Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవికుల వతంసుడు
ఏ చందన గిరీంద్రాలపై నుండో
గాలి, కవిత్వమై వీస్తున్నప్పుడు
వసంతాలను వరించిన విరికన్నెలు
అరకన్నులు మోడ్చిన అక్షరాలై నవ్వినప్పుడు
మహాత్ముల మానసాలలో వెలిగే
మానవత్వం
శుభాకృతులై
పదిమంది కోసం ప్రసరించినప్పుడు
మట్టి, గాలి, నిప్పు, నీరు, ఆకాశం
కలంలో కలసి కావ్యం
మనిషై నడిచొస్తున్నప్పుడు
సినారె ….నువ్వు మాకు
ఋతుచక్రాన్ని గానమై స్పృశించే
పరభృతమై కన్పిస్తావు
పగడాల జాబిలి చెక్కిలి తడిమే
కుఱ్ఱ గాడ్పువై అలరిస్తావు
ఓ సినారె ! నీవి కవితలా అవి
నీ కలం పుకిలించిన రసగుళికలు
గుళికలా అవి మరులు గొల్పించే
మదనసతి యౌవనకళికలు
అలుకలు నేర్చిన పలుకులకు
కులుకులు నేర్పిన వాడా
తరగలు సాగిన నుడికడలులకు
తళుకులు తీర్చిన వాడా
అక్షరకన్యలకు
కావ్య లక్షణాలను పొదిగిన వాడా
గంధర్వలోక మధురకవనగాన
సుధారసమ్మును గ్రోలిన వాడా
జోహారు కవి వసంతరాయా జోహారు.
-డాక్టర్. బి. బాలకృష్ణ,
9948997983.