Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాడుంది నా యాస
కథలల్ల కవితలల్లనే
కొద్దో గొప్పో
ఊపిరి పోసుకుంటా వుంది
యాడుంది నా యాస
శ్రమకారుల నాలుకల మీదనే
జారుడు బండాట ఆడుతా వుంది
సామాన్య జనం నోళ్లల్లనే
నారపొట్టెలా నాంతా వుంది
యాడుంది నాయాస
బానిస బుద్ధులింకా
లుక లుకలాడుతనే వున్నయ్
బానిస రోగం
కరోనా పురుగులెక్క
బతుకు మూలాల్ని
తొలుస్తనే వుంది
నా రాజ్యం నా చేతికొచ్చినా
నా రాజ్యం గొంతింకా
పాత పాటనే పాడుతాంది
పుస్తకాల పల్లకీ ఎక్కి
తరగతి గది వీధుల్లో
పట్ట మహిషిలా
ఊరేగాల్సిన నా యాసింకా
పరిచారికలానే
ఓ మూలన
నిలబడి పోయుంది
నా యాసను వెక్కిరించిన
నోళ్లింకా
పూర్తిగా మూతపడనే లేదు
నా యాసను
దుష్ట పాత్రలకు
స్వరంలా మార్చి
మా బతుకుల్లో దొర్లించిన
అవమానాల అపశృతులింకా
చెదిరిపోనే లేదు
అవహేళనల గాయాలింకా
మాసిపోనే లేదు
భాషేదైనా
ఎవరి యాస వారికి ప్రాణం
యాస ఒక జీవిక
యాస ఒక ఉనికి
యాస ఒక ప్రాణ దీపం
యాస ఒక తొక్కులాట
యాస ఒక బతుకు పాట
యాస ఒక సొంతు గొంతు
నా గొంతు నాది కావాలె
నా స్వరం నాది కావాలె
నా పాట నాది కావాలె
నా మాట నాది కావాలె
నా యాస నాక్కావాలె
మొత్తంగా
నా బతుకు నాది కావాలె
నా యాసే కదా నా ఊపిరి
నా యాసే కదా
నా సంస్కృతి సిరి
నా అధికారిక యాసింకా
గొంగళి దశలోనే వుంది
సీతాకోక చిలుకై
రాజ్యం పూల తోటనింకా
చుట్టేయటం లేదు
సామాన్యుని స్వరంలో పలికే
నా యాస
నా రాజ్యానికీ పూర్తి శ్వాస కావాలె
పర యాసా
బానిసతనాన్ని వీడి
నాదైన సొంత గొంతుతో
నా యాస
రాజ్యమంతా పాడుకునే
నా బతుకమ్మ పాట కావాలె
నా కాళోజీ కవిత కావాలె
నా సకల యాసా సరళికొక
ప్రామాణిక స్వరం కావాలె!
- చిత్తలూరి
8247432521