Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహేష్ వేల్పుల
తొండ, తిరుమలగిరి, సూర్యాపేట
99518 79504
తిరగబడింది తిరగబడింది..
చెఱచబడిన చెల్లెలు గుత్పపై లేచింది
వెట్టిచాకిరి కట్టలుతెంచి బంధూకు పట్టింది
ఈ బానిస బతుకొద్దని కన్నెర్ర జేసింది
దొడ్డి కొమరయ్య రక్తం వీరతిలకం అయింది
భీంరెడ్డి నర్సింహారెడ్డి ధైర్యం పులుముకుంది
రావి నారాయణ రెడ్డి విప్లవంలా పిడికిలెత్తింది
ఐలమ్మ పిలుపుతో చేత కొడవలి పట్టింది
మల్లు స్వరాజ్యమై సింహంలా దూకింది
చకిలం లలితాదేవై రక్తాన్ని అర్పించింది
ఆరుట్ల రాంచంద్రరెడ్డి పోరు బాటలో నడిచింది
ఆరుట్ల కమాలదేవై రణం చేయ కదిలింది
బండి యాదగిరి రాసిన పాట అయింది
ముగ్దుమ్ మొయినొద్దీన్ రచనలా సాగింది
షేక్ బందగిలా హక్కుకై పోరాడి ప్రాణం విడిచింది
కాళోజీలా ప్రజల గొడవను వినిపించింది
సుద్దాల హన్మంతు పల్లెటూరి పిలగాడ పాటయింది
దాశరథిలా నిజాం గుండెల్లో గుబులు పుట్టించింది
రంగాచార్య మోదుగుపూల్లో కుసుమై విరిసింది
ఆళ్వారుస్వామిలా వెట్టిని వివరించింది
కొమురంభీం అయి గెరిల్లా యుద్ధం చేసింది
ఎందరో ఎందరో గడీల్లో పాణం విడిచిన వీరులందరో
నా తెలంగాణ బిడ్డలెందరో..
ఏయ్
రజాకార్లను తరిమిన వీరులరా
భూస్వామిని బొందపెట్టిన బిడ్డలరా
దేశ్ ముఖ్ అంతు చూసిన ధీరులరా
నిజాంను ఎదిరించిన అమరులరా మీకు ఇదే నా వందనం