Authorization
Mon Jan 19, 2015 06:51 pm
--శశికళ.బి
1.
సీ.ప
పుస్తకము మనను పురుషోత్తముని జేయు
సత్ప్రవర్తన నేర్పు సద్గుణాలు
బాల్యాన జ్ఞానమ్ము బంగారు బాటౌను
మేటి వృక్షమగును నేటి మొక్క
చల్లగా యుండును పిల్లల మనసులు
లేత మనసు పైన రాత రాయు
చక్కగాను హృదయ సంస్కారవంతమూ
గొప్ప వారి చరిత చెప్పవలెను!
ఆ.వె
పఠనములను నేర్పు తటపటాయించక
చిన్న వయసులోన వన్నె పెంచు
పుస్తకాలు మనకు నేస్తాల వంటివి
తెలివి పెంచు నీకు తెలుగు కవిత!
2.
సీ.ప
గ్రాంధిక భాషలో ఘనమైన సాహితీ
ఆధునికపు భాష మేధపెంచు
పలుకు శైలి కలిగి పలుమార్పులుండును
మాండలికపు భాష మాటరీతి
లాలిత్యమే నేటి శైలి వాడుక భాష
సెలయేరులా నిన్ను సేద దీర్చు
ప్రజల సమ్మతి దెల్పె ప్రామాణికపు భాష
సర్వ జనులకిది సరళమౌను!
ఆ.వె
తీయనైన తెలుగు తీరైన గమకాలు
రాగ మాధురీల రమ్య భాష
పుస్తకాలు నీకు ఆస్తులే విద్యార్థి
చరిత తెలియవచ్చు చదువుమయ్య!
3.
సీ.ప
తల్లిదండ్రుల మాట తనమాట యనుకున్న
రమ్యమైనట్టిది రామచరిత
మిత్రలాభము జెప్పు మిత్రభేదము జెప్పు
పంచతంత్రము దెల్పు మంచిచెడులు
పౌరాణికమ్ములు ప్రాచీన సంస్కృతి
భాగవతము నీకు భక్తిదెలుపు
వీర భీష్మ చరిత భారతాన జదువు
సాధించ వలె కీర్తి శాశ్వతముగ
ఆ.వె
గీత సారమంత నీతియే యున్నది
జాన పదుల కథలు తేనె పట్టు
మానవతను నేర్పు మహనీయ చరితలు
తెలుగు జిలుగు వెలుగు తెలుసుకొనుము!