Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యమ కవిత్వమనేది ఆధునిక తెలుగు సాహిత్య ఆరంభం నుండి సంఘ సంస్కరణోద్యమ కవిత్వంగా, జాతీయోద్యమ కవిత్వంగా, ప్రాంతీయ వాదంతో వచ్చిన నేటి తెలంగాణ ఉద్యమ కవిత్వం వరకు వివిధ రూపాలుగా వెలువడుతూనే ఉంది ఏ ఉద్యమ కవిత్వం లో నైనా స్థూలంగా జాతీయాభిమానము, ప్రాంతీయాభిమానం మెండుగా కనిపిస్తాయి. అయితే జాతీయాభిమానంతో రచనలు చేసే వారు కొందరైతే, ప్రాంతీయాభిమానంతో రచనలు చేసే వారు మరికొందరు కానీ ఈ రెండిటిని బలంగా వినిపించిన కవులు తెలుగు సాహితీ లోకంలో చాలా అరుదుగా కనిపిస్తారు ఆ కోవలోనే ఈ రెండిటినీ కాలానుగుణంగా తెలుపుతూ "కవిత ద్వారా మేల్కొల్ప లేనప్పుడు కాళోజీ కాయం చాలింక" అంటూ "జీవితమే కవిత్వంగా కవిత్వమే జీవితంగా" తన కవితోద్యమంతో ప్రజల్ని చైతన్య పరిచిన ప్రజా ఉద్యమ కవి కాళోజీ.
"చావు కైనా జంక నీయదు మాతృదేశము మాతృదేశమే" అని "ప్రాంతం వారి రక్షణ పనికి రాదన్నప్పుడు ప్రత్యేక రాజ్యం పాలు కోరక తప్పదు" అంటూ జాతీయ, ప్రాంతీయ అభిమానాలను తన కలం పదునులో పదిల పరుచుకుని "ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక" గా తన తుది శ్వాస వదిలె వరకు కవితాలాపన గావించాడు కాళోజీ.
కాళోజీ ఉద్యమ కవిత్వాన్ని 'తూర్పు మల్లారెడ్డి' చెప్పినట్లుగా జాతీయోద్యమ కవిత్వం, నిజాం వ్యతిరేకోద్యమ కవిత్వంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. కానీ వీటితో పాటు కాలానుగుణంగా తెలంగాణ ఉద్యమ కవిత్వం కూడా అందించిన కాళోజీ ఉద్యమ కవిత్వాన్ని విషయ అవగాహన కొరకు మూడు రకాలుగా విభజించవచ్చు. అవి: 1) జాతీయోద్యమ కవిత్వం 2) నిజాం వ్యతిరేకోద్యమ కవిత్వం 3) ప్రత్యేక తెలంగాణోద్యమ కవిత్వంగా నిరూపించవచ్చు.
1) జాతీయోద్యమ కవిత్వం :
తెలుగు సాహితీ లోకంలో జాతీయోద్యమ కవిత్వమనేది, జాతీయ, ప్రాంతీయ అభిమానంగా రెండు పాయలుగా ప్రవహించింది ఈ రెండింటినీ కూడా బలంగా వినిపించారు కాళోజీ.
జాతీయ అభిమానంతో కాళోజీ "పరుల యొక్క పాలనలో ఉండటం కంటే హేయమైనది మరొకటి లేదని, నీరు లేని ఎడారి అయినా మాతృదేశం మాతృదేశమే" అంటూ "మాతృదేశం" కవిత ద్వారా పరుల యొక్క పాలనలోని దేశ విముక్తిని ఆకాంక్షించాడు.
"మాతృదేశం మాట ముచ్చట
ముదము గూర్చదు మదికిననియెడి
పరమ నీచుడు ధరణి నంతట
కలియ వెదికిన కాననగునా?
నీరు లేని ఎడారియైనను
వాన వరదల వసతియైనను
అగ్గి కొండల అవనియైనను
మాతృదేశము మాతృదేశమే
లాఠి దెబ్బల లక్ష్యమేమి
కఠిన శిక్షయే కాదు కాదు
చావు కైనను జంక నీయదు
మాతృదేశం మాతృదేశమే
స్వర్గమే అపవర్గ మేయని
చాటిచెప్పెడు జన్మభూమియె
పరుల వశమున నరక కూపము
కన్న హేయము కఠిన తరము"
అంటూ తన జాతీయ భావాన్ని చాటుకున్నాడు కాళోజీ. అంతేకాకుండా...
"పరాయి వాడు దోపిడి చేస్తే
బార్డర్ దాక తన్ని తరిముతాం
మన వాడే దోపిడి చేస్తే
మన కాళ్ళ కిందే పాతరేస్తాం."
అని గర్జిస్తూ ప్రాంతీయత భావాన్ని వ్యక్తం చేశాడు కాళోజీ.
2) నిజాం వ్యతిరేకోద్యమ కవిత్వం:
నిజాం వ్యతిరేక ఉద్యమ కవిత్వాన్ని ఎక్కువగా రచించిన కవులు దాశరథి, గంగినేని, కాళోజీ. 'అగ్నిధార' తో దాశరథి, గెరిల్లాతో గంగినేని, కాటెయ్యాలి అంటూ 'నా గొడవ' అంటూ గొడవ చేసిన కాళోజీ లు, నిజామును ఎదిరించి తన కవితలతో పోరాడారు.
"రాచరికంబు ముసలి నక్కకు దక్కునా?
తెలంగాణం రైతుదే." అని
"తీగలను తెంపి అగ్నిలోన దింపినారు
నా తెలంగాణ కోటి రతనాల వీణ" అంటూ దాశరథి అగ్నిదారను కురిపిస్తే.
"కసియారి పోకుండ బుస కొట్టు చుండాలె
కాలంబు రాగానే కాటేసి తీరాలె"
అంటూ కల నాగుల కదం తొక్కాడు కాళోజీ.
దోపిడీలు, హత్యలు, స్త్రీలను చెరచడం వంటి రజాకార్ల యొక్క దమనకాండకు చెలించిన కాళోజీ, నిజాం అరాచక పాలన కు వ్యతిరేకం గా హింసకు ప్రతిహింసే గుణపాఠం అని తిరగబడి కాటేయాలి అంటూ బుస కొట్టాడు కాళోజీ.
"మన కొంపలార్చిన మన స్త్రీల చెరచిన
మన పిల్లలను చంపి మనల బంధించిన
మానవాధములను మండలాధీశులను
మరచిపోకుండగ గుర్తుంచుకోవాలె
--------------------------------------------
కండ కండగా కోసి కాకులకు వేయాలె
కాలంబు రాగానే కాటేసి తీరాలె."
స్త్రీలపై నిత్య కృత్యమైన రజాకార్ల యొక్క అత్యాచారాలు, ప్రజల మాన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నిజాం నిరంకుశ పాలనను "చాలింక" అంటూ నినదించాడు కాళోజీ.
"బాధ్యత లేని ప్రభుత్వ భటులు
పెట్టే బాధలు చాలింక
బాధ్యత గల పరిపాలన లేక
బ్రతికిన బతుకులు చాలింక
హద్దుమీరి అధికార వర్గము
ఆడిన ఆటలు చాలింక
రాజు పేరిట అరాజకమునకు
జరిగిన పూజలు చాలింక
రక్కసి తనముకు పిశాచ వృత్తికి
దొరికిన రక్షణ చాలింక."
అన్యాయం జరిగినపుడు మనసు చలించి కవిత రాయడం కాళోజీకి సహాజ లక్షణం. అలాగే న్యాయం కోసం అన్యాయాన్ని ఎదిరించే వాళ్ల పక్షాన నిలబడి కూడా నిజాంను ఎదురించాడు. నల్లగొండలో భూస్వాములపై తిరగబడ్డ రైతుకూలీలపై నిజాం పోలీసు దళాల ఆకృత్యాలను "ఇంకెన్నాళ్లు" అంటూ ప్రశ్నిస్తూ ప్రజలంతా సమైక్యమై పోరాడాలని పిలుపునిచ్చారు.
"నల్లగొండలో నాజీ వృత్తుల
నగ్నసత్యమింకెన్నాళ్లు?
పోలీసండన దౌర్జన్యాలు
పోషణ పొందేదెన్నాళ్ళు?
కంచెయె చేనును మేయుచుండగా." అంటూ ప్రశ్నించాడు.
తన కవిత్వంతో తెలంగాణ ప్రజలను జాగృతం చేస్తూ, నిజాం నిరంకుశ పాలనను ఎండగడుతూ ఎప్పటికప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించే కాళోజీ. ప్రజల కొరకు ప్రజలను ఉద్యమింప జేసి జమీందారీ వ్యవస్థ పై తిరుగుబాటు ప్రకటించిన "ప్రజాశక్తి" పై నిజాం ప్రభుత్వం నిషేధం విధించిన సందర్బంలో కాళోజీ "తీర్పు" అనే కవిత ద్వారా ఇక నిలువ జాలదు నీ ప్రభుత్వం ఈ ప్రజల తీర్పులో అంటూ నిజాం ప్రభుత్వంను ఎండగట్టాడు.
"ప్రజా సంస్థ పై పగ సాధించిన
ఫలితము తప్పక బయటపడున్
నిక్కుచు నీల్గే నిరంకుశత్వము
---------------------------------
ప్రజాశక్తి పై పందెం వేసిన
ప్రభుత్వమే పాటిగ నిల్చున్." అని నినదించాడు.
1946లో వరంగల్లు కోటలో 'హయగ్రీవాచారి' ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేయడాన్ని అడ్డుకోవడానికి వచ్చిన రజాకార్లను ఎదిరించిన 'మొగులయ్య' అనే యువకున్ని చిత్రవధతో హంతం చేసి అతడి రక్తం ను దుస్తులకు, చేతులకు పూసుకుని వెళ్తున్న రజాకార్లను దారిలో 'శబ్దానుశాసన గ్రంథాలయం' అరుగుపై ఉన్న ఓ పసి బాలుడు చూసినందుకు,ఆ బాలుడిని అతి క్రూరంగా, అమానుషంగా హతమార్చిన రజాకార్ల రాక్షస కాండకు తల్లడిల్లిన కాళోజీ. ఈ రాక్షస ప్రభుత్వం ఇంకా ఎన్నో రోజులు కొనసాగదు అనే నగ్నసత్యాన్ని "నగ్నసత్యాలు" అనే కవిత ద్వారా తెలియజేశాడు.
"పట్టపగలే పట్టణంబుల
పట్టి పౌరుల కొట్టి చంపిన
దుష్ట కూటమితో ప్రభుత్వం
దొంగ బేరము చేసినట్లే
దుష్టులకు తావిచ్చి తోడై
ఆధిపత్యములోన కులజులు
అనాధలై జీవించినట్లే"
నిజాం ప్రభువులు ముస్లీం భాషను ఆదరించడం వల్ల, తెలుగుకు ఆదరణ కరువై మూలపడే పరిస్థితుల్లో, కాళోజీ హృదయం ద్రవించి, భాషను, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేస్తూ, స్వీయ భాష రక్షణ కొరకు "అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలిస్తావెందుకురా" అంటూ "ఆంధ్రుడా" అనే కవిత ద్వార ఆక్రోశించాడు.
"ఏ భాష రా నీది ఏమి వేశావు రా?
ఈ భాష ఈ వేషం ఎవరికోసం రా?
ఆంగ్ల మందును మాటలాడగల్గగనే?
ఇంతగా కుల్కెదవు ఎందుకోసమురా?
సూటు బూటు హ్యటు సోకుగా దొడుగగ
ఘనతేమీ వచ్చెరా గర్వమేటికిరా? II ఏ భాష రా II
-------------------------------------
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా? II ఏ భాష రా II
అంటూ మాతృభాష మమకారాన్ని చాటుతూ నిజాం పాలనను తూర్పారబట్టాడు.
3) ప్రత్యేక తెలంగాణోద్యమ కవిత్వం :
నిజాం పాలనలో సాంస్కృతికంగా, ఆర్థికంగా వెనుకబడిన తెలంగాణ, పెద్దమనుషుల ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్ లో విలీనమైంది. అప్పటినుండి ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రుల పరిపాలనతో, పాలనాపరంగా, నీళ్లు, నిధులు, వనరులు, ఉద్యోగాలు. దోపిడీకి, వివక్షకు గురైనాయి.పరిపాలన క్రమంలో తెలంగాణ యాస, భాష హాస్యం చేయబడి, తెలంగాణ ఉనికిని కోల్పోతున్న దశలో కాళోజీ స్పందించి. నిర్భయంగా, నిర్మోహమాటంగా, తెలంగాణ అభివృద్ధికి స్వీయ పాలన కావాలని, అందుకు ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావమే ముఖ్యమంటూ "అన్యధా శరణ నాస్తి" అనే కవితతో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను తెలియజేశాడు.
"ప్రాంతం వారి రక్షణ
పనికిరాదు అన్నప్పుడు
ప్రత్యేకంగా రాజ్యం
పాలు కోరడం తప్పదు
ముఖ్యమంత్రి ఆదర్శం
ముఠా తత్వమైనప్పుడు
ముల్కీ మంత్రులు సైతం
ప్రధానమంత్రికి బంట్లు అయినప్పుడు
ప్రత్యేకంగా రాజ్యం
పాలు కోరడం తప్పదు."
అన్యాయం అనిపిస్తే ఎంతటి వారైనా ఎవరైనా సరే వెంటనే ప్రశ్నించి ఎదురు తిరిగి పోరాడే స్వభావం కాళోజీది. తెలంగాణ అభివృద్ధికి తోడ్పడ కుండా, తెలంగాణ నిధులను సైతం ఆంధ్ర ప్రాంతానికి తరలించిన అప్పటి ముఖ్యమంత్రి 'కాసు బ్రహ్మానందరెడ్డి' యొక్క వ్యవహారాన్ని ప్రశ్నిస్తూ, "నమ్మి పెత్తనం ఇచ్చినందుకు" అంటు "నిర్వాకం" అనే కవిత ద్వారా కాసు యొక్క నిర్వాకాన్ని ఎండగట్టాడు.
"నమ్ముకొని పెత్తనము ఇస్తే
నమ్మకం పోగొట్టుకొంటివి
కుప్ప కావలి ఉండి కట్టలు
తావు దీస్తివి ముద్దెరేస్తివి
సాటి వాడు చేరదీస్తే
అన్న అధికారమునకు తగిన
న్యాయ బుద్ధిని కోల్పోతివి
చిలిపి చేష్టలు చేసి ఇప్పుడు
చిలుక పలుకులు పలుకుచుంటివి."
అని నిలదీశాడు కాళోజీ.
ఉధృతంగా కొనసాగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని లాఠీచార్జీలు, కాల్పులతో అణగదొక్కడానికి ప్రయత్నించిన ఆనాటి ఆంధ్ర ముఖ్యమంత్రుల వైఖరిని, అధికార దర్పాన్ని ప్రశ్నిస్తూ, "కలం - బడితె - రూపాయి" అనే కవితతో కలాన్ని అధికారానికి, బడితెను సైన్యానికి, రూపాయిని ధనానికి, ప్రతీకలుగా చేసి ప్రజల్లో పౌరుషాన్ని రగిలించాడు కాళోజీ.
"కలం- బడితె - రూపాయి
కొలువు దీర్చి కూర్చున్నాయి
కసిగా మనల జూస్తున్నాయి
మసిగ మనల జేస్తున్నయి
కసాయి కోత కోస్తుతున్నయి
కాలం వేసి రాస్తున్నాయి
కలం - బడితె - రూపాయి
వలలు పన్ని పడుతున్నయి."
తెలంగాణ ఉద్యమం అణచి వేయడానికి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ తెలంగాణ కొరకు "అష్ట సూత్రాల పథకాన్ని" ప్రకటించింది. ఆ పథకాన్ని ఆనాటి తెలంగాణ నాయకులంతా వ్యతిరేకించారు. కాళోజీ కూడా ఆ పథకాన్ని వ్యతిరేకిస్తూ, సంతృప్తి చెందకుండా "ప్రత్యేక తెలంగాణ" వల్లనే తెలంగాణ ప్రజలకు న్యాయం చేకూరుతుంది తప్ప ఇలాంటి పథకాల వల్ల కాదు, అంటూ ఇది "ఫిరదౌసి చచ్చినాక గజనీ మహమ్మద్ కానుక" వంటిదని "ప్రధాన మంత్రి ప్రకటన"అనే కవిత ద్వారా నినదించాడు.
"ఫిరదౌసి చచ్చినాక
గజ్నీ మహమ్మద్ కానుక
ఎందుకమ్మా ? ఎందుకమ్మా ?
ఏ పీనుగు శోభకమ్మా ?
ప్రధానమంత్రి శ్రీమతి గాంధీ
ప్రకటన ఎందులకమ్మా ?
--------------------------------------
అష్ట సూత్ర ప్రణాళిక
అరిష్టాలు బాపతమ్మా!
తెలంగాణ ఏర్పాటే
తెలుగోరికి శుభమమ్మా!"
ప్రత్యేక తెలంగాణ కొరకు పోరాడిన "ప్రజా సమితి" నాయకులను, అష్ట సూత్రం ఫలించక, విభజించు పాలించు అనే సూత్రాన్ని పాటిస్తూ తన రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ లో విలీనం చేసుకున్న శ్రీమతి గాంధీ గారి కుటిలత్వాన్ని "దండి ఉపాయం" అనే కవిత తో ఇది ఏ మతము? ఏ శాంతి? రాజ్యాంగ సమ్మతమా? అంటూ ప్రశ్నించాడు కాళోజీ.
"వెనకటి కో అమ్మగారు
విచారించి విచారించి
పందిరి చుట్టూర్త మొండి
---------------------------------
నేత నెహ్రూ కాత్మ శాంతా?
లాల్ బహుదూర్ మతమా
రాజ్యాంగ సమ్మతమా?"
అంటూ నిర్మొహమాటంగా నిక్కచ్చిగా నిలదీశాడు కాళోజీ.
ముల్కీ నిబంధనల కొరకు తెలంగాణ ప్రాంతం వారు, దీనికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతం వారు, తీవ్రంగా ఉద్యమం చేస్తున్న కాలంలో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడి రాష్ట్రపతి పాలన విధించబడింది. ఆ సందర్భంలో ఉద్యోగుల హక్కులను కాలరాస్తూ, పౌరులు అభిప్రాయాలకు విలువ ఇవ్వక, ఆందోళనకారులపై కాల్పులు జరిగిన పరిస్థితులను, తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని "రాష్ట్రపతి పాలనలో ఆంధ్రప్రదేశ్" అనే కవితలో చక్కగా వివరించారు. ఇలా అనేక సందర్భాల్లో స్పందించి ప్రత్యేక తెలంగాణా కొరకు తన కవితల ద్వారా మరణించే వరకు అలుపెరుగని పోరాటం చేసిన కాళోజీ, ప్రజల యొక్క ఆకాంక్ష తెలంగాణ ను కుండ బద్దలు కొట్టినట్టుగా ప్రకటిస్తూ
"దోపిడి చేసే ప్రాంతేతరులను
దూరం దాకా తన్ని తరుముతం
ప్రాంతం వారే దోపిడి చేస్తే
ప్రాణంతోనే పాతర వేస్తం." అంటూ ఆక్రోశంతో ఆగ్రహిస్తూ తెలంగాణ నినాదాన్ని ప్రకటించాడు కాళోజీ.
జాతీయమా? ప్రాంతీయమా?అన్నది ముఖ్యం కాదు కాళోజీకి, ఎప్పుడైనా ఎక్కడైనా అన్యాయాన్ని ఎదిరించడమే కాళోజీ లక్ష్యం. అందుకు ఎంతటివారినైనా ప్రశ్నించడమే తనకు తెలిసిన తత్వం. నిజామును, ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని ఇలా అందరిని ప్రశ్నించి ఎప్పుడు అతను స్వేచ్ఛ,సమానత్వం కలిగిన సంపూర్ణ స్వాతంత్య్రం కావాలనే కోరాడు, బానిసత్వాన్ని నిరసించాడు.
"ఉల్లంబుల పల్లేరు పొరలగ
కల్లబొల్లి నవ్వులు వెదజల్లుచు
తల్లడిల్లు ప్రాణాలకు
గొల్లున యేడ్చే స్వాతంత్ర్యంబెపుడో"
అంటూ సంపూర్ణ స్వాతంత్ర్యం కొరకు పోరాడిన కాళోజి, ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించి గొడవ చేయడమే కాదు అన్యాయాన్ని ఎదిరించే వాడు ఎవరైనా తనకు ఆరాధ్యుడు అని అన్యాయాన్ని ఎదిరించినపుడే తన గొడవకు ముక్తి అంటూ గొడవ చేశాడు.
"అన్యాయాన్నెదిరిస్తే
నా గొడవకు సంతృప్తి
అన్యాయాన్ని అంతరిస్తే
నా గొడవకు ముక్తి ప్రాప్తి
అన్యాయాన్నెదిరించినోడు నాకు ఆరాధ్యుడు "
అన్యాయాన్ని సహించని కాళోజి అన్యాయం అంతం కొరకు ఆందోళనే ఊపిరిగా, తిరుగుబాటు వేదాంతంగా ఉద్యమించాలని హెచ్చరించాడు.
" ఆందోళన ఊపిరి
తిరుగుబాటు వేదాంతం
ఉద్యమం మనుగడ
హెచ్చరిక ప్రజాస్వామ్యం."
అంటూ కాలానుగుణంగా జాతీయ ప్రాంతీయాభిమానాలను చాటుతూ, అన్యాయాన్ని ఎదిరించి పోరాడుతూ తన కవితోద్యమం తో ప్రజల్లో చైతన్యం మేల్కొల్పుతూ జీవితాంతం ఉద్యమించిన కాళోజీ గారి జీవితం, జ్వాలాముఖి గారు చెప్పినట్లు కాలానికి లోబడిన జీవితం.
ప్రజల కొరకు ప్రజల గొడవను తన గొడవగా "నా గొడవ" అంటూ జీవితాంతం గొడవ చేసిన కాళోజీ, తెలుగు సాహిత్య లోకం ఉన్నంతకాలం ప్రజాకవిగా ప్రజల మనసుల్లో చిరస్మరణీయుడు.
---- మాచిడి సంతోష్ గౌడ్.
M.A, T.P.T, NET, SET, (Ph.D.).
చర వాణి: 9948351138.
Email: santhoshmachidi@gmail.com.
మంథని, పెద్దపల్లి.
ఆధార గ్రంథాలు :-
1) నా గొడవ.(2012)
2) కాళోజి యాదిలో.(2002)
3) శ్రీ కాళోజీ సాహిత్య సమాలోచన -(తూర్పు మల్లారెడ్డి).
( తెలుగు అకాడమీ) నాల్గవ తెలుగు మహాసభలు.