Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మండవ.సుబ్బారావు
నన్నయ నుండి నారాణరెడ్డి వరకు తెలుగు కవిత్వం అనేకానేక సాంఘిక రాజకీయ సాహిత్య ఉద్యమాలను చవి చూసింది. ఏ ఉద్యమానికి సంబంధం లేకుండా, ఏ ఉద్యమానికి చలించకుండా తమ చుట్టూ అనుభుతుల, ఆనందాల అడ్డు గోడలు కట్టుకొని తమదో ప్రపంచంగా జీవించిన కవులు నాడూ ఉన్నారు. నేడూ జీవిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు..వాళ్ల వల్ల తెలుగు కవిత్వానికి వచ్చిన లాభం లేదు. వాళ్ళు రాసినదాంట్లో సామాజిక స్పృహ లేక పోయినా కవిత్వం ఉంటే సాహిత్య చరిత్ర పుటల్లో మాత్రమే వాళ్ల పేర్లు నిలచి పోయాయి. రెండూ వున్నవాళ్లు పామరుల, పండితుల నోళ్ళల్లో చిరంజీవులై ఉన్నారు. రెండూ లేకుండా కవిత్వం రాసిన వాళ్ల కంటే రాస్తున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. వీరు పత్రికల్లో కనిపించినా, పదికాలాలు మాత్రం జీవించ లేరు. తెలుగు కవిత్వం సంసారంలో సరిగమల దగ్గర నుంచి సాయుధ పోరాటల వరకు తన వస్తువుగా స్వీకరించుకొని సమకాలీన సాంఘిక పరిస్థితులను సమతల దర్పణంలోలా చక్కగా ప్రతిబింబించింది.
ఆధునిక తెలుగు కవిత్వంలో తెలంగాణ సాయుధ పోరాటం మీద వచ్చింనంత కవిత్వం మరే విషయం మీద రాలేదని చెప్పటం అతిశయోక్తి ఏ మాత్రం కాదు. శ్రీశ్రీ అన్నట్లు భారత దేశం అంతట్లోకి రాజకీయంగా ఎక్కువ చైతన్యం చూపిస్తున్న ప్రాంతం “ఆంధ్రప్రదేశ్”. అలాగే ఎక్కువ చైతన్యాన్ని ప్రతిబిబంబించే కవిత్వం తెలుగు కవిత్వం అని చెప్పవచ్చు. “భారత దేశంలో మరే ప్రాంతంలో కూడా తెలంగాణా రైతాంగ పోరాటం వంటి పోరాటం జరగలేదు. అందువల్ల ఏ భారతీయ భాషలలోనూ తెలంగాణా రైతాంగ పోరాటం చైతన్యం వంటి చైతన్యంతో సాహిత్యం రాలేదు”అంటారు శ్రీ కేతవరపు రామకోటి శాస్త్రి గారు. తెలంగాణా సాయుధ పోరాటం స్పేనిష్ సివిల్ వార్ లాంటిది. స్పేయిన్ లోని అంతర్యుద్ధం యూరప్ లోని ఎందరో మేధావుల్ని కదిలించింది. అలాగే తెలంగాణా సాయుధ పోరాటం తెలుగు కవుల్ని కదిలించ గలిగింది. స్పేయిన్ మీద ఆడెన్, స్పెండర్ ,సిడెలూయిస్,జార్జి,బార్కర్ వంటి మహాకవులు అనేక కావ్యాలు రాసారు.అలాగే తెలంగాణా సాయుధ పోరాటం మీద కావ్యాలు రాసిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో “దాశరథి,కుందుర్తి, ఆరుద్ర, కాళోజీ, కె.వి.రమణారెడ్డి” మొదలైన వారు ముఖ్యులు. ఇంకెంతో మంది నాటక కర్తలు, నవలాకారులు తెలంగాణా మీద రాసిన వారు ఉన్నారు. ఇందులో కొందరు ఉద్యమానికి దూరంగా ఉండి రాసిన వాళ్లు, మరి కొందరు ఉద్యమంలో స్వయంగా పాల్గొంటు కవిత్వం రాసారు. వారిలో “దాశరథి, కాళోజీ” ముఖ్యులు.
“ మన కొంపలార్చిన మన స్త్రీల చెరచిన
మన పిల్లలను చంపి మనల బంధించిన
మానవాధములను మండలాధీశులను
మరచి పోకుండ గురుతుంచుకోవాలె
కసి ఆరి పోకుండ బుసగొట్టుచుండాలె
కాలంబు రాగానే కాటేసి తీరాలి “
అంటూ నిజాం చేసే ప్రజా పీడనమునకు స్పందించి ప్రతీకారం చేసి తీరాలి అని ప్రబోధం చేసిన వారు కాళోజీ.
కాళోజీ జీవితం
తెలంగాణా విప్లవ కవిగా, తెలంగాణా శ్రీశ్రీగా పేరు పొందిన ప్రజాకవి కాళోజి. సెప్టెంబర్ 9, 1914లో వరంగల్ జిల్లా,మడికొండ గ్రామంలో జన్మించారు. తండ్రి రంగారావు గొప్ప విద్వాంసులు. వారు ఒక విద్యాలయాన్ని మడికొండలో నిర్వహించారు. అన్న రామేశ్వరరావు ఉర్దు భాషను నేర్చుకొని ఉర్దు భాషలో కవితా రచన చేసారు. కాళోజి హైదరాబాదులో వకాలతు చదువుతున్న రోజులలో ఆంధ్రమహాసభల్లో చురుగ్గా పాల్గొన్నారు. నిజాం పాలనలో జరుగుతున్న దోపిడీలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన వకాల్తా పుచ్చుకొని నిజాం నవాబుకు వ్యతిరేకంగా కవిత్వ రాసారు. ఆయన రాసిన కవిత్వాన్ని ఆయనే వేదికల మీద వినిపించారు. సున్నితంగా హేళనగా కవిత్వం రాయటంలో కాళోజీ దిట్ట. ఆయన కవిత్వం, ఆయన ఉపన్యాసాలు ప్రజల్లో ఎంతో చైతన్యాన్ని ఉత్సాహాన్ని కలిగించాయి. తత్ఫలితంగా నిజాం సర్కార్ వారు కాళోజిని జైల్లో పెట్టారు.
1939లో తొలిసారి కాళోజీ జైలు గోడల్ని చూశారు. అయినా జంకలేదు. ఆనాడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు ప్రారంభించిన గ్రంథాలయోద్యమాన్ని స్వీకరించి, గ్రామ గ్రామాలలో గ్రంథాలయాలు స్థాపించి, “గ్రంథాలయోద్యమ – ఆస్థాన కవి” అని పిలిపించుకున్నారు. ముస్లిం, హిందూ ఐక్యతకు కాళోజీ ఎంతగానో కృషి చేశారు. వరింగల్ లో మొగిలయ్య అనే వ్యక్తిని కొందరు దుండగులు చంపినప్పుడు ఆ దుశ్చర్యను ప్రతిఘటిచటానికి పూనుకున్నాడు. ఈ సందర్భంగా ప్రభుత్వం వారిని వరంగల్ రావద్దని ఆంక్ష పెట్టింది. అంతే కాకుండా 1943లోను 1947లోను కూడా కాళోజీని జైల్లో పెట్టారు. స్వాతంత్ర్యానంతరం జరిగిన ప్రథమ సార్వత్రిక ఎన్నకల్లో కాంగ్రేస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రేస్ అసెంబ్లీ అభ్యర్థుల మోసం వల్లనే అతి స్వల్పమైన తేడాతో ఓడిపోయాడు. దాపరికం లేకుండా కుండ బద్దలు కొట్టినట్లు ఉన్నదేదో ముఖం మీదే అనే వాడు కనుకనే కాళోజీకి రాజకీయాలు అచ్చి రాలేదు. కాంగ్రేస్ పార్టీలో కల్మషం చేరడం ఆరంభించగానే అందులోంచి తప్పుకున్న కాళోజీ ఆ పార్టీ ప్రభుత్వ లోపాలు తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడూ, పౌరునిగా, కవిగా విమర్శిస్తూనే ఉన్నాడు. అన్ని ఉద్యమాలలో కాళోజీ కవితను ఒక సాధనంగా తీసుకొని తన వాణిని ప్రజలకు వైతాళిక గీతంగా వినిపించాడు.
ప్రజా కవిత్వం
ప్రజా కవిత్వ నిర్మాతలు ప్రజలే. ప్రజలంటే శ్రమజీవులు. శ్రమజీవుల పాటలే ప్రజల పాటలు. ఈ ప్రజలు తమకు తాము వెలువరించుకున్న కవిత్వాన్నీ, ప్రజలకోసం వారికి అర్థమయ్యేటట్లు వాళ్ల శ్రమను గురించి, జీవితాల గురించి ఇతరులు రాసే కవిత్వాన్ని ప్రజాకవిత్వం అనవచ్చు.
“నెరా నెరా నెరబండి” అనే పాట ప్రజలకు సులువుగా అర్థం అయి ఆనందాన్ని కల్గిస్తుంది. ఇది ప్రజాకవిత్వం. వేమన కవిత్వం ఈనాటికి ప్రజల నాలుకలపై ఆడుతూనే వున్నాయి. తరువాత తెలంగాణా సాయుధ పోరాట రోజుల్లో ఇలా ప్రజల మాటల్తో కవిత్వం రాసిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో కాళోజీ అగ్రగణ్యులు. అభ్యుదయ కవులు కవిత్వం ప్రజల కోసం అంటూనే ప్రజలకు అర్థం కాని కవిత్వం చెపుతుంటే కాళోజీ కవిత్వంలోనూ,భాషలోను గొప్ప మార్పు తెచ్చి ప్రజల కవిత్వాన్ని సృష్టించారు.
నా గొడవ
కాళోజీ ఎప్పటికప్పుడు దేశంలోని సమస్యలకు, సంఘటనలకు స్పందిస్తూ వందలకొలది కవితలు రాశారు.ఇవన్నీ “నాగొడవ” ద్వారా లోకానికి పరిచయమైనాయి.ఈ నా గొడవ గురించి శ్రీశ్రీ ప్రథమ ముద్రణ ఆవిష్కరణ సభలో ఇలా ప్రశంసించారు. “ఇది కవి గొడవగానే కనిపించి నప్పటికీ చదివిన వారికి ఇది తమ గొడవగానే అర్థమవుతుంది. ఇది విశాల జగత్తు ప్రజలందరి గొడవ”. ఇది మనం మననం చేసుకోవాల్సిన పుస్తకం. కాళోజీ దేశభక్తుడు. అయితే వీరి దేశభక్తి కేవలం కవిత్వానికే పరిమితమైంది కాదు. విద్యార్థి దశ నుండి వారు నమ్మిన దానిని గురించి ప్రభుత్వానికి వ్యతిరేకమైందైనా జంకు గొంకు లేక ధైర్యంగా కవిత్వంలో చూపించారు. నిజాం కాలంలో ప్రజల బాధల్ని గాధల్ని ధైర్యంతో రాసి,పాడి జైలుకు వెళ్ళారు. ఆయన కవితల్లో ఒక్కొక్క మకుటం పునరావృతమవుతూ ఉంటుంది. జానపద వాజ్ఞ్మయములో తరుచుగా కనిపించే “ఉయ్యాలో, ఉయ్యాలో”, “ రామ రామ ఉయ్యాలో” లా ఉంటుంది. ప్రపంచము అనే కవితలో
“గడియ గడియకు మారు ప్రపంచము / గవ్వకును కొఱగాని ప్రపంచము”
అంటూ మొత్తం కవితలో చివర ప్రపంచము అనే మకుటం రాశారు. అలాంటిదే మరో కవిత.వ్యత్యాసాలు. ఇందులో ప్రతి పాదము చివర “ఒక చోట” అని ఉంటుంది. ఇలా ఎన్నో కవితలు కలవు.ఇలాంటి పోకడలతోనే వీరి కవిత్వం ప్రజా కవిత్వమైంది. “మాతృదేశము” కవితలో కాళోజీ గారి దేశభక్తి వ్యక్తమవుతుంది. చిన్న చిన్న మాటల్లో పెద్ద పెద్ద భావాల్ని కలిగిస్తారు కాళోజీ
“నీరు లేని ఎడారి యైనను/ అగ్గికొండల అవని యైనను
వానల వరదల వసతి యైనను /మాతృదేశము మాతృదేశమే”
ఈ నాడు ఉద్యోగ అవకాశలు లేవంటూ, చదువుకు మేధస్సుకు గుర్తింపు లేదంటూ అనేక మంది యువకులు దేశం వదలి పరదేశాలకు పోవడం మనకు తెలిసిందే కదా!.
పెట్టుబడిదారి దేశాలలోని వ్యత్యాసాల గురించి చెప్పడానికి పెద్ద పెద్ద సిద్ధాంత పదాల్ని ఉపయోగించ లేదు. ప్రజల మాటల్తోనే ఇక్కడ కనిపిస్తున్న వ్యత్యాసాల్ని ఎలా వివరించారో చూడండి.
“అన్నపు రాసులు ఒక చోట /ఆకలి మంటలు ఒక చోట
సంపదలన్ని యెక చోట / గంపెడు బలగంబొక చోట”
“అవనిపై జరిగేటి అవకతవకలు జూసి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు? ” అంటూ “కష్టపడు వారలను కాపాడగా లేను” అనే బాధ వారిలో వ్యక్తమవుతుంది. అయినా వారు తమ వంతు కర్తవ్యంగా జనాన్ని చైతన్యపరచటమే అనుకొని ఆ పనిని చేయటానికి వారి కలాన్నే బలంగా ఉపయోగించుకున్నారు. మన దేశం ప్రధానంగా వ్యవసాయిక దేశం. వ్యవసాయం చేసే రైతు దేశానికి వెన్నెముక .ఈ విషయాన్ని గాంధి గారు నాడు గ్రామ రాజ్యం రావాలంటి రైతు క్షేమం కావాలంటూ ఉపన్యాసలిచ్చేవారు. ఈ విషయాన్ని “కర్షకా” అనే కవితలో కాళోజీ కమనీయంగా చిత్రించారు..
“నర్తకుని నాట్యాలు గాయకుని గానాలు / వాదితుని వాద్యాలు శిల్పకుని శిల్పాలు
చిత్రకుని చిత్రాలు అంగనల అందాలు /కందర్పు కయ్యాలు కవిరాజుకావ్యాలీ
కర్షకా నీ కఱ్ఱు కదిలినన్నాళ్లే” ప్రజలు వాడుకునే నానుడి గా మిగిలి పోయిందీ వాక్యం.
కాళోజీ ముక్కు సూటి మనిషి తనకు కలిగిన భావం ఎదైనా సరే ఇతరులు ఏమనుకుంటారో అనే భయం లేకుండా చెప్పేవారు. ఆంధ్ర మహాసభల ప్రభంజనం తెలంగాణా గ్రామాల్లో బలంగా వీస్తున్న రోజుల్లో ప్రజలు భూస్వాములు, పోలీసులు చేస్తున్న అరాచకాలకు వ్యతిరేకంగా అనేక ప్రతిఘటనలు చేశారు. ఆ నాడు రక్షించ వలసిన పోలీసులే ప్రజల్ని నానా హింసలు పెడుతుంటే వాళ్ళ కిరాత కాలనుఎండగడ్తూ కాళోజి ఎన్నో గేయాలు రాశాడు.
“ పాలన పేరిట పల్లెల్లో / జరిగే పాపం చాలింక
రక్షణకై ఏర్పడ్డ బలగమే /చేసే భక్షణ చాలింక”
అంటూ గద్దించాడు. కాళోజీ కైతలు విని కదలకుండా ప్రజలుండరని, వాళ్లు చైతన్యంతో మేల్కొని కాలం రాగానే కాటేసి తీరుతారని విశ్వాసాన్ని వ్యక్త పరిచాడు.
స్వాతంత్య్రానంతరం మన ప్రజా రాజ్యం ఏదో చేస్తుందని ఎదురు చూసిన ప్రజలకు మిగిలింది నిరాశే
“స్వాతంత్ర్యం పేర సొంతానికి కట్లు
బయట పడనీయ దలచుకోలేదు ప్రభుత్వం
కూటముల కోటల్లో అధికారుల తత్వం”
అంటూ గాంధి గారికి విన్నవించుకొన్నారు. పంచవర్ష ప్రణాళికలు, పంచశీల సూత్రాలు ప్రజలకు ఏమి మేలు చేయక పోగా, వాటి పేరున డబ్బు ఎంతో ఖర్చు పెట్టి జనులకు అప్పు మాత్రం మిగిల్చారని వాపోతూ కవి,
“శృతి మించిన పంచశీల రాగాలాపన
మితిమీరిన పోకిరి పొరుగుల ప్రేలాపన
అప్పుల పాలై పోయింది జనత
తప్పుల కుప్పై పోయింది ప్రభుత”
అని వాపోతారు. అయితే ఈ పరిస్థితి పోయి గాంధి గారు కలలు గన్న గ్రామ రాజ్యమే రావాలంటే ప్రజల చేతుల్లోనే ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ,”ఓటిచ్చు అధికారమున్నట్టి వారు పురుషులెవ్వారు, కాపురుషులెవ్వారు గుర్తించి ఓటులను గురిపింప వలయు “ అని హెచ్చరిక చేస్తారు.
ఇలా నా గొడవ లో నాటి నిజాం ప్రభుత్వం దురాగతాలను, నేటి ప్రజా ప్రభుత్వాల స్వార్థాలను మనం చూడ వచ్చు. దాశరధి దీన్ని గురించి చెపుతూ, “కాళోజీ నా గొడవలో చెప్పిందంతా అయ్యింది. ఈనాడు చెబుతున్నదంతా అవుతుంది. అతడు చెప్పనున్నదే కానుంది.త్రికాలజ్ఞుడైన మహర్షి కాళోజీ” అంటారు.
కాళోజీ నా గొడవ ను ప్రచురించడంలో శ్రద్ధ చూపించలేదనే విషయం నా గొడవ భాగాలు చదివితే అర్థమవుతుంది. ఏది నిజాం ప్రభుత్వం మీద రాసిందో ఏది మన ప్రజా ప్రభుత్వం గురించి రాసిందో తెలుసుకోవడం కష్టంగా ఉంది. అయినా ఇప్పటికీ ఆ కవితల్లోని వస్తువు సజీవంగానే వుంది. అంతే కాక వారి కవితల్లో పరస్పర వ్యతిరేకమైన అభిప్రాయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ విషయాన్ని నా గొడవ మొదటి ప్రచురణ ముందు మాటల్లో ఆచార్య శ్రీ సుప్రసన్న సోదాహరణంగా వివరించారు. బహుశః దీనికి కారణ వారు దీన్ని ప్రచురించేటప్పుడు పునః పరశీలించక పోవడం కావచ్చు.
భాష
ప్రజల భాషతో రాసిందే ప్రజా కవిత్వం. అంతేగాని ఏ ప్రజల కోసం వస్తువు నిర్ధేశించబడిందో ఆ ప్రజలకు అర్థంగాని భాషలో రాయడం వ్యర్థం. కాళోజి భాష ప్రజల భాష.వాడుకలో ప్రజల్లో ఉన్న పదాలు హిందీవైనా, ఉర్దూవైనా, ఆంగ్ల పదాలైనా ఉపయోగించారు కాళోజీ. సలామత్, భాయీ భాయీ పోలింగ్ బూత్ బస్సుసీటు, బిజిలి వంటి పదాలు నిరక్షరాసులకైనా సరళంగానే అర్థమవుతాయి. ఇలా సజీవమైన భాషను ప్రయోగించడం వల్లనే కాళోజీ ప్రజా కవి అయినాడు.
ఇతర రచనలు
కాళోజీ కొన్ని కథలు కూడా రాశారు. “కాళోజీ కథలు” అనే పేరుతో ఓ పుస్తకం ప్రచురింపబడింది. ఈ కథల్లో కాళోజీ నైజాం పాలనలోని ప్రజల జీవితాల్ని వర్ణించాడు. ఇంకా “తుది విజయం మనది’” ,” నిజం”, “పార్థివం” వీరి ఇతర రచనలు. “నా భరతదేశ యాత్ర”, “జీవన గీత” వీరి అనువాద గ్రంథములు. ఇందులో “జీవనగీత” అనే అనువాద గ్రంథం కాళోజీ అనువాద నైపుణ్యానికి చక్కని నిదర్శన గ్రంథం. ఖలీల్ జిబ్రాన్ రాసిన “ది ప్రాపెట్” కు తెలుగు పేరు జీవనగీత.ప్రపంచం లోని అనేక భాషల్లోకి అనువదించబడింది. అలాంటి ఉత్తమ గ్రంథాన్ని తెలుగు పాఠకులకు అందించటానికి కాళోజీ చేసిన కృషి సాటి లేనిది.
ముగింపు
“ఒక్క చుక్క సిరా వేయి మెదళ్లకు కదలిక” అనే వీరి మాటలు తెలుగునాట నానుడిగా నిలిచి పోయాయి. ప్రజల నాలుకల మీద నిలిచిపోయే కవిత్వం రాసిన వేమన, కాళోజీ ప్రాతః స్మరణీయులు.
“నా తపస్సు ఫలించి, నా గీతం గుండెలలో ఘూర్ణిల్లగ నా జాతి జనులు పాడుకొనే మంత్రంగా మ్రోగించాలని” ప్రతి కవి కోరుకుంటాడు. అయితే అలా జాతి జనులు పాడుకొనే గీతాలు రాయడానికి కృషి చేయాలి ప్రతి కవి. కొంత మంది కవులు వాళ్ల ప్రతిభ, కృషి వల్ల ఇలా కలకాలం జాతి గుండెల్లో నిలిచి పోతారు.
కాళోజీ వ్యక్తిగా మొహమాటం లేని మనిషి. ఎవరి మీదనైనా, దేని మీదనైనా వారికి కలిగిన అభిప్రాయాన్ని నిస్సంకోచంగా వెలిబుచ్చుతారు. మంచి ఎక్కడ ఏ కొద్దిగా కనిపించినా కాళోజీ మెచ్చుకుంటారు. శ్రీశ్రీ గురించి ఓ సందర్భంలో కాళోజీ.
“నువు రాసి పారేసిన కవితలు గుభాళిస్తున్నపుడు
నువు తాగి పారేసిన సీసాల కంపు మా కెందుకు?”
అంటూ శ్రీశ్రీ వ్యక్తిగా ఎలాంటి వాడైనా శ్రీశ్రీ తెనుగు వాడి ని వాడే ప్రతిభ కలవాడు అంటాడు.
జాతి గొడవను తన గొడవగా భావించి తన గళం వినిపించిన కాళోజీ ధన్యజీవి. ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో అభ్యుదయ కవిగా, ప్రజా కవిగా నిలిచి పోయిన కాళోజీ ప్రజల ఎదల్లో నిగూఢంగా నిరంతరం నిలిచిపోయే ఉన్నాడు........ఉంటాడు.
“ఉదయం
కానే కాదనుకోవడం
నిరాశ
ఉదయించి
అట్లానే వుండాలనుకోవడం
దురాశ”.
- కొత్తగూడెం,9493335150