Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''రగులుతున్న పంక్తులు
పగుళ్ళువారిన పాదాలు
నెత్తురోడ్చే అక్షరాలు
కత్తిమొన లాంటి కవిత'' అని అభ్యుదయ కవితకు అందమైన అర్థాన్ని ఇచ్చిన సాహితీ శిఖరం. ఆధునిక తెలుగు కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించి, విశ్వంభరతో తెలుగు నేల విశిష్టతను దశదిశలా వ్యాపింపజేసిన సాహితీ దిగ్గజం డా||సి.నారాయణ రెడ్డి. తెలుగు సాహిత్యాన్ని, తెలంగాణ నేలను జ్ఞానపీఠ్తో సత్కరించిన నారాయణరెడ్డి నిరంతర ప్రయోగశీలి. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆధునిక సాహిత్య చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విలక్షణ వ్యక్తిత్వం ఆయనది.
పద్యాలు, కవితలు, సినిమా పాటలు, గజళ్లు కథలు ఇలా ఏ పక్రియలోనైనా సినారెది అందెవేసిన చెయ్యి. ఆయనకు జ్ఞానపీఠ్ అవార్డు తెచ్చి పెట్టిన 'విశ్వంభర' కావ్యం ఒక ఎత్తయితే, 'కర్పూర వసంతరాయలు, నాగార్జున సాగరం, విశ్వనాథ నాయకుడు, ఋతు చక్రం' మరో ఎత్తు. సినారెగా అందరికీ సుపరిచితులైన సింగిరెడ్డి నారాయణరెడ్డి స్ఫూర్తి సదా స్మరణీయం.
డిగ్రీవరకు ఉర్దూ మీడియంలో చదివినా, తెలుగు, సంస్కృత భాషలపై మంచి పట్టు సాధించారు సినారె. పదమూడవ ఏటనే పద్యాలు రాయడం మొదలెట్టారు. కాలేజీ రోజుల్లోనే 'శోభ' అనే పత్రికకు సంపాదకత్వం వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చదువుతుండగా గురజాడ, రాయప్రోలు, శ్రీశ్రీ, జాషువా, విశ్వనాథ, కృష్ణశాస్త్రి రచనలతో పరిచయమేర్పడింది. అభ్యుదయ, విప్లవ కవిత్వానికి శ్రీశ్రీ, భావ కవిత్వానికి రాయప్రోలు, సంప్రదాయ కవిత్వానికి విశ్వనాథ సత్యనారాయణ లబ్ధ ప్రతిష్టులుగా వున్న వారి బాటనే వెళ్లితే తన ప్రత్యేకత ఏముంటుందని భావించిన సినారె కొత్త ప్రయోగాలకు పూనుకున్నాడు. 1953లో 'నవ్వని పువ్వు' తో మొదలైన ఆయన సాహితీ ప్రస్థానం, నాగార్జున సాగరమై సాహిత్యపు పంటను తెలుగు నాట పుట్లుపుట్లుగా పండించింది. తొంబైకి పైగా గ్రంథాలు, మూడు వేలకుపైగా సినిమా పాటలు, ఇంకా ఎన్నో గజల్స్, కథలు వెలువడ్డాయి.
ఆధునిక తెలుగు సాహిత్యంలో అనేక కొత్త ప్రయోగాలకు ఆద్యుడిగా నిలిచిన సినారె సహజంగానే అభ్యుదయవాది. ఆయన రచనలు అనేకం కన్నడం, మలయాళం, హిందీ వంటి దేశీయ భాషల్లోనే గాక రష్యన్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జపనీస్, ఇటాలియన్, అరబిక్ తదితర విదేశీ భాషల్లోకి కూడా తర్జుమా అయ్యాయి. 1988లో ఆయనకు ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారాన్ని సాధించిపెట్టిన 'విశ్వంభర' కావ్యం మట్టికి, మనిషికి పట్టం గట్టింది. సామాజిక చైతన్యమే కవిత్వ ప్రధాన లక్ష్యం కావాలన్న ఆయన ఆశయం విశ్వంభరలో మనకు ప్రస్పుటంగా కనిపిస్తుంది. మానవ పరిణామ క్రమం, సృష్టి మార్మికత, అల్పత్వం, జ్ఞానం, లొంగుబాటు, ఎదురీత వంటి తాత్వికతల గురించి ఇందులో చర్చించారు. నందమూరి తారకరాముడి ఆహ్వానంతో సినిమా రంగంలో ప్రవేశించిన సినారె అక్కడ కూడా విశేషంగా రాణించారు. సన్నివేశానికి, సందర్భానికి అనుగుణంగా అద్భుతమైన పాటలు రాశారు. 'గులేబకావళి కథ' చిత్రంలో ''నన్ను దోచుకుందువటే'' పాటతో మొదలైన ఆయన సినీ ప్రస్థానం అయిదు దశాబ్దాలకు పైగా సాగింది. ఆణిముత్యాల్లాంటి ఎన్నో పాటలు తెలుగు సినీరంగానికి అందించారు. చంటిబిడ్డలున్న ప్రతి ఇంట ఆయనపాట లాలిపాటై మారుమోగుతూనే ఉంటుంది.
ఆయన నిత్య చైతన్యశీలి. అంతకుమించిన గొప్ప మానవతావాది. సామ్యవాదం, ప్రగతిశీల మానవతావాదమే తన మార్గమని ఎలాంటి శషబిషలు లేకుండా నిర్ద్వంద్వంగా ప్రకటించిన ధీశాలి. సోవియట్ యూనియన్ పతనమైనప్పుడు కమ్యూనిజానికి కాలం చెల్లిందని పెట్టుబడిదారులు సంబరపడుతున్న వేళ 'ఎవడురా అన్నది కమ్యూనిజం చచ్చిపోయిందని... ఎవడురా కూసింది ఎర్ర జెండా నేలకొరిగిందని' అంటూ గర్జించాడు. సామ్యవాదం పట్ల ఆయనకున్న తిరుగులేని విశ్వాసమే ఆయనతో అలా పలికించింది. హిందూత్వ మూకలు చెలరేగి బాబ్రీ మసీదును కూల్చివేసినప్పుడు దానిని సినారె ఖండించారు. అధ్యాపకుడిగా, అధికార భాషాసంఘం అధ్యక్షుడిగా, సాంస్కృతిక మండలి చైర్మన్గా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతిగా, రాజ్యసభ సభ్యునిగా ఆయన వివిధ పదవులు చేపట్టి, వాటికి వన్నె తెచ్చారు. తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. 'నీటికి చలనం ఉంటేనే ఏటికి వరదొస్తుందిరా.. నిప్పున జ్వలనం ఉంటేనే గుప్పున మంటొస్తుందిరా...'' అంటూ ప్రజా చైతన్యానికి ఊపిరిలూదాడు. ''కదిలిందీ అరుణ సైన్యం- బెదిరిందీ చీకటి రాజ్యం'' అంటూ దోపిడీ కోటలపై ఎర్ర జెండాలను ఎగురవేశాడు. రైతు కుటుంబంలో పుట్టి సాహిత్యరంగంలో ధ్రువతారై వెలుగొందాడు.
'నోట్లకట్టల మధ్య నలిగే/ ఓట్ల జన్మహక్కులలో.../ పెచ్చరిల్లే ధరల దూకుడులో.../ డిగ్రీలమూట మూపున కట్టుకొని/ ఆఫీసుల చుట్టూ చాంద్రాయణం చేసే/ నిరుద్యోగుల నిట్టూర్పు నెగళ్లలో...' అని 1971లో రాసిన కవిత ఇప్పటి పరిస్థితికీ సరిగ్గా సరిపోతుంది. రాజకీయ అవినీతి, ధరల పెరుగుదల, నిరుద్యోగం ఏడు దశాబ్దాలలో ఎన్ని వందల రెట్లు పెరుగుతాయో సినారె ఆ రోజుల్లోనే ఊహించి రాశారనిపిస్తుంది ఈ కవిత చదివాక.
'శ్రమజీవుల చెమటబిందువులను/ జాతిరత్నాలుగా తలచేది / మంచికి నిలబడ్డ మనిషిని/మహర్షిగ కొలిచేది' ఇది ఒక అభ్యుదయ కవిగా సినారె కలలు కన్న భారతదేశం. ఒక అభ్యుదయవాదిగా వర్గదృష్టి ఉన్న కవి ఆయన. 'నువ్వూ నేను నిచ్చెనలం/ ఎవ్వరికో ఏతామెత్తే బొక్కెనలం' అంటూ శ్రామికులకు ప్రతీకలైన నిచ్చెన, బొక్కెనలు ఇనాళ్ళు సంపన్నులకు సహనంతో ఊడిగం చేశాయి. ఇప్పుడు శ్రమ దోపిడి అవుతున్నదని తెలుసుకుని మేల్కొన్నాయి అని తెలియజేస్తూ ''చిక్కిన ఫలితమంతా/ ఒక్కడికే దక్కుతుంటే/ ఒక్కడికే దక్కుతుంటే / ఒక్కడే బొక్కుతుంటే.../ ఉగ్గబట్టలేక వెలిగక్కిన /అగ్గిసెగల ఊర్పులివి'' అంటూ పీడితుల చైతన్యాన్ని వర్ణించాడు. అభ్యుదయకవికి మనిషే వాస్తవం. మానవుడే చరిత్రనిర్మాత అని మానవేతర శక్తులు భావవాదుల షృష్టి అని గట్టిగా నమ్మిన మనిషినే తన కవితా వస్తువుగా చేశారు.
రంగులు మార్చే ఊసరవెల్లిని పీడకవర్గానికి ప్రతీకగా చిన్నచిన్న కీటకాలను పీడితవర్గంగా పోల్చి తొండ రంగుమార్చి కాషాయిరంగు ధరించినా కీటకాలు దానిపై తిరుగుబాటు చేసి చంపేశాయి అని అదే నేడు శ్రామిక వర్గం చేయాలని నేటీకి వర్తించే కవిత రాశారు. వర్గ సంఘర్షణలో తుది విజయం పీడితులదేనని మార్క్సిజం చెప్పిన సత్యానికి కవితారూపం ఇచ్చారు.
అభ్యుదయ కవులు ఎప్పుడూ ప్రజల చైతన్యాన్ని కోరుకుంటారు. ప్రజా ఉద్యమాలను సమర్ధిస్తారు. అభ్యుదయ కవైన సినారె ప్రతిఘటన కవిత ద్వారా చైత్యన్యాన్ని ప్రబోధించారు.
''అచ్చమైన జీవితం అనుకరణంలో లేదు/ ప్రతిఘటనంలో ఉంది నిజమైన వ్యక్తిత్వం/ భజనలో లేదు సృజనలో ఉంది'' అంటూ అభ్యుదయ వాదులు, ప్రగతిశీలవాదులు నిత్యం సృజన చేయాలని తెలియజేస్తారు.
''రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకేవరకు... పోతూ పోతూ రాస్తాను'' అని కవితాత్మకంగా చెప్పిన సినారె చివరి దాకా అదే స్ఫూర్తితో అక్షర యాత్ర సాగించారు. యువ కవులను నిరంతరం ప్రోత్సహించేవారు. కవిత్వమే శ్వాసగా, ప్రగతిశీల మానవతావాదమే లక్ష్యంగా తుదికంటా ప్రస్థానం సాగించిన సినారె ధన్యజీవి. ఆ కవి వరేణ్యునికి ఇదే మా అక్షర నివాళి.
- అనంతోజు మోహనకృష్ణ,
8897765417