Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చరితార్ధులు కాళోజీ !! పద్మ విభూషణ్ అవార్డ్ గ్రహీత. స్వాతంత్ర్య పోరాట వీరుడు, తెలంగాణా పోరాట వీరుడు శ్రీ కాళోజీ నారాయణ రావు గారి గురించి తెలియని వారుండరు. తెలంగాణా పోరాట వీరుడు అయిన కాళోజీ ప్రత్యేక తెలంగాణ సాధించటానికి ముఖ్య కారకుడు. వీరి జీవిత చరిత్ర ప్రతి తెలంగాణ పౌరుడు తెలుసుకోవాలి. ప్రముఖ సాహితి వేత్త అయిన శ్రీ కాళోజీ సెప్టెంబర్ 9న 1914లో వరంగల్ జిల్లాలో కాళోజీ రంగారావు, రమాబాయి దంపతులకు జన్మిం చారు. తన స్వగ్రామంలో ప్రాధమిక విద్యని అభ్యసించిన కాళోజి వరంగల్ లో ఉన్నత విద్యని అభ్యసించారు.
కాళోజీ నారాయణ రావు గారి వ్యక్తిత్వం ఉన్నతంగా రూపు దిద్దుకోవడానికి ప్రముఖ ఉర్దూ కవి, వారి అన్నగారయిన కాళోజి రామేశ్వర రావు గారి పాత్ర ఎంతో వుంది. కాళోజీ 16 సంవత్సరాల వయస్సులోనే ఆర్య సమాజంలో చేరారు. తరువాత అంధ్ర మహాసభలలో పాల్గొనేవారు. ఉద్యమాలలో చురుకుగా పాల్గొనేవారు. నిజం పరిపాలనకి వ్యతిరేకంగా ఉద్యమాల్లో చేరి రెండు సార్లు జైలుకి కుడా వెళ్లారు. సత్యాగ్రహం ఉద్యమాల్లో పాల్గొన్నారు ,
ప్రజా కవి అయిన నారాయణ రావు చిన్నతనం నుంచే కవిత్వం రాస్తుండేవారు. 1931లోనే తన మొదటి కవితని రాశారు. నా కథలు , నా భారత దేశ యాత్ర 1941, కాళోజీ కథలు పార్థివ వ్యయం 1946, నా గొడవ 1951, తుది విజయం మనది. నిజం 1962. ఆరు ఋతువుల మీద నా గొడవ పేరుతొ రచనలు చేసారు. ఇంకా వీరి రచనల్లో తెలంగాణ ఉద్యమ కవిత్వం, నా గొడవ ఇది నా గొడవ (1995-కాళోజీ - ఆటో బయోగ్రఫీ ), బాపు బాపు బాపు (1995), కాళోజీ కథలు (2000).
కాళోజీ నా గొడవ కవిత చాలా ప్రసిద్ధి పొందింది.
' పుట్టుక నీది /చావునీది / బ్రతుకంతా దేశానిది'
ఈ కవితా వాక్యాలలో కాళోజి వారి ఉన్నతమైన వ్యక్తిత్వం తెలుపుతుంది. ప్రజల వ్యక్తీ ప్రజల కవి అయిన వారి కవితల్లో పదాల ఎంపిక, భావన, సూక్ష్మంలో కొండంత భావం, ప్రజలకే అంకితమైన వారి జీవితం చెబుతాయి. నిజాన్ని నిర్భీతితో వ్యక్త పరిచే విధానం ఎంతో మందికి వారంటే అభిమానం పెరిగింది. వారి రచనల్లో ఆనాటి సమాజపు పోకడలు, రాజకీయ పరిణామాలు, వాటి ప్రభావాలు కనిపిస్తాయి. వారి పది సంపుటాలుగా వెలువడ్డ 'నా గొడవ' వారి ఆత్మ కథ అయినా అది ప్రజలందరికీ ఉపయోగపడాలని ఆ పుస్తకాలపై ఎటువంటి కాపీ రైటు నిభందనలు విధించలేదు.
రాజకీయాలలోనూ ప్రవేశమున్న వీరు 1960-1962 లో అంధ్రప్రదేశ్ శాసన సభ లెజిస్లేటివ్ ) సభ్యులుగా వున్నారు.
అంధ్ర సారస్వత పరిషత్తు వ్యవస్తాపక సభ్యులు. అంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి సభ్యులు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు. సాహిత్య రంగంలోనూ, సామాజిక రంగం లోను వారు చేసిన కృషికిగాను భారత ప్రభుత్వం వారి ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డుని అందుకున్నారు.
తామ్ర పత్రని 1972లో స్వీకరించారు. వారు జీవన గీత గ్రంధానికి అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి చే ఉత్తమ అనువాదకులుగా 1968లో అందుకున్నారు . ప్రభుత్వం వారిచే సత్కారాలు, బూర్గుల రామకృష్ణా రావు గారి స్మారక అవార్డుని అందుకున్నారు. 1992లో కాకతీయ యునివర్సిటీ వారిచే డాక్టరేట్ బిరుదుని అందుకున్నారు.
దాదాపు శతాబ్దపు వ్యక్తి గా జీవితాన్ని చూసిన కాళోజీ తన కలం బలం తోనే అటు పురాణాలు , ఇటు సాహిత్య విప్లవాలు మానవాళికి అందించారు. అభ్యుదయ వాది గా సామ్యవాదాన్ని కోరారు. ప్రజల పక్షాన నిలబడ్డారు. ప్రజల కోసమే పరితపించిన వారు. తెలంగాణా కోసం అహర్నిశలు పాటుబడ్డారు. జనాలను తట్టిలేపి తెలంగాణాకై ఇక తిరుగుబాటు తప్పదని వారిని జాగృతి చేసారు. నియంతలను నిలదీసేవారు. నీతి నిజాయితీ వున్న వారు. పీడిత ప్రజల పక్షాన నిలబడి పోరాటం సాగించిన వారు. అయన తన కాలాన్ని దోపిడీ వ్యవస్థ పై గురి పెట్టేవారు. అందరి గొడవలను, బాధలను తన గొడవ గా కలం గళంలో వివరించిన వారు.. మానవత్వమే అయన మతం. ధనికులు పేదలు మధ్య తేడాలను తన వ్యతాసాలు కవితలో తెలిపారు
'అన్నపురాశులు ఒక చోట / ఆకలి మంటలు ఒక చోట
హంస తూలికలోకచోట / అలసిన దేహాలోక చోట
సంపదలన్నీ ఒక చోట / గంపెడు బలగంబొకచోట
వాసన నూనియ లొకచోట / మాసిన తలలింకోక చోట' -ఇలా సాగుతుంది కాళోజి కవిత్వం.
అలాగే శాస్త్రం పద్దతి లో కాళోజీ అంటారు.. ..
'శాస్త్రం పద్దతి చెపుతుంది / ఆచరణ బ్రతుకు చాటుతుంది
శాస్త్రం ఆదర్శం వల్లే వేస్తుంది / ఆచరణ సాధ్యం నిరూపిస్తుంది'
ఇదే కవితలో ....
'ఎవనికో నచ్చునట్లు పలకడం నాడు / ఎవనికి వాడు వచ్చినట్లు పలకడం ఖాయం
నేడు ఎదుటివానికి తెలిసిందా అనే ప్రశ్న / పలికేవాడు వేసుకోవలసింది / వినేవాడు కాదు ...'-అంటారు.
కాళోజీ తెలంగాణా ఏర్పాటుకు తొలి తెలంగాణా దేశ భక్తుడు. తెలంగాణా నిర్మాణానికి తోలి పునాది వేసిన వ్యక్తి . తెలంగాణా నేలపై అడుగడుగునా కాళోజీ అడుగులే! అవే అందరికీ మార్గదర్శకాలు. మాతృ గడ్డ కోసం మే కాదు మాతృ భాషకోసం, యాస కోసం పోరాటం సలిపినారు ఆయన. తన కవిత్వాన్ని యాస భాషలోనే వెలువరించారు. వాటిలో ఆవేశం, క్రోధం, ఆవేదన, విప్లవం అన్నీ కనిపిస్తాయి. వోరుగల్లయినా కాకతీయుల తోరణమైనా గోలుకొండా ఖిల్లా అయినా ఏ చారిత్రక కట్టడమైనా తెలంగాణా సీమలో అడుగిడిన వారికి కాళోజీ అడుగుజాడలు కనిపిస్తాయి. విప్లవాభ్యుదయాల భావాలతో తన కలం బలంతో ప్రజలలో నేతలలో మార్పుని తెచ్చిన తపస్వి కాళన్న!
నా గొడవలో ఆరు ఋతువుల లో ప్రజల జీవితాన్ని రచించారు.
తన మాటల్లో కాళోజి
'అన్యాయాన్నెదిరిస్తే / నా గొడవకు సంతృప్తి
అన్యాయం అంతరిస్తే /నా గొడవకు ముక్తి ప్రాప్తి
అన్యాయాన్నెదిరించినోడు /నాకు ఆరాధ్యుడు' అంటారు.
ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో కవితలు ఎన్నో భావాలు అందరి మదినీ ఆలోచింప చేసే భావాలు.
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ జన్మ దినాన్ని తెలంగాణా మాతృ భాషా దినోత్సవంగా ప్రకటించింది.
తెలంగాణా రాష్ట్ర సాధనలో ప్రజా కవి కాళోజి నారాయణ రావు తన జీవితాన్నే ధారపోశారు.