Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జననం….జీవిత విశేషాలు:
ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర లో తనకంటూ కొన్నిపేజీలను సువర్ణాక్షరాలతో లిఖింపచేసుకున్న కవితా తపస్వి దేవరకొండ బాలగంగాధర తిలక్. కవితామతల్లి నుదుట ఎన్నటికీ చెరగని కుంకుమ తిలకమయ్యాడు. కళలకు కాణాచి అయిన బంగారు భారతావనిన తెలుగు గడ్డపై 1921 ఆగష్టు 1 న, పశ్చిమగోదావరి జిల్లా తణుకు తాలూకా "మండపాక" గ్రామంలో జనించాడు.ఆయన తండ్రి సత్యనారాయణ గారికి "లోకమాన్య బాలగంగాధర తిలక్" మీద వున్న అభిమానంతోనే కవి తిలక్ కు "బాలగంగాధర తిలక్" గా నామకరణం చేశారు. తణుకుకు చెందిన పెన్మెత్స సత్యనారాయణరాజు తిలక్ కి గురువు. ఆయన వద్దనే ఛందస్సు, వ్యాకరణం, ప్రబంధాలను నేర్చుకున్నారు.
వీరిది గొప్ప ధనిక కుటుంబం. వీరి తాత తండ్రులు మండపాక జమీందారులుగా ప్రసిద్ధి. వీరు వెలనాటి వైదిక బ్రాహ్మణులు. తిలక్ మొత్తం పన్నెండు మంది సంతానంలో ఆరవవారు. ఆయన భార్య పేరు ఇందిరాదేవి. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. అందరూ విదేశాల్లో స్థిరపడ్డారు. తిలక్ గొప్ప ధనిక కుటుంబంలో పుట్టినా జీవితంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుండే వారు. గుండె జబ్బుకు పెద్ద ఖర్చుతో వైద్యం చేయించుకోవడం వల్ల, ఉద్యోగలేమి వల్ల, స్టెయిన్ లెస్ స్టీల్ వ్యాపారం చేసి నష్టపోవడం వల్ల తిలక్ ఆర్థికంగా చితికిపోయి ఉంటారని నా ఊహ.
తిలక్ ఇంటర్‌తో చదువు ఆపేశారు. సొంతగా తెలుగు, సంస్కృత, ఆంగ్ల సాహిత్యం చదువుకున్నారు. ఆయనకు చాలా మంది మిత్రులు ఉండేవారు. మల్లవరపు విశ్వేశ్వరరావు, పాలగుమ్మి పద్మరాజు, పిలకా గణపతి శాస్త్రి, అనిసెట్టి సుబ్బారావు, అబ్బూరి వరద రాజేశ్వరరావు... ఇలా. రెండవ తరంలో ఆవంత్స, వరవరరావు, ఇంద్రగంటి శ్రీకాంతశర్మ తదితరులు. తిలక్ వీరందరితో కలిసి సాహితీ చర్చలు చేస్తుండే వారు. తిలక్ జీవితకాలమే తక్కువ (1921 - 66) అనుకుంటే దురదృష్టం అందులో ఆయనకు అనారోగ్య విరామ దశ (1946 - 54) ఉండటం. నరాల జబ్బు అన్నారు. కాని తిలక్‌కి ఏ జబ్బూ లేదనీ ఆయన హైపో కాండ్రియాసిస్ (లేని జబ్బును ఊహించుకోవడం)తో బాధ పడుతున్నారని డాక్టర్ల అభిప్రాయం. కాని నిజంగానే ఆయన ఏదో వ్యాధితో బాధ పడేవారు. ఏమైనా ఆయన ఉజ్వలంగా రాయాల్సిన 25వ ఏట నుంచి 33వ ఏట వరకు ‘గదిలో మంచమే ఎల్లలోకమనుచు’ ఉండిపోయారు.
తిలక్ వచన కవితలన్నీ పుస్తకంగా ఆయన బతికి ఉండగా రాలేదు. 1966లో ఆయన మరణించారు. 1968 జూలైలో విశాలాంధ్ర వారు వాటిని ప్రచురించారు. దీనికి కుందుర్తి చేత పీఠిక రాయించారు. ఈ కావ్యానికి ‘అమృతం కురిసిన రాత్రి’ అనే శీర్షిక కూడా కుందుర్తే పెట్టారు. ఈ కవితలలోనే ‘మైల పడిన దుప్పటిలా నాగరికత నన్ను కప్పుకుంది’/ ‘రాత్రిని రంపం పెట్టి కోసినప్పుడు రాలిన పొట్టులా ఉంది వేకువ’ లాంటి కొత్త అలంకారాలను ప్రవేశపెట్టారాయన. ‘అమృతం కురిసిన రాత్రి’కి 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు, 1971లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చాయి. ఈ సంపుటిలోనే ఒక కవితలో ‘కార్తిక మాసపు రాత్రి వేళ/ చల్లని తెల్లని వెన్నెల’ ఎలా ఉన్నదో చెపుతూ తిలక్ ఇలా అంటారు.
‘ఎంత శాంతంగా, హాయిగా, ఆప్యాయంగా ఉందీ!
చచ్చిపోయిన మా అమ్మ తిరిగొచ్చినట్టుంది’.
తిలక్ సాహిత్యం విడివిడిగా అందుబాటులో ఉన్నా మొత్తం లభ్య రచనలను మనసు ఫౌండేషన్వారు ఎమెస్కోతో కలిసి ‘దేవరకొండ బాల గంగాధర తిలక్’ పేరుతో బృహత్ సంపుటిగా హైదరాబాద్ బుక్‌ఫెయిర్ సందర్భంగా వెలువరించారు. దాదాపు వెయ్యి పేజీల ఈ పుస్తకంలో పద్యకవిత్వం, వచన కవిత్వం, కథ... ఇలా అన్ని ప్రక్రియల్లో తిలక్ రచనలు ఉన్నాయి. ఆయన తేజస్సును పట్టి చూపుతున్నాయి. ఈ పుస్తకానికి తిలక్ అభిమాన శిష్యులు ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు ప్రత్యేకంగా రాసిన విస్తృత ముందుమాటలోని కొన్ని విశేషాలు....
తిలక్ దృష్టిలో ‘విశ్వనాథ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ’ ఆధునికాంధ్ర కవిత్వానికి త్రిమూర్తులు. అయితే మరికొందరి దృష్టిలో ‘శ్రీశ్రీ, తిలక్, శేషేంద్ర’ నవ్యాధునిక కవిత్వానికి త్రిమూర్తులు. తిలక్ దీ నాదీ ఒకే ఊరు. తణుకు. 1955లో భారతిలో ఆయన కవిత ‘ఆర్తగీతం’ ప్రచురితమైనప్పుడు ఆయనను పరిచయం చేసుకొని పై చదువులకు వెళ్లేవరకు ఐదేళ్లపాటు అంటి పెట్టుకొని శిష్యరికం చేశాను.
నేను కొంతకాలం తణుకు పోస్టాఫీసులో గుమాస్తాగా పని చేశాను. ప.గో.జిల్లా తంతి తపాలా శాఖవారు జరుపుకొనే వార్షికో త్సవాల సందర్భంగా పోస్ట్‌మేన్ మీద ఒక గేయం రాయమని వెంటపడ్డాను. చూద్దాం చూద్దాం అంటూనే రాయలేదు. ఉత్సవాలు అయిపోయాయి. తీరా ఒకరోజు పిలిచి ‘పోస్ట్‌మేన్’ కవిత వినిపించారు. అద్భుతం. కాని అప్పుడే రాసి ఉంటే బాగుండేది కదా అని నేను నిష్టూర పడితే ‘నువ్వడిగినప్పుడు రాసుంటే ఏడ్చినట్టు వచ్చేది. ఇంత కాలం నానింది కాబట్టే బాగా వచ్చింది’ అన్నారు. ‘మై డియర్ సుబ్బారావ్! కనిపించడం మానేశావ్’ అని మొదలయ్యే ఆ కవిత నన్ను సంబోధిస్తూ నా జీవితాన్ని ధన్యం చేసింది.
తిలక్ రాయాలని రాయలేక పోయిన నాటకం- ఖడ్గతిక్కన. ‘చూడు సుబ్బారావ్. ఖడ్గతిక్కనను శత్రువులు చంపలేదు. నెల్లూరి ప్రజలు, తల్లిదండ్రులు, భార్య కలిసి చంపేశారు. ప్రతికూల పరిస్థితులు న్నప్పుడు యుద్ధం నుంచి పారిపోయి వస్తే తప్పేముంది? బెర్నాడ్ షా ‘ఆర్మ్స్ అండ్ ది మేన్’ నాటకం రాసినట్టుగా నేను ఖడ్గ తిక్కన నాటకాన్ని కొత్తగా రాస్తాను’ అనేవారు.
తిలక్ కథకులుగా ప్రసిద్ధులు. సమకాలీన సంఘటనలకు ఆయన వెంటనే స్పందించేవారు. నవకాళి దురంతాలు జరిగిన కొద్దిరోజులకే ‘అద్దంలో జిన్నా’ రాశారు. ‘ఊరి చివరి ఇల్లు’ కథను ‘ది షాడోస్’ పేరుతో స్వయంగా ఆంగ్లంలోకి అనువదించి ‘ట్రిబ్యూన్’ అమెరికన్ పత్రిక జరిపే ప్రపంచ కథల పోటీకి పంపారు. ఈ పత్రిక జరిపిన పోటీలలోనే గతంలో పాలగుమ్మిగారి ‘గాలివాన’ కథకు బహుమతి వచ్చింది. ఆయనకు మల్లే తనకు కూడా బహుమతి రావాలనే పట్టుదల తిలక్గారిలో ఉండేది.
తిలక్ వ్యక్తిత్వ ప్రత్యేకతలు…..
తెలుగు భాష ఎంత మెత్తనిదో, తిలక్ మనసు అంత సున్నితమైనది. కానీ ఇతని కవిత్వం మాత్రం సునిశితమై, పదునైన భావాలతో అలరారింది.సన్నగా, పొడుగ్గా,తెల్లగా మెరిసిపోతూ చక్కని స్ఫూరద్రూపిగా అందరి మనసుల్లో నిలిచిపోయాడు. తిలక్ తెలుగు మరియు ఇంగ్లీషు లలో చక్కని పాండిత్య ప్రకర్ష కలిగివున్నాడు. చిన్న ప్రేరణకు కూడా చలించిపోయే సుకుమార హృదయం కలిగి వుండేవాడు.మెత్తని మనసు కలిగిన స్నేహశీలియే గాక రసజ్ఞుడు కూడా. ఆరోజుల్లో నరసారావుపేటలో స్థాపించిన " నవ్య కళా పరిషత్" లో ప్రముఖ సభ్యుడిగా ఉండేవాడు.
పాశ్చాత్య, ప్రాచీనాధునిక సాహిత్యంలో మంచి పట్టు కలిగినవాడు. భావ కవిత్వం అతని చేతుల్లో పరుగులు పెట్టేది. వృత్త కవితలు వ్రాసినా,జీవిత పోరాటాన్ని వ్రాయడానికి ఆ పరిధి చాలదనిపించి, వచన గేయాన్ని ఎన్నుకున్నాడు. నిశితమైన భావాలు, పద రమ్యత, విశిష్ట శైలిని అలవర్చుకొని వ్రాసిన కవితలతో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఇతర ప్రక్రియలలోఅంటే కథలు,నాటికల రచనలో కూడా తాను మేటి అని నిరూపించుకున్నాడు.మధ్యతరగతి జీవనం, అనాథలు, దగాపడ్డ దీన జనం, బిచ్చగాళ్ల, పడుపు వృత్తి, చీకటి బజారులో దొరలను పాత్రలుగా రచనలు మలిచారు.
కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ ల ప్రభావం మొదట్లో వున్నా తన ప్రజ్ఞతో, ప్రతిభతో తనదంటూ ప్రత్యేక శైలిని అలవర్చుకొని వచన కవితా ప్రక్రియను ఉన్నత శిఖరంపై నిలబెట్టాడు. ఇతని కవిత్వం సాంప్రదాయవాదులను, ఆధునికుల అభ్యుదయవాదాన్ని మెప్పించిందనడంలో అతిశయోక్తి లేదు.
తిలక్ లోని కవి మరింత విశ్వరూపం చూపకముందే,వికసించిన ఆ కవి పుష్పం వాడకుండానే, సౌరభాలు వీడకుండానే చిన్న వయసులోనే, నలభై ఐదేళ్ల నడిప్రాయంలో 1966 జులై 1 న అనారోగ్యంతో ఈ నేలకు సెలవంటూ ఆ నింగిన చేరాడు.
రచనలు….
కవితా సంపుటాలు...
ప్రభాతము-సంధ్య(దీనితోనే కవి జీవితాన్ని ప్రారంభించారు);గోరువంకలు(ఇందులో తిలక్ పద్య కవితలు వ్రాసారు.); కఠినోపనిషత్తు; అమృతం కురిసిన రాత్రి
కథానికా సంపుటాలు….
తిలక్ కథలు; సుందరీ- సుబ్బారావు; ఊరి చివర యిల్లు
నాటకాలు….
సుశీల పెళ్లి; సుప్త శిల; సాలె పురుగు
నాటికలు…..
సుచిత్ర ప్రణయం; తిలక్ లేఖలు
పురస్కారం...
తిలక్ చే రచించబడి విశేషాదరణ పొందిన "అమృతం కురిసిన రాత్రి" అనే కవితా సంపుటి అతని మరణానంతరం 1968లో ముద్రణ పొందింది. దీనికి కుందుర్తి ఆంజనేయులు గారు పీఠిక వ్రాసారు. ఈ కవితా సంపుటి 1971 లో ఉత్తమ కవితా సంపుటిగా " కేంద్ర సాహిత్య అకాడమీ" అవార్డును అందుకొంది.
సాహిత్య ప్రస్థానం:
ఉవ్వెత్తున ఎగసిన భావ, అభ్యుదయ కవిత్వోద్యమాల నేపథ్యంలో తిలక్ కవిత్వ రచన ప్రారంభమైంది. "ప్రభాతము-సంధ్య"తో కవిగా జీవితాన్ని ప్రారంభించిన దేవరకొండ బాలగంగాధర తిలక్, తొలి రోజుల్లో అందరు భావ కవుల్లాగానే పద్యాలనే ఆశ్రయించాడు."గోరువంకలు, అద్వైత మన్మధం, సీత, వివేకానందుడు" వంటి శీర్షికలతో ఎన్నో పద్య ఖండికలు వ్రాశాడు. ఇతని కవిత్వం భావుకత్వం ప్రధాన లక్షణంగా ఉండేది.
దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీ శ్రీ గార్ల ప్రభావం మొదట్లో కొంత వున్నా, తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న అసమాన ప్రతిభా సంపన్నుడు.తిలక్ కవిత్వం అభ్యుదయ శీలతను, భావ సౌందర్యాన్ని ఇముడ్చుకుంది. తిలక్, తాను అనుభూతివాదినని గట్టిగా చెప్పుకున్నారు. వచన కవితా రచనయే గాకుండా ఇతర సాహితీ ప్రక్రియలో విశేష కృషి చేసారు. రూపకాలంకారాలను(మెటఫర్స్) సులభంగా, సుందరంగా, విస్తృతంగా వాడుకొన్న కొద్ది మంది కవుల్లో తిలక్ ఒకరు.పద చిత్రాలను అద్భుతంగా పండించిన నేర్పరి.ఇతర సాహిత్య ప్రక్రియాల్లో కూడా తాను కనబడుతాడు. ఛందోబద్ద కవిత్వమే కాదు, కథ, నాటికా రచనలో తన ముద్ర వేసాడు.
అభ్యుదయ కవితాయుగం బాగా వర్ధిల్లిన రోజుల్లో కవులు శైలికి, అక్షర రమ్యతకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం పెద్ద లోపం అయింది. కానీ తిలక్ అభ్యుదయ భావాలకు రమ్యమైన శైలిని కూర్చడంలో కృతకృత్యుడయ్యాడు. అభ్యుదయ కవితాయుగంలో కావ్యవస్తువు కొన్ని పరిధులకు లోబడి కొన్ని నిర్దిష్ట అంశాలకు మాత్రమే పరిమితమైనట్టు కనిపించింది. దీనిని పూరిస్తూ జీవితంలోని అన్ని రంగాలకు వ్యాపింపచేసి అన్ని రసాలను వచన కవిత్వంలో ఇమిడ్చి అందరిచే ఒప్పించబడే కవిత్వం వ్రాసి చూపించాడు తిలక్. వ్యావహారిక భాష, రస దృష్టి, వాస్తవికతా దృక్పథం, అనితర సాధ్యమైన శైలి తిలక్ రచనలలో కనిపించే రీతులు.
కవితా సంపుటాలు రాకుండానే ఆధునిక కవితా రంగంలో ప్రముఖులుగా వెలిగినవారు తిలక్, శ్రీశ్రీ, అజంతాలు. వీరిలో తిలక్ రచనా శైలి, పద రమ్యత, తీసుకున్న కవితా వస్తువులు అన్నీ కలిపి కవితాప్రియులకు ప్రియమైన వాడిగా నిలిపాయి.కవిత్వం అంటే అంతగా ఆసక్తి లేని వారికి కూడా చేరువైంది. పద్య కవితాభిమానులను కూడా అలరించింది. ఇతడు వ్రాసిన పద్య సంకలనం"గోరువంకలు". ఇందులో ఛందోబద్ద కవిత్వం ఉంటుంది. అందులోని సౌందర్యం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.
అందపు లేతసిగ్గు తడియారని తారుణ కుంకుమ ప్రభల్
విందొనరించు నీ పసిమి నిల్చిన చెక్కిలి వోలె నాకు నీ
సుందర సంధ్యవేళ పొడచూపును వంపుల ఆకసమ్ము ఓ
స్పందిత చంద్రమ! ప్రభ!శుభానన! రమ్మిక మోహగీతివై (గోరువంకలు, ప్రతిభ 1942-44).
శిశిరము సన్నసన్న చిరు చీకటి బాటల వచ్చి జాలిగా
కొసరెడి పూల అత్తరుల కోసము తారెడి గాలి గొంతులో
విసమునుబోసి నల్దెసల వీచుచు సోరణ గండ్ల సందులన్
ముసరుచు తాకిపోవు విషమూరెడి సూదుల వ్రేళ్ళు గ్రుచ్చుచున్ (శిశిరము, 1942-45)
వీని చెంతజేరి విడువగలను నేను
సుఖములేని రాణి సొగసులేని
వీని పనుపుచాలు వెడలగలను నేను
అడవికేని కడలి నడిమి కేని (స్వయంవర, భారతి 1942-48)
ఇంత చినుకు పడిన ఎంత పొగరు హెచ్చి
పచ్చి గడ్డిపరక పల్లవించె
చిన్ని పువ్వు తొడిగి చిలిపిచిలిపి గాలి
నూగి తూగి నవ్వు నూరినెల్ల (ఆటవెలది, భారతి, 1961).
తెలతెలవార నా యెడద తీర్చిన మ్రుగ్గుల త్రొక్కివచ్చు శీ
తలపవనమ్ము వీవు, కనుదమ్ముల సవ్వడి సోకి లోతు లో
తుల దిగిపోవు రత్నఖచితోజ్వల హేతివి, మద్గవాక్ష వీ
థుల పొగమబ్బులౌ అగరు ధూపము తావివి నీవు రాఘవా (అద్వైత మాన్మథము, భారతి 1961-66).
తిలక్, "సుప్త శిల" నాటకంలో మనందరికీ తెలిసిన అహల్య శాపగాథను రమణీయ అద్భుత దృశ్య నాటికగా తనదైన శైలిలో రచించారు.రేడియోలో కూడా ప్రసారం చేయబడింది.అహల్యగా శారదా శ్రీనివాసన్ నటన చెప్పనలవి కానిది.
ఇక కథానిక సంపుటి అయిన "తిలక్ కథలు" లో కథకుడిగా కూడా విశిష్టత కనబరిచాడు. సామాన్య మానవుని సామాజిక పార్శ్వాలను ఇందులో స్పృశించాడు.తానే చెప్పుకున్నట్టు కవిత్వంలో తాను దొరికినట్టే కథల్లో కూడా దొరకడం వింతేమీ కాదు.
వీరు వ్రాసిన కథ ‘నల్లజర్ల రోడ్’దాదాపుగా భారతీయ భాషలన్నింటిలోకీ అనువదించబడ్డది.
ఎందరో చదువరులను తనవైపు త్రిప్పుకొని, అభిమాన పాఠకులుగా మలచుకొని ఇతర రచయితలకు ఇష్టమైన కవితా సంపుటిగా మారిన "అమృతం కురిసిన రాత్రి", తిలక్ కలం నుండి జాలువారిన భావ కవిత్వాభ్యుదయ వెన్నెల వీచిక." కేంద్ర సాహిత్య అకాడమీ" వారిచే ఉత్తమ కవితా సంపుటిగా పురస్కారం పొందింది. ఇందులో సామాజిక పరమైన తన ఆలోచనలను సునిశితంగా కవిత్వీకరించి సాహితీ లోకంలో కవిగా సార్ధకత పొందాడు.దురదృష్టవశాత్తు తిలక్ మరణానంతరం కుందుర్తి ఆంజనేయులు 1968 లో,దీనికి పీఠిక వ్రాయగా ముద్రణ పొందింది.
అమృతం కురిసిన రాత్రి లోని విశేషాలు అన్నీ, ఇన్నీ కావు. కవిత్వం ఆలాపించడానికి ఛందోబద్ద గుణం ఉండాలి. అప్పుడే కంఠానికి పట్టుబడుతుంది. ఆ పద్యం గొప్ప పద్యం కాకపోవచ్చు, ఆ కవి గొప్పవాడు కాకపోవచ్చు. కానీ ఛందో భంగం కాకుంటే కంఠ వశం అయిపోతుంది. కానీ వచన కవిత కంఠవశం కావడానికి ఆ కవి ఎంత విశేష ప్రతిభ కలిగి ఉండాలి.అలాంటి ప్రతిభుడు తిలక్. అతని పంక్తులు రసగంగా ప్రవాహమైతుంటే మన చూపుల ప్రవాహం అందులో కలిసిపోయి మనసుకు ఆనంద నివేదన చేస్తుంది. హరివిల్లు కనుల ముందు నిలిచినట్టు వర్ణిత విషయాలు పద చిత్రాలై దృశ్యమానమవుతాయి. ఈ కవితా సంపుటిలోని కవితా ఖండికలు, అదృష్టాధ్వ గమనం ,నీవు లేవు నీ పాట ఉంది, అమృతం కురిసిన రాత్రి,ఆర్తగీతం, కఠినోపనిషత్, వసుధైక గీతం, విరహోత్కంఠిత, చావు లేని పాట, నెహ్రూ, వెళ్ళిపొండి వెళ్ళిపొండి, మంచు, వెన్నెల, శిఖరారోహణ, వానలో నీతో, సైనికుడి ఉత్తరం, ఇలాంటివి ఎన్నో గళమెత్తి పాడుకునేలా ఉండటమే కాక పాడుకోవాలని అనిపిస్తుంది కూడా.
ఈ సంపుటిలో మొదటి కవితలోనే తన కవిత్వం ఏ రకానికి చెందుతుందో , కవిత్వం ఎలా ఉండాలో, ఎలా వుండరాదో చాలా బాగా చెప్పాడు. కవులను గురించి కవిత్వాన్ని గురించి రెండు మూడు కవితా ఖండికలలో చెప్పాడు అక్కడక్కడా కూడా కవిత్వ తత్వం గురించి స్పృశించాడు. తన గురించి తాను చెప్పుకునే కవుల్లో కూడా తిలక్ ఒకరిగా వున్నారు. 'నా కవిత్వం' అనే కవితా ఖండికలో ఇలా వ్రాస్తూ
నా కవిత్వం కాదొక తత్వం
మరికాదు మీరనే మనస్తత్వం
కాదు ధనిక వాదం, సామ్య వాదం
కాదయ్యా అయోమయం జరామయం
తన కవిత ఏ తత్వం లోనూ ఇమడదని చెప్పుకున్నాడు. ఏ కొలతబద్దతోను కొలవద్దన్నాడు.
అంతేకాదు,తన కవితలు ఎలా ఉంటాయో ఇలా కూడా చెప్పాడు.
నా అక్షరాలు కన్నీటి జడులతో తడిసే దయా పారావతాలు
నా అక్షరాలు ప్రజా శక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకొనే అందమైన ఆడ పిల్లలు.
తన కవితల్లో కరుణ, సౌందర్య పూరిత శక్తులతో నింపి విశ్వ శ్రేయస్సుకు పాటుపడతానంటాడు.ఇందులో విశ్వ శ్రేయస్సుకు విజయ ఐరావతాలు అనే అద్భుత ప్రతీకను వాడాడు. భావకవిత్వం పాళ్లు ఇతనిలో ఎక్కువ కాబట్టి, తన అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు అంటూ అన్న మాట ఇప్పటికీ అందరి గుండెల్లో చిన్న భావాతి శయ హాయిని కలిగిస్తుంది. తెలుగు కవిత్వం ఉన్నంతవరకు మరిచిపోని పద సొగసు ఇది.
కవిత్వాన్ని నేడు అనుభవ ప్రధానంగా పరిగణిస్తున్నాం. సిద్ధాంతాల కోసం కవిత్వాన్ని, అసలు వ్యక్తిని, బలి పెట్టే తత్త్వం హర్ష నీయం కాదు. అంటాడు తిలక్.ఈనాటి కవిత చురుకైన ఆవేశాన్ని, సాంద్రతరమైన అనుభూతి వత్తిడినీ, సూక్ష్మమైన భావననీ పొదువుకుంది.కవి దృష్టి
వస్తు స్వరూపాలకూ, సంఘర్షణ లకూ, శక్తులకూ, కీలక స్థానం మీద శక్తి వంతమైన బ్యాట్రీ లైటు ఫోకస్ చెయ్యడం లాంటిది అంటాడు తిలక్."నిన్న రాత్రి" అనే కవితలో అతని తత్వమంతా గోచరిస్తుంది. ఇతర అభ్యుదయ కవులకు, తనకు ఉన్న వ్యత్యాసం తెలుస్తుంది. నవీన భావుకులు, అభ్యుదయవాదులు తమ తమ వాడేనని ఎందుకు భావిస్తారో అవగతమవుతుంది.
ఈ కవితా ఖండికలో ఒక యువకుని ఆకలి చావు,"అమ్ముకొని యౌవ్వనం, అలసిన జీవనం" సాగించి, సాగించి, సంధ్య వేళ ఉరి తీసుకొన్న సాని దాని కథ, కాంగోలో, క్యూబాలో, సైప్రస్ లో, లావోస్ లో కాలి, కమురు కంపు కొట్టే కాలం కథ, మానవ వ్యథ వర్ణిత
అడుగ లేదు!" అని కూడా అంటాడు.
దేవుని చెక్కిళ్ళ మీద దీనంగా కారే కన్నీటిని
మానవుడే దానవుడై తిరగ బడినప్పుడు
పాపం పెద్దవాడు కన్న కడుపు ఏం చేస్తాడని!
ఈ ఆధునిక యుగంలో దేవుడు ఎంత నిస్సహాయుడై పోయాడో, దేవుని చెక్కిళ్ళ మీద దీనంగా కార్చే కన్నీటిని తుడిచి ఊరడించ వలసిన పరిస్థితి కవికి పట్టింది.మరో చమత్కార మేమిటంటే తిలక్ బాధ్యత నంతా దేవుని మీద వేయడు. హృదయాన్ని కదిలించే విధంగా మానవుడే దానవుడై ప్రవర్తిస్తే,పాపం దేవుడు మాత్రం ఏంజేస్తాడు,పైగా కన్న కడుపు అంటూ జాలిని వ్యక్త పరుస్తాడు.సిద్ధాంతాలన్నింటికీ అతీతమైన మానవతా ధర్మాన్ని ప్రతిపాదిస్తాడు తిలక్ ఈ కవితలో. ఈ సంకలనము లోని ప్రతి కవితా ఖండిక స్వయం సంపన్నత గలవే. దేని కదే చదివి ఆనందింపతగినది. ఒక దానితో మరొకటి వస్తు బాంధవ్యము లేనిది.దేని అనుభూతి దానిదే. ఇదే తిలక్ లోని గొప్పదనం.
ఆకాలంలో కొంతమంది యువకులు "నయాగరా" కవులనే పేరుతో సాహిత్యాన్ని వరదగా ప్రవహింపచేశారు. ఆనాటి యువకులకు వ్యక్తి చైతన్యాన్ని, సంఘ చైతన్యంగా అనువదించాలనే ప్రగాఢమైనది.ఆ సమయంలో"మేగ్నా కార్టా" కవిత వ్రాశాడు తిలక్. విజయ శంఖారావ విమలగీతమ్ము తో కొత్త మార్గాలకై సాగిపోతాడు. "మేగ్నా కార్టా" అంటే ప్రతి పౌరుడికి అన్ని విధాల స్వేచ్ఛ అవసరమనే ప్రభల వాంఛ.
"వసుధైక గీతం "లో తన కవితకు ఎల్లలు లేవని తన కవితలతో ఉత్తర, దక్షిణ ధృవాలను స్పృశిస్తానని, చక్రవర్తి పదవి సంపాదించుకున్నానని అంటాడు. లేత ఎరుపు ఆవేశాన్ని ఒంటి నిండా కప్పుకొని కడుపులో వణికించే చలి కనబడకుండా ఆలోచనల మంటలంటించి గొణుక్కుంటూ, పాడుకుంటూ ఏదో రాసుకుంటున్నాను అంటూ రచనలు చేసేటప్పుడు తన మానసిక శక్తి ఎలా ఉంటుందో, వ్యక్తపరుస్తాడు తిలక్.
ఇక "సైనికుని ఉత్తరం"లో వారి గురించి వ్రాసిన తీరు మన హృదయాంతరాల్లో తడిని సృష్టిస్తుంది.వారి జీవన విధానం, బాధలు ఒక ఎత్తు అయితే, మనుషుల్లోని స్వార్ధం, కుల అసహాయత వారిని నిరుత్సాహ పరచి, వారిలో నిర్వీర్యతనే గాక రాక్షసత్వాన్ని, జీవితం పట్ల చులకనా భావాన్ని యినుమడింప చేస్తుంది. అప్పటి వారి మనస్థితిని మనో వేదనను వ్యక్తపరచడంలో మనోంతరాల నుండి అనుభూతిని విశాల పరిధిలోనికి గొని వచ్చి ఘనీభవింప జెయ్యాలని ప్రయత్నిస్తాడు తిలక్. భార్యాపిల్లలను ఎన్నాళ్లకు కలుస్తానో, అసలు కలుస్తానో లేదో అనే వారి వేదనకు అద్భుత అక్షరరూపం ఇచ్చాడు తిలక్.ఇదే తిలక్ శైలి లోని ప్రత్యేకత. మానవుల్లోని దయ, కారుణ్య భావనకు ప్రతీకగా ఈ కవితను చెప్పుకోవచ్చు. దీనితో మనకు కవి హృదయం కూడా తేటతెల్లమవుతుంది.
ఇక తిలక్ ప్రకృతి ఆరాధకుడిగా కూడా కొన్ని కవితల్లో కనబడుతాడు. ఉదయ, సాయంకాల సంధ్యలను గురించి వారు చేసిన వర్ణన అతి సుందరమై మనసు ఆహ్లాదంతో నిండిపోతుంది. యువశక్తి దేశానికి ఎంతో అవసరం. కానీ వారికి నిరంతరం ప్రేరణ, ఉత్సాహం కలిగిస్తూ ఉండాలి సమాజం. అప్పుడే వారి శక్తి వెలికివచ్చి దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది. ఈ విషయం తిలక్ కు తెలుసు కాబట్టే, "పిలుపు" అనే కవితలో యువతరాన్ని మేల్కొనమని పిలుస్తున్నాడు.
ఇతని "ఆర్త గీతం" గురించి చాలా చెప్పుకోవాలి. ఇది ఒక హృదయ విదారక మైన కవిత. ఈ కవిత చదువు తున్నప్పుడు దేవులపల్లి కృష్ణ శాస్త్రి రచన "ఏడ్వనీండి నన్ను" మనకు స్పురిస్తుంది. కాని ఈ రెండు కవితలలో చాలా వ్యత్యాస మున్నది. తిలక్ హృదయ వ్యధకు దారి తీసిన కారణాలు పాఠకుణ్ణి సహితం అత్యంత వేదన పాలు చేస్తాయి. తాను చూచిన దృశ్యాలను హృదయానికి హత్తుకొనే విధంగా చిత్రిస్తాడు తిలక్. "నేను చూచాను నిజంగా మూర్తీభవత్ దైన్యాన్ని, హైన్యాన్ని, క్షుభితాశ్రు కల్లోల నీరధుల్ని,గచ్చత్ శవాకార వికారుల్ని" అంటాడు భరించ లేని ఆవేదనతో. అందుకే కాబోలు ఇది ఏ నాగరికతకు ఫల శ్రుతి? ఏ విజ్ఞాన ప్రకర్షకు ప్రకృతి; ఏ బుద్ధదేవుని జన్మ భూమికి గర్వ స్మృతి"? అని నిక్కచ్చిగా ప్రశ్నిస్తాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ అంటాడు. "ఒక్క మలినాశ్రు బిందు వొరిగి నంత వరకు; ఒక్క శుష్క స్తన్య సన్నిధిని క్షుదార్తి నేడ్చు పసి పాప ఉన్నంత వరకు...; అలాగే "ఒక్క తల్లి వీరవాక్రోశ రవమ్ము విన్నంత వరకు, ఒక్క క్షత దుఃఖిత హృదయ మూరడిల్ల నంత వరకు, నాకు శాంతి కలగదింక నేస్తం, నేను నిగర్వినైనాను, ఈ సిగ్గు లేని ముఖాన్ని చూపించ లేను" అని వాపోతాడు. అంతే కాదు, ఈ స్థితిని గురించి పట్టించు కొనే నాధుడెవడైనా (రాజకీయ వేత్త గాని, భోగ భ్యాగ్యాలను భవించు వారుగాని) ఉన్నాడా? ఈ విషాద ఆర్తి వారిని చలింప జేస్తుందా? ఏ భగవంతునికి ఈ హృదయ విదారక స్థితి విన్నవించాలి? అని ప్రశ్నిస్తాడు కవికుల తిలక్. "ఆర్త గీతం"లోని కవి భావాలు గమనిస్తే, అతనిలో మనిషితనం మేల్కొనే ఉందన్న విషయం సుస్ఫష్టం. అతనిలోని ఆర్తి, ఆవేదన,కవికుండే లక్షణాలు అని తెలుస్తుంది. మానవధర్మం పాటించడంలో ముందుంటాడని అర్ధమవుతుంది. నిండినది. ఆయన కోరుకున్నదేమంటే దేశంలోని మనుషులకు కడుపు నిండా ఆహారం, బ్రతుకు పొడువునా స్వతంత్రం, కొంచెం పుణ్యం,కొంత కన్నీరు, మరికొంత సంతోషపు తేనీరు. ఈ అవసరాలన్ని తీరేకాల మెప్పటికైనా వస్తుందా అని ఆయన మనో వ్యధ. దానిని గురించి అటు దేవునికీ, ఇటు మనిషికీ తగిన జవాబు ఇవ్వ లేక తన నిస్పృహను వ్యక్త పరుస్తాడు.
ఇక "ఒక శ్రుతి" కవితా ఖండిక ను పరిశీలిస్తే తిలక్ ప్రతిభ ఎంత గొప్పదో మనకు అర్ధం అవుతుంది. శ్రుతి అంటే, ధ్వని, వినబడినది, సంగీతంలోని మేళవింపు అనే అర్ధాలున్నప్పటికీ, ఇక్కడ 'వినబడినది' అనే అర్ధాన్ని తిలక్ వాడాడని అర్ధమవుతుంది.
ఈ కవితలో దూరదూరల్లో రేఖగా, పొలి మేరగా కరిగి నిల్చిన తనలో వినబడే" శ్రుతిని" కవి పలికించడానికి ప్రయత్నిస్తాడు. ఇది చాలా లోతైన భావన. కొన్ని సార్లు మనుషుల అంతర్నేత్రపు చీకట్లను తొలగించటానికి కవి తన మనసు చీకటికి వెలుగురేఖను జోడించాలి. ఇది చీకటిని పారదర్శకంగా చేస్తుంది.ఇవే పాఠకుడికి అందే సంకేతాలు, కవితా రహస్యాలు.
"దూరపు రేఖ" అనే పద సంఘటన చాలా ప్రతిభావంతమైనది.దూరాన ఉన్న రేఖ అని కాదు దీని అర్థం. దూరము అనేటువంటి రేఖ. మానవుడు దైవానికి, ఒకేసారి అనంత దూరంలోనూ, అమిత సమీపంలోనూ ఉన్నాడు.అందుకని ఒకేసారి దూరాన్ని సమీపానికీ, సమీపాన్ని దూరానికీ తీసుక పోగల శక్తిని ప్రదర్శిస్తుంది "దూరపు రేఖ" అనే సమాసం. ఇటువంటి అద్భుత శిల్పాన్ని తిలక్ తనదైన నవ్య మార్గంలో విచిత్రంగా చూప గలిగాడు" (అద్దేపల్లి రామమోహనరావు) 'ఒక శ్రుతి' అనే కవితా ఖండికలో.
లోతైన భావనతో వ్రాసిన "కఠినోపనిషత్"లో అధునాతన భావుకుల గురించి ఆలోచిస్తాడు. "కోట్ల
కొలది జనులు ఎండమావుల పండగలు చేసు కుంటున్నారని" ఎంతటి కఠిన సత్యం తెలిపాడు తిలక్ ఇప్పటికి పరిస్థితి మారలేదు.ఎంతటి నిరాశ.ఆస్తిక, నాస్తిక మత సిద్ధాంతాలు మనుషులం అన్న నిజాన్ని మర్చిపోయేలా చేశాయని వాపోతాడు.
ఇక "నువ్వు లేవు నీ పాట ఉంది " అనే రసభూషిత కవిత గురించి ఎంత చెప్పినా తక్కువే. గల గల గోదారిలా అక్షర ప్రవాహం సాగిపోతుంది. చదవడం అయ్యాక అయ్యో అయిపోయిందా అనిపిస్తుంది.ఆమె తాలూకు మధుర స్మృతులతో కూడిన కవిత ఇది. మరువలేని వారి ప్రేమ,ఇప్పటి తన దీనస్థితి, ఆగని కన్నీళ్ల నడుమ అందమైన భావరసస్ఫోరకంగా కవిత తీర్చిదిద్దబడింది. ఇది ఒక ఎలిజీ లాంటిది.
"అమృతం కురిసిన రాత్రి" కవితా ఖండిక 1962 లో రచించాడు. ఇది ఊహాత్మక ఆత్మాశ్రయ కవిత. ఆనందం పరవళ్ళయ్యింది ఈ కవితలో. ఆహ్లాదంగా తనను తాను వ్యక్తీకరించుకుంటూ,ఊహాలోకంలో విహరిస్తూ పొందిన అనుభూతి పరంపర.
అదొక రమణీయ రాత్రి. ఎందుకంటే మైదానమంతా వెన్నెల పరుచుకుంది. జనమంతా నిద్రాదేవి ఒడిలో జోగుతున్నారు. ఇతనొక్కడే పయనిస్తున్నాడు కొండా, కోన దాటి వెన్నెల మైదానంలోకి. ఇందులో ఆత్మఘోషతోపాటు ఆధ్యాత్మిక భావాలు చొప్పించాడు.అద్భుతమైన అనుభూతిని మనతో పంచుకున్నాడు. మనమూ మెలకువతో ఉంటే ఆ రాత్రి కురిసిన అమృతాన్ని త్రాగి వచ్చేవాళ్ళం కదా, అని అనిపిస్తోంది కదూ. ఇదే తిలక్ గొప్పదనం. ఈ కవితా మధుర్యానికి తలిగ్గాల్సిందే ఎవరైనా. అందుకేనేమో ఈ కవితా సంపుటికి, "అమృతం కురిసిన రాత్రి" అని శీర్షిక పెట్టారు.
తిలక్ కవితల్లోని రచనా పారవశ్యం ప్రతీ ఒక్కరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది. కవితా శిల్పం ప్రస్ఫుటంగా కనబడుతుంది.నేను కాని నేను" అనే కవితా ఖండికలో ఈ విషయం మనకు విశదమౌతుంది.
"ఒక నిశార్థ భాగంలో నివహ గగనం
ఓరగా భూమ్మీదకు ఒంగి ఏదో రహస్యం చెబుతున్న వేళ" అంటారు కవి. "నక్షత్రాలతో కలసిన ఆకాశం భూమ్మీదకు వంగి రహస్యం చెప్పటం" అనేది గొప్ప వ్యక్తీకరణ. పదాల పొందిక అద్భుతం. రహస్యం అనే పదం ఉపయుక్తంగా , మహత్తరంగా వాడబడింది.
మహాకవులైన విశ్వనాథ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ లు అంటే అవ్యాజమైన గౌరవాదరాలు తిలక్ మహాశయునికి. వారిని త్రిమూర్తులుగా చిత్రీకరిస్తాడు. అల్లాగని వారిని గుడ్డిగా అభిమానించడు. చురక చురకగా వ్యంగ్య రీతిలో వారిని గూర్చి ఈవిధంగా అంటాడు
ఒకడు:
మావాడే - మహాగట్టివాడు - మకుటం లేని మహారాజయ్యేవాడు
కాని ముసలిదాన్ని, మసక మసక కన్నులదాన్ని
మూలమూల ముడుచుకు కూర్చున్నదాన్ని
మనువు చేసుకోవాలన్న ఉబలాటంతో
మంచి చెడ్డా మరచి పోయాడు
మర్యాదల్ని అతిక్రమించాడు
మరి పనికిరాడు.
మరొకడు:
మల్లెపూల మీద పరుంటాడు, మంచి గంధం రాసుకుంటాడు
మరి ఎందుకేడుస్తాడు?
మంచి పనివాడు, మాకు నచ్చిన వాడు
మాతో నడుస్తా నంటాడు
మరి నిజంగా వస్తాడా?
మూడోవాడు:
అరే! వీడు చిచ్చిర పిడుగు,
ఎండలో నడిచే మనుష్యులకు గొడుగు
ముందుకు వేసిన అడుగు
మాకు చిన్నన్న కానీ అన్నన్న!
ఈ మధ్య విదేశాల చవకబారు
పానీయాలు సేవించి
మత్తుగా పడుకున్నాడు
మరి యిప్పట్లో లేవడు
ఎంతో చమత్కారంగా, నిర్భయంగా, త్రిమూర్తులలాంటి కవులను చిత్రిక పట్టాడు. ఇదే కదా తిలక్ గొప్పదనం. చివరగా కవిత్వం గురించి తన దృక్పథాన్ని తన "నవత-కవిత"లోని మాటల్లోనే చదువుదాం.
"కవిత్వం ఒక ఆల్కేమీ, దాని రహస్యం కవికే తెలుసును
కవిత్వం అంతరాంతర జ్యోతి స్సీమల్ని బహిర్గతం చెయ్యాలి, విస్తరించాలి చైతన్య పరిధి
అగ్ని జల్లినా, అమృతం కురిసినా
అందం, ఆనందం దాని పరమావధి".
తిలక్ కవిత్వాన్ని గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ‘అద్భుత సౌందర్యం - దుర్భర విషాదం’.
తిలక్, తానే చెప్పుకున్నట్టుగా
"జీవితాన్ని హసన్మందారమాలగా ధరించాను
అందుకే పాపం
ఈనాటికీ ఎవరికీ తెలియదు
నేను అమరుడనని…."
నిజమే మీరు అమరులు. తెలుగు సాహిత్యం వెలుగుల్లో కాంతిరవ్వై మా గుండెల్లో తళుకులీనుతుంటారు. కవి అన్న తర్వాత విమర్శలు సహజం. తిలక్ దీనికి అనర్హుడేమీ కాదు.వీరిపై ప్రధాన విమర్శ భావ కవిత్వ ఛాయలు ఎక్కువగా ఉండటం, గ్రాంధిక భాషా ప్రయోగం, సంస్కృత సమాసాలు ఉపయోగించడం, అభ్యుదయ కవిగా తనకు తాను ప్రాముఖ్యాన్ని కోరుకున్నాడని, తోటి జనుల ఆకాంక్షలను తాను ఆదర్శలుగా స్వీకరించలేదనేవి కొన్ని ముఖ్య విమర్శలు.
విమర్శల సంగతి ఎలా వున్నా,తిలక్ కవిత్వాన్ని గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ‘అద్భుత సౌందర్యం - దుర్భర విషాదం’. తన అసామాన్య ప్రతిభా జ్ఞాన సంపత్తితో కవితా సతి నొసట నిత్య రసగంగాధర తిలకమయ్యాడు 'దేవరకొండ బాలగంగాధర తిలక్'.
-సుధా మైత్రేయి
9989042236