Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-వకుళ వాసు
హన్మకొండ
9989198334
పసిపిల్లల తేనెలొలుకు పలుకులోన సౌందర్యం
బుడిబుడి అడుగులు తడబడు నడకలోన సౌందర్యం
కన్నెపిల్ల కులుకులొలుకు హరిణినేత్ర చూపులతో
ప్రియునిచేరి ముచ్చటించు కనులలోన సౌందర్యం
ముద్దబంతి మోములోన పసిడికాంతి పులుముకున్న
తెలుగువన్నె వెలయుఇంతి నవ్వులోన సౌందర్యం
నల్లరాళ్ళ నిదురబోవు శిల్పాలను మేలుకొలిపి
శిల్పిచెక్కి వెలికితీయు శిలలలోన
సౌందర్యం
జడివానలు కురిసినపుడు పొంగిపొర్లి
అలుగుపారి
విరబూసిన కలువలున్న చెరువులోన సౌందర్యం
కరిమబ్బుల ప్రేమతోటి అనుబంధపు వలపువాన
కురిపించే వకుళ వాసు బతుకులోన సౌందర్యం