాహిత్యంలోనే కాదు అసలు ఏ భాషా సాహిత్యంలోనైనా ఉన్నాడా అనేది అనుమానమే.
మనుషుల్లో వుండే ఏ మానసిక రుగ్మతలూ రాళ్ళకు లేవని...
''కోపాలకు తాపాలకు బహుదూరములో ఉన్నవి/ మునులవోలెనె కారడివిలపడి ఉన్నవి...'' అంటూ గొప్ప స్థితప్రజ్ఞతను చూస్తాడు సినారె రాళ్ళలో.
''కదలలేవు మెదలలేవు/ పెదవి విప్పి పలకలేవు'' అంటూనే ''జీవమున్న మనిషి కన్నా శిలలే నయమనిపించును'' అంటారు.
సామాజిక అంశాల్ని సమాజంలోని అసమానతలను అనేక గేయాల ద్వారా ఆయన వివరించాడు.
''గాలికి కులమేది ఏదీ? నేలకు కులమేది?'' అంటూ ఒక ప్రశ్నను సంధిస్తాడు.
''వీరులకెందుకు కులబేధం/ అది మనసుల చీల్చెడు మతబేధం'' అంటూ ప్రకృతికి లేని కులమత బేధాలు మనుషులకెందుకని ప్రశ్నిస్తాడు.
మనిషిలోని ఊహా ప్రపంచం ఎంతటి మధురమైనదో, అదెంత స్వేచ్ఛాపూరితమైనదో వివరిస్తాడు సినారె.
''పగలే వెన్నెలా జగమే ఊయల/
కదిలే ఊహలకే కన్నులుంటే'' అంటూ ఊహలకు కన్నులిచ్చి, అవి చూసిన అందాలను మనముందు నిలుపుతున్నప్పుడు నిజంగానే మన ఊహల్లోంచే సినారె ఈ అందాల్ని చూశాడా అన్నంతగా మన ఊహలతో మమేకమైపోతాడు.
ప్రకృతిలో మనం చూడలేని, దృష్టి సారించని అనేక చిన్న చిన్న విషయాలను నిశితంగా చూసి మైమరచిన ఆ అందాలను మనకు ''కడలి పిలువ కన్నెవాగు పరుగుతీసే''
కడలి కన్నెవాగును పిలిచిందట. ఆ పిలుపు అందుకున్న కన్నెవాగు పరుగు తీసిందట. ఎంత గొప్ప ఊహ!
నింగిలోని చందమామ తొంగి చూడగానే నీటిలోని కలువ భామ పొంగి పూసిందట. ఎంత మధురమైన ఊహ. ప్రకృతిని ప్రేయసీ ప్రియులలో ఆవహింపచేయడంలో సినారెను మించిన వారు లేరు.
ఎస్.పి. బాలసుబ్రమణ్యం సినిమా రంగానికి పరిచయమైన కొత్తలో ఆయనను నిలబెట్టడంలో సినారె పాటలు ఎంతగానో తోడ్పడ్డాయి. 'మట్టిలో మాణిక్యం, నిప్పులాంటి మనిషి, తూర్పు పడమర, చెల్లెలి కాపురం, కృష్ణవేణి' మొదలైన చిత్రాలకు సినారె రాసిన పాటలు బాలసుబ్రమణ్యం కెరీర్‌కు ఉపయోగపడ్డాయి.
'తాతా మనవడు' చిత్రం కోసం సినారె రాసిన పాట మనుషుల అనుబంధాల్లోని డొల్లతనాన్ని ఎత్తి చూపుతుంది. ''అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం... ఆత్మ తృప్తికై మనుషులు ఆడుకునే నాటకం...'' అంటూ మనుషులు ఆత్మతృప్తి కోసమే అనుబంధాలను నిర్మించుకుంటారని ఎత్తి చూపుతాడు. సాంప్రదాయాలు పక్కదారి పట్టి సమాజం ఎంతగా దిగజారిపోతున్నదో వేదన పడుతూ ''ఇదేనా మన సాంప్రదాయమిదేనా...?'' అంటూ ప్రశ్నిస్తాడు.
తెలుగు సినీ రంగాన్ని అద్భుతమైన గీతాలతో మెరుగులు దిద్దిన కొద్దిమందిలో సినారె ప్రముఖులు. సినారె మరణంతో తెలుగు చిత్రసీమ, తెలుగు శ్రోతలు ఒక అందమైన అద్భుతమైన సాహితీ దిగ్గజ కలాన్ని కోల్పోయింది.
- సిహెచ్. ఉషారాణి,
9441228142