Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేను చూసిన అతను ఓ మహోన్నత వ్యక్తిత్వ శిఖరం...
అంచనాలకందని కడలి లోతంతటి గాంభీర్య దర్పణం...
ఆతని మాటలు స్ఫూర్తి ప్రేరకాలు నింపు ఉత్తేజ పరిమళం...
ఆతని కనుసన్నలలో నడుస్తున్న నా జీవన గమనం పూల సుగంధ భరితం...
ఆ ఆలంబనే అమృత తుల్యమై వేశానొక మేటి ముందడుగు...
ఆశ్చర్యం..!!! ముడిపడిన బృకుటి, చిట్లించిన కనుదోయితో ఆతని అసహనం...
ఆంక్షల సంకెళ్లను బిగిస్తూ, నీకు తగదంటూ వీడివెళ్తున్న అతగాడి నైజం...
ముందర ముందర మేరు పర్వతమే అనుకున్నాలి
తన గుణగణాలకు దీటుగా నన్ను ఎదగనివ్వని మరగుజ్జు మనసు అది...
తన అడుగులకు మడుగులొత్తేహొ దాస్య సృంఖలాలు నాకు తగిలించబడ్డాయని...
తన కీర్తి శిఖరాలను కొనియాడుతూ శ్రావ్య గీతాలాపనలు మాత్రమే చేయాలని...
నేనో ఆరాధనల పూజా హారతులనిచ్చే పూజారిణిగా నియమింపబడ్డానని...
నా సాధికార స్వర ప్రకంపనలతో ఊడుతున్న ఆతని కపట ముసుగు పొరలు...
ఆ తరువాత తెలిసింది అరకు లోయల్లో కూడా అతనున్నాడనిలి
ఓ పురుషాధిక్య మేరు పర్వతాన్నే చూశాననే నా నిరాశా నిట్టూర్పులు...
కడలి లోతంతటి భావ గాంభీర్యం అరకు లోయలో రాలిన తాటాకుల డొల్ల ధ్వనే...
ఏ ఉత్తేజమూ లేని అతని స్వర కంపనలు ధూళి మేఘాలై చెదిరిపోగా...
అతనొక మామూలు విగ్రహ మూర్తే, నా ఆరాధనా కటకాలు చూపిన విశ్వరూపం మాత్రమే..!!!!
-శ్రీమతి అమరా లావణ్య