Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అన్యాయాన్నెదిరిస్తే
నాగొడవకు సంతృప్తి
అన్యాయం అంతరిస్తే
నా గొడవకు ముక్తి ప్రాప్తి
అన్యాయాన్నెదిరించినోడు
నాకు ఆరాధ్యుడు...
తెలంగాణ నేలకు పోరాట స్ఫూర్తి నేర్పిన కలం గళం కాళోజి..1914 సెప్టెంబర్ 9 న జన్మించిన కాళోజీ తెలంగాణా భాషా ప్రభంజనం....
ఉర్దూ హిందీ మరాఠీ కన్నడ ఆంగ్లభాషలపై సాధికారత ఉన్న తెలుగు భాష పై ఆయన చూపిన మమకారం అత్యంత శ్లాఘనీయం.. ఆయన కలం ఒక ప్రచండ శక్తి. తెలంగాణ ప్రజల వ్యధాభరిత జీవితాలను సిరాగా చేసుకుని ఒక మహా విప్లవాన్ని సృష్టించి చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయాడు కాళోజి.
ఉదయం కానే కాదనుకోవడం నిరాశ...
ఉదయం అలానే ఉండాలనుకోవడం దురాశ...
ఆనాటి నిజాం ప్రభుత్వంపై తన అక్షర పాశుపతాస్త్రం సంధించి తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన మహాకవి కాళోజి.
బడి పలుకుల భాష కాదు నాది
పలుకుబడుల భాష నాది
నా భాష తెలుగు భాష...
అంటూ తెలంగాణ భాష యాస లకు ప్రపంచ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన యుగకర్త కాళోజి.
సమస్త మానవాళికి భాష ఆత్మ అని బలంగా నమ్మిన కాళోజి తెలంగాణ గడ్డ కు భాషకు ఉన్న ఆత్మానుబంధాన్ని తొలిగా తెలిపిన ప్రజాకవి.
ఎక్కడో కన్నడ దేశంలో జన్మించి తెలంగాణా నడిబొడ్డు లోని వరంగల్ జిల్లా మడికొండను కేంద్రంగా చేసుకుని తన గొడవను తెలంగాణా గొడవగా మార్చి నా గొడవ అంటూ తెలంగాణా ప్రజలలో ఉద్యమస్ఫూర్తిని నింపి ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఊపిరి పోశాడు.
ఏ భాష నీది ఇది ఏమి వేషం రా
ఈ భాష ఈ వేషం ఎవరికోసం రా
ఆంగ్ల మందున మాట అనగానే
ఇంత కులుకు ఎందుకురా
తెలుగు వాడవై తెలుగు రాదనుచు
సిగ్గు లేక ఇంక చెప్పుటెందుకు రా
అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు
సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా
అంటూ పరాయి భాషలో మోజులో కన్నతల్లి వంటి మాతృభాషను నిర్లక్ష్యం చేస్తున్న వారిని అక్షర నిప్పులతో కడిగి పారేశాడు కాళోజీ.
పుట్టుక నీది..చావు నీది... బ్రతుకంతా దేశానిది
స్వాతంత్ర ఉద్యమంలో ఆనాటి ప్రజల దృఢమైన సంకల్పం, నిబద్ధత ఈనాటి తెలంగాణ ప్రజలలో రావాలని అప్పుడే మన నేల మన మట్టి మన భాష మన సంస్కృతి మన సాంప్రదాయం కాపాడుకోగలమని నిరంతరం తన గోసను వినిపించిన వాడు కాళోజి.
స్వాతంత్ర సమర యోధుడిగా మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పీవీ నరసింహారావులతో కలిసి సత్యాగ్రహోద్యమంలో పాల్గొన్న కాళోజి ఆ ఉద్యమ స్ఫూర్తి తోనే ఆనాటి నిజాం సర్కార్ మరియు రజాకార్లపై తిరుగుబాటుతో తరువాతి కాలంలోని తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నాయకులకు ప్రజలకు స్ఫూర్తిగా నిలిచాడని స్పష్టంగా చెప్పవచ్చు.
మూడు కోట్ల మేటి ప్రజల గొంతొక్కటి
కోర్కొక్కటి తెలంగాణ వెలసి నిలిచి
ఫలించాలో భారతాన... అని వాంఛించాడు..
జరిగిందంతా చూస్తూ
ఎరగనట్లు పడి ఉండగ
సాక్షీభూతున్ని గాను
సాక్షాత్తూ మానవున్ని...
అంటూ అటు బ్రిటిష్ వాళ్ళను ఇటు రజాకార్లను నిరసించాడు.
భగవంతుడు అవతారాలు ఎత్తి ఎత్తి విసుగు పుట్టి
మనిషిగా పుట్టాడని చెబుతూ అసాధ్యాలను సుసాధ్యం చేయగల ఏకైక శక్తి మనిషి మాత్రమేనని అందరిలో ఆశావాహ దృక్పధాన్ని నింపిన యుద్ధనౌక కాళోజీ..
బ్రతికున్న పాము
ఎక్కడ బుస్సని పడగ విప్పుతుందోనని
పగబట్టి కాటేస్తుందని
ఆపాద మస్తకం వణికి పోతూ
నాగ స్వరాల ఆసరాతో మెప్పిస్తూ
పూజిస్తూ నాగులచవితి మొక్కుబళ్ళు చెల్లిస్తూ
చచ్చినపామును బడితల్తో బాది
నిరసన జూపి, భర్సన జరిపి
విషనాగుల్ని చితక పొడవాలె
అని నినదించే మనిషి ఏం మనిషి
అధికారానికి భజన చేసే వాళ్ళు తప్పించుకు తిరిగే మోసగాళ్ళు అంటూ అణగదొక్కుతున్న నాయకుల్ని నిరసించాలన్న కాళన్న...మనల్ని మనం మోసం చేసుకుంటూ ఎంత కాలం బ్రతుకుతాం అంటూ అని నిలదీసాడు...
రాసే భాష మాట్లాడే భాష ఒకేలా ఉండాలనే నినాదంతో
తెలంగాణ భాషకు అస్తిత్వాన్ని కల్పించిన మహాకవి కాళోజి. నా గొడవ,అణా కథలు, జీవన గీతి,ఇదీ నా గొడవ, బాపూ.. బాపూ.. బాపూ.. తెలంగాణ ఉద్యమ కథలు నా భారత దేశ యాత్ర వంటి రచనలతో తెలంగాణ భాషను ఇంటి భాషగా మార్చాడు...
'ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక'
ఈ ఒక్క వాక్యం తోనే కాళోజి విశ్వ చైతన్యస్ఫూర్తికి పునాదిగా నిలిచాడు.
'ఎరుగుదువా నేస్తం
ఎన్ని మొద్దు బ్రతుకుల
ముద్దులు ముచ్చట్లు
రంపపు కోతల పాలైతే
మన ముద్దు ముచ్చట్లుు..'
ప్రజలందరినీ తన నేస్తాలుగా భావించి ఎన్నో యాతనలు,అగచాట్లు,జీవితం చట్రంలో నలిగిపోతేనే మన సుఖం మన క్షేమం అంటూ స్వేచ్ఛకై పోరాడా ల్సిందే అని హితవు పలికిన ఉద్యమ స్ఫూర్తి కాళన్న...
తెలంగాణ భాషకు సంస్కృతికి సంప్రదాయాలకు చిహ్నంగా గా తెలంగాణ ప్రజల గుండె గోస యాసను
అక్షరబద్ధం చేసి తెలంగాణ సాహిత్యానికి పట్టాభిషేకం చేసిన మహాకవి యువ కర్త పద్మ విభూషణ్ కాళోజీ పేరిట 'తెలంగాణ భాషా దినోత్సవం' అని జరుపుకోవడం తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద పండుగ...
-అట్లూరి వెంకటరమణ
కవి రచయిత ఖమ్మం
9550776152