Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళ అంటూ లేనివారు
ఈ భూమి మీద ఎవరూ ఉండరు..
అమ్మ కడుపులో పడ్డప్పుడే
కళ మొదలవుతుంది
చిన్ని చిన్ని కాళ్ళతో తన్నడం..దొర్లడం
ఇదోరకమైన ప్రారంభకళ..
తన్నినప్పుడు బాధను భరిస్తూ..
చిరునవ్వుతో ఇదో
గొప్పకళగా భావిస్తుంది అమ్మ...
అమ్మ పొత్తిళ్లలోనుంచి జారి
పుడమిపై పడ్డప్పటి
కెవ్వుమనే కేక.. అదో అద్భుతమైన
కళానైపుణ్యమే..
పురిట్లోనే పురుడుపోసుకున్న
కళాప్రస్థానం...
బ్రతకాలన్నా ఓ కళ..
మరొకరిని బ్రతికించాలన్నా ఓ కళ..
నవ్వడం ఓ కళ.. నవ్వించడం మరోకళ..
కడుపు నింపుకోవాలన్నా ఓ కళ తెలిసుండటం తప్పనిసరి..
కళలు అంతరంగానికి వెలుగు..
అంతరాత్మను
ఆనందంగా ఉంచుజిలుగు..
అంతులేని బాధనైనా
అర్థంకాని బరువవైనా
కళలతోనే తొలగు..
కళ లేని వారు ఓ బండశిల.. ఒంటరివారికి
కళలతోనే కాలక్షేపం..
అదేవారి కరవాలం..
ఎన్నోరకాల కళలు..
కొన్ని.. ఆత్మసౌందర్యానిచ్చేవి.. మరికొన్ని..
అందరినీ ఆనందపరిచేవి. ఇంకొన్ని..
శిలను శిల్పంగా మలిచేవి.
ముడిరాతిని సైతం మూర్తిగా మలిచేవి..
కలంతో కావ్యాలనూ వ్రాయించేవి...
ఇప్పుడు నిజమైన
సహజ కళలు అంతమవుతున్నవి..
ఆదరణ తక్కువైనవి..
కళామతల్లి కలతబారుతోంది..
బోరుమని విలపిస్తోంది
ఏ కళాకారుడి నైపుణ్యముతో
పురుడు పోసుకొన్నదో కదా..
మా ఇంట్లో నేడు పూజలందుకుంటున్న మట్టివినాయకుడు!!..
సహజ కళలు సాగిపోతున్నాయి..
కలత నిద్రలోకి జారిపోతున్నాయి...
ఆనాటి జానపదాల జాడలేమైనాయి?!!..
నాటకాలు తెలియని నడకలైనాయి!!..
తోలుబొమ్మల కళారూపాలు తోవతప్పాయి!!...
ఒగ్గుకథలు.. జముకుల కథలు..
బుర్రకథలు.. అన్నీ ఉనికిని పోగొట్టుకున్నాయి..
చిందేసే భాగవతాలులేవు చిలిపిఆటలు లేవు..
అందుకే కళామతల్లి కన్నీరు పెట్టు కొంటుంది.. కాలభ్రమణంలో అవి మళ్లీ పునరుజ్జీవనమై ప్రకాశిస్తాయని ఆశగా ఎదురుచూస్తోంది...
అంబటి నారాయణ
నిర్మల్
9849326801