Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మట్టిపై
ఎక్కడ కాలుమోపిన కవిత్వం తండ్లాడ్తది.
ఎవ్వర్ని పలకరించిన జీర గొంతుతో
పల్లెజానపదాల తెలుగు ఇంపుదనం ఇనబడ్తది
తెలుగంటే మాకాడ
మా బత్కు మా మెత్కు.
ఈ మట్టిపై మాటమాటకి
సామెతలు వల్లించే పెద్ద మనుష్యులున్నారు
పల్లెపల్లెకు గుండెనిండెటంతగా
ఆసువుగా జానపదం పాడేటి రైతన్నలున్నరు.
సేనుసేనుకాడ దోసిలినిండేటంతగా
పల్లె ముచ్చట్ల సుద్దులు చెప్పే
పెద్దరాశి పెద్దమ్మలున్న పదాల మాగాణమిది.
అలిసిపోయి పొలం మధ్యలో
ఆ ఇంటికూర ఈ ఇంటిరొట్టె
కల్పుకొని ఊరి ముచ్చట్లు మాట్లాడకాడనే
తెలుగు భాష బత్కి నాల్గుకాలాల పాటు
నిలిచిపోతది.
ఈ మట్టిపై
తెలుగంటే ఎంత కమ్మగుంటదంటే
ఇస్తరాకు సుట్టూ ఇరవై తొక్కులేసుకోని తినట్లుంటది.
ఆకలైనప్పుడు పైటాలైదంటే
పాలిండ్లను గుంజుకోని గుంజుకోని
అమ్మ ఒడిలో పసిపిల్లాడు
పాలు తాగేటంతటి కమ్మగా ఉంటది.
ఈ మట్టిపై
సిగమూపే కవిత్వం రాసేకవులున్నారు.
ఇదే గడ్డపై
పెండ్లికి శాసబోసినట్లు
పద్యాలల్లే పండితులున్నారు.
ఈ మట్టిపై
బొడ్రాయికి బొట్టుబెట్టి
కట్ట మైసమ్మను యదల తల్సుకోని
తెలుగు కథలు సెప్పేటోళ్లున్నారు.
పల్లె ఎల్లమ్మ గుడి సుట్టూ తిరిగి
సేతికి కంకణం గట్టుకోని
హరిశ్చంద్రుని కథ ఆరు దినాలు సెప్పే కథరాజులున్నారు.
ఈ మట్టిపై
వాన రాకపోతే కప్పతండ్లాటాడే ఆటగాండ్లున్నారు
పీర్ల పండగనాడు అలాయి ఆడి
అలాయి బలాయిగా దుంకులాడే
ఆశన్న ఊశన్న కాశిమన్నలున్నారు.
ఈ అవనిపై
మునంకోసారీ పాటందుకునే పల్లెతల్లులున్నారు.
ఈ మట్టిపై
తెలుగే మాకు ఎన్నెల వెలుగు.
మాకు కాలు కదలలన్న సెమట సిందాలన్న
పాడె మోయాలన్న కాడి ఎత్తలన్న
మోట కొట్టలన్న మూట దించాలన్న
మా నోటెంట తెలుగు యాసలొలికే
తీయ్యటి రాగమొకటి రాకపోతే
మా ఊపిరి ఆగిపోతది.
--అవనిశ్రీ.
9985419424.